ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి : ఇదో కలుపు నివారణ మందు. పేరు గ్లైపోసేట్. అన్ని మందుల లాంటిది కాదిది. భస్మాసురహస్తం. కలుపే కాదు.. ఇది పడినచోట పచ్చగడ్డి మాడిమసైపోవాల్సిందే. కలుపుతోపాటు మానవాళికి మేలుచేసే క్రిమికీటకాదులు కూడా కనిపించకుండా పోతాయి. పిచికారీ చేసేవాళ్లకు కూడా తీవ్రనష్టం కలిగిస్తుంది. అనారోగ్యాలపాలు చేస్తుంది. వాస్తవానికి ఇది నిషేధిత పురుగుమందుల జాబితాలో ఉంది. అయినా సరే రాష్ట్రంలో విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నట్టు పెస్టిసైడ్ యాక‌్షన్ నెట్‌వర్క్ చెబుతోంది. పలువురు పర్యావరణ ప్రముఖులు, సంస్థల వారు కూడా నిజమేనంటున్నారు. టీ తోటల్లో ఎక్కువగా పెరిగే కలుపు నివారణకు కేంద్రం అనుమతి ఇచ్చిన ఈ మందు వినియోగం తరువాత దేశవ్యాప్తంగా విస్తరించింది.
ఇంతకీ ఏమిటీ గ్లైపోసేట్..
కలుపును తట్టుకునే విత్తనాలతో కలిపి వాడే ఆగ్రో కెమికల్ ఇది. ఇతర కలుపు నివారణ మందులకు, దీనికి చాలా తేడా ఉంది. ఈ మందును రౌండప్ అని, గ్లైసిల్ అని కూడా అంటారు. దీని దుష్ప్రభావాలను గుర్తించి.. ఈ మందు పుట్టిన అమెరికాలోనే దీని వాడకం నిషేధించారు. అయినా ఆసియా దేశాల్లో మాత్రం ఎక్కువగా వినియోగిస్తున్నారు. టీ తోటల్లో కలుపు నివారణ కోసం వచ్చిన ఈ మందును ఇప్పుడు జన్యుమార్పిడి విత్తనాలను వాడే పత్తి, మొక్కజొన్న, వంగ, మిర్చి, కాకర, అరటి, అక్కడక్కడా వరిచేలల్లో కూడా వాడుతున్నారు. చివరకు కలుపును తట్టుకుంటాయనే పేరిట వచ్చిన పత్తి రకాల సాగులోనూ వినియోగిస్తున్నారు. ఈ మందు చెడు ప్రభావాన్ని గుర్తించి ఇటీవల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు దీన్ని నిషేధించాయి. అక్రమంగా విక్రయిస్తున్న సంస్థల లైసెన్సులు రద్దుచేశాయి.
వాడితే వచ్చే ముప్పు..
- గ్లైపోసేట్ వాడడం వల్ల మనుషులకు, మొక్కలకు, పశువులకు కూడా ముప్పని పర్యావరణవేత్తలు కేంద్ర ప్రభుత్వానికి నివేదించారు.
- ఈ మందు వాడిన పొలాల్లోని గడ్డి తిని పశువులు చనిపోయినట్టు పాన్ ఇండియా సర్వేలో తేలింది.
- ఈ మందును పిచికారీ చేసిన వారిలో అనేకమంది రైతులు క్యాన్సర్, కిడ్నీ, ఛాతీ వ్యాధులకు గురయ్యారు. వీరిలో కొందరు మరణించగా కొందరు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ఈ పరిస్థితిని గమనించారు.
- గ్లైపోసేట్ వాడినా పత్తి చేలల్లో గులాబీరంగు పురుగు ఉద్ధృతమైనట్టు పరిశీలనలో తేలింది.
- దేశంలో 35 సంస్థలు ఈ మందును తయారుచేస్తున్నాయి. 2018–19లో 6,684 మెట్రిక్ టన్నుల గ్లైపోసేట్ తయారైనట్టు వ్యవసాయ మంత్రిత్వశాఖ ప్రకటించింది.
- నకిలీ లేబుల్స్ లేదా అసలు లేబుళ్లు లేకుండా కూడా గ్లైపోసేట్‌ను నిషేధిత రాష్ట్రాల్లోకి రవాణా చేస్తున్నారు.
- లీటర్ మందును రెండు వేల నుంచి 2,500 రూపాయల వరకు విక్రయిస్తున్నారు.
ఎలా నిరోధించాలి?
పర్యావరణానికి, పశుసంపదకు, మానవజాతికి తీవ్ర హాని కలిగిస్తున్న గ్లైపోసేట్‌ను దేశంలో పూర్తిగా నిషేధించాలని వ్యవసాయరంగ ప్రముఖులు కోరుతున్నారు. ఈ మందు తయారీని దశల వారీగా ఆపేయాలని పర్యావరణవేత్తలు కేంద్ర వ్యవసాయ, రైతుసంక్షేమ శాఖకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటువంటి విషతుల్యమైన మందులకు బదులు సేంద్రియ పద్ధతుల్లో కలుపును నివారించే మందుల తయారీపై దృష్టిసారించాలని జాతీయ సేంద్రియ సాగు సంస్థకు సిఫార్సు చేశారు.
ప్రకృతి సాగు ప్రోత్సాహమే పరిష్కారం
గ్లైపోసేట్ వాడకాన్ని టీ తోటలకే పరిమితం చేయాలి. మిగతా పంటల్లో వాడకుండా కేంద్ర ప్రభుత్వం నిషేధించాలి. ఆంధ్రప్రదేశ్‌లో పర్యావరణ అనుకూల ప్రకృతి సాగు పద్ధతులు అనేకం అమల్లో ఉన్నాయి. వాటిని రైతుల్లోకి తీసుకువెళ్లేలా వ్యవసాయశాఖ కృషిచేయాలి. కలుపు నివారణకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాల్లో ఒకటి ప్రకృతి సేద్యం. బహుళజాతి కంపెనీల దురాశ ఫలితమే గ్లైపోసేట్. దాన్ని ఏ రూపంలో ఉన్నా నిషేధించాల్సిందే.
- డాక్టర్ డి.నరసింహారెడ్డి, పర్యావరణరంగ ప్రముఖుడు
యాంత్రీకరణ పద్ధతులు ఉపయోగించాలి
కలుపు నివారణ పేరిట కొందరు రైతులు దొంగచాటుగా గ్లైపోసేట్ తెచ్చి పత్తి చేలల్లో వాడుతున్నారు. ఇది పూర్తిగా చట్టవిరుద్ధం. రూ.60, రూ.70 కూలి ఎక్కువ అని ఈ మందు వాడితే సాగుకు మేలుచేసే మిత్రపురుగులు కూడా చచ్చిపోతున్నాయి. దానికి బదులు కలుపు నివారణకు చిన్న యంత్రాలను వినియోగించడం మేలు. అప్పుడు రైతుల ఆరోగ్యంతో పాటు పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. చిన్న యంత్రాలు ఆర్బీకేలలో కూడా అందుబాటులోకి రానున్నాయి.
- వి.భరత్‌రెడ్డి, తలముడిపి, కర్నూలు జిల్లా
ఎవరైనా విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం
రాష్ట్రంలో గ్లైపోసేట్‌పై నిషేధం ఉంది. ఇక్కడ టీ తోటలు లేనందున ఆ మందు వాడడానికి వీల్లేదు. అనుమతి లేని ఆ మందును ఎవరైనా విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం. రైతులు తమకు కావాల్సిన నాణ్యమైన పురుగుమందులు, ఎరువులు, క్రిమిసంహారక రసాయనాలను ఆర్బీకేల ద్వారా తెప్పించుకోవచ్చు.
– హెచ్.అరుణ్ కుమార్, వ్యవసాయ శాఖ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment