ఇల్లు కట్టాలంటే ముందుగా చేతినిండా దండిగా డబ్బు ఉండాలి. అప్పుడే కలల ఇంటిని నిర్మించగలం. దీనికి సిమ్మెంట్, ఇటుక, ఇసుక తదితరాలు లేకుండా ఇంటి నిర్మాణమే మొదలవ్వదు. నిజానికి ఇప్పుడు, సిమ్మెంట్, ఇటుకలు ధరలు ఏ రేంజ్‌లో ఉన్నాయో మనకు తెలిసిందే. ఇక అందులో ఇసుకను కొనడం ఒక ఎత్తు తరలించేందుకు మరింత డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది. ఓ ఇంటి నిర్మాణానికి చాలా ఇసుక కావాల్సి ఉంటుంది. అలా ఇసుకు అవసరమే లేకుండా ఇల్లునే కట్టేయొచ్చట. ఎలాగంటే..
సహజ ఇసుకకు బదులుగా నిర్మాణాలకు ఉపయోగపడేలా ఓ సరికొత్త మెటీరియల్‌ను భారతీయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) శాస్త్రవేత్తలు నిర్మాణాలకు అవసరమయ్యే సహజ ఇసుక స్థానంలో కొత్త మెటీరియల్‌ను రూపొందించారు. నిర్మాణ పరిశ్రమలో అత్యంత కీలకమైన ఇసుక కొరత కారణాల దృష్ట్యా ఈ ఆవిష్కరణ జరిగింది.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ టెక్నాలజీస్ (సీఎస్‌టీ)లోని ఒక బృందం పారిశ్రామిక వ్యర్థ వాయువులలో సేకరించిన కార్బన్ డయాక్సైడ్ (CO2) ఉపయోగించి కొత్త పదార్థాన్ని అభివృద్ధి చేసింది. తవ్విన మట్టి, నిర్మాణ వ్యర్థాలను కార్బన్ డయాక్సైడ్‌తో శుద్ధి చేసి ఇసుకకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చని నిర్థారించారు.
ఈ కొత్త మెటీరియల్ నిర్మాణాల కారణంగా ఏర్పడే పర్యావరణ ప్రభావాన్ని తగ్గించి, నిర్మాణ నాణ్యతను మెరుగుపరుస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఆవిష్కరణకు అసిస్టెంట్ ప్రొఫెసర్ సౌరదీప్ గుప్తా నాయకత్వం వహిస్తున్నారు. దేశంలోని జీరో కార్బన్ లక్ష్యాలకు అనుగుణంగా తక్కువ కార్బన్ ప్రిఫ్యాబ్రికేటెడ్ బిల్డింగ్ ఉత్పత్తులను తయారు చేసే సాంకేతికతను అభివృద్ధి చేశామని సౌరదీప్ గుప్తా పేర్కొన్నారు. సాధారణంగా నిర్మాణ రంగాల్లో మట్టికి కార్బన్ డయాక్సైడ్‌ని ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది.
కానీ ఇసుక బదులుగా వాడే ఈ ప్రత్యేక మెటీరియల్ సిమెంట్, సున్నం మధ్య చర్యను మెరుగుపరుస్తుంది. ఈ ఆవిష్కరణ విజయంవంతం అయితే.. ఎంతో మందికి మేలు జరుగుతుంది. ఇసుక, కంకర, చువ్వ వీటికే లక్షలు ఖర్చు అవుతాయి.. పైగా రెండు పడకల గదుల ఇళ్లు నిర్మించాలంటే కనీసం 30 టన్నుల ఇసుక అవసరం ఉంటుంది. ఈ ఆవిష్కరణతో ఇసుకకు ప్రత్యామ్నాయం వస్తే ఖర్చు తడిసిమోపడవ్వడం తగ్గుతుంది. ఎకో ఫ్రెండ్లీగా మంచి ఇంటిని నిర్మించుకోవచ్చు కూడా.
(చదవండి: ఆయుష్షులో సెంచరీ కొట్టి.. గిన్నిస్ రికార్డు కెక్కిన వృద్ధుడు!)
Comments
Please login to add a commentAdd a comment