Mutton Recipes: How To Prepare Mutton Rogan Josh And Dum Aloo Recipes In Telugu - Sakshi
Sakshi News home page

Mutton Rogan Josh Recipe In Telugu: అన్నం, రుమాలీ రోటీలోకి అదిరిపోయే మటన్‌ రోగన్‌ జోష్‌!

Published Sat, May 28 2022 5:05 PM

Recipes In Telugu: How To Make Mutton Rogan Josh And Dum Aloo - Sakshi

పర్యాటకుల్ని ఆకర్షించే ప్రదేశాల్లో కశ్మీర్‌ అందాలు మొదటి స్థానంలో ఉంటాయి. అక్కడి పర్యావరణానికి తగ్గట్టుగానే కశ్మీరి వంటకాలు అమోఘమైన రుచితో నోరూరిస్తుంటాయి. కశ్మీరీలనేగాక పర్యాటకుల్ని విపరీతంగా ఆకట్టుకునే కొన్ని వంటకాలను మన ఇంట్లోనే ఎలా వండుకోవచ్చో తెలుసుకుందాం...

దమ్‌ ఆలూ 
కావలసినవి: బేబీ పొటాటోలు – పది, నీళ్లు – కప్పు, ఆయిల్‌ – డీప్‌ఫ్రైకి సరిపడా.
కూర కోసం: ఆయిల్‌ – రెండు టేబుల్‌ స్పూన్లు, జీలకర్ర – అరటేబుల్‌ స్పూను, దాల్చిన చెక్క – అంగుళం ముక్క, నల్ల యాలుక్కాయలు – రెండు, సాధారణ యాలుక్కాయలు – రెండు, లవంగాలు – ఐదు, ఇంగువ – చిటికెడు, కశ్మీరి ఎండు మిర్చి కారం – టీస్పూను, నీళ్లు – కప్పు, పెరుగు – ముప్పావు కప్పు, శొంఠి పొడి – టీస్పూను, సోంపు పొడి – రెండు టేబుల్‌ స్పూన్లు, ఉప్పు – రుచికి సరిపడా, గరం మసాలా – పావుటీస్పూను.



తయారీ..
►ముందుగా పొటాటోలను శుభ్రంగా కడిగి కప్పు నీళ్లుపోసి ఒక విజిల్‌ వచ్చేంత వరకు ఉడికించాలి.
►ఉడికిన దుంపలను తొక్కతీసి ఫోర్క్‌తో చిన్న రంధ్రాలు పెట్టుకోవాలి.
►ఇప్పుడు బాగా వేడెక్కిన ఆయిల్‌లో దుంపలను బంగారు వర్ణం, క్రిస్పీగా మారేంత వరకు డీప్‌ఫ్రై చేయాలి.
►ఇప్పుడు స్టవ్‌ మీద మరో బాణలి పెట్టి ఆయిల్‌ వేసి, వేడెక్కిన తరువాత జీలకర్ర, దాల్చిన చెక్క, నల్ల యాలుక్కాయలు, యాలుక్కాయలు, ఇంగువ వేసి దోరగా వేయించాలి. ►ఇవన్నీ వేగాక స్టవ్‌ ఆపేసి కశ్మీరి కారం వేసి తిప్పాలి.
►తర్వాత పెరుగు వేసి ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి.
►ఇప్పుడు శొంఠిపొడి, సోంపు పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి.
►ఈ మసాలా మిశ్రమంలో డీప్‌ఫ్రై చేసిన బేబీపొటాటోలను వేయాలి. 

►అరకప్పునుంచి కప్పు నీళ్లుపోసి మూతపెట్టి అరగంటపాటు సన్నని మంటమీద మగ్గనివ్వాలి. మధ్యమధ్యలో కలుపుకోవాలి. ∙అరగంట తరువాత ఆయిల్‌ పైకితేలుతుంది. ఇప్పుడు గరం మసాలా వేసి తిప్పి దించేయాలి. అన్నం, రోటీలలోకి ఇది మంచి సైడ్‌ డిష్‌గా పనిచేస్తుంది. 

రోగన్‌ జోష్‌
కావలసినవి: మటన్‌ ముక్కలు – అరకేజీ, పెరుగు – కప్పు, ఉప్పు – రుచికి సరిపడా, ఆవనూనె – అరకప్పు, నల్ల యాలుక్కాయలు – రెండు, సాధారణ యాలుక్కాయలు – నాలుగు, లవంగాలు – నాలుగు, దాల్చిన చెక్క – అంగుళం ముక్క, బిర్యానీ ఆకు – ఒకటి, మిరియాలపొడి – అరటీస్పూను, సోంపు పొడి∙– టీస్పూను, ఇంగువ – అరటీస్పూను, కశ్మీరీ ఎండుమిర్చికారం – రెండు టీస్పూన్లు, రత్నజోట్‌ (ఒక రకమైన వేరు, రంగుకోసం వాడుతారు) – అరంగుళం ముక్క, కొత్తిమీర – గార్నిష్‌ కు సరిపడా

మ్యారినేషన్‌ కోసం: సోంపు గింజలు – టీస్పూను, దాల్చిన చెక్క పొడి – పావు టీస్పూను, కశ్మీరీ ఎండు మిర్చికారం – టీస్పూను, మిరియాల పొడి – అరటీస్పూను, యాలుక్కాయ పొడి – అరటీస్పూను.

తయారీ..
►మటన్‌ ముక్కలను నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా వడగట్టాలి.
►మటన్‌ ముక్కలకు మ్యారినేషన్‌ కోసం తీసుకున్న పదార్థాలు, కొద్దిగా ఉప్పు వేసి చక్కగా కలిపి గంటన్నరపాటు రిఫ్రిజిరేటర్‌లో ఉంచాలి
►మందపాటి బాణలిలో ఆయిల్‌ వేసి వేడెక్కనివ్వాలి.
►కాగిన తరువాత బిర్యానీ ఆకులు, యాలుక్కాయలు, దాల్చిన చెక్క వంటి మసాలా దినుసులన్నీ వేయాలి.
►ఇవన్నీ ఒకనిమిషం పాటు వేగిన తరువాత నానబెట్టుకున్న మటన్‌ను వేసి పెద్ద మంట మీద తిప్పుతూ ఉడికించాలి.
►ఐదు నిమిషాల తరువాత ఇంగువ వేసి తిప్పాలి.
►తరువాత కప్పు నీళ్లుపోసి కలిపి, మూతపెట్టి సన్నని మంటమీద అరగంటపాటు ఉడికించాలి
►మరొక గిన్నెను తీసుకుని పెరుగు, కారం, సోంపు పొడి వేసి చక్కగా కలుపుకోవాలి.
►ఉడుకుతున్న మటన్‌ మిశ్రమంలో పెరుగు మిశ్రమాన్ని వేసి కలపాలి.
►ఇప్పుడే రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి.
►ఇప్పుడు రతన్‌ జోట్‌ను ఒక గిన్నెలో వేసి వేడినూనె పోసి ఐదు నిమిషాల పాటు నానబెట్టాలి.
►నానిన రతన్‌ జోట్‌ మిశ్రమాన్ని ఉడుకుతోన్న మటన్‌ మిశ్రమంలో వేయాలి.
►మటన్‌ ముక్కలు మెత్తబడిన తరువాత కొత్తి మీరతో గార్నిష్‌ చేస్తే ఎంతో రుచికరమైన రోగన్‌ జోష్‌ రెడీ. అన్నం, రుమాలీ రోటీలోకి ఇది చాలా బావుంటుంది.

ఇది కూడా ట్రై చేయండి: Chepala Iguru In Telugu: ఘుమఘుమలాడే చేపల ఇగురు చేసుకోండిలా!

Advertisement
 
Advertisement
 
Advertisement