తదేక దీక్షతో అక్షరాలు కూర్చుతున్న సంజన చట్లాని
రోలెక్స్, ది రిట్జ్ కార్ల్‌టన్, ఫ్యూచర్ గ్రూప్, గూచి, లూయీ వ్యుట్టన్, మిఖాయిల్ కోర్స్, జిమ్మీ చూ, గూగుల్ ఇండియా, ది వెడ్డింగ్ ఫిల్మర్, టాటా జోయా... ఇలా ఎన్నో ఎన్నెన్నో కంపెనీలు. ఈ పేర్లతోపాటు ఆయా కంపెనీల అక్షరరూపం కూడా కళ్ల ముందు మెదిలి తీరుతుంది.
ఆ ఆక్షరాలకు ఓ రూపం పురుడు పోసుకున్నది మనదేశంలోనే. ఆశ్చర్యమే కాదు ఒకింత గర్వంగానూ ఉంటుంది మరి. ఈ అక్షరాల రూపకర్త పూనాకు చెందిన సంజన చత్లాని. ఆమె తన జీవితాన్ని అక్షరాలా అక్షరాలతోనే దిద్దుకుంది. తన కెరీర్‌ను తానే అందంగా రాసుకుంది.
నిస్తేజం నుంచి ఉత్తేజం
అది 2015 ఆగస్టు. సంజన చట్లాని కాలేజ్ నుంచి సమాజంలోకి అడుగుపెట్టిన తొలినాళ్లు అవి. ఓ కార్పొరేట్ కంపెనీలో మార్కెటింగ్ అసిస్టెంట్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించింది. మూడున్నరేళ్ల ఉద్యోగ జీవితం ఆమెకు ఏ మాత్రం సంతృప్తినివ్వలేదు. అంతటి నిస్పృహలోనూ ఆమెకు సాంత్వన చేకూరుతున్న విషయం ఒక్కటే.
కుటుంబంతో యూఎస్‌కి వెళ్లినప్పుడు లాస్ ఏంజెల్స్, శాన్ ఫ్రాన్సిస్‌కోలో జరిగిన కాలిగ్రఫీ క్లాసులకు హాజరైంది. అప్పుడు నేర్చుకున్న కాలిగ్రఫీలో తోచిన నాలుగు అక్షరాలు రాసుకున్నప్పుడు మనసు ఆనందంగా ఉంటోంది. ‘తనను ఆనందంగా ఉంచని ఉద్యోగంలో కొనసాగడం కంటే తనకు సంతోషాన్నిస్తున్న కాలిగ్రఫీలోనే జీవితాన్ని వెతుక్కుంటే తప్పేంటి’ అనుకుంది సంజన. ఉద్యోగం మానేసి ముంబయిలో ఒక చిన్న గదిలో ‘ద బాంబే హ్యాండ్ లెటరింగ్ కంపెనీ’ సంస్థను స్థాపించింది.
సాధనేలోకం
సంజన సొంతంగా కంపెనీ స్థాపించిన తర్వాత ఆర్డర్‌ల కోసం ప్రయత్నించలేదు. అక్షరాలను అందంగా రాయడం అనే ప్రక్రియను సాధన చేయడానికే ఎక్కువ సమయం కేటాయించింది. ప్రపంచవ్యాప్తంగా జరిగే కాలిగ్రఫీ వర్క్‌షాపులకు హాజరయ్యేది. తిరిగి వచ్చిన తర్వాత స్టూడియోలో కూర్చుని ప్రాక్టీస్ చేస్తూ టైమ్ మర్చిపోయేది. అలా రోజుకు పన్నెండు గంటల సేపు స్టూడియోలోనే గడిపిన రోజులున్నాయి. ఆ అలవాటు ఆమె కెరీర్‌లో బిజీ అయిన తర్వాత అంత నిడివి స్టూడియోలో పని చేయడానికి దోహదం చేసింది.
ఇప్పుడు ఆమె క్లయింట్ల జాబితాలో ప్రపంచంలో అనేక ప్రఖ్యాత కంపెనీలున్నాయి. ఇంతగా పేరు వచ్చేసింది కదా అని కూడా ఆమె రిలాక్స్ కావడంలేదు. ఆర్డర్‌ల పని పూర్తయిన తర్వాత రోజుకు కనీసం మూడు గంటల సేపు అక్షరాలను కొత్తగా రాయడానికి ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. మొదట్లో బిజినెస్ ఆర్డర్స్ లేని రోజుల్లో సంజన దీపావళి శుభాకాంక్షల గ్రీటింగ్ కార్డ్స్ రాసి స్నేహితులకు, బంధువులకు పంపించేది. ఆ గ్రీటింగ్ కార్డులు అందుకున్న వారి ప్రశంస లు నోటిమాటగా ప్రచారం కల్పించాయి. ఇప్పుడు మనదేశంలో అత్యుత్తమ కాలిగ్రఫీ ఆర్టిస్టుల్లో ఆమె ఒకరు.
ఆటిజమ్‌కి ఔషధం
సంజన ఇప్పుడు మనదేశంలో సామాన్యులకు కూడా కాలిగ్రఫీ గురించి తెలియచేయాలనే సంకల్పంతో పని చేస్తోంది. కాలిగ్రఫీ సాధన చేయడం ద్వారా ఆటిజమ్ నుంచి బయటపడవచ్చని, ఆటిజమ్ పిల్లలకు ఉచితంగా వర్క్‌షాపులు నిర్వహిస్తోంది. కాలిగ్రఫీ నేర్చుకోవడానికి జీవితకాలం సరిపోదని, ఎన్ని రకాలుగా సాధన చేసినా ఇంకా ఎన్నో మిగిలిపోయి ఉంటాయని చెప్తోంది. రానున్న ఏడాది జనవరిలో ఆమె యూకేలో మూడు నెలల అడ్వాన్స్‌డ్ స్టడీ కోసం వెళ్తోంది. అంతటి అంకితభావంతో పని చేస్తుంటే... విజయం వారిని నీడలా వెంటాడుతుంది.
సంజన చట్లాని
Comments
Please login to add a commentAdd a comment