
Sakshi Excellence Awards: సాక్షి మీడియా 2020 ఎక్స్‌లెన్స్ అవార్డుల కార్యక్రమం సెప్టెంబర్ 17న ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా.. ‘ఎక్స్‌లెన్స్ ఇన్ హెల్త్‌కేర్’ అవార్డును స్పర్శ్ హాస్పీస్ తరఫున సీఈఓ డా.రామ్ మోహన్‌రావు అందుకున్నారు.
స్పర్శ్ హాస్పీస్ ‘ఎక్స్‌లెన్స్ ఇన్ హెల్త్‌కేర్’
మరణాన్ని ఎలాగూ తప్పించలేం కానీ మరణ యాతనను తగ్గించవచ్చనే ఆలోచనతో ‘రోటరీ క్లబ్ ఆఫ్ బంజారాహిల్స్ చారిటబుల్ ట్రస్ట్’ ఆధ్వర్యంలో 2011లో హైదరాబాద్‌లో ఏర్పాటైంది ‘స్పర్శ్ హాస్పీస్’ సంస్థ. అవసాన దశలో ఉన్నవారికి, వారి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ద్వారా కావాల్సిన మానసిక, ఆధ్యాత్మిక స్థైర్యాన్ని అందిస్తోంది. వివిధ కారణాల వలన ఈ సెంటర్‌కి రాలేని వారి కోసం స్పర్శ్ టీమ్ సభ్యులు వారి ఇళ్లకే వెళ్లి సపర్యలు చేస్తున్నారు. ఈ విధంగా ఈ 9 ఏళ్లలో 3300 మంది రోగులకు సేవలందించింది స్పర్శ్ హాస్పీస్.
ఈ గుర్తింపుతో మరింత మందికి సేవలు
సమాజానికి చేస్తున్న మంచి సేవకు గొప్ప గుర్తింపు. పదేళ్లుగా జీవితపు ఆఖరి దశలో ఉన్న 4వేల మంది రోగులకు అండగా నిలిచి, వారి అంతిమదశలో కష్టాలను నివారించాం. సాక్షి లాంటి సంస్థల గుర్తింపు, ప్రభుత్వ ప్రోత్సాహం లభిస్తే మరింత మందికి సేవ చేయగలుగుతాం.
– డా.రామ్ మోహన్‌రావు, సిఇఓ, స్పర్శ్ హాస్పీస్