Lansa Flight 508 Crash Incredible Survival Of Juliane Koepcke: కొందరి ఊహల్లోంచి ఉట్టిపడే కథనాలకంటే.. కొన్ని నిజజీవితాలు భలే గొప్పగా ఉంటాయి. ‘ఏదో శక్తి పక్కనే ఉండి, తీర్చిదిద్దిన కథలా ఇవి?’ అన్నట్లుగా అబ్బురపరుస్తాయి. ప్రకృతి, పరిస్థితులు, గత అనుభవాలు.. ఇలా అన్నీ ఆ కథను ఆసక్తిగా నడిపిస్తాయి. తరతరాలకు గుర్తుండే పాఠాలను నేర్పిస్తాయి. పెరూ దేశంలో అలాంటి అద్భుతమే జరిగింది. ఓ విమాన ప్రయాణం.. పదిహేడేళ్ల అమ్మాయి జీవితాన్నే మార్చేసింది.
అది 1971, డిసెంబరు 24.. వాతావరణం అనుకూలించక పోవడంతో పెరూ రాజధాని లిమా విమానాశ్రయంలో అప్పటికే కొన్ని గంటల నుంచి ‘లాన్సా 508’ ఫ్లయిట్ డిలే అవుతూ వస్తోంది. దాని టేకాఫ్‌ను బలంగా కోరుకుంటోంది పదిహేడేళ్ల జూలియన్ అదెక్కి పుకాల్పాకి వెళ్లేందుకు చాలా ఆత్రంగా ఎదురుచూస్తోంది. లిమాలో ఆ ఫ్లయిట్ ఎక్కితే.. సరిగ్గా గంటలో తన తండ్రి ముందు వాలిపోవచ్చని.. మరునాడే క్రిస్మస్ కావడంతో పేరెంట్స్‌తో కలిసి బాగా సెలబ్రేట్ చేసుకోవాలనే ఊహల్లో విహరిస్తోంది.
ఎదురు చూస్తున్నకొద్దీ ఫ్లయిట్ ఆలస్యం అవుతూనే ఉంది. జర్మనీకి చెందిన మారియా, హన్స్ విల్హెల్మ్ కోయెప్కే దంపతులకు 1954, అక్టోబర్ 10న జన్మించింది జూలియన్. తన తల్లితో కలిసుంటూ లిమాలో చదువుకునేది. తండ్రి హన్స్.. పుకాల్పాలోని రెయిన్ ఫారెస్ట్‌లో పనిచేస్తుండేవాడు. కోయెప్కే దంపతులు పెరూలో స్థిరపడిన జువాలజిస్ట్‌లు. నిజానికి కొన్ని రోజుల ముందే జూలియన్, మారియాలు.. హన్స్ దగ్గరకు వెళ్లేందుకు ఫ్లయిట్ టికెట్స్ బుక్ చేసుకున్నారు.
కానీ జూలియన్ హైస్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుకకు హాజరు కావాల్సిరావటంతో ఆ టికెట్స్‌ను రద్దు చేసుకొని.. ‘లాన్సా ఫ్లయిట్ 508’కి ప్రయాణం ఖరారు చేసుకున్నారు. సుమారు 7 గంటల ఎదురు చూపుల తర్వాత ‘ఫ్లయిట్ నంబర్ 508’ లిమా నుంచి బయలు దేరేందుకు సిద్ధంగా ఉందనే అనౌన్స్‌మెంట్.. జూలియన్ కి చెప్పలేనంత ఆనందాన్నిచ్చింది. కానీ తనకు తెలియదు అదే తన తల్లితో తను చేసే చివరి ప్రయాణమని.
ఆ విమానంలో జూలియన్, మారియాలతో కలిపి 85 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది.. మొత్తం 91 మంది ఉన్నారు. టేకాఫ్ అయిన 40 నిమిషాల తర్వాత గుండెలదిరిపడే శబ్దం వినిపించింది. ఏమిటా అని తెలుసుకునేలోపే పెద్ద మెరుపు మెరిసింది. విమానం వెనుక ట్యాంక్ నుంచి మంటలు అలుముకున్నాయి. ఆ భీకరశబ్దం విమానంపై పడిన పిడుగుదని వారందరికీ తెలియడానికి ఎంతో సమయం పట్టలేదు.
ఓ పక్క ప్రయాణికుల హాహాకారాలు.. మరో పక్క చావు భయం. మెల్లగా విమానంలో ఒక్కో భాగం ఊడిపోసాగింది. తల్లి మారియా.. జూలియన్ చేతిని గట్టిగా పట్టుకుంది. కానీ జూలియన్ కూర్చున్న కుర్చీతో సహా ఊడి విమానం నుంచి విడిపోయింది. పదివేల అడుగుల పైనుంచి ఆ కుర్చీ వేగంగా నేలరాలడం తనకు తెలుస్తూనే ఉంది. సుమారు 24 గంటల తర్వాత కళ్లు తెరిచిన జూలియన్ .. చుట్టూ ఉన్న పరిస్థితుల్ని చూసి హడలిపోయింది.
కలేమోనని వణుకుతున్న చేతులతో కళ్లు నులుముకుని మరీ చూసింది. ఎటు చూసినా దట్టమైన చెట్ల నీడలే. అప్పుడు తనకు తెలియదు అది అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అని. అంతా మసకమసకగా కనిపిస్తోంది. జూలియన్‌కి దృష్టి లోపం ఉండటంతో కళ్లజోడు పెట్టుకుంటేనే కానీ ఏదీ సరిగా కనిపించదు. కానీ ప్రమాదంలో అదీ పోయింది. భుజం విరిగి, మోకాలు బెణికి, కాళ్లు, చేతులు కోసుకుపోయాయి. ఎటు చూసినా విషసర్పాల బుసలు, క్రూరమృగాల గర్జనలే.
జరిగిందంతా కళ్లముందు కదులుతుంటే.. తల్లి ఏమైపోయిందోనన్న ఆవేదన, ఎలా బయటపడాలో తెలియని ఆందోళన జూలియన్ మనసుని అతలాకుతలం చేశాయి. తల్లి కోసం ఎంత వెతికినా దొరకలేదు. ఎలా బయటపడాలో తెలియలేదు. ఎంత దూరం నడిచినా పెద్దపెద్ద మానులే, వాటిని చుట్టుకున్న పాములే. విమానం కూలిన ప్రాంతం వైపు నడవడం మొదలుపెట్టింది జూలియన్. పైన సెర్చ్ ఆపరేషన్ విమానాలు తిరుగుతున్నాయి కానీ వాళ్లకి ఆమె కనిపించలేదు. కాపాడండనే ఆమె అరుపులూ వినిపించలేదు.
చుట్టూ మనుషులైతే ఉన్నారు కానీ ఏ ఒక్కరికీ ప్రాణం లేదు. తెగిపడిన తలలు, ఛిద్రమైన శవాలు జూలియన్‌ని చాలా భయపెట్టాయి. రోజులు గడుస్తున్నాయి. నీరసం ఆవహించేసింది. అప్పుడే దారిలో ఓ మహిళ శవం కనిపించింది. తన తల్లేమోనని ఏడుస్తూ అటు పరుగుతీసింది. కానీ కాదు. ఆ పక్కనే పడి ఉన్న లగేజ్‌లో స్వీట్స్ తీసుకుని తింటూ.. నడవడం మొదలుపెట్టింది. శక్తి కోసం కొన్ని సార్లు ఆకులనూ తిన్నది.
‘నీరు ఉన్నచోట ఆ పల్లానికి మనిషి మనుగడ ఉంటుంద’నే తన తండ్రి మాటలు గుర్తొచ్చి.. ‘ఒక్క మనిషైనా కనిపించకపోతాడా?’ అనే ఆశతో ఓ వాగు ప్రవాహాన్ని అనుసరిస్తూ... నడక సాగించింది. పది రోజులు గడిచాయి. కాస్త దూరంగా మనుషుల మాటలు వినిపించాయి. అటుగా పరుగు తీసిన జూలియన్ నదిలో పడవపై వెళ్తున్నవాళ్లని చూసింది, గట్టిగా అరిచింది. ఈ సారి ఆ అరుపులు వాళ్ల చెవిన పడ్డాయి.
ప్రాణాలతో బయటపడిన జూలియన్ కథ ప్రపంచానికి తెలిసింది. బతకడం కోసం తను చేసిన ఒంటరి పోరాటం ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. విలేకర్లు ఆమె వెంట పరుగుతీశారు. ఇక తన భార్య, కూతురు ప్రాణాలతో లేరనే నిజాన్ని నమ్మడం మొదలుపెట్టిన జూలియన్ తండ్రి హన్స్.. ప్రాణాలతో తిరిగి వచ్చిన జూలియన్‌ని చూసి నివ్వెరపోయాడు.
కూతుర్ని గుండెకు హత్తుకుని తనివితీరా ఏడ్చాడు. మరియా కూడా ఎక్కడో బతికే ఉండి ఉంటుందనే ఆశ హన్స్‌ని కుదురుగా ఉండనివ్వలేదు. కొన్ని రోజుల పాటు మరియాని వెతుకుతూనే ఉన్నాడు. చివరికి జనవరి 12న మరియా మృతదేహం దొరికింది. జూలియన్ తప్ప ఆ విమాన ప్రమాదంలో ఏ ఒక్కరూ ప్రాణాలతో లేరని తేలింది.
జర్మన్ ఫిల్మ్ డైరెక్టర్ వెర్నర్ హెర్జోగ్.. జూలియన్ పర్యవేక్షణలో ఇదే స్టోరీ లైన్‌తో 1998లో ‘వింగ్స్ ఆఫ్ హోప్’ అనే సినిమా తీశాడు. 2011 నవంబర్ 1న జూలియన్.. నాటి తన బతుకుపోరాటం గురించి.. ‘వెన్ఐ ఫెల్ ఫ్రమ్ ది స్కై’ అనే పుస్తకం రాసింది. 68 ఏళ్ల జూలియన్ ఇప్పటికీ పెరూలో తన తల్లిదండ్రులు స్థాపించిన పంగువానా పరిశోధనా కేంద్రాన్ని నడుపుతోంది.
అంత ఎత్తునుంచి పడినా చిన్న చిన్న గాయాలతో బతికి బయటపడటం ఓ మిస్టరీ అయితే.. ప్రాణాలు నిలుపుకోవడానికి ఆమె చేసిన పోరు ప్రపంచానికే స్ఫూర్తి. వైద్యపరిభాషలో చెప్పాలంటే అదో మిరాకిల్.
ప్రమాదానికి ముందు.. సుమారు ఏడాదిన్నర పాటు నేను మా పేరెంట్స్‌తో రెయిన్ ఫారెస్ట్ పరిశోధనల కేంద్రంలో గడిపాను. అది నాకు బాగా కలిసి వచ్చింది – జూలియన్.
-సంహిత నిమ్మన
Comments
Please login to add a commentAdd a comment