చిన్నారులూ... కిడ్నీలో రాళ్లు...! | Sakshi
Sakshi News home page

చిన్నారులూ... కిడ్నీలో రాళ్లు...!

Published Sun, Jun 25 2023 1:30 AM

Kidney stones in childrens - Sakshi

పెద్దవాళ్లతో పోలిస్తే చిన్నపిల్లల మూత్రపిండాల్లో రాళ్లు రావడం అంతే సాధారణం కాదుగానీ... అరుదు మాత్రం కాదు. గణాంకాల ప్రకారం పదహారేళ్లలోపు వారిలో 5 నుంచి 6 శాతం మంది పిల్లల్లో కిడ్నీలో రాళ్లు వస్తుంటాయి. కిడ్నీల్లో రాళ్లు వచ్చే కండిషన్‌ను ‘నెఫ్రోలిథియాసిస్‌’ అంటారు.

కారణాలు: పిల్లల కిడ్నీల్లో రాళ్లు తయారు కావడానికి అనేక కారణాలున్నాయి. వాటిల్లో ముఖ్యమైనవి...
► ఆహారంలో రాళ్లను కల్పించే రసాయన గుణాలు ఉండటంతో పాటు కొంతవరకు వాతావరణం, ఆర్థిక–సామాజిక పరిస్థితులు. (పేదవర్గాల్లో కలుషితాహారం తీసుకునే ఆర్థిక సామాజిక పరిస్థితులు మూత్రపిండాల్లో రాళ్లకు దారితీసే అవకాశాలు ఎక్కువ. వారు తీసుకునే ఆహారాలను బట్టి అవి క్యాల్షియం కార్బొనేట్, ఆక్సలేట్స్, ఫాస్ఫరస్, యూరిక్‌ యాసిడ్, స్ట్రువైట్‌ స్టోన్, సిస్టీన్‌ వంటి రాళ్లను ఏర్పరవచ్చు. వాటిని బట్టి  ఫలానా ఆహారనియంత్రణ పాటించాలంటూ డాక్టర్లు సూచిస్తుంటారు).
► పిల్లల్లో తరచూ యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్స్‌ వస్తున్న సందర్భాల్లో మూత్రపిండాల్లో రాళ్లకు దారితీయవచ్చు.
► కొందరిలో ఎండోక్రైనల్‌ సమస్యలు
► కొన్ని జన్యుపరమైన అంశాలు
► కిడ్నీలో రాళ్లు కనిపించిన పిల్లల్లో మెటబాలిక్‌ డిజార్డర్స్‌ ఏవైనా ఉన్నాయా అని కూడా డాక్టర్లు అన్వేషిస్తారు.  


లక్షణాలు:
► జ్వరం
► తీవ్రమైన కడుపు నొప్పి, తీవ్రమైన నడుము నొప్పి
► మూత్రంలో రక్తం కనిపించడం
► వాంతులు
► కొన్ని సందర్భాల్లో ఎలాంటి లక్షణాలూ కనిపించకపోవచ్చు కూడా.


నిర్ధారణ :
► కొన్ని రొటీన్‌ మూత్రపరీక్షలు,
► రీనల్‌ ఫంక్షన్‌ టెస్ట్,
► రీనల్‌ స్కాన్‌
► కొన్ని మెటబాలిక్‌ పరీక్షలు చేయించడం అవసరం.
(రీనల్‌ స్కాన్స్, మెటబాలిక్‌ పరీక్షల సహాయంతో రాయి తాలూకు రసాయన స్వభావం తెలుసుకుంటారు. దానిపైనే చికిత్స ఆధారపడి ఉంటుంది.


జాగ్రత్తలు / చికిత్స: కిడ్నీల్లో స్టోన్స్‌ వచ్చేందుకు అవకాశం ఉన్న పిల్లలు నీళ్లు ఎక్కువగా తాగడం;  పొటాషియమ్‌ ఎక్కువగా ఉండే ద్రవాహారాల్ని తీసుకోవడం; కొవ్వులు ఎక్కువగానూ, పిండిపదార్థాలు తక్కువగా ఉంటే ఆహారాలకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తక్కువగా తీసుకోవాలి. పిల్లల్లో యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్స్‌ ఉంటే వెంటనే చికిత్స చేయించాలి. చాక్లెట్ల వంటి వాటిని తగ్గించాలి. ఉప్పు తక్కువగా తీసుకోవాలి. అలాగే ఉప్పు మోతాదు ఎక్కువగా ఉండే చిప్స్, పచ్చళ్లు వంటి ఆహారాలకు దూరంగా ఉండాలి. పాల ఉత్పాదనలు, మాంసాహారం, చీజ్‌ వంటి ఆహారాలను తగ్గించాలి.

చికిత్స : ఈ రాయి పరిమాణం చాలా చిన్నదిగా ఉంటే దానంతట అదే మూత్రంతో పాటు పడిపోతుంది. ఒకవేళ రాయి పరిమాణం పెద్దదిగా ఉండి, దేనికైనా అడ్డుపడుతుంటే  షార్ట్‌వేవ్‌ లిథోట్రిప్సీ వంటి అధునిక పద్ధతులతో రాయిని పొడిపొడి అయ్యేలా బ్లాస్ట్‌ చేయడం, అదీ కుదరనప్పుడు చివరగా యూరాలజిస్ట్‌ ఆధ్వర్యంలో శస్త్రచికిత్స అవసరమవుతుంది.  

Advertisement
 
Advertisement
 
Advertisement