నాన్నా... నను కన్నందుకు కృతజ్ఞతా వందనాలు | Sakshi Special Story On Fathers Day 2022: | Sakshi
Sakshi News home page

Father's Day 2022: నాన్నా... నను కన్నందుకు కృతజ్ఞతా వందనాలు

Published Sun, Jun 19 2022 4:50 AM | Last Updated on Sun, Jun 19 2022 7:51 AM

Sakshi Special Story On Fathers Day 2022:

నీ గుండె నా లేత పాదాలకు పరిచిన తొలి మెత్తటి రహదారి...
నీ చిటికెన వేలు నా చిట్టి గుండెకు దొరికిన తొలి దిలాసా...
నీ వీపు నేనధిరోహించిన తొలి ఐరావతం...
నా మూడు చక్రాల బండితో పరుగెత్తి నిను ఓడించినదే నేను గెలిచిన తొలి రేస్‌...
నీ కావలింత నా కన్నీళ్లకు స్టాప్‌బటన్‌...
నువ్వే నా ఫస్ట్‌ బెస్ట్‌ ఫ్రెండ్‌.


నాన్నా...
నా గురించి తప్ప నీ గురించిన చింత నీకు లేదు.
ఏడ్పించే లోకాన్ని గుమ్మం బయటే వదిలి గడపలో విజేతగా నా కోసం అడుగుపెడతావు.
నువ్వే కదా నా ఫస్ట్‌ సూపర్‌స్టార్‌.
నాన్నా... గుర్తుకొస్తున్నావు. నాన్నా... నిను చూడాలని
ఉంది. నాన్నా... నీ పాదాలు తాకి నీతో కాసేపు కబుర్లు చెప్పాలని ఉంది.
నాన్నా... నీ గొప్పతనం గురించి గొంతు పెగుల్చుకుని నాలుగు ముక్కలు మాట్లాడాలని ఉంది.
నాన్నా... నను కన్నందుకు కృతజ్ఞతావందనాలు.


నాన్నా...
నేను పుట్టినప్పుడు నువ్వు పడ్డ ఆరాటం గురించి అమ్మ చాలాసార్లు చెప్పింది. ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్‌ను తోడు పిలుచుకున్నావట. సులభంగా కాన్పు జరుగుతుందన్నా సిజేరియన్‌ అవసరం అవుతుందేమోని తెగ అప్పు చేసి డబ్బు పెట్టుకున్నావట. తొలికాన్పు మా బాధ్యత నాయనా అని తాతయ్య చెప్పినా, కాదు... నాకు పాప పుట్టినా బాబు పుట్టినా నా రెక్కల కష్టంతోటే భూమ్మీదకు రావాలని పుట్టింటికి పంపకుండా వాళ్లనే అమ్మ దగ్గరకు రప్పించావట. నాన్నా... ఆ కంగారులో నువ్వేం చేశావో తెలుసా. మార్చి నెల ఎండల్లో నేను పుడితే ఆ వెంటనే బజారుకు వెళ్లి ఉన్ని టవలు, ఉన్ని స్వెటరు తీసుకొచ్చావ్‌. అందరూ భలే నవ్వారటలే. అవి ఇంకా నా దగ్గర ఉన్నాయి.

నీ లీలలు ఇంకా విన్నాను. నాకు టీకాలు వేస్తే నువ్వు ఏడ్చేవాడివట. జ్వరం వస్తే అమ్మను అస్సలు నమ్మకుండా సిరప్‌ను నువ్వే కొలత పెట్టి తాపించేవాడివట. ‘నువ్వు పడుకో’ అని అమ్మకు చెప్పి రాత్రంతా మేలుకునేవాడివట. ‘దొంగముఖమా... అన్నీ ఆయన చేత చేయించుకుని మాటలు వచ్చిన వెంటనే మొదటిమాటగా నాన్నా అనే పిలిచావు’ అని అమ్మ ఇప్పటికీ భలే ఉడుక్కుంటుందిలే. అమెరికాలో ఉన్నా కదా. నువ్వు ఊళ్లో ఉన్నావు. అందుకే నువ్వు ఉన్నట్టుగానే ‘నాన్నా’ అని చిన్నప్పుడు పిలిచినట్టు పిలుస్తుంటాను. నీ మనవడు పరిగెత్తుకొని వస్తాడు.. అచ్చు నీ పోలికలతో. నాన్నా... నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు నిజంగా తెలుసా. ఈ కూతురు ఎప్పుడూ నాన్న కూతురే. హ్యాపీ ఫాదర్స్‌ డే నాన్నా.

నాన్నా...
ఐదో క్లాసులో మొదటిసారి నువ్వు నా మీద కోప్పడ్డావు. యూనిట్‌ టెస్ట్‌లో మార్కులు సరిగా రాలేదని ‘ఏంట్రా ఈ మార్కులు’ అన్నావ్‌. నాలుగు దెబ్బలు వేసినా బాగుండేది. కాని నేను గెలిచి డబ్బాలో దాచిన గోలీలన్నీ విసురుగా లాక్కుని బయటకెళ్లిపోయావ్‌. ఏడ్చి ఏడ్చి నిద్రపోయాను. తెల్లారి అమ్మను అడిగితే ‘ఆ గోలీలన్నీ మీ నాన్న పారేసి వచ్చాడు’ అని చెప్పింది. మళ్లీ ఏడ్చాను. వాటిలో గోధుమ రంగు గోలీలంటే నాకు ఇష్టం. నీతో నేను మాట్లాడలేదు. అలిగాను. నువు పలకరించినా ముఖం తిప్పుకున్నాను. నన్ను తిడతావా అని నీ మీద కోపంతో చదివాను. రోజూ ఎక్కువ ఎక్కువ చదువుతుంటే నువ్వు చాల్లే పడుకో అన్నా వినలేదు. వారం తర్వాత నువ్వు ఒకరోజు ఆఫీసు నుంచి తొందరగా వచ్చావ్‌.

నన్ను సైకిల్‌ మీద కూచోబెట్టుకుని స్వీట్‌స్టాల్‌కు తీసుకెళ్లి గులాబ్‌ జామూన్‌ తినిపించావ్‌. ‘చాలా బాగా చదువుతున్నావ్‌’ అని ముద్దు పెట్టి పెన్ను కొనిచ్చావ్‌. ‘ఆడుకో. వద్దనను. కాని చదువును మర్చిపోయి కాదు’ అని ఇంటికి తీసుకు వచ్చావ్‌. ఆ తర్వాత నువ్వు చేసిన పని ఇవాళ్టికీ తలుచుకుంటా తెలుసా. అటక దగ్గర కుర్చీ వేసుకుని పైన దాచిన నా గోలీల డబ్బా తీసి ఇచ్చావ్‌. ఆటలో గోలీలతో పాటు చదువులో మార్కులు గెలవడం నేను నేర్చానంటే నీ వల్లే నాన్నా. ఇవాళ ఇంత పెద్ద ఉద్యోగం నీ వల్లే. నా అకౌంట్లో లక్షలు ఉన్నాయి. కాని నీ డబ్బులతో ఇవాళ మళ్లీ గులాబ్‌ జామూన్‌ తినాలని ఉంది. బయట కారులో వెయిట్‌ చేస్తున్నా. షర్ట్‌ వేసుకుని రా. హ్యాపీ ఫాదర్స్‌ డే.

డాడీ...
నేను ఇంటర్‌లో ఉన్నప్పుడు కాలేజీ నుంచి ఇంటికొస్తుంటే ఎవడో కుర్రాడు ఏదో కాయితం చేతిలో పెట్టి పారిపోయాడు. అదేమిటో కూడా చూడకుండా, వణికిపోయి, ఏడ్చుకుంటూ ఇంటికొస్తే అప్పుడే నువ్వు బయటి నుంచి వచ్చి ముఖం కడుక్కుంటున్నావు. ‘ఏంటమ్మా... ఏంటమ్మా’ అని దగ్గరకు తీసుకున్నావు. అమ్మ కంగారు పడుతుంటే అరిచి కూల్‌గా విషయం తెలుసుకున్నావు. నా చేతిలోని లెటర్‌ చూసి ‘ఇదా... లవ్‌ లెటర్‌’ అన్నావు. ‘కాలేజీల్లో ఇలాంటివి జరుగుతుంటాయమ్మా. పట్టించుకోకూడదు’ అని ఎంత కూల్‌గా అన్నావో తెలుసా. ఆ తర్వాత ఆ అబ్బాయిని కలిసి ఫ్రెండ్లీగా మాట్లాడావని, ఆ అబ్బాయి సారీ చెప్పాడని నువ్వు చెప్పినప్పుడు పెద్ద రిలీఫ్‌.

అమ్మ నాకు అన్నింటిలో గైడ్‌ చేస్తున్నా నువ్వు ఎన్ని మంచి మాటలు చెప్పేవాడివి. ఫిజికల్‌గా, మెంటల్‌గా వచ్చే మార్పుల గురించి, ఆపోజిట్‌ సెక్స్‌ను చూసినప్పుడు వచ్చే అట్రాక్షన్‌ గురించి, ఎమోషన్స్‌ గురించి ఎంతో వివరించేవాడివి. మెచ్యూర్డ్‌ వయసు, చదువు వచ్చే వరకు వీటిని ఫేస్‌ చేస్తూ తప్పులు, పొరపాట్లు చేయకుండా ఉండాలని చెప్పావ్‌. మగవారితో ఏమైనా సమస్యలు వస్తే ముందే నీకు చెప్పేంత స్నేహం, చనువు నాకు ఇచ్చావు. నా పెళ్లి నా చాయిస్‌కే వదిలి కేవలం సలహాలు ఇచ్చావు తప్ప బలవంతం చేయలేదు. నువ్వు నా చేతిలో ఎప్పుడూ కంపాస్‌బాక్స్‌లా ఉన్నావు డాడీ. ఐ హానెస్టీ›్ల లవ్‌ యూ. హ్యాపీ ఫాదర్స్‌ డే.

అబ్బా...
నా జీవితంలో చాలా రోజుల పాటు నాదే మార్గమో తెలుసుకోలేదు. కానీ మీకు మాత్రం తెలుసు– మీది మీ కొడుకును సపోర్ట్‌ చేసే మార్గం అని. ఇంటర్‌ ఫెయిల్‌ అయ్యాను. పర్లేదు నేనున్నాగా అన్నారు. బిఎస్సీ చేరి ఒక సంవత్సరం చదివి బి.కామ్‌కు మారేను. పర్లేదు సరే అన్నారు. ఎం.బి.ఏ చేస్తానంటే ఫీజు కట్టారు. కాదు సి.ఏ చేస్తానన్నాను. ఆ ఫీజు వదిలి మళ్లీ దీని ఫీజు కట్టారు. ఒక్కరోజు తిట్టలేదు. కొట్టలేదు. హర్ట్‌ చేయలేదు. నేను కూడా మీరున్నారన్న ధైర్యంతోనే ఎన్నో ఎక్స్‌పెరిమెంట్లు చేశాను. ‘నేనున్నాగా’ అనే మీ మాట.

ఒక తండ్రి నుంచి పిల్లల మంచి కోసం వచ్చే ఆ మాట పిల్లలకు ఎంత బలం ఇస్తుందో. నేను డిగ్రీ పాసైనప్పుడు నాకు ఇష్టమైన హీరో సినిమా ఊళ్లో ఉందని అమ్మీతో పాటుగా మీరు మొదటిసారి నాతో సినిమాకు వచ్చారు. ‘ఎవర్రా ఆ హీరో’ అని హీరోను మెచ్చుకున్నారు. మొన్న ఆ హీరో నా ఆఫీస్‌కు వచ్చాడు అబ్బా... నాకు ఆడిటర్‌గా ఉంటారా అని. నువ్వే గుర్తుకొచ్చావు. లెక్కా, జమా చూడటంలో నన్ను మించినవాడు లేడు అబ్బా. కానీ నీ ప్రేమ లెక్కా జమాను మాత్రం చూడలేకపోతున్నాను. ఐ లవ్‌ యూ అబ్బా.

నాన్నా...
‘ఒరేయ్‌.. ఒక చిన్న గదిలో ఉండి మీ నలుగురిని సాకానురా’ అని నువ్వు అనేవాడివి. నాకేం పట్టేది కాదు. నా లోకం నాది. నా చదువు నాది. నువ్వు పాకెట్‌ మనీ ఇస్తే దానిని దాచుకుని, నా దగ్గర ఉన్నా, నువ్వు ఒక్కోసారి చిల్లర కోసం అవస్థ పడుతుంటే నీకివ్వకుండా చోద్యం చూస్తుండేవాడిని. అంత స్వార్థం నాది. పెళ్లి చేసుకుని మళ్లీ ఇంటి వైపు చూళ్లేదు. అమ్మను, నిన్ను నా దగ్గర నాలుగు రోజులు ఉంచుకోలేదు. నేనే చుట్టపు చూపుగా వచ్చి వెళ్లేవాణ్ణి.

నాతో కలిపి నీ నలుగురు పిల్లలు మా వల్ల కాదంటే మా వల్ల కాదంటూ మిమ్మల్ని ఇవాళ ఓల్డ్‌ ఏజ్‌ హోమ్‌కు పంపారు. ప్రేమ పంచడం మీ బాధ్యత. పొందడం మా హక్కు అన్నట్టు ఉండేవాణ్ణి. కాని ఇంటర్‌కు వచ్చిన నా కొడుక్కి అచ్చు నా పోలిక వచ్చింది నాన్నా. నాకు భయంగా ఉంది.  నా కొడుకు నన్ను ఉత్త ఏటిఎం మిషన్‌లా చూస్తున్నాడు. మీరు మా ఇంటికి వచ్చి, నాతో ఉండిపోయి, నన్ను నిజమైన నాన్నను చేయండి. నేను నిజమైన కొడుకులా మారనివ్వండి. ఈ ఫాదర్స్‌ డే రోజున ఈ వేడుకోలు ఇదే నాన్నా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement