
ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు చేశారు. లాలూ, ఆయన కుటుంబాన్ని "బిహార్‌లో అతిపెద్ద నేరస్థులు"గా అభివర్ణించారు. దశాబ్దానికి పైగా పాలనలో రాష్ట్రంలో జంగిల్ రాజ్‌కు నాంది పలికారని ఆరోపించారు.
పశ్చిమ చంపారన్ జిల్లా బెట్టియాలో జరిగిన ర్యాలీలో ప్రసంగించిన ప్రధాని మోదీ.. ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి దుష్పరిపాలన కారణంగా బీహార్ యువకులు పెద్ద సంఖ్యలో వలస వెళ్లాల్సి వచ్చిందని ఆరోపించారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాతనే రాష్ట్రం అభివృద్ధి చెందడం ప్రారంభించిందన్నారు.
కుటుంబ రాజకీయాలపై విమర్శలకు బదులుగా తనకు కుటుంబం లేదంటూ లాలూ ప్రసాద్ చేసిన వాఖ్యలపై ప్రధాని స్పందిస్తూ.. "జయప్రకాష్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా, బాబాసాహెబ్ అంబేద్కర్, కర్పూరీ ఠాకూర్ వంటి వ్యక్తులు జీవించి ఉంటే కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించనందుకు వారిపైనా విమర్శలు చేసేవారన్నారు.
"నాపై వారు చేసే ప్రధాన విమర్శ ఏంటంటే నాకు కుటుంబం లేదు. దేశం మొత్తం నా కుటుంబమే. నేడు దేశమంతా తమను తాము మోదీ కుటుంబంగానే చూస్తోంది" అని ప్రధాని మోదీ అన్నారు. లాలూకు వ్యాఖ్యలకు నిరసనగా, మోదీకి సంఘీభావంగా బీజేపీ నాయకులు, మద్దతుదారులు తమ సోషల్ మీడియా హ్యాండిల్‌లకు "మోదీ కా పరివార్" అంటూ ట్యాగ్‌లు జోడించుకున్నారు.
ఇక డీఎంకే నాయకుడు ఎ.రాజా వివాదాస్పద వ్యాఖ్యలను మోదీ ప్రస్తావిస్తూ, "పశ్చిమ చంపారన్ వాల్మీకి మహర్షి భూమి. అక్కడ సీతాదేవి ఆశ్రయం పొందింది. లవకుశులకు జన్మనిచ్చింది. రాముడిని అవమానిస్తున్న ఇండియా కూటమి నాయకుల తీరును ఇక్కడి ప్రజలు క్షమించరు. మన సంస్కృతి, సంప్రదాయాలపై ఇలాంటి దాడులను ఎవరు ప్రోత్సహిస్తున్నారనే విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు" అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment