చిన్నప్పుడు అమ్మ గోరు ముద్దలు తినిపిస్తూ చందమామ రావే, జాబిల్లి రావే అని పిలిచేది. అప్పుడు జాబిల్లి రాకున్నా.. ఇప్పుడు మనమే జాబిల్లి దగ్గరికి వెళ్లే రోజు వచ్చేసింది. చంద్రుడిపై మనిషి ఎప్పుడో అడుగుపెట్టినా.. అక్కడ ఉన్నది కాసేపే. కానీ రోజులకు రోజులు, వీలైతే నెలల పాటు చంద్రుడిపైనే ఉండేందుకు.. అసలు చందమామను శాశ్వత ఆవాసంగా మల్చుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా సహా చాలా సంస్థలు చంద్రుడిపైకి మనుషులను పంపేందుకు, అక్కడ కాలనీలు ఏర్పాటు చేసేందుకు ప్రయోగాలు చేస్తున్నాయి. ఆ దిశగా కొంత ముందడుగు కూడా వేశాయి.
నాసా 2024లో తన ఆర్టిమిస్ మిషన్ ద్వారా మనుషులను చందమామపైకి పంపడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ ప్రయోగాలన్నీ విజయవంతమై మనం చంద్రుడిపైకి వెళ్లొచ్చే రోజు దగ్గర్లోనే ఉంది. మరి చందమామపై గడపాలంటే ఎంత ఖర్చవుతుందో తెలుసా? ఈ లెక్క తేల్చేందుకే బ్రిటన్‌కు చెందిన కొందరు నిపుణులు ఓ స్టడీ చేశారు. చంద్రుడిపై ఇండ్లు కట్టడానికి, కరెంటు సహా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి, టూరిస్టులు అక్కడ గడపడానికి ఎంతెంత ఖర్చవుతుందని లెక్కలు వేశారు. మూన్ మార్టిగేజ్ గైడ్ పేరుతో ఓ నివేదిక విడుదల చేశారు.
ఎందుకింత వ్యయం?
భూమిలాగా చందమామపై వాతావరణం లేదు. దాంతో మనం ఉండే ఇంట్లోనే ఉండాలి. బయటికి వెళితే స్పేస్ సూట్ తప్పనిసరి. చంద్రుడిపై వాతావరణం వేరు, ఒత్తిడి తక్కువగా ఉంటుంది కాబట్టి.. ఇంట్లో ప్రెషర్, ఆక్సిజన్, నీళ్లు, ఇతర సౌకర్యాలన్నీ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికితోడు కరెంటు కోసం సోలార్ విద్యుత్ ప్యానెళ్లు కావాలి. చంద్రుడిపై ఉల్కలు గాల్లోనే మండిపోకుండా నేరుగా నేలపై పడతాయి.
వాటిని తట్టుకునే సామర్థ్యమున్న గోడలు, అద్దాలు అమర్చాలి. వీటన్నింటికీ పెద్ద మొత్తంలోనే ఖర్చవుతుంది. దీనికితోడు చందమామపై ఇళ్ల నిర్మాణానికి కావాల్సిన మెటీరియల్‌ను సిద్ధం చేసుకోవడమూ వ్యయంతో కూడుకున్నదే. అయితే మెటీరియల్ తయారీ, ఏర్పాట్లకు సంబంధించి మొదట్లో ఖర్చు ఎక్కువగా ఉంటుందని, తర్వాత తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ వ్యయం లెక్కలన్నీ చంద్రుడి నేలపై ఇల్లు కట్టేందుకేనని.. నేల దిగువన గుహల్లా కడితే ఖర్చు కొంత తగ్గుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
– సాక్షి, సెంట్రల్ డెస్క్
►మొదటి ఇల్లు కట్టడానికయ్యే ఖర్చు రూ. 289.76 కోట్లు (40 మిలియన్ డాలర్లు)
►నెల రోజులు ఉండటానికి అయ్యే ఖర్చు రూ. 2.35 కోట్లు (3.25 లక్షల డాలర్లు)
మనీ మ్యాగజైన్ రిపోర్ట్
మొదటి ఇల్లు కట్టడానికి అవసరమైన పరికరాలు, వర్కర్లను భూమిపై నుంచి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అందుకే ఖర్చు చాలా ఎక్కువ. తర్వాత పరికరాలు, వర్కర్లు అక్కడే ఉంటారు కాబట్టి.. తర్వాతి ఒక్కో ఇల్లు ఖర్చు తక్కువగా ఉంటుందని మనీ మేగజైన్ రిపోర్టులో పేర్కొంది.
(చదవండి: ఆర్థిక నేరగాళ్లకు లండన్ స్వర్గధామం ఎలా ?)
Comments
Please login to add a commentAdd a comment