సాపేక్ష సిద్ధాంతం గురించి ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌తో సంభాషించింది సృజన. సినిమాలు ఎక్కువగా చూసే గీతిక దర్శక దిగ్గజం ఆల్‌ఫ్రెడ్ హిచ్‌కాక్‌తో ‘నంబర్ 13’ నుంచి ‘ది వైట్ షాడో’ వరకు ఎన్నో సినిమాల గురించి వివరంగా సంభాషించింది. ఇక స్వరతేజకు జపనీస్ ప్రఖ్యాత వీడియో గేమ్ క్యారెక్టర్ ‘మారియో’తో సంభాషించడం సరదా! కాల్పనికత అనేది మనకు బొత్తిగా కొత్త కాదు. అయితే ఏఐ సాంకేతికత కాల్పనికతను మరోస్థాయికి తీసుకువెళ్లింది. యువతరం తాజా ఆర్టిఫిషియల్ క్రేజ్ ‘క్యారెక్టర్. ఏఐ’ ఆ సాంకేతికతలో భాగమే...
ఏఐ పవర్ హౌజ్ ‘ఓపెన్ ఏఐ’ అంతర్జాల సంచలనంగా మారింది. ‘చాట్ జీపీటీ’ పాపులారిటీతో ఎన్నో టెక్నాలజీ కంపెనీలు తమ సొంత ఏఐ చాట్‌బాట్‌లను ప్రవేశపెట్టాయి. ‘చాట్‌జీపీటీ’ పాపులారిటీ సంగతి ఎలా ఉన్నా యువతరం తాజా ఆసక్తులలో ‘క్యారెక్టర్. ఏఐ’ ఒకటిగా మారింది. ‘క్యారెక్టర్. ఏఐ’ ద్వారా సెలబ్రిటీలు, చారిత్రక వ్యక్తులు, కాల్పనిక పాత్రలు, పాపులర్ వీడియో గేమ్ క్యారెక్టర్‌లు, థెరపిస్ట్‌లతో హాయిగా సంభాషించవచ్చు.
సంభాషణల విషయంలో ఇది ‘చాట్ జీపీటి’ కంటే సహజంగా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, మెషిన్ లెర్నింగ్ కాంబినేషన్‌లో ‘క్యారెక్టర్. ఏఐ’ను అభివృద్ధి చేశారు. ‘క్యారెక్టర్.ఏఐ’లో ఎకౌంట్ సెటప్ పూర్తి చేసిన తరువాత ‘క్రియేట్ ఏ క్యారెక్టర్’ ఆప్షన్‌ను క్లిక్‌చేస్తే విండో ఓపెన్ అవుతుంది. క్యారెక్టర్ తనకు తాను పరిచయం చేసుకుంటుంది. ఆ తరువాత సంభాషణ మొదలుపెట్టవచ్చు.
ఉదాహరణకు...‘హారి పోటర్’ సిరీస్‌లోని ఫిక్షనల్ క్యారెక్టర్ హమైనీ గ్రేంజర్‌తో సంభాషించాలనుకున్నాం.‘హలో రమ్య, మై నేమ్ ఈజ్ హమైనీ గ్రేంజర్. ఇట్స్ వెరీ నైస్ టు మీట్ యూ’ అంటూ తనను తాను పరిచయం చేసుకుంటుంది హమైనీ. తన ఇష్టాయిష్టాలు, ఆసక్తుల గురించి చెబుతుంది. రిలవెంట్ ట్యాగ్స్ అందుబాటులో ఉంటాయి. క్యారెక్టర్ వ్యక్తిత్వం ఆధారంగా డ్రాప్ డౌన్ మెన్యూ నుంచి స్పీకింగ్ వాయిస్‌ను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక క్యారెక్టర్‌తో చాట్ చేయవచ్చు లేదా మల్టిపుల్ క్యారెక్టర్స్‌తో గ్రూప్ చాట్ చేయవచ్చు.
‘క్యారెక్టర్. ఏఐ’ అనేది టెక్ట్స్‌కు మాత్రమే పరిమితం కాదు. ప్రాంప్ట్స్, చాట్స్ ఆధారంగా ఇమేజ్‌లను క్రియేట్ చేయవచ్చు. ఏఐ ఇండస్ట్రీ ప్రముఖులుగా గుర్తింపు పొందిన షాజీర్, డేనియల్ ఫ్రెటస్ గూగుల్‌లో పనిచేస్తున్నప్పుడు ‘క్యారెక్టర్. ఏఐ’కు సంబంధించి ఆలోచన చేశారు. షాజీర్ ‘అటెన్షన్ ఈజ్ ఆల్ యూ నీడ్’ పుస్తక రచయితలలో ఒకరు. ఇక డేనియల్ ‘మీన’ అనే చాట్‌బాట్ క్రియేటర్. వ్యక్తిగత వస్తువులు ఉన్నట్లే, పర్సనలైజ్‌డ్ చాట్‌బాట్‌లు ఉండాలనుకునేవారికి క్యారెక్టర్ ఏఐ ఉపయోగపడుతుంది. ‘వర్చువల్ ఫ్రెండ్’ను సృష్టిస్తుంది. ‘పర్సనలైజ్‌డ్ చాట్‌బాట్ అంటే మాటలా? ఖర్చు బాగానే అవుతుంది కదా’ అనే సందేహం వస్తుంది. అయితే ‘క్యారెక్టర్. ఏఐ’తో ఖర్చు లేకుండానే సొంత చాట్‌బాట్‌ను సృష్టించుకోవచ్చు.
ఆ.. ఏముంది... అంతా కాల్పనికమే కదా అనుకుంటే ఏమీ లేకపోవచ్చు. ఉంది అనుకుంటే మాత్రం ఎంతో ఉంది. ‘కొత్త అనుభూతిని సొంతం చేసుకున్నామా లేదా అనేది ముఖ్యం కాని వాస్తవమా కాదా అనేది ముఖ్యం కాదు’ అంటున్నాడు ‘యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా’ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం అసోసియేట్ ప్రొఫెసర్ మైక్. ‘చాట్ జీపీటీ’ గురించి ఎంత గొప్పగా చర్చించుకున్నప్పటికీ కొన్ని ప్రయోగాలు దెబ్బతిన్నాయి. ఉదాహరణకు ... నేషనల్ ఈటింగ్ డిజార్డర్స్ అసోసియేషన్ బరువు తగ్గడానికి సంబంధించి సమస్యాత్మక సలహా ఇచ్చినందుకు తమ చాట్‌బాట్‌ను సస్పెండ్ చేసింది. క్యారెక్టర్. ఏఐ విషయంలోనూ పొరపాట్లు జరగవచ్చు. సాంకేతికతకు పరిమితులు ఉండే విషయాన్ని అర్థం చేసుకోవాలి’ అంటుంది చెన్నైకి చెందిన ఇంజనీరింగ్ స్టూడెంట్ మనీష.
రియల్ చాలెంజర్... జెమిని
ఏఐ రేసులో ఓపెన్ ఏఐ లాంగ్వేజ్ మోడల్స్ లీడింగ్‌లో ఉన్నప్పటికీ ఇది ఎప్పటివరకు అనేది ప్రశ్నార్థకంగా ఉంది. దీనికి కారణం సరికొత్తగా వస్తున్న పవర్‌ఫుల్ ఏఐ మోడల్స్. వీటిమాట ఎలా ఉన్నా గూగుల్ వారి ‘జెమిని’ని అసలు సిసలు రియల్ చాలెంజర్ అంటున్నారు. గూగుల్ తమ కొత్త ‘జెమిని’ ప్రాజెక్ట్‌లో భాగంగా నెక్స్›్ట– జనరేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్‌ను లాంచ్ చేయనుంది.
‘జెమిని’ అనేది కన్వర్‌సేషనల్ టెక్ట్స్‌ను జనరేట్ చేయడానికి పరిమితం కాదు. ఇన్‌ఫుట్స్, వీడియోలు, ఇమేజ్ లను హ్యాండిల్ చేసే మల్టీ–మోడల్ జెమిని. గూగుల్ దగ్గర ఉన్న అపారమైన వనరులు(యాక్సెస్ టు యూ ట్యూబ్ వీడియోస్, గూగుల్ బుక్స్, సెర్చ్ ఇండెక్స్, స్కాలర్ మెటీరియల్)లతో ‘జెమిని’ ఇతర కంపెనీలకు గట్టి ప్రత్యర్థిగా మారనుంది. ‘ఎక్స్‌క్లూజివ్ టు గూగుల్’ అనే ప్రత్యేకత వల్ల జెమిని మరింత బలంగా మారనుంది.
(చదవండి: తండ్రికి కూడా ప్రసూతి సెలవులు ఇవ్వాల్సిందే! హైకోర్టు జస్టిస్ ఆదేశం!)
Comments
Please login to add a commentAdd a comment