
చెప్పొద్దు గానీ, నీకు గర్వంగా అనిపించడం లేదూ? నువ్వు కంప్లైంట్ చెయ్యాల్సిందే’ చంద్రిక చేచి ఒత్తిడి చేసింది. కంప్లైంట్? నేనా? సమస్యలేమీ రావా? చంద్రిక చేచి రూల్స్ గురించి వివరించింది.
ఈ మెట్లు నావి కావు. ఈ వరండా, దూలాలు, బిల్డింగ్, వాకిలి, ఈ దారి, ఈ మైదానం, ఈ లాబర్నమ్ చెట్టు, పుస్తకాలు, ఉపాధ్యాయులు, ఇవేవీ కూడాను. వీరెవరునూ నన్ను వాళ్లకు సంబంధించిన ఆత్మీయ వ్యక్తిగా భావించరు.
చంద్రిక చేచి చెప్పింది నిజమే. ప్రతి మెట్టు మీద కాసేపు నిలబడి బాధపడటం, తిరిగి ఒక్కొక్క మెట్టు దిగడం. నా శాండిల్స్ ధూళితో కప్పబడి వున్నాయి. అరికాళ్లు చెమటతో తడిసిపోయాయి. మడమలు చీలిపోయి పచ్చి పుండ్లయ్యాయి. ‘వన్ లాక్ హౌసింగ్ కాలనీ’కి, కాలేజీకి మధ్య చాలా దూరం. ఊపిరి తీసుకోకుండా అంత దూరాన్ని చెరిపేస్తూ, పరుగు పరుగున ఈ మెట్ల దగ్గరికి వచ్చాను. పురాతనమైన ఈ మెట్ల చివర సంభ్రమాశ్చర్యంతో ఒక పురుగులా నిలబడిపోయాను. నా తండ్రి, తల్లి, సోదరులు, ఈ ఆడంబరమైన మెట్లను చూడనే లేదు. నా ఆశ్చర్యం వారిది కూడా.
కొద్ది సమయం క్రితం, అడ్మిషన్ కమిటీ ముందు నిలబడి ఫిర్యాదు పత్రం అందజేశాను. కమిటీలో పదకొండుగురు సభ్యులుగా వున్నారు. వారంతా అర్ధచంద్రాకారంలో కూర్చున్నారు. సాధారణంగా ఏ విషయం మీద కూడా నాకు ఫిర్యాదులుండవు. నిజానికి చంద్రిక చేచి ‘నీ కన్యాయం చేశారు వాళ్లు. తప్పనిసరిగా నువ్వు ఫిర్యాదు చేయాల్సిందే’నంటూ రెచ్చగొట్టింది. చంద్రిక చేచి న్యూస్ ఏజెంట్.
తెల్లవారక ముందే నేను వాకిలి ఊడుస్తుండగా న్యూస్ పేపర్ల కట్టలను సైకిల్‌పై పెట్టుకొని చంద్రిక చేచి హుషారుగా పోవడం చూస్తూ వుంటాను. సైకిల్ దిగకుండానే ఒక కాలు నేలకు ఆనించి నాతో పిచ్చాపాటీ మాట్లాడుతూ ఉంటుంది. వంగి ఊడుస్తున్న నేను నిటారుగా నిలబడి చేతిలో వున్న చీపురును సరిచేస్తూ, చీపురు అడుగు భాగాన్ని అరచేతి మధ్యలో కొట్టి పుల్లలను లెవెలింగ్ చేస్తూ, నేనూ ఉబుసుపోక కబుర్లు పెట్టేదాన్ని. చంద్రిక చేచినే నా ‘సీనియర్ స్కూల్ లివింగ్ సర్టిఫికెట్’ రిజల్ట్స్ అడ్వాన్స్‌గా చెప్పింది. ఫలితాల్లో నాకు డిస్టింక్షన్ వచ్చిందని చెప్పింది కూడా తనే. కాలేజీ నుండి అడ్మిషన్ ఫారం తెచ్చి, నింపి నాతో సంతకం చేయించి, దాఖలు చేసి, కాలేజీలో ర్యాంక్ లిస్టు చూసి, వచ్చిన ఫలితాలు కూడా చెప్పింది. నా పేరు మెరిట్ లిస్టులో కాకుండా, రిజర్వేషన్ లిస్టులో వుందని చెప్పి ఒక కల్లోలం సృష్టించింది తానే. ఈ విషయంలో నేనెంతో మథనపడ్డాను. మెరిట్ లిస్ట్ ఏమిటి? రిజర్వేషన్ లిస్ట్ ఏమిటి? నా బుర్రలో ఒకటే ఆలోచన. లిస్టు ఎటువంటిదైనా సరే నా పేరుందా లేదా? నాకు కావలిసింది కాలేజీలో అడ్మిషన్. బతుకుదెరువు కోసం పరాయి వాళ్ల ఇంటి వాకిళ్లు ఊడ్చే పని వదులుకొని, ఈ చీపురును అవతల పారేసి నేరుగా ఆ కాలేజీ మెట్లు ఎక్కడమే నాకు కావాల్సింది. ‘దరిద్రం మొహమా’ చంద్రిక చేచి గట్టిగా అరిచింది. ‘నువ్వు ఇక మారవు’ అంది. పిచ్చెక్కినట్లు నాపై కేకలు వేసింది. ఇక మారు మాట్లాడకుండా సైకిలెక్కి పెడల్ తొక్కుకుంటూ ట్రింగ్, ట్రింగ్ మని ఆపకుండా బెల్లు మోగించుకుంటూ వెళ్లిపోయింది. ఏమైనా మాట్లాడే విషయాలు మిగిలివుంటే న్యూస్ పేపర్లు పంచి పెట్టిన తరువాత వచ్చి పూర్తి చేస్తుంది. అందుకే త్వరత్వరగా వాకిలి ఊడ్చి, అంట్లు తోమి, ఇల్లంతా కడిగి శుభ్రం చేసి, చేతుల్ని స్కర్ట్‌కు తుడిచి, పొడిగా చేసుకొని ఆమె కోసం వేచి చూస్తున్నాను.
‘చెప్పొద్దు గానీ, నీకు గర్వంగా అనిపించడం లేదూ? నువ్వు కంప్లైంట్ చెయ్యాల్సిందే’ చంద్రిక చేచి ఒత్తిడి చేసింది. కంప్లైంట్? నేనా? సమస్యలేమీ రావా? చంద్రిక చేచి రూల్స్ గురించి వివరించింది. ‘అడ్మిషన్ కమిటీ రూల్స్‌ను అతిక్రమించింది. నీకు న్యాయం అక్కర్లేదా?’ న్యాయం తమకు జరగకూడదని ఎవరైనా ఆశిస్తారా? కానీ అందరిలా కాకుండా నేను జాప్యం చేస్తూ వచ్చాను. చంద్రిక చేచి కోపంతో ఊగిపోయింది. నాతో తగవు పెట్టుకొని చిర్రుబుర్రులాడుతూ వెళ్లిపోయింది. తిరిగి వచ్చింది. మాట్లాడింది. మళ్లీ వెళ్లిపోయింది. కమిటీ ద్వారా నాకు అన్యాయం జరిగిందని నాకు అర్థమయ్యే వరకు రుసరుసలాడుతూనే వుంది. అన్యాయం జరిగిందని తెలుసుకున్నాక చాలా బాధపడ్డాను. జనరల్ మెరిట్ లిస్టు, ఒక సోదర భావంతో కూడుకున్న నిర్ణయం– మరి, అధిక మార్కులు సాధించిన నన్ను సోదర సమూహం నుండి ఎందుకు వెలివేసినట్లు. వారిలో ముందు వరసలో నేనొకరిగా ఉండవలసింది.
చంద్రిక చేచి చెప్పింది– మార్క్స్ ఆధారంగానే కాదు, ఇతర విషయాలు కూడా చాలా వున్నాయి లెక్కలోకి తీసుకోవడానికి. ఇతర విషయాలా? ఏమిటవి? వంశం, కులం, మతం, రంగు, భాష, దుస్తులు. ఫిర్యాదు చేయాల్సిందేనన్న భావం గట్టి పడింది. నేనెంత భయస్తురాలినైనా లెక్కచేయను. ఫిర్యాదు చేసి తీరుతాను. ఇదంతా చంద్రిక చేచి వెయ్యిసార్లు నాలో స్వాభిమానం లేనందుకు నన్ను దుమ్మెత్తి పోయడంతో చివరికి కాలేజీకి, ‘వన్ లాక్ హౌసింగ్ కాలనీ’కి మధ్య దూరాన్ని సాధించాల్సిందేనని నిర్ణయించుకున్నాను. చంద్రిక చేచి ఈ విషయంలో సహాయం చేయ నిరాకరించింది. ‘కాలేజీ విద్యార్థులు న్యూస్ ఏజెంట్ల ద్వారా కంప్లైంట్లు చేయరు’ అంటూ వాదించింది. ‘ఎదురు తిరుగు. నువ్వే సొంతంగా రాసి వెళ్లి కంప్లైంట్ చెయ్యి.’అందుకే కంప్లైంట్ నేనే స్వయంగా రాశాను. చదివిన తర్వాత అడ్మిషన్ కమిటీ నా వైపు చూసి, ‘ఆశ్చర్యం, ఇటువంటి ఫిర్యాదు వుందా నీ దగ్గర’ అన్నట్లు చూసింది. నాకు గుర్తుంది, చంద్రిక చేచి హెచ్చరిక: సాహిబ్‌ను చూడగానే నెర్వస్‌నెస్‌తో నువ్వు తప్పక తడబడే అవకాశముంటుంది. ఆమె చెప్పింది వాస్తవం. అలాంటి సమయం మొదలయ్యింది. ఒక సభ్యుడు– ‘ఇలాంటి ఫిర్యాదు రాయకుండా వుండాల్సింది’ అన్నాడు. ‘నీకెంత ధైర్యం, ఇలా చేసి ఈ కాలేజీలో నీ చదువు సాగించగలననుకున్నావా? చివరికి, మేమే నీకు చదువు చెప్పేది. మా మొహంలో సూటిగా చూడగలవా? ఇంతకీ నిన్ను రెచ్చగొట్టింది ఎవరు?’
కమిటీ సభ్యులు, వారి ద్వారా తప్పయిందా? అన్న భావనను, సానుభూతి చూపుతున్నట్లు నటిస్తూనే, ఈ ర్యాంక్ పిచ్చిలో అమాయకంగా ధైర్యం చేశావు అన్న భయాన్ని నాలో కలిగిస్తూ, ఏదైతే జరిగిందో అంతా సవ్యంగానే జరిగింది అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. కానీ, వారు ఒక అశాంతికి గురవుతున్నారనేది నాకు స్పష్టంగా తెలుస్తున్నది. ‘మెరిట్ లిస్టా? రిజర్వేషన్ లిస్టా? అన్నది ముఖ్యమా? ముఖ్యమైన విషయమేమిటంటే నీకు అడ్మిషన్ దొరికింది. అది చాలదూ?’ అని సభ్యులడిగారు.
ఏదైతే జరుగుతుందో అది సరిగా జరగడం లేదన్న విషయం అర్థమవుతోంది. నోట మాట రాక, చలనం లేకుండా అలా నిల్చుండిపోయాను. అడ్మిషన్ కమిటీ ముందు నేను ఎల్‌సీ పరీక్షలో మార్కులు అధికంగా సాధించిన టాప్ ర్యాంకర్‌నని, విజేతనని గర్వంగా నన్ను చూపదల్చుకోవడం నా కోరిక కాదు.
కేవలం ఈ ఒక్క అంశం బలం మీద గర్వంగా తలెత్తుకొని ఎలా నిలబడగలను? వంశం, కులం, మతం, రంగు, భాష, ధరించే దుస్తులు ఇవన్నీ చూసుకోవాలి. నేనా నల్లగా వుంటాను. వికారంగా వుంటాను. సన్నటి మొహం, శుష్కించిపోయిన కాళ్లు, చేతులు. ఎవరివైపు చూసినా కళ్లు భయం భయంగా, బెదురు చూపులతో వుంటాయి. దుర్వాసన వేసే తలనూనెతో కంపుకొట్టే నెత్తి, సరిగా దువ్వుకోక అడ్డదిడ్డంగా చిట్లిపోయిన చివర్లతో వున్న తలవెంట్రుకలు, గుండెలకత్తుకుంటూ రెండు చేతులతో పట్టుకున్న పుస్తకాలు– అవి కూడా నా శరీర ఆకృతిలో ఒక భాగమే. ఛాతీపై నుంచి చేతులు పక్కకు జరిగితే భయంతో వణికిపోతాను. చేతులు, పెదాలు ఎప్పుడూ నీళ్ల మాదిరి చల్లగా చెమట పోస్తూ వుంటాయి. అర్ధచంద్రాకృతిలో అమర్చిన సింహాసనాల మీద కూర్చున్నట్లు ఎదురుగా వ్యక్తులు. కానీ, క్షితిజం వరకు వ్యాపించి వున్న ఈ గది మధ్యలో నేను కూర్చున్నట్లు, ఏదో నన్ను పట్టుకున్నట్లు, భయపెడుతున్నట్లు ఒక భ్రాంతి...
‘మెరిట్ లిస్ట్‌లో నీది సెకండ్ ర్యాంక్ మాత్రమే. రిజర్వేషన్ లిస్ట్‌లో ఫస్ట్ ర్యాంక్. ఏది మంచిదంటావ్?’
కుట్రపూరితమైన చూపుతో, తియ్యగా మాట్లాడుతూ, ఒకమ్మాయి వైపు కన్నుగీటుతూ నా కంప్లైంట్ వెనక్కిచ్చేశాడు. నేను జవాబిచ్చేలోగానే కమిటీ సభ్యులు తమ చర్చల్లో నా విషయం కూడా అసంకల్పితంగా వచ్చిందన్నట్లు మాట్లాడుకోసాగారు. ‘ఒకవేళ ఈ స్టూడెంట్‌ను రిజర్వేషన్ లిస్టులో పెడితే, మన ఒక విద్యార్థి మెరిట్ లిస్ట్‌లో రాగలడు. ఆ విద్యార్థిని అక్కడి నుంచి కదిలించి ఈ స్టూడెంట్‌ను అక్కడ పెడితే, ఇంకా వేరే విద్యార్థిని తీసేసి మన స్టూడెంట్‌ను...’ సాగుతోంది సంభాషణ.
నా వైపు చూసి జీవం లేని నవ్వు నవ్వి, ‘అంతా సరిపోయింది గదా ఇప్పుడు?’ అని చెప్పాలనుకున్నారు. నా ఫిర్యాదును టేబుల్ అంచుకు తోశారు. వారు చెయ్యాల్సిన పని చాలావుంది అన్నట్లు అందరూ వారి పనుల్లో మునిగిపోయారు. నా విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు. నేను నిలబడ్డ చోటు నుంచి కదలడానికి భయపడ్డాను. అక్కణ్ణుంచి నేను కదిలితే ఫ్లోర్ మీద చెమట, దుమ్ముతో వుండిపోయిన నా అడుగు గుర్తులు చూస్తారు. నా ఫిర్యాదు పత్రాన్ని వెనక్కి తీసుకోవడానికి ముందుకు కదిలినపుడు నన్నెవరూ గమనించకుండా జాగ్రత్తపడ్డాను.
ప్రతిక్షణం చంద్రిక చేచి నా మెదడులో కదలాడుతూనేవుంది. గద్దిస్తూనే వుంది. ‘నా దగ్గరికి రాకు! వూరికే నీ ఏడుపు చూడదల్చుకోలేదు! గట్టిగా మాట్లాడాలి. అలా భయపడితే మనలాంటోళ్లు ఇక్కడ బతకలేరు. కానీ నేను, నా సోదరులు, నా తండ్రి గాని, నా తల్లి గాని, వారి తల్లిదండ్రులు గాని ఎవ్వరూ అంత ధైర్యం చేయలేదు.’
మెట్ల పైనుంచి ప్రొఫెసర్ థేవన్ కళ్లు ఆమెను దగ్గర నుంచి గమనిస్తున్నాయి. ప్రతి మెట్టు మీద దుమ్ము, చెమటతో పడిన ఒక పాదముద్ర ఒక చారిత్రాత్మక రికార్డు. తలవంచుకొని ముందుకు కదిలిపోతున్న ఆ అమ్మాయి నడుస్తున్న చరిత్రకు కొనసాగింపు. ఇలా చరిత్రలో ఎక్కని ప్రధాన సందర్భానికి ప్రతీక. ఈ సందర్భంలో కల్పించుకొని చరిత్రలో నిలిచిపోయే విధంగా చూడటం చరిత్ర ప్రొఫెసర్‌గా ఇది తన బాధ్యత. అతని ఆలోచనలు అంత దూరం వరకు వెళ్లాయి. ఎప్పటిలానే అతని కుడి చెయ్యి సన్నగా వణుకుతోంది. క్షణాలు చారిత్రాత్మకమైనవి అంటే ఆచార్యుల వారికి విషాదంతో శరీరంలో సన్నటి కంపన మొదలవుతుంది. అలా జరగకపోతే అతను జీవించి వుండటం సంభవం కాదు– ఈ చర్య అతనిలోని మేధకు, శరీరానికి మధ్య జరిగే తీవ్రమైన సంఘర్షణకు భావ ప్రకటన. ప్రొఫెసర్ థేవన్‌లోని తీవ్రమైన ఆకాంక్షకు ప్రతిస్పందనగా వున్న, అతని వణుకుతున్న చేయి, మెల్లగా మెట్లు దిగుతున్న ఆ అమ్మాయిని వెనక్కి రమ్మని హెచ్చరించడానికి ఉద్యుక్తమవుతోంది. ఒక్కొక్క మెట్టు దిగుతూ వుంది.
‘ఇప్పుడు నేను త్వరగా దిగి ఆమెతో మాట్లాడాలి’ అని ఆలోచించాడు. ‘నేనేం సహాయం చేయగలనో చూస్తాను అని చెప్పి ఆమెను ఓదార్చాలి.’
ఆమె మెట్లు దిగిపోతూనే వుంది.
మెట్లెక్కి వస్తున్న వాచ్‌మెన్ బాలన్ నాయర్‌ను చూసి ‘ఆమెను వెనక్కి రమ్మని చెప్పాలి’ అని అనుకున్నాడు.
కానీ, మెట్టు మెట్టుగా, చివరి మెట్టు కూడా దిగి వరండా దాటి, మరో వరండా, అలా మూడో వరండా కూడా దాటి పూర్తి చివరంచు వరకు వెళ్లి కనుమరుగయిపోతోంది.
కేవలం చెమటతో తడిసిన తడి పాదముద్రలు వరండాలో అచ్చులా వుండిపోతాయి. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. ఇప్పుడు అతని పూర్తి కుడిచెయ్యి వణికిపోతోంది. తెరవబడిన చరిత్ర పుస్తకంలోకి మెడ విరిగి పడిపోయినట్లు అతని తల ఒరిగిపోతోంది. చెమటతో తడిసిపోయాడు. బూట్ల నుండి తన పాదాలను బయటికి తీసి వాటికి స్వేచ్ఛ కల్పించాడు. కళ్లద్దాలు తీసి కళ్లు రుద్దుకున్నాడు. అతనికి దాహం వేస్తోంది. అల్లం వేసి మరగబెట్టిన నీటిని అతను కోరుకుంటున్నాడు. ఆ క్షణంలో అతని కూతురు నమిత మాటలు అతన్ని చుట్టుముట్టాయి. ‘ఇలా భయపడుతూ వుంటే సమస్యల నుండి విముక్తి కలగదు– కొన్నిసార్లు ఈ భయాలు సమంజసమైనవే కావచ్చు. కానీ, చాలాసార్లు అకారణంగా పుట్టుకొస్తాయి. నాక్కూడా ఈ భయం అనే రోగం వుంది. జన్యువుల ద్వారా నాకు సంక్రమించింది.’
నమిత గ్రహించింది. తాను భయస్తుడని, మడమ తిప్పేవాణ్ణని, సమయానికి నోరు పెగలదని– బస్సులో, షాపింగ్ కాంప్లెక్స్‌లో, పెళ్లి రిసెప్షన్‌లో, ఆఫీసులో, హాస్పిటల్లో, గుళ్లో తాను అన్ని రకాల భయాలకు బాధితుడినని నమిత భావిస్తుంటుంది. చిన్నది, పెద్దది– చీకటి అన్నా, దొంగలన్నా, పోలీసులన్నా, పాములన్నా, దయ్యాలన్నా, చివరికి తన తల్లి అన్నా, దేవుడన్నా భయమే. నువ్వెందుకు భయపడాలి, ఎవరి వల్ల, ఎందువల్ల భయం– నమిత అడుగుతూ వుంటుంది. అతనూ నమ్ముతాడు ఈ భయం అనేది తనకు తన తాత, ముత్తాతల నుండి సంక్రమించిందని. అతి విధేయత చూపుతూ, అరచేతులతో నోళ్లు మూసుకొని, వొంగి వొంగి వుండే వారేమోనని చరిత్ర తెలుపుతోంది. చెమటతో నిండిన ఈ పాదముద్రలు ఏం ఆశిస్తున్నాయో అతనికి తెలుసు. సూటిగా అడ్మిషన్ కమిటీ ముందుకు వెళ్లి వెంటనే ఈ అన్యాయాన్ని ప్రశ్నించమని డిమాండ్ చేస్తున్నాయి. అతను వణుకుతూ తన ముఖాన్ని వంచి టేబుల్– టాప్ మీద ఆనించాడు.
ఆందోళనకు గురైన చాలా సమయం తర్వాత ప్రొఫెసర్ థేవన్ మెలకువలోకి వస్తాడు. ముఖం కడుక్కొని కళ్లద్దాలు పెట్టుకుంటాడు. అడ్మిషన్ కమిటీని దాటుకుంటూ లెటర్ బాక్స్ దగ్గరికి వెళతాడు. హిస్టరీ డిపార్టుమెంట్‌కు చెందిన క్యూబికల్‌లో వున్న ఉత్తరాలను చిందరవందర చేస్తూ నిలబడి వుండగా అతని బుర్రలో ఒక ప్రశ్న ఊగిసలాడుతోంది. ‘మెరిట్ లిస్ట్‌లో వున్న పేరు ఆ అమ్మాయిది ఎందుకు కాకూడదూ– నా కోసం, ఆమె నా నమిత కావచ్చు కదా! కనుక్కోవాలా, ఒకవేళ ఉండకపోతే లేదా లిస్ట్‌లో చూపకపోయి వున్నట్లయితే?’ ప్రొఫెసర్ థేవన్ ఒక సందిగ్ధావస్థ స్థితిలోకి వెళ్లి అలా క్యూబికల్‌లో పడి వున్న ఉత్తరాలను పరిశీలించసాగాడు. తన చిరునామాతో ఉత్తరాలు లేకున్నా!
ఇప్పుడు తననావరించిన బలహీన క్షణాల అనుభవం, సరిగ్గా తన పెళ్లి ఫోటోను చూసినపుడు కలిగింది. తన పరివారంలో అందరూ నల్లవారే. నలుపు రంగులో వున్న పిల్లలు, పెద్దల మధ్య తెల్లగా మెరిసిపోతున్న రేణుక నిలబడి వున్నప్పుడు, ఆమె తన నల్లని చేతిని పట్టుకున్నప్పుడు కలిగిన అనుభవం. ఈ సంఘటన ప్రతిదీ బహిరంగ పరుస్తుంది. వారి కళ్లలోని కంగారు, బేలతనానికి, తరాల నుండి వారసత్వంగా వస్తున్న భయానికి దర్పణం పడుతోంది. కానీ రేణుక కెమెరాకు ఎదురుగా జన్మతః వచ్చిన ఆత్మ విశ్వాసంతో నిల్చుంది. ప్రొఫెసర్ థేవన్ ఆ ఫోటోను అగాథంలోకి తోసివేసి, భయాల నుండి తప్పించుకోవడానికి దాచిపెట్టాడు. ఐనప్పటికీ తన పెళ్లి ఫోటోలు తన జీవిత చరిత్రలోని క్లిష్ట సమయాలలో ధైర్యాన్నిచ్చి తన జ్ఞాపకాల్లోని అస్పష్టతలను చెరిపేస్తాయి.
చిన్నగా నవ్వుకొని, ఇవన్నీ అల్ప విషయాలే అని తలపోస్తూ అడ్మిషన్ కమిటీ వైపుకు నడుచుకుంటూ వెళ్తాడు. నిజానికి చరిత్రలో ఒక ముఖ్యమైన మలుపులో నిలబడి పొరబాటు సరిదిద్దుటకై ఆ అమ్మాయి తన కంప్లైంట్‌తో అక్కడ నిలబడింది అని తనకు తాను సాంత్వన పరచుకున్నాడు. కానీ అతను తలుపులను సగం తెరిచి చూడగానే వరండాలో కనబడిన అమ్మాయి పాదాల చెమట గుర్తులు అక్కడ కనబడగానే భయంతో బిగుసుకుపోయాడు. ‘రేపు, ఔను రేపు నేను తప్పనిసరిగా కొన్ని విషయాల మీద ప్రశ్నలు వేయాలి. ఏ పెళ్లి ఫోటో కూడా నన్ను నిలవరించి, భయపెట్టే ప్రశ్నే తలెత్తదు.’
బాలన్ నాయర్, వాచ్‌మెన్ అమాయకంగా అడిగేవాడు. ‘ఈరోజుకు వెళ్లిపోతున్నారా థేవన్ మాస్టారు?’ కానీ రేణుక అతని అమాయకత్వాన్ని నమ్మకపోయేది. ‘థేవన్ మాష్, థేవన్ మాష్ అని ఏదో ఉద్దేశంతో అతను అలా పిలుస్తున్నాడు. అతను ఒకరోజు ముందు జాయిన్ అయిన పిల్లల్ని కూడా ‘ప్రొఫెసర్’ అని పిలిచేవాడు. ఎన్నిసార్లు పట్టుబట్టాను మిమ్ముల్ని, మీ పేరు స్పెల్లింగ్ మార్చుకొమ్మని? కేవలం ఒక్క అక్షరం సమస్యనే. కేవలం మీ పేరులోని ‘టి’ అక్షరం చోట ‘డి’ అక్షరాన్ని చేరిస్తే ఈ అవమానాన్ని భరించే బాధ పోతుంది కదా!’
ప్రొఫెసర్ థేవన్ చెమటతో తడిసి ముద్దయ్యాడు.
చెమట వాసన జన్యువుల్లో కూడా ప్రవహిస్తుంది. దున్నబడి, బురద నిండిన వరిమళ్లలోని మట్టి వాసన నమితలో కూడా వారసత్వంగా ప్రవహిస్తోంది. ఆ వాసనని పారిస్‌లోని అన్ని పరిమళ ద్రవ్యాలకు బదులుగా బేరం పెట్టనని ఆమె పట్టుబడుతోంది.
‘వన్ లాక్ హౌసింగ్ కాలనీ’ దేశంలోని బడుగు వర్గాలకు, కేరళలో 1970లో ‘కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా’కు చెందిన ఎం.ఎన్.గోవిందన్ నాయర్, అప్పటి హౌసింగ్ మినిస్టర్, గృహ నిర్మాణ పథకం కింద నిర్మించిన కాలనీ. ‘యూఎం’ కాలనీగా మారింది.
మాష్: ‘మాష్టారు’కు బదులుగా క్లుప్తంగా పిలిచే పేరు.
థేవన్: ఉన్నత కులాల వారి ‘దేవన్’ పేరును, నిమ్న కులాల వారిని ‘థేవన్’ పేరుతో ఉద్దేశ పూర్వకంగా, అవహేళనగా పిలుస్తారు.
మూలం : మలయాళం
రచయిత్రి : సారా జోసెఫ్
ఆంగ్లానువాదం : ఏ.జె.థామస్–ప్రతీక్ కంజిలాల్
తెలుగు అనువాదం : డా.రూప్ కుమార్ డబ్బీకార్