‘ఆర్యూ ఓకే’ అనే భావం భర్త చూపుల్లో మేఘన్‌కు కనిపించింది! హాస్పిటల్ బెడ్‌పైన ఉంది మేఘన్. భర్త అలా చూడగానే ఆమెకు విషయం అర్థమైంది. గుండె పగిలి ఒక్కసారిగా ఏడ్చేసింది.
మాతృత్వం! ఆ భావనలోనే అమృతం దాగుంది. దేవుడు స్త్రీకిచ్చిన వరం మాతృత్వం అని అంటుంటారు. అందుకే ఎన్నిసార్లు తల్లయినా, మళ్లీ మరో బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు ఆ అమ్మదనాన్ని స్త్రీ కొత్తగా కోరుకుంటుంది. గర్భంలో అప్పుడే ప్రాణం పోసుకుంటున్న జీవిని కంటికి రెప్పలా కాచుకుంటుంది. అయిన వారందరికీ చెప్పుకొని మురిసిపోతుంది.
పుట్టబోయే బిడ్డని అందనంత ఎత్తులో చూడాలని కలలు కంటుంది. కానీ.. ఆ కలలు అర్ధంతరంగా కల్లలైపోతే! రేపో మాపో పుడుతుందనుకున్న నలుసు కడుపులోనే కరిగి, అందని లోకాలకు వెళ్లిపోతే! ఆ బాధను భరించడం ఏ తల్లికీ తరం కాదు. ఆ తల్లి కన్నీటిని తుడవడం ఏ ఒక్కరికీ వశం కాదు.
2020 జూలై. అప్పుడే రోజు మొదలవుతోంది. గర్భంతో ఉన్న మేఘన్ మార్కెల్ తన మొదటి కొడుకు డైపర్ మార్చుతోంది. అకస్మాత్తుగా తెలీని నిస్సత్తువ ఏదో ఆవరించినట్లు ఆమె శరీరమంతా తిమ్మిర్లు మొదలయ్యాయి. చేతుల్లో ఒక బిడ్డ, కడుపులో మరో బిడ్డ. చేతుల్లోని ఏడాది బిడ్డను ఉన్నఫళంగా వదిలేయలేదు. వదిలేయకుంటే తనలో ప్రాణం పోసుకుంటున్న మరో బిడ్డపై ఆ క్షణాన పడుతున్న ఒత్తిడి ఏమిటో తెలుసుకోలేదు. మనసేదో కీడు శంకిస్తోంది. ఏమిటది? ఆలోచించే లోపే తనకు తెలీకుండానే చేతుల్లో ఉన్న బాబుతో సహా కింద పడిపోయింది.
కళ్లు తెరిచి చూసేసరికి ఆసుపత్రి పడకపై ఉంది! పక్కన భర్త హ్యారీ ఓదార్పుగా ఆమెనే చూస్తూ ఉన్నాడు. కళ్లు తెరిచాక, ‘నువ్వు బాగున్నావ్ కదా?!’ అనే భావం అతడి చూపుల్లో ఆమెకు కనిపించింది. ఆమె చెయ్యి విడువకుండా, దుఃఖాన్ని దిగమింగుకొని, కడుపులోని జీవం కడుపులోనే పోయిందని చెప్పలేకపోతున్నాడు. కడుపు కోతంటే కేవలం తల్లిది మాత్రమే కాదు తండ్రిది కూడా. విషయం ఆమె గ్రహించింది! ఒక్కసారిగా ఆమె గుండె పగిలి పోయింది. తట్టుకోలేక పోయింది. భోరున ఏడ్చేసింది.
∙∙
ప్రిన్స్ హ్యారీని ప్రేమించి, పెళ్లాడి బ్రిటన్ రాజవంశంలోకి అడుగుపెట్టిన మేఘన్ మార్కెల్‌ను ఈ చేదు ఘటన ఒక్కసారిగా తలకిందులు చేసింది. భర్త హ్యారీ, ముద్దులొలికే తమ చిన్నారి కుమారుడు ఆర్చీ మాత్రమే లోకంగా జీవిస్తూ వస్తోంది ఆమె ఇంతవరకూ. ‘మొదటి బిడ్డను పుట్టగానే నా చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఎంత సంతోషం అనుభవించానో.. రెండో బిడ్డను కడుపులోనే పొగొట్టుకున్నప్పుడు అంతకు రెట్టింపుగా బాధపడ్డాను’ అని తాజాగా ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రికకు రాసిన వ్యాసంతో ఆమె తన వ్యధను దిగమింగుకోలేకపోయారు.
బ్రిటన్ రాజవంశానికి చెందిన ఓ ఉన్నత వ్యక్తి ఇలా వ్యక్తిగత విషయాలు బయటకు వెల్లడించడం.. అందులోనూ ఇలాంటి విషయాల గురించి మీడియాతో పంచుకోవడం ఇదే ప్రథమం కాకపోవచ్చు. కానీ ఎంతో ఆవేదనా భరితంగా ‘ది లాసెస్ వియ్ షేర్’ అనే ఆ వ్యాసం కొనసాగింది. కొద్దికాలం క్రితమే బ్రిటన్ రాజప్రాసాదాన్ని వీడిన ఈ దంపతులు ప్రస్తుతం లాస్ ఏజెలిస్‌లో ఉంటున్నారు.
తన వ్యాసంలోనే ఇంకో మాట కూడా రాశారు మేఘన్. గత ఏడాది ప్రిన్స్ హ్యారీ, తను దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నప్పుడు ఒక జర్నలిస్టు.. ‘ఆర్యూ ఓకే’ అని మేఘన్‌ను అడిగారట. అది మామూలు ప్రశ్నే అయినా అలాంటి పలకరింపు ప్రతి మహిⶠకూ అవసరం అని మేఘన్ అన్నారు. బహుశా తనను వద్దనుకున్న రాజప్రాసాద బాంధవ్యాలను తలచుకుని అలా రాసి ఉండవచ్చు. ఏమైనా భర్త తన పక్కన ఉన్నాడు. ‘ఆర్యూ ఓకే’ అని అతడు తనని అడుగుతున్నట్లే ఉంది ఆమెకు ప్రతి క్షణం.
– జ్యోతి అలిశెట్టి, సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం
Comments
Please login to add a commentAdd a comment