Merry Christmas 2021: ఆమె ఒక బామ్మ. క్రిస్మస్ షాపింగ్‌కు తన ముగ్గురు మనమరాళ్లతో షాపింగ్‌కు వెళ్లింది. వాళ్లతో మాట్లాడుతూ నవ్వుతూ దగ్గరకు తీసుకుంటూ షాపింగ్ చేసింది. బిల్లు పే చేయబోయే సమయానికి వెనుక ఉన్న యువకుడు ‘మీ బిల్లు నేను పే చేస్తాను. నా క్రిస్మస్ కానుక అనుకోండి’ అన్నాడు. ‘ఎలా ఎందుకు?’ అని ఆమె అడిగింది. దానికి అతడు ఏం సమాధానం చెప్పాడు? ఈ ఘటన యు.కెలో జరిగితే అమెరికాలో ఒక మనవరాలు ‘ఈ క్రిస్మస్‌కు నాకు నానమ్మతో హగ్ కావాలి’ అని కోరి ఇంట్లో పెద్దవాళ్ల అవసరాన్ని చెప్పింది. ఈ క్రిస్మస్ మన దేశంలో కూడా నానమ్మల, అమ్మమ్మల ఆత్మీయతల మధ్య జరగాలి.
డిసెంబర్ 17. యు.కెలోని హెల్స్‌టన్ పట్టణం. బేవర్లీ కుక్ అనే బామ్మ తన ముగ్గురు మనవరాళ్లతో కలిసి సూపర్ మార్కెట్‌కు వెళ్లింది. జనం రద్దీగా ఉన్నారు. క్రిస్మస్ షాపింగ్ జోరుగా జరుగుతోంది. బేవర్లీ కుక్ తన ముగ్గురు మనవరాళ్లతో ఎంతో ప్రేమగా మాట్లాడుతూ ముద్దు చేస్తూ ఇంటికి కావాల్సినవి, వారికి కావాల్సినవి కొంటోంది. అంతా అయ్యాక సరుకుల బుట్టను బిల్లింగ్ దగ్గరకు తెచ్చేసరికి వెనుక ఉన్న యువకుడు ‘మీరేమీ అనుకోకపోతే మీ బిల్లు నేను కట్టనా?’ అన్నాడు. బామ్మ ఆశ్చర్యపోయింది. ‘ఎందుకు?’ అని అడిగింది.
‘మీ కుటుంబం చాలా బాగుంది. మీ మనవలు మీతో ఎంతో ప్రేమగా ఉన్నారు. మీరు కూడా వారితో. ఇలా కుటుంబాలు అందంగా ఉండాలి. అందుకే నేను మీ బిల్లు కడతాను. ఇది నా క్రిస్మిస్ కానుక అనుకోండి’ అన్నాడు. ఆమె సంతోషంగా అంగీకరించింది. ఆ యువకుడు మాస్క్ కట్టుకుని ఉన్నాడు. పేరు చెప్పలేదు. ముఖం చూపించలేదు. బిల్లు కట్టి వెళ్లిపోయాడు. బహుశా అతని కుటుంబంలో ఆ పరిపూర్ణత్వం లేదేమో. బేవర్లీ కుక్ ఈ విషయాన్ని ఫేస్‌బుక్ ద్వారా అందరికీ తెలిపినప్పుడు ఆ అజ్ఞాత యువకుడికి ఎన్నో ప్రశంసలు వచ్చాయి. బామ్మల ప్రేమ కుటుంబానికి అవసరం అని అతడు గుర్తించి అందరినీ గుర్తించేలా చేశాడని కామెంట్లు పెట్టారు.
పెద్దవాళ్లు తాము జీవించి ఉండగానే చూసే అద్భుతాలు మనవలు, మనవరాళ్లు. అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు తాము తల్లిదండ్రులు అయినప్పుడు మురిసిపోతారో లేదో కాని అవ్వలు, తాతయ్యలు అయినప్పుడు పొంగిపోతారు. పిల్లలతో లేనంత గాఢ బంధం వారికి మనమలతో ఏర్పడుతుంది. కాని ఇవాళ ప్రపంచంలో చాలా మటుకు ఆ పెద్దవాళ్లకు మనవలతో, మనవరాళ్లతో గడిపే వీలు లేదు. కారణాలు అనేకం. కాని ఇంట్లో భార్య, భర్త, పిల్లలు ఉండటం ఇప్పుడు సంపూర్ణం అనుకునే రోజులు వచ్చాయి. పెద్దవాళ్లు ఉన్నప్పుడు కదా కుటుంబ చిత్రం సంపూర్ణం అయ్యేది. ఈ క్రిస్మస్ ఆ సంగతే గుర్తు చేస్తోంది.
అమెరికాలోని ఉటా సిటీ. అమీలియా జోన్స్ అనే తల్లి తన ఆరేళ్ల కూతురిని ‘క్రిస్మస్ వస్తోంది కదా. శాంటా తాత నుంచి నీకేం కావాలో ఒక లిస్టు రాయి’ అంది. అప్పుడా చిన్నారి ‘ఒక పెట్, మెడికిల్ కిట్ కావాలి’ అని రాసి మూడో కోరికగా ‘నానమ్మ నుంచి హగ్’ అని కూడా లిస్ట్‌లో చేర్చింది. నానమ్మ నుంచి పండగపూట ఒక హగ్ కోరుకోవాల్సిన పరిస్థితిలో కుటుంబం బిజీగా ఉంది.
ఆ అమ్మ వెంటనే ఆ విషయాన్ని అత్తగారితో చెప్తే ఆమె ఆఘమేఘాల మీద వచ్చింది. కళ్లకు గంతలు కట్టుకున్న పాపను ఆ నానమ్మ కన్నీళ్లతో కావలించుకుంది. పాప తన కళ్లకు గంతలు తీసి నానమ్మ మీద ముద్దులు కురిపించింది. పెద్దవాళ్లు మనల్ని ఆశీర్వదించే దేవతలు. ఈ క్రిస్మస్ ఆ పెద్దవాళ్లతో పూర్తి సమయం గడుపుతూ అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుందాం. హ్యాపీ క్రిస్మస్.
చదవండి: ఇలపై జనించిన కరుణ కిరణం
Comments
Please login to add a commentAdd a comment