వార్నింగ్‌ ఇచ్చి వచ్చే వ్యాధులు... | Neuro Physician Dr B Chandrasekhar Reddy On Presympotmatic Diseases | Sakshi
Sakshi News home page

వార్నింగ్‌ ఇచ్చి వచ్చే వ్యాధులు...నివారించుకుందాం... నిశ్చింతగా ఉందాం! 

Published Sat, Feb 26 2022 11:52 PM | Last Updated on Sat, Feb 26 2022 11:54 PM

Neuro Physician Dr B Chandrasekhar Reddy On Presympotmatic Diseases - Sakshi

కొన్ని జబ్బు లక్షణాలు వ్యాధి రాకముందే బయటపడతాయి. తాము రాబోతున్నామంటూ హెచ్చరికలు జారీచేస్తాయి. జాగ్రత్తపడమంటూ చెప్పి, నివారించుకునేందుకు అవకాశాలిస్తాయి. ఆ వార్నింగ్‌ సిగ్నల్స్‌ను ఎలా గుర్తించాలో ప్రముఖ న్యూరో ఫిజీషియన్‌ డాక్టర్‌ బి. చంద్రశేఖర్‌ రెడ్డి వివరిస్తున్నారు. వాటిని నిలువరించే మార్గాలూ చెబుతున్నారు. తెలుసుకుందాం... రండి. 

ప్రశ్న : వార్నింగ్‌ ఇచ్చి వచ్చే వ్యాధులేమైనా ఉన్నాయా? 
జ: న్యూరో విభాగానికి సంబంధించిన చాలా జబ్బులు ముందస్తు వార్నింగ్‌ ఇచ్చాకే వస్తాయి. ఉదాహరణకు మైగ్రేన్, ఫిట్స్, పక్షవాతం, అలై్జమర్స్‌  వంటివి. వీటిల్లో మైగ్రేన్‌ బాధాకరమే గానీ... చాలావరకు నిరపాయకరం. కానీ పక్షవాతం వల్ల అవయవాలు పనిచేయకపోయే ప్రమాదం ఉంది. ఇతరులపై జీవితాంతం ఆధారపడాల్సిన పరిస్థితి రావచ్చు. ఫిట్స్‌ కూడా ప్రమాదమే. అందుకే ముందస్తు హెచ్చరికలు చేసే ఆ వ్యాధుల వార్నింగ్‌ సిగ్నల్స్‌ అర్థం చేసుకోవడం వల్ల చాలా అనర్థాలను నివారించుకోవచ్చు.

ప్రశ్న : పక్షవాతం ముందస్తు సిగ్నల్స్‌ ఇస్తుందా? అదెలా? 
జ: పక్షవాతం (బ్రెయిన్‌ స్ట్రోక్‌)లో చేయిగానీ, కాలుగానీ, లేదా రెండూ పడిపోవడం గానీ, ఒకవైపు చూపు తగ్గిపోవడం, మూతి వంకరపోవడం, మాట పడిపోవడం, మింగడం కష్టం కావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి తాత్కాలికంగా పది నిమిషాల నుంచి ఒక గంట లోపు వస్తే దాన్ని ట్రాన్సియెంట్‌ ఇస్కిమిక్‌ అటాక్‌ (టీఐఏ) అంటారు. ఈ టీఐఏ లక్షణాలు... అసలు పక్షవాతం కంటే కొంత ముందుగానే కనపడవచ్చు. ముందుగా వచ్చే ఈ ‘టీఐఏ’ తర్వాత బాధితులు పూర్తిగా కోలుకుంటారు. కానీ ఆ సిగ్నల్స్‌ పెడచెవిన పెట్టి... అసలు పక్షవాతం వచ్చే వరకు నిర్లక్ష్యం చేస్తే కోలుకోడానికి చాలా టైమ్‌ పట్టవచ్చు లేదా ఆ నష్టం జీవితాంతం బాధించవచ్చు. 

ప్రశ్న :  బ్రెయిన్‌ స్ట్రోక్‌ / టీఐఏ ముప్పు ఎవరిలో ఎక్కువ?  
జ: సాధారణంగా 50 ఏళ్లు దాటి... షుగరు, హైబీపీ ఉన్నవారికి స్ట్రోక్‌ వచ్చే అవకాశాలు ఉంటాయి. పొగతాగడం, మద్యం వంటి దురలవాట్లు ఈ ముప్పును మరింత పెంచుతాయి. రక్తంలో కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉన్నవారికీ, ఊబకాయం ఉన్నవారికీ స్ట్రోక్‌ ముప్పు ఎక్కువ. 

ప్రశ్న : మైగ్రేన్‌లో ఏయే ముందస్తు లక్షణాలు కనిపిస్తాయి? 
జ: మైగ్రేన్‌ తలనొప్పి రెండు విధాలుగా వస్తుంది. మొదటిదానిలో తలనొప్పికి ముందర కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. దీన్ని ‘మైగ్రేన్‌ విత్‌ ఆరా’ అంటారు. దాదాపు 20శాతం మందిలో ‘ఆరా’ కనిపిస్తుంది. రెండో రకంలో నేరుగా తలనొప్పి వస్తుంది. ‘మైగ్రేన్‌ ఆరా’లో కనిపించే లక్షణాలు ఇలా ఉంటాయి. 
∙తలనొప్పి వచ్చే గంటలోపు చూపు కొద్దిగా మందగిస్తుంది.  ∙కళ్ల ముందు మెరుపులు మెరిసినట్లుగా అనిపించడం, వెలుగు చూడలేకపోవడం, శబ్దాలు వినడంలో ఇబ్బంది కలగడం, కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ∙చుట్టూరా ఉన్నవి కనిపించకుండా, ముందు ఉన్నవే కనిపిస్తాయి. దీన్ని టెలిస్కోపిక్‌ విజన్‌ అంటారు. ∙అరుదుగా ఏదో ఓ పక్క కాలు / చేతిలో బలం తగ్గడం. ∙త్వరగా కోపం రావడం, చికాకు పడటం వంటివి కనిపించిన గంట లేదా రెండు గంటల్లోపు అసలు తలనొప్పి మొదలవుతుంది. 

ప్రశ్న : మైగ్రేన్‌కు చికిత్స ఎలా? 
జ: దీనికి రెండు రకాలుగా చికిత్స అందిస్తారు. మొదటిది తీక్షణంగా వచ్చే తలనొప్పిని తగ్గించడానికి ఇచ్చే మందులు. ఇవి ఎంత త్వరగా తీసుకుంటే, అంత త్వరగా ఉపశమనం కలుగుతుంది. రెండోవి... మళ్లీ రాకుండా ఉండేందుకు ఇచ్చే మందులు. 

ప్రశ్న : ఫిట్స్‌లో కూడా ముందస్తు సిగ్నల్స్‌ కనిపిస్తాయా? 
జ: మూర్ఛను వైద్యపరిభాషలో ఫిట్స్‌ అనీ, ఆ జబ్బును ఎపిలెప్సీ అని అంటారు. ఆరు నెలల నుంచి ఆరేళ్ల వయసున్న పిల్లల్లో జ్వరం వచ్చినప్పుడు ఫిట్స్‌ వచ్చే ప్రమాదం ఉంది. అప్పుడు చల్లటి నీటితో ఒళ్లు తుడుస్తూ, శరీర ఉష్ణోగ్రత తగ్గించి ఫిట్స్‌ రాకుండా నివారించుకోవచ్చు. 
కొంతమందిలో ఫిట్స్‌ వచ్చే కొన్ని నిమిషాల నుంచి గంటల ముందుగా తలనొప్పి, కళ్లు తిరగడం, ఒళ్లు జలదరించడం (జర్క్స్‌), కనురెప్పలు కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లలు ఈ లక్షణాలను గమనించలేరు. కాబట్టి పెద్దలే వాటిని గమనించాలి. ముఖ్యంగా ముందురోజు నిద్ర సరిపోకపోవడం, తీవ్ర ఒత్తిడికి లోనవ్వడం వంటి పరిస్థితుల్లో ఫిట్స్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ. 

ప్రశ్న : అలై్జమర్స్‌ జబ్బును ముందస్తుగా గుర్తుపట్టడం ఎలా? 
జ: అలై్జమర్స్‌లో ముఖ్యమైన మొట్టమొదటి లక్షణం – కొన్ని సెకండ్ల నుంచి నిమిషాలకు ముందుగా జరిగిపోయిన విషయాలను మరచిపోతుండటం. (వీళ్లలో చిన్నప్పటి విషయాలు మాత్రం బాగా గుర్తుండవచ్చు). తర్వాత క్రమంగా దారులు, తేదీలు, పండుగలు మరచిపోతారు. కొత్త విషయాలు ఏవీ గుర్తుపెట్టుకోలేరు. క్రమంగా ప్రవర్తనలో కూడా మార్పు రావచ్చు. సరైన సమయంలోనే ఈ లక్షణాలను గుర్తించలిగితే... సరైన చికిత్సతో... వ్యాధి పెరుగుదలనూ, తీవ్రతనూ నియంత్రించవచ్చు. 
ఇక్కడ చెప్పిన ఏ వార్నింగ్‌ కనిపించినా వెంటనే ‘న్యూరో ఫిజీషియన్‌’ను సంప్రదించి, తగిన పరీక్షలూ, వాటి ఆధారంగా తగిన చికిత్స తీసుకుంటే... ఈ జబ్బులను చాలావరకు రాకముందే నివారించవచ్చు. 


డాక్టర్‌ బి. చంద్రశేఖర్‌ రెడ్డి
సీనియర్‌ న్యూరో ఫిజీషియన్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement