గత ఏడాది న్యూఢిల్లీలో ప్రధాని మోదీకి రాఖీ కడుతున్న మొహ్సిన్
అనురాగబంధం చిరకాలం ఉండేది. రజతోత్సవం అన్నది ఒక జ్ఞాపకమే. మోదీకి ఇరవై ఐదేళ్లుగా.. మొహ్సిన్ షేక్ రాఖీ కడుతూ వస్తోంది. ఈసారి కుదర్లేదు. రాఖీని, ప్రార్థనల్ని.. పోస్ట్ చేసింది. ప్రధానికి రక్షా బెహన్ ఈ పౌరురాలు.
ఖమర్ మొహ్సిన్ షేక్ ఈ ఏడాది ప్రధాని నరేంద్ర మోదీకి రాఖీ కట్టలేకపోయారు! అయితే రాఖీ పౌర్ణమికి మూడు రోజుల ముందే ఈ చెల్లెమ్మ పంపిన రాఖీ ఆ అన్నయ్యకు చేరింది. చేరినట్లుగా ప్రధాని కార్యాలయం నుంచి ఆమెకు తిరుగు జవాబు కూడా వచ్చింది. గత ఇరౖÐð నాలుగేళ్లుగా మోదీకి రాఖీ కడుతున్నారు మొహ్సిన్. ఈ ఏడాది కూడా ఆయన చేతికి స్వయంగా రాఖీ కట్టి ఉంటే అదొక రజతోత్సవ సంబరం అయి ఉండేది. కరోనా కారణంగా సాధ్యం కాలేదు.
మొహ్సిన్ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉంటారు. మోదీకి ఆమె మొదటిసారి రాఖీ కట్టింది 1996లో. మోదీ అప్పుడు బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఢిల్లీలో ఉన్నారు. పార్టీ ఆదేశాలపై బదలీ మీద ఢిల్లీ వచ్చి హర్యానా, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల రాజకీయ వ్యవహారాలను చూస్తున్నారు. ఆ ఏడాది ఆగస్టు 28న వచ్చింది రాఖీ పౌర్ణమి. అహ్మదాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లి ఆయన చేతికి రాఖీ కట్టి వచ్చారు మొహ్సిన్! మోదీకి ఢిల్లీకి, మొహ్సిన్‌కి ఢిల్లీకి పుట్టు పూర్వోత్తరాల అనుబంధం ఏమీ లేదు. మోదీ పుట్టింది గుజరాత్‌లో. మొహ్సిన్ పుట్టినిల్లు పాకిస్థాన్‌లో. అయితే ఈ అన్నాచెల్లెళ్ల బంధం కలిసింది మాత్రం ఢిల్లీలోనే! మొహ్సిన్‌కి తోడబుట్టిన సోదరులు లేరు.
మొహ్సిన్ ఇరవై ఐదేళ్లుగా మోదీకి రాఖీ కడుతున్నప్పటికీ ముప్పై ఐదేళ్లుగా ఆమెకు ఆయన తెలుసు. 1980లలో పాకిస్తాన్ నుంచి ఆమె ఢిల్లీ వచ్చినప్పుడు మోదీ ‘సంభాగ్ ప్రచారక్’గా ఢిల్లీలో ఆరెసెస్ కార్యక్రమాలను నిర్వహిస్తుండేవారు. ఆ సమయంలోనే మొహ్సిన్‌కు ఆయన పరిచయం అయ్యారు. ‘‘నేను కరాచీ నుంచి వచ్చానని, నా భర్త ఇక్కడి వారేనని తెలిసిన వెంటనే మోదీజీ నన్ను ‘బెహెన్’ అని సంబోధించారు’’ అని శనివారం ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్ (ఎ.ఎన్.ఐ.) వార్త సంస్థ ప్రతినిధితో మాట్లాడుతూ గుర్తు చేసుకున్నారు మొహ్సిన్. కరాచీ నుంచి ఢిల్లీ వచ్చిన మొహ్సిన్ ఆ తర్వాత అహ్మదాబాద్‌లో స్థిరపడ్డారు. మోదీకి మొహ్సిన్ ఏడో రాఖీ కట్టేనాటికి ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. పందొమ్మిదో రాఖీ కట్టేనాటికి దేశ ప్రధానిగా ఉన్నారు.
మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి కాకముందు ఓ ఏడాది ఆయనకు రాఖీ కడుతూ.. ‘‘మీరు గుజరాత్ ముఖ్యమంత్రి అవ్వాలని ప్రార్థించాను’’ అని మొహ్సిన్ అన్నారట. ఆ మాటకు మోదీజీ నవ్వి ఊరుకున్నారని, ఆయన ముఖ్యమంత్రి అయ్యాక వచ్చిన తొలి రాఖీ పౌర్ణమికి రక్షాబంధన్ కట్టేందుకు వెళ్లినప్పడు ఆ సంగతిని ఆయనకు గుర్తు చేశానని మొహ్సిన్ ఎ.ఎన్.ఐ. ప్రతినిధికి చెప్పారు. ఈ ఏడాది కూడా మోదీని నేరుగా కలిసి రాఖీ కట్టాలని అనుకున్న మొహ్సిన్‌కు ఆ అవకాశం లేకుండా పోయింది. రాఖీతో పాటు ఆయన గురించి తను చేసిన ప్రార్థనలను కూడా ఒక కాగితంలో రాసి పంపారు. ఆయురారోగ్యాలతో మోదీజీ చిరకాలం వర్థిల్లాలని, ప్రపంచానికే గర్వకారణమైన దేశ నాయకుడిగా... వచ్చే ఐదేళ్లల్లో మోదీజీ గుర్తింపు పొందాలని తను ప్రార్థించినట్లు మొహ్సిన్ ఆ కాగితంలో రాశారు.
Comments
Please login to add a commentAdd a comment