రేణుకా సహానీ
ఈ కొత్త ఏడాది రేణుకకు ఉల్లాసంగా మొదలైంది.‘‘ఓటీటీలో మనం ఎలాంటి కథనైనా చెప్పొచ్చు. ఎంత సున్నితంగానైనా. ‘పుషింగ్ ద ఎన్వలప్’ అది. పరిమితుల్ని దాటుకుని కొంచెం దుడుకుతనాన్ని చూపించవచ్చు. ఆ ఛాన్స్ ఉంటుంది అందులో..’’ అంటారు రేణుక. త్రిభంగను దృష్టిలో పెట్టుకునే ఆమె ఆ మాట అన్నారు. తల్లి, ఆమె కూతురు, ఆమె కూతురు.. మూడు తరాల స్త్రీల మధ్య కథను కాస్త ‘తీవ్రంగా’ నడిపించారు రేణుక. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ‘‘భారతీయ మహిళల జీవితాలు ప్రత్యేకమైనవి. వాటిని మనం కథలుగా ప్రపంచంతో పంచుకోవలసిన అవసరం ఉంది. నా పాత్రలు బాగా చదువుకున్నవి కావచ్చు. పాశ్చాత్య పోకడలతో ఉండొచ్చు.
కానీ అవి భారతీయత వేర్లను తెంపుకుని వెళ్లేలా ప్రవర్తించవు. ఆ గుణాన్నే నేను స్క్రీన్ మీద సెలబ్రేట్ చెయ్యాలని అనుకుంటున్నాను’’ అంటున్నారు రేణుకు. త్రిభంగ తర్వాత తను తీసే సినిమా కూడా ముగ్గురు మహిళల కథేనట. మహిళల సమస్యల్ని మాత్రమే మహిళా దర్శకులు తియ్యగలరు అని చిత్ర పరిశ్రమలో ఒక అభిప్రాయం ఉంది. అంటే, వాళ్లకు వేరే జీవనాంశాలేమీ పరిచయం ఉండవు కనుక తమకు తెలిసిన వాటిని మాత్రమే చూపించగలరని. అది సరికాదంటారు రేణుక. ‘‘మహిళల సమస్యల్ని సినిమా తియ్యడం అంటే స్త్రీని ఒక భార్యగానో, చెల్లిగానో, కూతురిగానో చూపించడం మాత్రమే అవుతుంది. చాలామంది మగ దర్శకులు చేస్తున్నది కూడా అదే. మహిళా సమస్యల్నే తీసుకున్నా ఆ సమస్యల్ని చర్చిస్తున్న విధానాన్ని మనం చూడాలి. నా పాత్రలు అన్ని విషయాలను ధైర్యంగా మాట్లాడాలని నేను కోరుకుంటాను.
రేణుకా సహానీ దర్శకత్వం వహించిన ‘త్రిభంగ’ చిత్రంలో మూడు తరాల మహిళలు : మిథిలా పాల్కర్, కాజోల్, తన్వీ అజ్మీ
పురుషాహంకారం, భర్త, పెళ్లి.. వీటి జోలికి ఆ పాత్రలు వెళ్లడం నాకు ఇష్టం ఉండదు’’ అంటారు రేణుక. ఈ మాటల్ని బట్టి రేణుక సరికొత్త సున్నితమైన కథాంశంతో ఒక మహిళా చిత్రాన్ని తీయబోతున్నట్లే ఉంది. ఇప్పుడైతే ఆమె 1980ల నాటి జీవితంపై ఒక పుస్తకాన్ని రాసేందుకు కూర్చున్నారు. మరో రెండు స్క్రిప్టులూ ఆమె చేతుల మీదుగా తయారవుతున్నాయి. ఒకటి పూర్తయింది. ఇంకోటి పూర్తి కావస్తోంది. ఆమెకింత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? రేణుక తండ్రి అరుణ్ ఖోప్కర్ స్క్రిప్టు రైటర్. తల్లి శాంతా గోఖలే రచయిత్రి, అనువాదకురాలు, జర్నలిస్టు, రంగస్థల విమర్శకురాలు. ఇవన్నీ రేణుకపై పని చేసి ఉండొచ్చు. రేణుక దర్శకత్వం వహించిన మొదటి సినిమాగా ‘త్రిభంగ’ పేరు పొందినప్పటికీ 2009 లోనే ‘రీటా’ అనే మరాఠీ మూవీతో దర్శకత్వంలోకి ప్రవేశించారామె.
రేణుక అడపాదడపా సినిమాల్లో కనిపిస్తూ ఉన్నా.. ఇకముందు తనే సినిమాలు తీయాలని నిర్ణయించుకున్నారు. తీయడం అంటే దర్శకత్వం. కథ తను రాసిందే, స్క్రిప్టూ తను అల్లిందే. మహిళలే ఆమె ప్రధాన కథాంశం. అయితే ఆ పాత్రలేవీ మగవాళ్ల గురించి, రొమాన్స్ గురించీ మాట్లాడవని కూడా డైరెక్టర్‌గా తన తొలి సినిమా ‘త్రిభంగ’ సక్సెస్ మీట్‌లో చెప్పేశారు సహానీ. ఇప్పటికే ఆమె మరొక సినిమా కథ రాసే పనిలో పడిపోయారు. రెండు సినిమా స్క్రిప్టులను కూడా అల్లుకుంటున్నారు. బహుశా అవి కూడా ఆడవాళ్ల ప్రపంచం చుట్టూ తిరిగేవే కావచ్చు.
Comments
Please login to add a commentAdd a comment