‘లోయ’కు గొంతునిచ్చారు | Sakshi Family Story On Kashmir Singers | Sakshi
Sakshi News home page

‘లోయ’కు గొంతునిచ్చారు

Published Wed, May 19 2021 9:15 AM | Last Updated on Wed, May 19 2021 9:18 AM

Sakshi Family Story On Kashmir Singers

సంగీతం మగవారిది అని అక్కడ కొందరు అనుకుంటారు. ‘మాది కూడా’ అని ఈ ఆడపిల్లలు అన్నారు. కశ్మీర్‌ లోయలో ఐదారుమంది ఆడపిల్లలు కలిసి ‘వికసించే పూలు’ పేరుతో ఒక సూఫీ సంగీత బృందంగా ఏర్పడ్డారు. వారే పాడతారు. వారే వాయిద్యాలు వాయిస్తారు. కశ్మీర్‌ మొత్తంలో ఆ మాటకొస్తే దేశంలోనే ఇలాంటి సర్వ మహిళా సూఫీ గీత బృందం లేదు. నిరాశ నిశ్శబ్దపు లోయకు ఈ సంగీతం అవసరం అని వారు అనుకుంటున్నారు. ఒకరిద్దరు భృకుటి ముడివేసినా వీరుగొంతు ఎత్తగానే అప్రయత్నంగా కనులు విప్పారుస్తున్నారు. కశ్మీర్‌ సూఫీ గర్ల్స్‌ పరిచయం.

ఆ నలుగురైదుగురు అమ్మాయిలు అలా చెట్ల మధ్యగా నడుచుకుంటూ ఒక తిన్నె మీదకు చేరుకుంటారు. తాము తెచ్చుకున్న చాదర్‌లను నేల మీద పరిచి తామూ వాయిద్యాలు పట్టుకుని కుదురుగా కూచుంటారు. ఒకమ్మాయి సంతూరును సవరిస్తుంది. ఒకమ్మాయి తబలా మీటుతుంది. ఒకమ్మాయి కశ్మీరి వయొలిన్‌లో కంపనం తెస్తుంది. మెల్లగా అందరూ పాటలు మొదలెడతారు. ప్రకృతి వాటిని పులకించి వింటుంది. బహుశా ఆధ్యాత్మిక తాదాత్మ్యం కూడా చెందుతుంది. ఎందుకంటే వారు పాడేది సూఫీ భక్తి సంగీతం కనుక. కశ్మీర్‌లో గత రెండేళ్ల నుంచి ఈ బృందం అందరినీ ముచ్చటగొలుపుతోంది. ఈ బృందం తనకు పెట్టుకున్న పేరు ‘వికసించే పూలు’. కాని కశ్మీర్‌ ప్రాంతం, దేశం సులువుగా ‘సూఫీ గర్ల్స్‌’ అని పిలుస్తున్నారు.

లోయలో బృంద గీతం
కశ్మీర్‌ బండిపోర జిల్లాలో గనస్థాన్‌ అనే చిన్న పల్లె ఉంది. ఆ పల్లెలో ఈ సంగీత గాథను ఇర్ఫానా యూసఫ్‌ అనే కాలేజీ అమ్మాయి మొదలెట్టింది. ఆ అమ్మాయి తండ్రి సంగీత విద్వాంసుడు. సాయంత్రమైతే ఇంట్లోని వాయిద్యాలు తబలా, సితార్, సంతూర్‌ తీసి సాధన చేస్తుండేవాడు. ఇర్ఫానా అది గమనించి తానూ నేర్చుకుంటానని చెప్పింది. అయితే సంగీత వాయిద్యాలను అమ్మాయిలకు నేర్పడం పట్ల ఆ ప్రాంతంలో కొంత పట్టింపు ఉంది. ఇర్ఫానా తండ్రి దానిని పట్టించుకోలేదు. కూతురు ఎప్పుడైతే నేర్చుకుంటానందో ఆ ప్రాంతంలోని ఉస్తాద్‌ ముహమ్మద్‌ యాకూబ్‌ షేక్‌ అనే గురువు దగ్గరకు తీసుకువెళ్లి చేర్పించాడు. ఉస్తాద్‌ ముహమ్మద్‌ షేక్‌ ఆ ప్రాంతంలో అమ్మాయిలకు సంగీతం నేర్పిన తొలి గురువు.

సంగీతం మగవారిది మాత్రమే కాదు అమ్మాయిలది కూడా అని అతని విశ్వాసం. ఆయనకు ఉన్న పేరుకు ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఎవరూ వ్యతిరేకించలేదు. అలా ఇర్ఫానా సంగీతం నేర్చుకుంది. నేర్చుకున్న సంగీతాన్ని దూరదర్శన్‌లో ప్రదర్శించింది. అంతే. ఆమె ఊళ్లో ఆ కార్యక్రమాన్ని చూసిన ఇతర అమ్మాయిలు ఎంత స్ఫూర్తి పొందారంటే ‘మనమంతా ఒక బృందంగా ఏర్పడి కచ్చేరీలు ఇద్దాం’ అని అనేవరకు. ఇర్ఫానాకు కావలసింది అదే. లోయ వినాలనుకుంటున్న సంగీతమూ అదే. ‘సూఫీ సంగీతంలో దేవుణ్ణి, ప్రవక్తని, పీర్లను స్తుతించడం ఉంటుంది. వారి గొప్పతనాన్ని శ్లాఘించడం, కృతజ్ఞతను ప్రకటించడం ఆ పాట ల్లో ఉంటుంది. పారశీ గీతాలు మాకు తెలియకపోయినా పెద్దల నుంచి అర్థం తెలుసుకుని పాడుతున్నాం’ అంటున్నారు ఈ అమ్మాయిలు.

సూఫీ సంగీతం
కశ్మీరీ ఫోక్‌లోర్‌ పాడే బృందాలు కశ్మీర్‌లో చాలానే ఉన్నాయి. కాని సూఫీ సంగీతం పాడే బృందాలు లేవు. మగవారే పాడుతున్నారు. కశ్మీర్‌ అంతటా ఉర్సుల్లో, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో, ఇళ్లల్లో జరిగే ఉత్సవాల్లో సూఫీ సంగీతం వినిపించడం ఆనవాయితీ. పారశీ, కశ్మీరీ భాషల్లో కశ్మీర్‌ ప్రాంతంలోని సూఫీ గురువులు పూర్వం రాసిన గీతాలను లయబద్ధంగా పాడటం అక్కడ ఎంతో ఆదరంతో చూస్తారు. ‘సూఫీ సంగీతంలో 12 నిర్దేశిత స్వరాలు ఉంటాయి. వాటిలోనే పాడాలి. వాటిలో కొన్ని స్వరాలకు కొన్ని సమయాలు ఉంటాయి. ఉదాహరణకు మొకామ్‌-ఏ-కూహి స్వరాన్ని రాత్రి తొలిజాము లోపల పాడేయాలి. ఆ తర్వాత పాడకూడదు. కొన్ని సాయంత్రాలు మాత్రమే పాడాలి’ అంటుంది ఇర్ఫానా. ఈ అమ్మాయిల తల్లిదండ్రులందరూ వీరి పాటకు సమ్మతించారు. కొందరు మొదట ‘ఆడపిల్లలకు పాటలా’ అని అన్నా తర్వాత ఈ బృందానికి వస్తున్న పేరును ప్రోత్సహిస్తున్నారు. ‘మా దగ్గర నిన్నమొన్నటి వరకూ సొంత వాయిద్యాలు లేవు. కాని మా కచ్చేరీలు మొదలయ్యాక వచ్చిన డబ్బుతో వాటిని కొనుక్కున్నాం. అందుకు దాదాపు లక్ష రూపాయలు అయ్యింది’ అంది ఫర్హానా.

యూనివర్సిటీలోనూ
కశ్మీర్‌ యూనివర్సిటీలో సంగీత వాయిద్యాల శాఖ ఉంది. ఫర్హానా అక్కడ సంతూర్‌ వాయిద్యం లో శిక్షణ కోసం చేరినప్పుడు ఆ అమ్మాయితో పాటు మరొక్క అమ్మాయి మాత్రమే ఆ కోర్సులో ఉంది. వాయిద్యాలన్నీ అక్కడ దుమ్ము పట్టి కనిపించేవి. ఇవాళ వీరికి వచ్చిన పేరు చూసి వాయిద్యాలు నేర్చుకోవడానికి చేరుతున్న ఆడపిల్లల సంఖ్య పెరిగింది. ‘మేము యూనివర్సిటీలో నేర్చుకుంటున్నాం. ఇంటికి వచ్చి సంప్రదాయబద్ధంగా గురువు దగ్గరా నేర్చుకుంటున్నాం. సంగీతం నేర్చుకోవడం ఆషామాషీ కాదు. తాళం పట్టాలి’ అంటారు ఈ అమ్మాయిలు. ‘కశ్మీర్‌లో ఆధునిక పోకడలు ఏనాడో మొదలయ్యాయి. కళ, సాంస్కృతిక రంగాలలో చాదస్తాలు తగ్గాయి. కశ్మీర్‌లో కళా వికాసం జరుగుతోంది. ప్రోత్సాహం దక్కితే మాలాంటి అమ్మాయిలు ఇంకా చాలా చేయడానికి సిద్ధంగా ఉన్నాం’ అంటోంది ఈ బృందం.

‘వికసించే పూలు’ బృందానికి ముఖ్య నగరాల నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి. లాక్‌డౌన్‌ లేకపోతే వారు మరింతగా వినిపించి ఉండేవారు. తెలుగు నగరాల్లో కూడా వీరిని చూస్తామని ఆశిద్దాం.
- సాక్షి ఫ్యామిలీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement