ఐషీ ఘోష్, జేఎన్‌యు విద్యార్థి సంఘం అధ్యక్షురాలు
మమతా బెనర్జీతో ఏ అమ్మాయినీ పోల్చలేం. 15 ఏళ్ల వయసుకే మమత రాజకీయాలోకి వచ్చారు. వచ్చీ రావడంతోనే విజేతగా నిలిచారు! మమత లోపల ఉన్న ఫైర్‌తో మాత్రం ప్రతి అమ్మాయినీ రిలేట్ చెయ్యొచ్చు. ఇంటి దగ్గర మనం రోజూ చూసే అమ్మాయిని, జేఎన్‌యు స్టూడెంట్ లీడర్ ఐషీ ఘోష్‌ని కూడా! 26 ఏళ్ల ఐషీ ఇప్పుడు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతోంది! మే 2 న వెలువడే ఎన్నిక ఫలితాలలో జమూరియా నియోజకవర్గం నుంచి సి.పి.ఐ (ఎం) అభ్యర్థి ఐషీ గెలిచినట్లు వార్త వస్తే కనుక భవిష్యత్తులో ఏనాటికైనా ఒకరోజు దేశ ప్రజలు.. ‘‘పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఐషీ ఘోష్ నేడు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు’’ అనే వార్తనూ వినబోతారు! మరీ టూ మచ్ అనిపిస్తే కనుక.. ఆ నిప్పును కొంచెం తాకి చూస్తే ఐషీ హౌమచ్చో తెలుస్తుంది. జేఎన్‌యులో ప్రస్తుతం పొలిటికల్ ఫిలాసఫీలో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్న ఐషీలోని ’చప్పున అంటుకునే’ గుణం గల చైతన్యశీలతే ఆమెను రాజకీయాల్లోకి రప్పిస్తోంది!
3ఎనిమిది విడతల్లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికి మూడు విడతలకే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయింది. అయితే ఈ నెలాఖరుకు గానీ నోటిఫికేషన్ విడుదల కాని ఏడో విడత ఎన్నికలపై పశ్చిమ బెంగాల్‌తో పాటు, ఢిల్లీ కూడా ప్రత్యేకంగా దృష్టి సారించింది. అందుకు కారణం ఏడో విడత ఎన్నికల్లో పోలింగ్ జరిగే జమూరియా నియోజకవర్గం నుంచి జేఎన్‌యు విద్యార్థి సంఘం ప్రస్తుత అధ్యక్షురాలు ఐషీ ఘోష్ పోటీకి నిలబడటం! ఆమె సీపీఐ (ఎం) తరఫున పోటీ చేయబోతున్నప్పటికీ, ఏ పార్టీ నుంచి అని కాకుండా, అసలు ఆమె పోటీకి దిగడమే విశేషం అయింది. ‘‘నా మదిలో, నా హృదయంలో జేఎన్ యు ఉంది.
పశ్చిమ బెంగాల్ బొగ్గు గనుల కార్మిక ఉద్యమ అనుభవం నన్ను రాజకీయాల్లోకి ప్రేరేపిస్తోంది’’ అంటున్నారు ఘోష్, తన ‘కొత్త’ రాజకీయ రంగ ప్రవేశం గురించి. ఇప్పటికే ఆమె విద్యార్థి రాజకీయాలలో చురుగ్గా ఉన్నారు. గత ఏడాది జనవరి 5 న ఢిల్లీ జవహర్‌లాల్ యూనివర్సిటీలోని పెరియార్ హాస్టల్‌లో ఆమెపై ప్రత్యర్థుల దాడి జరగడానికి కూడా ఆ చైతన్యశీలతే కారణం. దాడి అనంతరం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఢిల్లీ వెళ్లి ఆమెను అభినందించారు. ఆశీస్సులు అందించారు. ఆయనకన్నా ముందు ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పడుకోన్ వెళ్లి ‘వందనం.. అభివందనం’ అన్నారు! ఐషీ ఘోష్ ప్రస్తుతం ఎంఫిల్ రెండో సంవత్సరం చదువుతున్నారు. జేఎన్‌యు లో చదువుతూ ఒక విద్యార్థి అసెంబ్లీకి పోటీ చేయడం యూనివర్సిటీ చరిత్రలోనే ప్రథమం. వర్సిటీలోని ‘స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్’లో ఆమె తన మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు.
∙∙
జేఎన్‌యులో తాము ఎందుకోసం అయితే పోరాడుతున్నామో, అదే ఉద్యమ పోరును తాను దేశ రాజకీయాల్లో కొనసాగించబోతున్నానని ఐషీ అనడంతో ఒక్కసారిగా పశ్చిమ బెంగాల్‌లోని అన్ని పార్టీల దృష్టీ ఆమెపై మళ్లేలా చేసింది. మెరుగైన విద్య, ఉపాధి, మంచి జీవన ప్రమాణాలు ఆమె తొలి ప్రాధాన్యాలు. జమూరియా బరిలో దిగేందుకు ఇప్పటికే ఆమె తన హాస్టల్ గదిలోని సామగ్రి ని సర్దుకుని ఉన్నారు. జమూరియాకు గంటన్నర దూరంలోనే ఆమె స్వస్థలం దుర్గాపూర్. అది వేరొక నియోజకవర్గ పరిధి లో ఉంటుంది. ఆమె తల్లిదండ్రులు దుర్గాపూర్‌లోనే ఉంటున్నారు. తండ్రి దేబశిష్ ఘోష్ దామోదర్ వ్యాలీ కార్పోరేషన్ ఉద్యోగి. కార్మిక నాయకుడు.
తల్లి శర్మిష్ఠ ఘోష్ గృహిణి. ఇంట్లో ఐషీనే పెద్ద. చెల్లెలు ఇషిక కూడా ఢిల్లీలోనే అక్కడి శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ కాలేజ్‌లో డిగ్రీ చదువుతోంది. ఐషీ ఘోష్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం పట్ల ఇంట్లో అందరూ సుముఖంగా ఉన్నారు. తండ్రయితే సంతోషంగా ఉన్నారు. గనుల అక్రమ తవ్వకాలకు జమూరియా పేరుమోసిన ప్రాంతం. తన కూతురు గెలిస్తే అక్రమాలు తగ్గుతాయని ఆయన ఆశిస్తున్నారు. ఐషీ వాటిని ఎలాగూ తగ్గిస్తారు. అయితే ఆమె ప్రధాన అజెండా వేరే ఉంది. ‘‘ఉన్నత విద్యల కోసం, పెద్ద జీతాల కోసం, మంచి జీవితం కోసం యువత పరాయి ప్రాంతాలకు వెళ్లిపోవడంతో పశ్చిమ బెంగాల్ వృద్ధాశ్రమంలా మిగిలిపోతోంది. వాళ్లను ఆపడం కోసం ఉపాధి కల్పనపై మొదట నా పని ప్రారంభిస్తాను’’ అంటున్నారు ఐషీ.
ఘోష్ దుర్గాపూర్‌లోనే ఇంటర్ వరకు చదివారు. ఢిల్లీలోని దౌలత్ రామ్ కాలేజ్ నుంచి పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ చేశారు. దుర్గాపూర్‌లో ఉండగా తండ్రితో పాటు స్థానిక బొగ్గు గనుల కార్మిక పోరాటాల్లో పాల్గొన్నారు. ఇరవై ఏళ్ల వయసులో విద్యార్థిగా ఢిల్లీ వచ్చేశారు. ఎన్నికల అభ్యర్థిగా ఇప్పుడు మళ్లీ బెంగాల్ వెళుతున్నారు. ‘‘ఒకవేళ మీరు గెలిస్తే ఎమ్మెల్యేగా జమూరియాను, ఎంఫిల్ విద్యార్థిగా జేఎన్‌యును ఎలా బ్యాలెన్స్ చేసుకోగలరు?’’ అనే ప్రశ్న ఇప్పటికే మొదలైంది. ‘‘బ్యాలెన్స్ చేసుకుంటాను’’ అని ఆత్మవిశ్వాసం తో చెబుతున్నారు ఐషీ ఘోష్. ఆ ఆత్మ విశ్వాసం ఆమెలో ఫైర్ బ్రాండ్ మమతను ప్రతిఫలింపజేస్తోంది.
గత ఏడాది ప్రత్యర్థుల దాడిలో గాయపడి, కోలుకుంటున్న సమయంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ఐషీఘోష్. ప్రస్తుతం ఆమె పశ్చిమ బెంగాల్ ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment