ఆకలి తెలిసిన మనిషి.. | Kanduri krishna to Breakfast for 250 people help | Sakshi
Sakshi News home page

ఆకలి తెలిసిన మనిషి..

Published Thu, Jul 25 2024 8:53 AM | Last Updated on Thu, Jul 25 2024 9:06 AM

Kanduri krishna to Breakfast for 250 people help

ఆకలికి పేద, గొప్ప తారతమ్యం లేదు. దానికి అందరూ సమానమే.. సమయానికి పిడికెడు మెతుకులు పొట్టలో పడకపోతే అల్లాడిపోతాం. ఆ విలువ తెలిసిన వాడు కనుకే ఆయన ఆకలితో ఉన్న వారి కోసం ఆలోచిస్తారు. మానవ సేవే మాధవ సేవ అన్న మాటను బలంగా నమ్ముతూ సేవా మార్గంలో పయనిస్తున్నారు కందూరి
కృష్ణ. దానికి తాను సంపాదించిన దాంట్లో కొంత పేదల కోసం ఖర్చు చేస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 30 ఏళ్లుగా (మూడు దశాబ్దాలుగా) ఎంతో మంది ఆకలి తీరుస్తున్నారు. కందూరి కృష్ణ చిక్కడపల్లి నివాసి. స్థానికంగా శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో నగల దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. తనకు వచ్చే సంపాదనలో ఏటా సుమారు రూ.2 లక్షలకు పైగా సేవా కార్యక్రమాల కోసం వినియోగిస్తున్నారు.                
– సుందరయ్య విజ్ఞాన కేంద్రం

ఆకలితో అలమటించే వారిని ఆదుకోవడం కోసం సాటి మనిషిగా కందూరి కృష్ణ ప్రతినిత్యం పలు ఆలయాల వద్ద అల్పాహారంతో పాటు అన్నదానం చేస్తుంటారు. చిక్కడపల్లిలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో యాచకులకు ప్రతిరోజూ ఉదయం అల్పాహారాన్ని అందిస్తారు. సమీప ప్రాంతాల్లోని ఆలయాల పరిసరాల్లో టిఫిన్‌ సెంటర్ల నిర్వహకులకు కృష్ణ ప్రతినెలా రూ.25 వేలు చెల్లిస్తారు. ఈ మేరకు టిఫిన్‌ సెంటర్ల నిర్వహకులు నిరుపేదలకు అల్పాహారాన్ని అందిస్తారు. అల్పాహారంతో పాటు అరటి పండ్లను పంపిణీ చేస్తారు. ప్రతిరోజూ తన నగల దుకాణం వద్ద ఉదయం 7 గంటలకు అల్పాహారంతో పాటు అరటి పండ్లను పంపిణీ చేస్తారు. ఇందులో పేదలతో పాటు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువకులు కూడా బారులు తీరుతూ అల్పాహారాన్ని అందుకుంటారు.

30 ఏళ్లుగా షెడ్యూల్‌ ప్రకారం.. 
అప్పుడప్పుడు ఈ అల్పాహారాన్ని తీసుకుని ఉన్నత ఉద్యోగాల్లో చేరిన యువకులు కందూరి కృష్ణ వద్దకు వచ్చి సార్‌ మీరు ఇచి్చన అల్పాహారం ఎంతో ఉపయోగపడింది. ఈ రోజు ఉన్నత స్థాయికి చేరుకున్నామని చెబితే ఆయన ఆనందానికి అవధులు లేకుండాపోతుందని చెబుతారు.. 30 ఏళ్లుగా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సోమవారం శంకరమఠం, మంగళ, బుధ వారాల్లో సికింద్రాబాద్‌లోని పద్మరావునగర్‌ స్కంధగిరి ఆలయం, గురువారం బాగ్‌లింగంపల్లిలోని సాయిబాబా మందిరం, శుక్రవారం లిబరీ్టలోని వేంకటేశ్వర స్వామి ఆలయం, శనివారం చిక్కడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయం పరిసరాల్లో అల్పాహారాన్ని అందిస్తూ నిరి్వరామంగా సేవలను కొనసాగిస్తున్నారు. తరచూ గోశాలలోని పశువులకు ఆహారాన్ని అందిస్తారు. అనేకమార్లు సామాజిక సేవలను కొనియాడుతూ ప్రస్తుత గవర్నర్‌ బండారు దత్తాత్రేయ లాంటి వారు సైతం కందూరి కృష్ణను సన్మానించారు.  

ఎన్నో ఉచిత వైద్య శిబిరాలు.. 
పేద, మధ్య తరగతి ప్రజలతో పాటు అన్ని వర్గాల ప్రజల ఆరోగ్యానికీ కందూరి కృష్ణ ఇప్పటి వరకూ సుమారు 130కిపైగా ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. రోగులకు అవసరమైన చికిత్సలు అందించారు. 75 మందికి కంటి శుక్లాల ఆపరేషన్లు చేయించారు. వృద్ధులకు, కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కర్నూల్‌లో సంభవించిన వరదల్లో సర్వస్వం కోల్పోయిన వారికి రూ.4 లక్షలతో దుస్తులను పంపిణీ చేశారు. ఎనిమిది సార్లు ఉచిత రక్తదాన శిబిరాలు నిర్వహించి 635 యూనిట్ల రక్తాన్ని సేకరించి రక్తనిధికి అందించారు. ట్విన్‌ సిటీస్‌ జ్యూవెలరీస్‌ అధ్యక్షుడిగా దశాబ్ద కాలంగా కొనసాగుతున్నారు. కందూరి కృష్ణ ఫౌండేషన్‌ ద్వారా నిరంతరం సేవలను కొనసాగిస్తున్నారు.

పేద విద్యార్థులకు ఆర్థికంగా తోడ్పాటు..  
ఉచితంగా అల్పాహారం పంపిణీ చేయడం వల్ల పేద విద్యార్థులకు ఎంతో కొంత ఆర్థికంగా వెసులుబాటు లభిస్తుంది. నాది వరంగల్‌ జిల్లా నేను 
ఎంఫార్మసీ పూర్తి చేశాను. ప్రతి రోజూ నాతో పాటు అనేక మంది విద్యార్థులు క్యూలైన్‌లో నిలబడి అల్పాహారం తీసుకుంటారు.  
– పల్లవి, ఎంఫార్మసీ 

 పేదల ఆకలి తీర్చే దేవుడు.. 
ఈయన పేదల ఆకలి తీర్చే దేవుడు. ప్రతిరోజూ ఉదయం అనేక మంది నాతో పాటు పేదలు వచ్చి అల్పాహారాన్ని తీసుకుంటారు. ఈ ప్రధాన రహదారి నుంచి పోయే చిరువ్యాపారులు సైతం క్యూలో నిలబడి జైశ్రీరామ్‌ అంటూ అల్పాహారం తీసుకొని సంతోషంగా వెళ్లిపోతుంటారు.          
 – లక్షి్మ, చిక్కడపల్లి

మిత్రుల సహకారంతో.. 
ప్రముఖ వ్యాపారవేత్త ప్రమోద్‌ అగర్వాల్, స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ హెచ్‌.గోవింద్‌రావుల సహకారం, ప్రోత్సాహంతో సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నాం. నా సంపాదనలో కొంత భాగం పేదలకు ఖర్చు పెట్టాలనేదే ఉద్దేశం. ప్రతి రోజూ స్కూల్‌ విద్యార్థులతో పాటు డిగ్రీ, పీజీ, బీటెక్‌ విద్యార్థులు, ఇతర వర్గాల పేదలు ఉదయం 7.30 గంటల వరకు మా షాపు వద్ద క్యూలైన్‌లో ఉంటారు. ప్రతిరోజూ సుమారు 250 మందికి అల్పాహారంతో పాటు అరటిపండ్లు అందజేస్తున్నా. 
– కందూరి కృష్ణ, ఫౌండేషన్‌ నిర్వాహకులు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement