యూపీఐతో డబ్బు బదిలీ చేస్తున్నారా?! | Money Fraud: LIC Customer Care Fake Number Frauds | Sakshi
Sakshi News home page

యూపీఐతో డబ్బు బదిలీ చేస్తున్నారా?!

Published Wed, Sep 8 2021 11:59 PM | Last Updated on Thu, Sep 9 2021 12:12 AM

Money Fraud: LIC Customer Care Fake Number Frauds - Sakshi

పూర్ణ (పేరుమార్చడమైనది) తన స్నేహితురాలికి మొబైల్‌ వాలెట్‌ యాప్‌ (ఫోన్‌ పే) ద్వారా రూ.2,800 చెల్లించింది. కానీ, అవి ఆ స్నేహితురాలి ఖాతాలో జమకాలేదు. దీంతో ఆ యాప్‌ బ్యాంక్‌ కస్టమర్‌ కేర్‌ నెంబర్‌ గూగుల్‌లో వెతికి, ఆ నెంబర్‌కు ఫోన్‌ చేసింది. కస్టమర్‌ కేర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఫోన్‌ కాల్‌ రిసీవ్‌ చేసుకున్నాడు. వివరాలు అడిగాడు. ‘మీ మొబైల్‌లో ఎనీడెస్క్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల’ని సూచించాడు. పూర్ణ అలాగే డౌన్‌లోడ్‌ చేసుకుంది.

అతను చెప్పిన విధంగా తన బ్యాంక్‌ ఖాతా వివరాలను అందులో నమోదు చేసింది. ఆ వివరాలను నమోదయిన వెంటనే, కస్టమర్‌ కేర్‌ అతను ఐదు సార్లు పూర్ణ అకౌంట్‌ నుంచి మరో బ్యాంక్‌ ఖాతాకు రూ.4,72,000ను ట్రాన్స్‌ఫర్‌ చేసుకున్నాడు. ఆ వెంటనే ఫోన్‌ కట్‌ అయ్యింది. అకౌంట్‌ నుంచి డబ్బు ట్రాన్స్‌ఫర్‌ అయినట్టుగా బ్యాంక్‌ నుంచి మెసేజ్‌లు వచ్చాయి. అవి చూశాక కానీ, తను మోసపోయానని పూర్ణకు తెలియలేదు. వెంటనే పూర్ణ పోలీసులను ఆశ్రయించింది.

మరో మోసం..
వింధ్యకి ఎల్‌ఐసీ కస్టమర్‌ కేర్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. ‘మీ పాలసీలకు సంబంధించిన క్లెయిమ్‌లు కంపెనీల పేరుతో ఉన్నాయి మేడమ్, కొత్త రూల్స్‌ వచ్చాయి. మీ పేరు మీద త్వరగా మార్చుకోవాలి’ అని చెప్పాడు. పెండింగ్‌లో ఉన్న ఎల్‌ఐసీలు, ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న పాలసీల గురించి వివరాలు ఇచ్చింది వింధ్య. ‘మేడమ్, అవన్నీ ఒక ఆర్డర్‌లో పెట్టాలంటే అందుకు ఛార్జెస్‌ పరంగా కొంత మొత్తం చెల్లించాలి’ అన్నాడు. అతను చెప్పిన విధంగా వింధ్య తన బ్యాంకు ఖాతా నుంచి ఐదువేలు ట్రాన్స్‌ఫర్‌ చేయగానే ఆమె అకౌంట్‌ నుంచి దఫదఫాలుగా రూ.5.5 లక్షలు డెబిట్‌ అయ్యాయి. తను మోసపోయినట్టుగా గుర్తించి, పోలీసులను ఆశ్రయించింది. 

అలా చేస్తే చెల్లించక తప్పదు భారీ మూల్యం
గూగుల్, యాహూ, బింగ్, డక్‌ డక్‌ గో వంటి సెర్చి ఇంజిన్లలో కస్టమర్‌ కేర్‌ నెంబర్లు, టోల్‌ఫ్రీ నంబర్ల కోసం శోధించడం మనందరికీ అలవాటు. ఈ అలవాటుకు మూల్యం చాలా ఎక్కువ మొత్తంలో చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఏ మోసగాడో ఉంచిన నకిలీ టోల్‌ఫ్రీ/ కస్టమర్‌ కేర్‌ నంబర్ల ఉచ్చులో చిక్కుకోవచ్చు.

ఆ సదరు వ్యక్తి బాధితులను ఆకర్షించడానికి, మీ దగ్గర ఉన్న డబ్బును దొంగిలించడానికి పొంచి ఉంటాడు. బెంగళూరులో ఒక మహిళ తన ఫుడ్‌ ఆర్డర్‌ క్యాన్సిల్‌ చేయడానికి ఫుడ్‌ అగ్రిగేటర్‌ యాప్‌ కాల్‌సెంటర్‌కు ఫోన్‌ చేయాలని, గూగుల్‌ ఇంజిన్‌లో సెర్చ్‌చేసి, ఆ నెంబర్‌కు ఫోన్‌ చేసింది. ఆ తర్వాత తన బ్యాంకు ఖాతా నుంచి పెద్దమొత్తంలో డబ్బు పోగొట్టుకుంది.

యూపీఐతో డబ్బు బదిలీ చేస్తున్నారా?!
సాధారణంగా మోసగాళ్లు యూపీఐ ఆధారిత యాప్‌లకు సంబంధించి నకిలీ కస్టమర్‌ కేర్‌ నంబర్లను ప్రముఖ వెబ్‌సైట్లలో ప్రదర్శిస్తారు. మనం సదరు కంపెనీ కస్టమర్‌ కేర్‌ నంబర్‌ కోసం సెర్చ్‌ చేసినప్పుడు ఆ నకిలీ నంబర్‌ వస్తుంది. మోసగాళ్లు వినియోగదారుల నుండి వారి వ్యక్తిగత ఖాతా వివరాలన్నీ రాబట్టిన తర్వాత ఓటీపీ లేదా పిన్‌ సమాచారంతో పాటు పూర్తి వివరాలను తెలిపే గూగుల్‌ ఫామ్‌ను వాడమని చెబుతారు. సంభాషణ మధ్యలోనే ఓటీపీ/పిన్‌ నెంబర్ల సమాచారం తీసుకుంటారు. అందుకని, గూగుల్, బింగ్‌ లేదా యాహూ సెర్చ్‌లో వచ్చే నంబర్‌కు ఫోన్‌ చేయవద్దు. మీ వ్యక్తిగత వివరాలను ఫోన్‌లో ఎవరికీ షేర్‌ చేయవద్దు.

అధికారిక వెబ్‌సైట్ల నంబర్లు మాత్రమే!
మీ డెబిట్, క్రెడిట్‌ కార్డ్‌ల నెంబర్, సివివి, ఓటీపీ లేదా యుపిఐ.. వంటివి ఏ బ్యాంకులు, ప్రముఖ కంపెనీలూ అడగవు. క్రెడిట్‌ కార్డు, రసీదు, కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచిన కస్టమర్‌ సర్వీస్‌ నంబర్‌కు మాత్రమే ఫోన్‌ చేయాలి. యాప్‌ లేదా వెబ్‌సైట్‌లో ఉంచిన ఇ–మెయిల్‌ లేదా మెసెంజర్‌ ద్వారా కూడా మీరు జరిపిన లావాదేవీల గురించి సంప్రదించవచ్చు. ఎందుకంటే, యూపీఐ ఆధారిత యాప్‌లలో కస్టమర్‌ కేర్‌ నంబర్‌ ఉండకపోవచ్చు. 

– అనీల్‌ రాచమల్ల, 
డిజిటల్‌ వెల్‌బీయింగ్‌ 
ఎక్స్‌పర్ట్, 
ఎండ్‌ నౌ ఫౌండేషన్‌

వెంటనే ఫిర్యాదు చేస్తే రికవరీ
కస్టమర్‌ కేర్‌ నకిలీ నంబర్లతో మోసం చేసేవారు దేశవ్యాప్తంగా ఉన్నారు. మనం ప్రతీది గూగుల్‌లో శోధించడం, ఆ నకిలీ నెంబర్లకు ఫోన్‌ చేయడం మానుకోవాలి. అధికారిక వెబ్‌సైట్లను లాగిన్‌ అయ్యి అందులో నంబర్లు తీసుకొని, ఫోన్‌ చేయాలి. మోసం జరిగిందని గ్రహించాక అరగంట, గంట వ్యవధిలో 155260 నెంబర్‌కి లేదా www.cybercrime.gov.in లో లాగిన్‌ అయి ఫిర్యాదు చేసినా పోగొట్టుకున్న డబ్బులు రికవరీ అయ్యే అవకాశం ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement