లుథియానా జిల్లా టూసా గ్రామానికి చెందిన సత్విందర్ కౌర్‌కు... అందరి అమ్మాయిల్లానే వయసు రాగానే తల్లిదండ్రులు పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు. టీచర్‌గా పనిచేస్తోన్న మంచి వరుడు దొరకడంతో 2009 ఫిబ్రవరి 23న పెద్దల సమక్షంలో కోటి ఆశలతో పెళ్లి చేసుకుంది సత్విందర్. ఆ ఆశలన్నీ మూణ్ణాళ్ల ముచ్చటేనని తెలియడానికి ఎక్కువ సమయం పట్టలేదు. వివాహం అయిన కొద్దిరోజులకే భర్త విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే 2010లో జార్జియా వెళ్లి అక్కడ నుంచి ఉక్రెయిన్‌కు మారాడు. అక్కడ ఓ ప్రైవేటు కంపెనీలో విదేశీ విద్యార్థుల కో ఆర్డినేటర్‌గా పనిచేసేవాడు. అతను మాత్రమే వెళ్లి తనను ఎందుకు తీసుకెళ్లలేదో సత్విందర్‌కు అర్థం కాలేదు. అలా ఐదేళ్లు గడిచిపోయాయి.
2015 జూలై 20 న ఇండియాకు భర్త తిరిగి వస్తున్నారని ఎంతో ఆత్రుతగా ఎదురు చూసింది సత్విందర్. సంవత్సరాల తరువాత విదేశాల నుంచి వచ్చిన భర్త కుటుంబంతో అయిష్టంగా వ్యవహరిస్తూ.. మనం వేరే ఇంటికి అద్దెకు వెళ్దాం అని చెప్పి కిరాయికి ఇల్లు తీసుకుని అక్కడకు మకాం మార్చాడు. నెల తరువాత ‘‘నేను ఇప్పుడు ఉక్రెయిన్ వెళ్తున్నాను. మూడు నెలల తరువాత నిన్ను తీసుకెళ్తాను’’ అని చెప్పి తిరిగి వెళ్లిపోయాడు. కానీ చెప్పినట్లుగా సత్విందర్‌ను తీసుకెళ్లలేదు. తన భర్త తనని మోసం చేసాడని తెలుసుకున్న సత్విందర్ 2016లో ఎన్‌ఆర్‌ఐ సెల్‌లో ఫిర్యాదు చేసింది.
ఇదే సమయంలో ఆమె భర్త విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించాడు. దీంతో కొన్ని వాయిదాల తరువాత పదివేల రూపాయల జీవన భృతితో కోర్టు విడాకులు ఇస్తూ తీర్పు ఇచ్చింది. విడాకులు మంజూరు అయ్యేంత వరకూ సత్విందర్.. తనలాగా భర్తచేతిలో మోసపోయి కోర్టుల చుట్టూ తిరుగుతున్న ఎంతోమంది అమ్మాయిల సాధక బాధలను దగ్గర నుంచి గమనించేది. చిన్న చిన్న అమ్మాయిల జీవితాలు రోడ్డున పడడం వారు న్యాయం కోసం సంవత్సరాలపాటు కోర్టుల చుట్టూ తిరగడం, సత్విందర్‌కు కూడా అటువంటి ప్రత్యక్ష అనుభవం ఉండడంతో తనలాంటి వారికి సాయపడాలనుకున్నారు.
అబ్ నహీ సోషల్ వెల్ఫేర్ సొసైటీ..
భర్తల చేతిలో మోసపోయి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న అమ్మాయిలను ఆదుకోవాలని నిర్ణయించుకుని 2016లో ‘అబ్ నహీ సోషల్ వెల్ఫేర్ సొసైటీ’ పేరున స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా మోసపోయిన అమ్మాయిలు, మహిళలకు సాయం చేయడం ప్రారంభించారు.
కోర్టులు, పోలీసు స్టేషన్స్ దగ్గర తనకు ఎదురైన అమ్మాయిలను, ఇంకా ఫేస్‌బుక్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా మరికొంతమంది బాధితులను కలిసి వారి సమస్యలు తెలుసుకుని ఎన్‌ఆర్‌ఐ సెల్స్, జాతీయ మహిళ కమిషన్ నిర్వహించే సెమినార్స్‌కు వారిని ఆహ్వానించి అక్కడ వాళ్లకు న్యాయం ఎలా అందుతుందో వివరించేవారు. ప్రభుత్వ పెద్దలను సంప్రదించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నారు. అంతేగాక ప్రపంచవ్యాప్తంగా గురుద్వారాలను సంప్రదించి బాధిత మహిళ వివరాలు తెలుసుకుని వారికి కావాల్సిన సహాయ సహకారాలను అందిస్తున్నారు. ఇప్పటిదాకా 700 మంది మహిళలకు సాయపడ్డారు. ఎన్జీవోని సంప్రదించిన 40 మంది పురుషులకు సత్విందర్ సాయపడడం విశేషం.
‘‘నా భర్త నన్ను మోసం చేసినప్పుడు చాలా బాధపడ్డాను. కానీ కొన్నిరోజులకు నన్ను నేను తమాయించుకుని ధైర్యంగా పోరాడాలనుకున్నాను. ఈ క్రమంలోనే నాలా కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారిలో ధైర్యం నింపుతూ.. సాయం చేయాలనుకున్నాను. ఎన్జీవో స్థాపించి నేను చేయగలిగిన సాయం చేస్తున్నాను. సాయం కోసం నా దగ్గరకు వచ్చేవారిలో 65 ఏళ్ల లోపు మహిళలు 22 మంది ఉన్నారు. వీళ్లంతా దశాబ్దాలుగా తమ భర్తల కోసం ఎదురు చూస్తున్నారు. పంజాబ్, హర్యాణ రాష్ట్రాల్లోనే దాదాపు 32 వేల మంది బాధిత మహిళలు ఉన్నారు. వీరిలో చాలా మందికి సరైన న్యాయం అందడం లేదు. కొన్ని సందర్భాల్లో మోసం చేసిన భర్తల పాస్‌పోర్టులు రద్దుచేయించడం, ప్రపంచ నలుమూలల్లో ఏదేశం లో ఉన్నా ఇండియాకు రప్పించి న్యాయం చేస్తున్నాం. ఇప్పటిదాక 20 జంటలను కౌన్సెలింగ్ ద్వారా కలిపాము’’ అని సత్విందర్ వివరించారు.
Satvinder Kaur: భర్తల చేతిలో మోసపోయిన స్త్రీలకు పెద్ద దిక్కు
Published Sat, Jul 17 2021 12:48 AM | Last Updated on Sat, Jul 17 2021 8:55 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment