రేపటి నుంచి పనిలోకి రానమ్మా... | Kalita Majhi contesting elections on BJP ticket from Ausgram | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి పనిలోకి రానమ్మా...

Published Thu, Mar 25 2021 4:36 AM | Last Updated on Thu, Mar 25 2021 7:35 PM

Kalita Majhi contesting elections on BJP ticket from Ausgram - Sakshi

అంట్లు కడుగుతున్న కలితా మాఝీ

పనిమనిషి ‘కలితా మాఝీ’ తను పని చేసే ఇళ్లల్లో ఒక నెల సెలవు తీసుకుంది. ‘రేపటి నుంచి పనికి రానమ్మా... నెల తర్వాతే మళ్లీ’ అని ఎన్నికల బరిలో దిగింది. పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎలక్షన్లలో పుర్బ బుర్‌ద్వాన్‌ జిల్లాలోని ఆస్‌గ్రామ్‌ నియోజకవర్గం నుంచి ఆమె బిజెపి అభ్యర్థిగా రంగంలో దిగింది. ‘ఊరి సమస్యలు పనిమనిషికి కాకపోతే ఇంకెవరికి తెలుస్తాయి’ అంటోంది. ఆమె ఓడితే సరే.. గెలిస్తే ఏం చేయాలా అని ఇప్పటి నుంచి వేరే పనిమనుషుల గురించి ఒక కన్నేసి పెడుతున్నారు ఆమె పని చేసే ఇళ్లవాళ్లు. ప్రజాస్వామ్యపు ఈ సదవకాశ కథ వినదగ్గది.

వారం క్రితం కలితా మాఝీ ఇల్లు చేరుకునేసరికి ఆమె గుడిసె ముందు ఒకటే కోలాహలం. బిజెపి జెండాలు. పార్టీ నాయకులు. కార్యకర్తలు. ఏమైందో ఆమెకు అర్థం కాలేదు. ఎవరో వచ్చి మిఠాయి తినిపించి ‘నిన్ను ఆస్‌గ్రామ్‌ నియోజకవర్గం నుంచి బి.జె.పి అభ్యర్థిగా నిలబెట్టారు’ అని చెప్పారు. కలితా తబ్బిబ్బయ్యింది. ఎందుకంటే ఇది ఆమె ఎప్పటికీ ఊహించనిది. ఆమె నాలుగిళ్లల్లో పాచి పని చేసుకుని బతికే పనిమనిషి. నేడు– కేంద్రంలో అధికారంలో ఉన్న అతి పెద్ద బి.జె.పి పార్టీ అభ్యర్థి. ఈ వార్త తెలిసి ఆమెకు సంతోషం కలిగింది. అయితే చేసే పని కొన్నాళ్లు మానేస్తున్నానని ఇళ్ల యజమానులకు ఎలా చెప్పాలా అని బెంగ కూడా కలిగింది.

నాలుగిళ్ల మనిషి
ఆస్‌గ్రామ్‌ అనేది దాదాపు 5 వేల మంది ఉండే చిన్న గ్రామం. అదే గ్రామ కేంద్రంగా ఆస్‌గ్రామ్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. ఇది పుర్బ బుర్వాన్‌ జిల్లాలో ఉంది. ఈ జిల్లాలో 74 శాతం మంది లోపలి పల్లెల్లోనే జీవిస్తుంటారు. నగర ఛాయలు తక్కువ. పట్టణ ఛాయలూ తక్కువే. బాగా వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతంలో అనాదిగా సిపిఎం ఆ తర్వాత తృణమూల్‌ కాంగ్రెస్‌ గెలుస్తూ వచ్చాయి. ఇప్పుడు బి.జె.పి అక్కడ తన జెండా ఎగురవేయ దలిచి కలితా మాఝీని రంగంలో దించింది. అయితే డబ్బు దస్కం పలుకుబడి ఉన్న ఇందరు ఉండగా కలితాను ఎందుకు దించింది? ఎందుకంటే ఆస్‌గ్రామ్‌ నియోజక వర్గం ఎస్‌.సి రిజర్వ్‌డ్‌ కనుక కూడా.

ఆరు చీరల అభ్యర్థి
కలితా మాఝీకి మొత్తం ఎంచితే ఆరు చీరలు ఉన్నాయి. అవే ఆమె ఆస్తి. 32 ఏళ్ల కలితాకు 8వ తరగతి చదివే కొడుకు ఉన్నాడు. భర్త çపంబ్లర్‌. ఒక నీటి కుంట పక్కన వీరి గుడిసె ఉంటుంది. ‘నేను నాలుగైదు ఇళ్లల్లో పని చేస్తాను. గిన్నెలు కడిగి, ఇంటి పని చేస్తే దాదాపు రెండున్నర వేలు వస్తాయి. ఇరవై ఏళ్ల నుంచి పని మనిషిగానే నా బతుకు నేను బతుకుతున్నాను’ అంటుంది కలితా. అయితే అయిదేళ్ల క్రితం ఆమె ‘అవసరం’ పార్టీలకు పడింది. పంచాయతీ ఎలక్షన్లలో ఆ స్థానం కూడా రిజర్వ్‌డ్‌ కాబట్టి ఆమెను నిలబెట్టారు. అయితే ఆమె ఓడిపోయింది. ఇప్పుడు ఏకంగా ఎం.ఎల్‌.ఏగానే బి.జె.పి టికెట్‌ ఇచ్చింది. ‘కలితా ఐదేళ్లుగా పార్టీకి పని చేసింది. కష్టపడి పని చేసేవారిని మా పార్టీ గుర్తిస్తుంది’ అని బి.జె.పి జాతీయ ప్రధాన కార్యదర్శి బి.ఎల్‌.సంతోష్‌ అన్నారు.

హాస్పిటల్‌ తెస్తాను
కలితా అభ్యర్థిత్వం జాతీయ స్థాయిలో చాలామందిని ఆకర్షించింది. ఆమె వార్తల్లోకి వచ్చింది. అయితే అవన్నీ పట్టని కలితా తాను పని చేసే ఇళ్ల యజమానుల దగ్గర నెల రోజుల సెలవు అడిగింది. ‘రేపటి నుంచి పనిలోకి రానమ్మా అని చెప్పేశాను’ అంది. ఆ మేరకు ఆమెకు ఈ నెల ఆదాయం పోయినట్టే. అయితే ఏమిటి? ఉత్సాహంగా తాను గెలవడానికి ప్రచారం మొదలెట్టింది. ‘నేను కష్టం తెలిసినదాన్ని. నాలుగిళ్లు తిరిగి కష్టం గమనించేదాన్ని. సమస్యలు నాకు కాక ఇంకెవరికి తెలుస్తాయి’ అంటూ కలితా ప్రచారం చేస్తోంది. ఆస్‌గ్రామ్‌లో ఎవరికైనా సీరియస్‌ అయితే గంటన్నర ప్రయాణం చేసి బుర్వాన్‌ టౌన్‌కు వెళ్లాలి. ‘ఈ బాధలు ఎంతకాలం. నేను గెలిస్తే మంచి ఆస్పత్రి మా ఊరికి తీసుకు వస్తాను’ అని కలితా అంటున్న మాటలు ఆ ప్రాంతం వారికి నచ్చుతున్నాయి. కలితా భర్త పార్థ మాఝీ, అత్తగారు సందా మాఝీ ఆమెకు పూర్తిస్థాయి మద్దతు తెలిపారు. ‘ఆమె గెలవాలి. అందుకు చేయగలిగిందల్లా చెయ్‌ అని చెప్పాను’ అన్నాడు భర్త. ‘నా కోడలు గెలిస్తేనా చూడండి ఎన్ని అద్భుతాలు చేస్తుందో’ అని అత్త అంటోంది.

నిజానికి అన్ని వర్గాల ప్రజలు ఎన్నికలలో పాల్గొనడానికి మన ఎన్నికల వ్యవస్థలో చోటు ఉంది. అన్ని వర్గాల ప్రజలు పాల్గొని గెలవాలి. గెలిచిన సందర్భాలు ఉన్నాయి. అయితే ‘తప్పనిసరి’ సందర్భాలలో మాత్రమే కొందరికి అవకాశాలు దక్కడాన్ని విమర్శించాలా ఈ తప్పనిసరి వల్లనైనా అవకాశం దక్కింది అని సంతోష పడాలా తెలియదు. గతంలో తెలుగులో ‘ముద్దమందారం’ అనే సినిమాలో రిజర్వ్‌డ్‌ స్థానానికి సినిమా టాకీసులో పని చేసుకు బతికే రాజేంద్రప్రసాద్‌ను నిలబెడతారు. కలితాది అలాంటి కథ కారాదని ఆమె గెలవాలని, ఎంఎల్‌ఏగా బాగా పని చేసి పేరు తెచ్చుకోవాలని కోరుకునే శ్రేయోభిలాషులు ఉంటారు. అయితే తృణమూల్‌కు, బిజెపికి హోరాహోరీగా పోరాటం జరుగుతున్న బెంగాల్‌లో చీపిరి వదిలి తడి చేతులు తుడుచుకుని అందరికీ నమస్కారం పెడుతూ ఓట్లు అభ్యర్థించే కలితా గెలుపు అవకాశాలు ఎన్ని అనేదే ఇప్పుడు ఉత్కంఠ. వేచి చూద్దాం.

ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రచారం నిర్వహిస్తున్న కలితా మాఝీ

– సాక్షి ఫ్యామిలీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement