దిల్లీకి చెందిన శిజ్య గుప్తా బహుముఖప్రజ్ఞాశాలి. సింగర్, ఎలక్ట్రానిక్ ప్రొడ్యూసర్, విజువల్ ఆర్టిస్ట్, డిజైనర్‌గా తన ప్రత్యేకత చాటుకుంటుంది. శిజ్యకు బాల్యం నుంచి సంగీతం అంటే ఇష్టం. ఆసక్తి మాట ఎలా ఉన్నా తన మ్యూజికల్ జర్నీ మాత్రం ఆలస్యంగానే మొదలైంది. మహిళల కోసం నిర్వహించిన మ్యూజిక్ వర్క్‌షాప్‌కు హాజరైన తరువాత తనకు కూడా ఏదైనా చేయాలనిపించింది. నోయిడాలో జరిగిన గ్లోబల్ మ్యూజిక్ స్కూల్ క్లాసులకు హాజరైన తరువాత ట్యూన్స్ క్రియేట్ చేయడం మొదలుపెట్టింది. ఫస్ట్ సింగిల్ ‘యంగ్ హేట్’తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.
రాజస్థాన్‌లో జరిగిన మాగ్నటిక్ మ్యూజిక్ ఫెస్టివల్‌లో ఫస్ట్ లైవ్ పెర్‌ఫార్మెన్స్‌తో ‘వావ్’ అనిపించుకుంది. శిజ్య మిత్రబృందంలో ఫిల్మ్‌మేకర్స్, యానిమేటర్స్, ఆర్టిస్ట్‌లు... మొదలైనవారు ఉన్నారు. వారితో కలిసి సృజనాత్మక చర్చలు చేయడం అంటే ఆమెకు ఇష్టం. ఆ చర్చలు ఎప్పుడూ వృథా పోలేదు. ఏదో ఒక కొత్త ఐడియా ఆ చర్చల్లో నుంచి పుట్టేది.మొదట్లో తనకు పాటలు రాయడం పెద్దగా ఇష్టం లేదు. అయితే సంక్లిష్టమైన భావాలను సరళమైన పదాలలో చెప్పాలనే ఆలోచన వచ్చిన తరువాత కలానికి పని చెప్పింది.
‘సృజనాత్మక ప్రయాణంలో ప్రతి అడుగు ఎంతో శక్తిని ఇస్తుంది...అనే మాటను తరచుగా వినేదాన్ని. ఇప్పుడు అది స్వయంగా అనుభవంలోకి వస్తోంది’ అంటుంది శిజ్య గుప్తా. ట్యూన్ కోసం మెదడుకు పని చెప్పినా, వచ్చిన ట్యూన్‌కు పసందైన పదాలు అల్లడానికి కలం పట్టినా, డిజిటల్ ఆడియో మ్యూజిక్ స్టేషన్‌లోకి వెళ్లినా, కీ బోర్డ్ ముందు కూర్చున్నా, తబలా వాయించినా, మ్యూజిక్ ఆల్బమ్ కోసం కవర్ డిజైన్ చేసినా.... ప్రతి సృజనాత్మక పనిలోనూ చెప్పలేనంత ఆనందం సొంతం చేసుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment