డిగ్రీలు చేసి, ఉద్యోగాలు చూసుకొని స్థిరపడిపోవడం గురించి ఆలోచిస్తుంటారు చాలా మంది. తమ చదువు పేదలకు ఉపయోగపడితే ఎంతో మేలు అని ఆశిస్తుంటారు కొంతమంది. అలాంటి కోవకి చెందుతుంది కర్పూరం గోవతి నిఖిల. సికింద్రాబాద్ సీతాఫల్‌మండిలో ఉండే నిఖిల గుర్గావ్ మేదాంత ది మెడిసిటీ హాస్పిటల్‌లో డిస్‌ఫేజియా స్పెషలిస్ట్‌గా పరిశోధనలు చేస్తోంది.
గోవతి పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేసి, ఇప్పటి వరకు 5వేల మంది పేదవారికి కంటి, గుండె, క్యాన్సర్ చికిత్సలలో సహాయసహకారాలు అందించింది. ఈ యేడాది యంగెస్ట్ రీసెర్చర్ ఇన్ డిస్‌ఫేజియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, భారత్ గౌరవరత్న శ్రీ సమ్మాన్ కౌన్సిల్ అవార్డులు పొందింది. ఈ సందర్భంగా మాట్లాడినప్పుడు ఎన్నో విషయాలను ఇలా పంచుకుంది.
‘‘తెలియని తపన నన్ను ఓ కొత్త మార్గంవైపు నడిపించింది. పరిశోధనల వైపుగా అడుగులు వేయించింది. ఈ మూడేళ్లలో 5 వేల మందికి సాయం చేసేలా మార్చింది. బీఎస్సీ ఆడియాలజీ పూర్తయ్యాక ఎమ్మెస్సీలో చేరాను. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ పూర్తవగానే మేదాంత హాస్పిటల్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది తమ రీసెర్చ్ ఇన్స్‌టిట్యూట్ లో చేరమని. కాలేజీలో కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ నుంచి వచ్చిన అవకాశమని తెలిసి చాలా ఆనందించాను.
పరిశోధనలో..
అనేక ఆరోగ్య సమస్యలలో ముఖ్యంగా నిమోనియా, గుండెకు సంబంధించిన చికిత్సలు జరిగినప్పుడు కొన్నాళ్ల వరకు ఆహారాన్ని మింగడంలో కలిగే ఇబ్బందుల కారణంగా మరణాల రేటు పెరుగుతోందని మా పరిశోధనలో తేలింది. న్యూరో పేషంట్స్‌లో 80 శాతం డిస్‌ఫేజియా సమస్య ఉంటుంది. ఆహారాన్ని మింగే పద్ధతిలో తేడా ఉంటే ఆ ఆహారం నేరుగా లంగ్స్‌లోకి చేరి, ప్రమాదం కలుగుతుంది. అందుకని ఈ పేషెం ట్స్‌కు, వీళ్లను చూసుకునేవారికి ఏ విధంగా ఆహారాన్ని తీసుకోవాలనే విషయాల మీద గైడెన్స్ ఇస్తుంటాను.
ఈ వైపుగా మన దగ్గర ఇంకా ఆలోచన పెరగలేదు. అమెరికాలో ఈ విషయాలపట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. దీంతో ఈ విభాగంలో నాకు ఆసక్తి కలిగింది. లోతుగా పరిశోధనలు చేయడం మొదలు పెట్టాను. నాకు అడ్వైజ్ చేసే డాక్టర్లు, ప్రొఫెసర్ల సలహాలు మరెన్నో విషయాలను పరిచయం చేసింది.
ఢిల్లీ సమీపంలోని హాస్పిటల్ కావడంతో వచ్చే పేషెంట్స్ సంఖ్య కూడా ఎక్కువే. ప్రతి ఒక్క పేషెంట్ నుంచి వారి ఆరోగ్యసమస్యల ద్వారా తెలుసుకునే విషయాలు ఎన్నో ఉంటాయి. అలా నా పరిశోధనకు సంబంధించి 31 ఆర్టికల్స్ మెడికల్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. జైపూర్, రాజస్థాన్, యూపీ నుంచి వచ్చే స్టూడెంట్స్‌కు సెషన్స్ కండక్ట్ చేస్తుంటాను.
కరోనా నుంచి..
అవసరమైన వారికి సాధ్యమైనంత వరకు నా స్నేహబృందంతో సాయం అందిస్తూ వచ్చాను. అప్పటి నుంచి కంటి, గుండె చికిత్సలు, నిమోనియా, పార్కిన్‌సన్స్, నీ రీప్లేస్‌మెంట్, న్యూరో డిజార్డర్స్ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి డాక్టర్లతో మాట్లాడి ఫీజు తగ్గింపులో సాయం చేస్తుండేదాన్ని.
కోవిడ్ పేషెంట్స్‌పైన రీసెర్చ్ చేసినప్పుడు మరణాలు పెరగడానికి అందరికీ ఒకే విధమైన చికిత్స అందించడం సరికాదని తెలుసుకున్నాను. ప్రతి ఒక్కరూ భిన్నంగా చికిత్స చేయాలనే అంశాల మీద చేసిన రీసెర్చ్ పేపర్స్‌కి మంచి ప్రశంసలు అందాయి. ఈ సమయంలోనే ఫౌండేషన్‌గా సేవలను ఒక గ్రూప్‌కిందకు తీసుకురావాలనిపించింది. అందుకు, మా ప్రొఫెసర్లు, కుటుంబసభ్యుల సపోర్ట్ ఉంది.
అభ్యర్థన మేరకు
ప్రభుత్వ, కార్పోరేట్ హాస్పిటల్స్‌లోని డాక్టర్స్ నెట్‌వర్క్ నుంచి పరిచయాలు ఉన్నాయి. వారిని అభ్యర్థించి పేదవాళ్లలో ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు సూచించడం, వారి చేత హెల్త్ క్యాంపులు నిర్వహించడం చేస్తుంటాను. ఏయే సమయాల్లో క్యాంపులను నిర్వహించాలో ముందే ప్లానింగ్ ఉంటుంది కాబట్టి, దానిని అనుసరించి డాక్టర్లను అభ్యర్థిస్తుంటాను. మా నాన్న హరిరాజ్ కుమార్ రేషన్ షాప్ నిర్వహిస్తుంటారు.
అక్కడకు వచ్చేవాళ్లలో దాదాపు పేదవాళ్లే ఉంటారు. వాళ్లకు అవసరమయ్యేలా క్యాంపులు నిర్వహించాను. నోటి మాట ద్వారా సాయం చేస్తూ వెళ్లడమే. దీని కోసం నేనేమీ డబ్బులు ఖర్చు పెట్టడం లేదు. ఎవరి నుంచీ సాయం తీసుకోవడం లేదు. నాకున్న నెట్‌వర్క్ ద్వారా నోటి మాట ద్వారా సాయం చేయడం ప్రస్తుతం చేస్తున్న పని.
మెడిసిన్స్ అవసరం ఉన్న పేషెంట్స్‌కు జెనెరిక్ మెడిసిన్ ద్వారా సర్వీస్ చేయడం, నర్సుల సాయం తీసుకోవడం వంటివీ జరుగుతుంటాయి. నా టీమ్‌లో అందరూ స్వచ్ఛందంగా సేవ చేసేవారే. ఇంటి వద్ద ఉన్నప్పుడే కాదు గుర్గావ్‌లో ఉన్నా ఫోన్ కాల్ ద్వారా అవసరమైన వారికి అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తుంటాను’’ అని వివరించింది నిఖిల.
ఒప్పించి.. మెప్పించాను..
అమ్మనాన్నలు ఇంజనీరింగ్ చేసి త్వరగా స్థిరపడిపోతే చాలు అనుకునేవారు. కానీ, అనుకోకుండా మెyì కల్ వైపుగా వచ్చాను. ఎమ్మెస్సీ తర్వాత గుర్గావ్‌లో ఇంటర్వ్యూ ఉందనే విషయం కూడా ఇంట్లో చెప్పలేదు, వద్దంటారు అనే ఆలోచనతో. అమ్మమ్మతో కలిసి ఢిల్లీ టూర్ వెళతాను అని ఒప్పించి వెళ్లాను.
అక్కడ మెదంతాలో సీట్ వచ్చాక అప్పుడు విషయాన్ని చెప్పాను. నాకున్న ఆసక్తిని చూసి అమ్మనాన్నలు సరే అన్నారు. కూతురు అంత దూరంలో ఎలా ఉంటుందో అనే బెంగ వాళ్లను ఒప్పుకోనివ్వదని ఆ పని చేశాను. ఇప్పుడు నేను చేస్తున్న రీసెర్చ్‌కి, సర్వీస్‌కు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. నాకు ఇంత మంచి గుర్తింపు రావడం గర్వంగా భావిస్తుంటారు.
– డా.కర్పూరం గోవతి నిఖిల
Comments
Please login to add a commentAdd a comment