Lima
-
Peru: ఏలియన్ మమ్మీల గుట్టు రట్టు.. అసలు కథేంటంటే..
లిమా: పెరూ రాజధాని లిమా ఎయిర్‌పోర్టులో గత ఏడాది దొరికిన ఏలియన్ మమ్మీల మిస్టరీ వీడింది. ఇవి ఏలియన్ మమ్మీలనేది పెద్ద జోక్ అని ఆర్కియాలజిస్టులు తేల్చారు. లిమా ఎయిర్‌పోర్టులో దొరికిన రెండు బొమ్మలు మనుషులు లేదా జంతువుల ఎముకల నుంచి తయారు చేసినవి అయి ఉండొచ్చని సైంటిస్టులు వెల్లడించారు. ‘అవి ఏలియన్ మమ్మీలు కానే కావు. జంతువుల ఎముకలను మోడ్రన్ గ్లూతో అతికించి తయారు చేసిన బొమ్మలు’అని పెరూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లీగల్ మెడిసిన్‌లో పనిచేసే ఆర్కియాలజిస్ట్ ఒకరు తెలిపారు. కాగా, గత ఏడాది అక్టోబర్‌లో లిమా ఎయిర్‌పోర్టులోని డీహెచ్ఎల్ కొరియర్ సంస్థకు చెందిన కార్డ్‌బోర్డు బాక్సులో ఏలియన్ మమ్మీలుగా తొలుత అందరూ భావించిన రెండు బొమ్మలు దొరికాయి. అప్పటి నుంచి ఏలియన్లు ఉన్నారని, అవి భూమి మీదకు వచ్చాయన్న పుకార్లు ఊపందుకున్నాయి. తాజాగా సైంటిస్టులు పరిశోధన చేసి క్లారిటీ ఇవ్వడంతో ఏలియన్ మమ్మీల గుట్టురట్టయింది. ఇదీచదవండి.. ఉక్రెయిన్‌పై యూఎన్ కీలక ప్రకటన -
Mystery: 10 వేల అడుగుల పైనుంచి ఆ కుర్చీ కిందపడింది.. చుట్టూ విషసర్పాలు.. అయినా
Lansa Flight 508 Crash Incredible Survival Of Juliane Koepcke: కొందరి ఊహల్లోంచి ఉట్టిపడే కథనాలకంటే.. కొన్ని నిజజీవితాలు భలే గొప్పగా ఉంటాయి. ‘ఏదో శక్తి పక్కనే ఉండి, తీర్చిదిద్దిన కథలా ఇవి?’ అన్నట్లుగా అబ్బురపరుస్తాయి. ప్రకృతి, పరిస్థితులు, గత అనుభవాలు.. ఇలా అన్నీ ఆ కథను ఆసక్తిగా నడిపిస్తాయి. తరతరాలకు గుర్తుండే పాఠాలను నేర్పిస్తాయి. పెరూ దేశంలో అలాంటి అద్భుతమే జరిగింది. ఓ విమాన ప్రయాణం.. పదిహేడేళ్ల అమ్మాయి జీవితాన్నే మార్చేసింది. అది 1971, డిసెంబరు 24.. వాతావరణం అనుకూలించక పోవడంతో పెరూ రాజధాని లిమా విమానాశ్రయంలో అప్పటికే కొన్ని గంటల నుంచి ‘లాన్సా 508’ ఫ్లయిట్ డిలే అవుతూ వస్తోంది. దాని టేకాఫ్‌ను బలంగా కోరుకుంటోంది పదిహేడేళ్ల జూలియన్ అదెక్కి పుకాల్పాకి వెళ్లేందుకు చాలా ఆత్రంగా ఎదురుచూస్తోంది. లిమాలో ఆ ఫ్లయిట్ ఎక్కితే.. సరిగ్గా గంటలో తన తండ్రి ముందు వాలిపోవచ్చని.. మరునాడే క్రిస్మస్ కావడంతో పేరెంట్స్‌తో కలిసి బాగా సెలబ్రేట్ చేసుకోవాలనే ఊహల్లో విహరిస్తోంది. ఎదురు చూస్తున్నకొద్దీ ఫ్లయిట్ ఆలస్యం అవుతూనే ఉంది. జర్మనీకి చెందిన మారియా, హన్స్ విల్హెల్మ్ కోయెప్కే దంపతులకు 1954, అక్టోబర్ 10న జన్మించింది జూలియన్. తన తల్లితో కలిసుంటూ లిమాలో చదువుకునేది. తండ్రి హన్స్.. పుకాల్పాలోని రెయిన్ ఫారెస్ట్‌లో పనిచేస్తుండేవాడు. కోయెప్కే దంపతులు పెరూలో స్థిరపడిన జువాలజిస్ట్లు. నిజానికి కొన్ని రోజుల ముందే జూలియన్, మారియాలు.. హన్స్ దగ్గరకు వెళ్లేందుకు ఫ్లయిట్ టికెట్స్ బుక్ చేసుకున్నారు. కానీ జూలియన్ హైస్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుకకు హాజరు కావాల్సిరావటంతో ఆ టికెట్స్‌ను రద్దు చేసుకొని.. ‘లాన్సా ఫ్లయిట్ 508’కి ప్రయాణం ఖరారు చేసుకున్నారు. సుమారు 7 గంటల ఎదురు చూపుల తర్వాత ‘ఫ్లయిట్ నంబర్ 508’ లిమా నుంచి బయలు దేరేందుకు సిద్ధంగా ఉందనే అనౌన్స్మెంట్.. జూలియన్ కి చెప్పలేనంత ఆనందాన్నిచ్చింది. కానీ తనకు తెలియదు అదే తన తల్లితో తను చేసే చివరి ప్రయాణమని. ఆ విమానంలో జూలియన్, మారియాలతో కలిపి 85 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది.. మొత్తం 91 మంది ఉన్నారు. టేకాఫ్ అయిన 40 నిమిషాల తర్వాత గుండెలదిరిపడే శబ్దం వినిపించింది. ఏమిటా అని తెలుసుకునేలోపే పెద్ద మెరుపు మెరిసింది. విమానం వెనుక ట్యాంక్ నుంచి మంటలు అలుముకున్నాయి. ఆ భీకరశబ్దం విమానంపై పడిన పిడుగుదని వారందరికీ తెలియడానికి ఎంతో సమయం పట్టలేదు. ఓ పక్క ప్రయాణికుల హాహాకారాలు.. మరో పక్క చావు భయం. మెల్లగా విమానంలో ఒక్కో భాగం ఊడిపోసాగింది. తల్లి మారియా.. జూలియన్ చేతిని గట్టిగా పట్టుకుంది. కానీ జూలియన్ కూర్చున్న కుర్చీతో సహా ఊడి విమానం నుంచి విడిపోయింది. పదివేల అడుగుల పైనుంచి ఆ కుర్చీ వేగంగా నేలరాలడం తనకు తెలుస్తూనే ఉంది. సుమారు 24 గంటల తర్వాత కళ్లు తెరిచిన జూలియన్ .. చుట్టూ ఉన్న పరిస్థితుల్ని చూసి హడలిపోయింది. కలేమోనని వణుకుతున్న చేతులతో కళ్లు నులుముకుని మరీ చూసింది. ఎటు చూసినా దట్టమైన చెట్ల నీడలే. అప్పుడు తనకు తెలియదు అది అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అని. అంతా మసకమసకగా కనిపిస్తోంది. జూలియన్కి దృష్టి లోపం ఉండటంతో కళ్లజోడు పెట్టుకుంటేనే కానీ ఏదీ సరిగా కనిపించదు. కానీ ప్రమాదంలో అదీ పోయింది. భుజం విరిగి, మోకాలు బెణికి, కాళ్లు, చేతులు కోసుకుపోయాయి. ఎటు చూసినా విషసర్పాల బుసలు, క్రూరమృగాల గర్జనలే. జరిగిందంతా కళ్లముందు కదులుతుంటే.. తల్లి ఏమైపోయిందోనన్న ఆవేదన, ఎలా బయటపడాలో తెలియని ఆందోళన జూలియన్ మనసుని అతలాకుతలం చేశాయి. తల్లి కోసం ఎంత వెతికినా దొరకలేదు. ఎలా బయటపడాలో తెలియలేదు. ఎంత దూరం నడిచినా పెద్దపెద్ద మానులే, వాటిని చుట్టుకున్న పాములే. విమానం కూలిన ప్రాంతం వైపు నడవడం మొదలుపెట్టింది జూలియన్. పైన సెర్చ్ ఆపరేషన్ విమానాలు తిరుగుతున్నాయి కానీ వాళ్లకి ఆమె కనిపించలేదు. కాపాడండనే ఆమె అరుపులూ వినిపించలేదు. చుట్టూ మనుషులైతే ఉన్నారు కానీ ఏ ఒక్కరికీ ప్రాణం లేదు. తెగిపడిన తలలు, ఛిద్రమైన శవాలు జూలియన్ని చాలా భయపెట్టాయి. రోజులు గడుస్తున్నాయి. నీరసం ఆవహించేసింది. అప్పుడే దారిలో ఓ మహిళ శవం కనిపించింది. తన తల్లేమోనని ఏడుస్తూ అటు పరుగుతీసింది. కానీ కాదు. ఆ పక్కనే పడి ఉన్న లగేజ్‌లో స్వీట్స్ తీసుకుని తింటూ.. నడవడం మొదలుపెట్టింది. శక్తి కోసం కొన్ని సార్లు ఆకులనూ తిన్నది. ‘నీరు ఉన్నచోట ఆ పల్లానికి మనిషి మనుగడ ఉంటుంద’నే తన తండ్రి మాటలు గుర్తొచ్చి.. ‘ఒక్క మనిషైనా కనిపించకపోతాడా?’ అనే ఆశతో ఓ వాగు ప్రవాహాన్ని అనుసరిస్తూ... నడక సాగించింది. పది రోజులు గడిచాయి. కాస్త దూరంగా మనుషుల మాటలు వినిపించాయి. అటుగా పరుగు తీసిన జూలియన్ నదిలో పడవపై వెళ్తున్నవాళ్లని చూసింది, గట్టిగా అరిచింది. ఈ సారి ఆ అరుపులు వాళ్ల చెవిన పడ్డాయి. ప్రాణాలతో బయటపడిన జూలియన్ కథ ప్రపంచానికి తెలిసింది. బతకడం కోసం తను చేసిన ఒంటరి పోరాటం ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. విలేకర్లు ఆమె వెంట పరుగుతీశారు. ఇక తన భార్య, కూతురు ప్రాణాలతో లేరనే నిజాన్ని నమ్మడం మొదలుపెట్టిన జూలియన్ తండ్రి హన్స్.. ప్రాణాలతో తిరిగి వచ్చిన జూలియన్ని చూసి నివ్వెరపోయాడు. కూతుర్ని గుండెకు హత్తుకుని తనివితీరా ఏడ్చాడు. మరియా కూడా ఎక్కడో బతికే ఉండి ఉంటుందనే ఆశ హన్స్‌ని కుదురుగా ఉండనివ్వలేదు. కొన్ని రోజుల పాటు మరియాని వెతుకుతూనే ఉన్నాడు. చివరికి జనవరి 12న మరియా మృతదేహం దొరికింది. జూలియన్ తప్ప ఆ విమాన ప్రమాదంలో ఏ ఒక్కరూ ప్రాణాలతో లేరని తేలింది. జర్మన్ ఫిల్మ్ డైరెక్టర్ వెర్నర్ హెర్జోగ్.. జూలియన్ పర్యవేక్షణలో ఇదే స్టోరీ లైన్‌తో 1998లో ‘వింగ్స్ ఆఫ్ హోప్’ అనే సినిమా తీశాడు. 2011 నవంబర్ 1న జూలియన్.. నాటి తన బతుకుపోరాటం గురించి.. ‘వెన్ఐ ఫెల్ ఫ్రమ్ ది స్కై’ అనే పుస్తకం రాసింది. 68 ఏళ్ల జూలియన్ ఇప్పటికీ పెరూలో తన తల్లిదండ్రులు స్థాపించిన పంగువానా పరిశోధనా కేంద్రాన్ని నడుపుతోంది. అంత ఎత్తునుంచి పడినా చిన్న చిన్న గాయాలతో బతికి బయటపడటం ఓ మిస్టరీ అయితే.. ప్రాణాలు నిలుపుకోవడానికి ఆమె చేసిన పోరు ప్రపంచానికే స్ఫూర్తి. వైద్యపరిభాషలో చెప్పాలంటే అదో మిరాకిల్. ప్రమాదానికి ముందు.. సుమారు ఏడాదిన్నర పాటు నేను మా పేరెంట్స్‌తో రెయిన్ ఫారెస్ట్ పరిశోధనల కేంద్రంలో గడిపాను. అది నాకు బాగా కలిసి వచ్చింది – జూలియన్. -సంహిత నిమ్మన -
Viral: కరెంట్ వైర్ల మధ్య పావురం.. డ్రోన్‌తో పోలీసుల రెస్క్యూ
ప్రస్తుతం ఉన్న ఆధునిక యుగంలో అన్ని రంగాల్లో డ్రోన్ టెక్నాలజీని వాడుతున్నారు. వ్యవసాయం రంగం మొదలుకొని రక్షణ రంగం వరకు అన్ని సేవలకు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. తాజాగా పెరు దేశ రాజధాని లీమాలో డ్రోన్ సాయంతో ఓ పావురం ప్రాణాలు కాపాడారు అక్కడి పోలీసులు. ఓ పావురం కాలుకు దారం చుట్టుకోవటంతో హైటెన్షన్ వైర్‌కు చిక్కుకొని కిందికి వేలాడుతూ.. ఎగరలేక విలవిలాడింది. ఇది గమనించిన పోలీసులు ఆ పావురాన్ని రక్షించడానికి డ్రోన్‌ను ఉపయోగించారు. డ్రోన్‌కు కత్తి కట్టి కరెంట్ వైర్ల మధ్య దాన్ని ఆపరేట్ చేస్తూ నెమ్మదిగా పావురం కాలుకున్న దారాన్ని కట్‌చేశారు. దీంతో పావురం సురక్షితంగా కిందపడింది. అనంతరం దాని కాలుకు చుట్టుకొని ఉన్న మొత్తం దారాన్ని తొలగించి పంజరంలో వేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
Aishwary Tomar: ప్రపంచ రికార్డుతో పసిడి
లిమా (పెరూ): భారత యువ షూటర్ ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ అదరగొట్టాడు. ప్రపంచ జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ విభాగంలో పసిడి పతకంతో మెరిశాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన తోమర్ ఫైనల్లో 463.4 పాయింట్లతో విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో అతడు 462.9 పాయింట్లతో ఫిలిప్ నెపిచాల్ (చెక్ రిపబ్లిక్) పేరిట ఉన్న జూనియర్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ఫ్రాన్స్ షూటర్ లుకాస్ క్రిజ్స్ (456.5 పాయింట్లు) రజతాన్ని... అమెరికాకు చెందిన గావిన్ బారి్నక్ (446.5 పాయింట్లు) కాంస్యాన్ని దక్కించుకున్నారు. అంతకుముందు జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లో 1185 పాయింట్లు సాధించిన తోమర్... పెని ఇస్తివాన్ (హంగేరి) పేరిట ఉన్న క్వాలిఫయింగ్ ప్రపంచ రికార్డును సమం చేశాడు. ఓవరాల్‌గా ఇప్పటి వరకు ఈ మెగా ఈవెంట్లో భారత్ 8 స్వర్ణాలు, 6 రజతాలు, 3 కాంస్యాలతో కలిపి మొత్తం 17 పతకాలతో అగ్రస్థానంలో ఉంది. -
600 ఏళ్ల క్రితం అతిపెద్ద బాలల నరబలి
-
గుట్టలుగా చిన్నారుల కంకాళాలు
లిమా: చరిత్రలోనే అతిపెద్ద నరబలిని పురావస్తు శాస్త్రవేత్తలు వెలుగులోకి తెచ్చారు. పెరూకు ఉత్తర ప్రాంతంలో వందల కొద్దీ చిన్నారుల అస్థిపంజరాలు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. కొలంబియన్ పూర్వపు చిమూ నాగరికతకు చెందిన చిన్నారులను పెద్ద మొత్తంలో బలి ఇచ్చినట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. తాజాగా 140 మంది చిన్నారుల అస్థిపంజరాలు బయటపడ్డ హువాన్చాకో సమీపంలోని పంపా లా క్రూజ్ ప్రాంతంలో ఈ శవాల దిబ్బ బయటపడటం విశేషం. (అతిపెద్ద బాలల నరబలి) అయితే ప్రస్తుతానికి 56 అస్థిపంజరాలను వెలికీ తీసినప్పటికీ.. ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిపేకొద్దీ వందల కొద్దీ అవశేషాలు బయటపడుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లాటిన్ అమెరికన్ దేశమైన పెరూలో వందల ఏళ్ల క్రితం చిన్నారులను బలి ఇచ్చే సంప్రాదాయం ఉండేది. ప్రస్తుతం లభ్యమైన కంకాళాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు.. వీరందరినీ దాదాపు ఒకేసారి బలి ఇచ్చి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కార్బన్ డేటింగ్ పద్దతిలో ఇవి సుమారు 600 ఏళ్ల క్రితం చెందినవిగా నిర్ధారించారు. నేషనల్ జియోగ్రఫిక్ సొసైటీ ఈ పరిశోధనకు నిధులు సమకూరుస్తుండటం విశేషం. ‘ఈ పిల్లలందరూ 6 నుంచి 14 ఏళ్ల మధ్య వయసు వారే. పిల్లల ఛాతి మధ్య ఎముక సహా ఇతర ఎముకలపై గాట్లు ఉన్నాయి. చాలా పక్కటెముకలు ధ్వంసమై ఉన్నాయి. శరీరం నుంచి గుండెను వేరే చేశారు శిలా స్ఫటికంతో తయారు చేసిన ఎర్రని రంగును చిన్నారులకు పూశారు. బలి ఇచ్చే ఆచార సంప్రదాయాల్లో ఇది ఒక భాగమై ఉండొచ్చు’ అని ఓ శాస్త్రవేత్త తెలిపారు. 2011లో ఉత్తర తీరంలో తొలుత అస్థిపంజరాలను గుర్తించిన శాస్త్రవేత్తలు.. గత ఐదేళ్లుగా పరిశోధనలను ముమ్మరం చేశారు. వందల సంఖ్యలో పిల్లల అస్థిపంజరాలతోపాటు దక్షిణ అమెరికాలో కనిపించే లామాస్(ఒంటె తరహా జీవి) అవశేషాలను వందల సంఖ్యలో ఆర్కియాలజిస్టులు కనుగొన్నారు. కాగా, చిమూ నాగరికతకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఇన్కా నాగరికత రంగ ప్రవేశంతో చిమూ నాగరికత అంతమైపోయింది. అయితే ఆ తర్వాత 50 ఏళ్లకు స్పెయిన్ వలసవాదులు దక్షిణ అమెరికాలో అడుగుట్టి ఇన్కా నాగరికతను మట్టికరిపించారు. -
పెరూలో రోడ్డు ప్రమాదం.. 48 మంది మృతి
లీమా: పెరూలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం హువాచో నగరం నుంచి రాజధాని లీమాకు బయలుదేరిన ఓ బస్సు ట్రక్కును ఢీకొనడంతో 48 మంది దుర్మరణం చెందారు. ట్రక్కును బలంగా ఢీకొట్టడంతో బస్సు కొండపై నుంచి పల్టీలు కొడుతూ దాదాపు 100 మీటర్లు కిందకు జారిపోయిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఇద్దరు డ్రైవర్లతో పాటు 55 మంది ప్రయాణికులు ఉన్నారన్నారు. సముద్రతీరంలో ఉండటంతో పొగమంచు, అధిక తేమ కారణంగా ఈ రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. -
పెరూలో దిగిన ఒబామా.. ఇదే ఆఖరి టూర్
లిమా: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పెరూలో అడుగుపెట్టారు. అధ్యక్ష స్థానంలో ఉండి చివరగా చేస్తున్న విదేశీ పర్యటనలో భాగంగా బెర్లిన్ నుంచి బయలుదేరిన ఆయన ప్రయణిస్తున్న ప్రత్యేక విమానం ఎయిర్ ఫోర్స్ వన్ పోర్చుగల్‌లో ఇంధనం నింపుకొని శుక్రవారం సాయంత్రం లిమాలో దిగింది. పెరూలో అధ్యక్షుడు పెడ్రో పబ్‌లో కుస్జిన్స్కీతో సమావేశం ద్వారా ఆయన తన షెడ్యూలును ప్రారంభిస్తారు. అనంతరం టౌన్ హాల్లో వందలమంది యువకుల మధ్య ప్రసంగించనున్నారు. ఇక్కడే ఆయన చివరగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆదివారం లిమాలో జరగనున్న ఆర్థిక సదస్సులో ఆసియా ప్రాంత నాయకులను, ఆస్ట్రేలియా నాయకుడిని ఒబామా కలవనున్నారు. అనంతరం పత్రికా సమావేశం నిర్వహించి తిరిగి సోమవారం ఉదయం శ్వేత సౌదానికి చేరుకుంటారు. దీంతో ఒబామా పర్యటనలు పూర్తి కానున్నాయి. -
పెరూలో భూకంపం
లిమా: పెరూ రాజధాని లిమాలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.6గా నమోదు అయింది. లిమాకు 45 కిలోమీటర్లు దూరంలో సముద్రంలో ఈ భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే శనివారం వెల్లడించింది. భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం కాని సంభవించలేదని తెలిపింది. ఈ భూకంపం శుక్రవారం రాత్రి వచ్చిందని పేర్కొంది. -
లోయలో పడ్డ బస్సు: 50 మంది మృతి
పెరూ రాజధాని లిమా దక్షిణా భాగంలో గత రాత్రి బస్సు లోయలోపడిన ఘటనలో 50 మంది ప్రయాణీకులు మరణించారని ఉన్నతాధికారులు ఆదివారం ఇక్కడ వెల్లడించారు. మృతుల్లో 13 మంది చిన్నారులు కూడా ఉన్నారని తెలిపారు. దాదాపు 650 అడుగులపై నుంచి బస్సు లోయలో పడటంతో మృతుల సంఖ్య పెరిగిందని వారు అభిప్రాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. పెరూలోని అండీస్ పర్వతపంక్తిపై ప్రయాణం అత్యధిక ములుపులు ఉంటాయని అలాగే చాలా అపాయకరమైన రహదారని తెలిపారు. ఆ ఘటనలో మరణించిన వారంతా పేద రైతులని పేర్కొన్నారు. ప్రమాద ఘటన స్థలంలో తమ సిబ్బంది సహాయ చర్యలను చేపట్టిందని, అయితే ఆ ప్రమాదంలో ప్రయాణీకులంతా మరణించారని అగ్నిమాపక దళ ఉన్నతాధికారి డేవిడ్ తబోడా తెలిపారు.