ఆంధ్రప్రదేశ్‌కు ΄పొరుగునే ఉన్న ఒడిశాలో కొంతకాలంగా ‘స్క్రబ్ టైఫస్’ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ స్వైరవిహారం చేస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి అక్కడ కనిపిస్తున్న ఈ కేసులు గత రెండు మూడు వారాలుగా ఒక్కసారిగా పెరిగాయి. ఇటీవల ఒక్క సుందర్‌ఘర్ జిల్లాలోనే దాదాపుగా 200కు పైగా కేసులు రావడంతో పాటు, కొన్ని మరణాలు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలూ అప్రమత్తం కావాల్సిన అవసరమున్న ఈ తరుణంలో స్క్రబ్ టైఫస్ ఇన్ఫెక్షన్‌పై అవగాహన కోసం ఈ కథనం.
స్క్రబ్ టైఫస్’ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌ను ‘బుష్ టైఫస్’ అని కూడా అంటారు. ఈ ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియమ్ పేరు ‘ఓరియెంటియా సుసుగాముషి’. ఇది చిమ్మటలా కనిపించే చిగ్గర్ అనే ఒక రకం కీటకం ద్వారా ఒకరినుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఈ కీటకం కుట్టినప్పుడు చర్మం ఎర్రబారడం, దురదరావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి కుట్టడం వల్ల ‘ఓరియెంటియా సుసుగాముషి’ అనే బ్యాక్టీరియమ్ దేహంలోకి ప్రవేశించడంతో ఈ స్క్రబ్ టైఫస్ ఇన్ఫెక్షన్ వస్తుంది.
ఒకసారి చిగ్గర్ కుట్టాక... బ్యాక్టీరియమ్ బాధితుల రక్తంలోకి చేరితే... దాదాపు పది రోజుల తర్వాత లక్షణాలు కనిపించడం మొదలవుతుంది. చాలావరకు లక్షణాలు నిర΄ాయకరంగా ఉండవచ్చు. కానీ మొదటివారంలో దీన్ని గుర్తించకపోవడం లేదా సరైన చికిత్స ఇవ్వకపోవడం జరిగితే రెండోవారం నుంచి కొన్ని దుష్ప్రభావాలు వస్తాయి. ఊపిరితిత్తులు, కిడ్నీ, గుండె, కొన్ని సందర్భాల్లో మెదడు కూడా ప్రభావితమై మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌కు దారితీయవచ్చు.
నిర్ధారణ
ఈ వ్యాధి నిర్ధారణకు చాలా పరీక్షలే అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు వెయిల్ ఫెలిక్స్ పరీక్ష, ఇన్‌డైరెక్ట్ ఇమ్యూనోఫ్లోరోసెంట్ యాంటీబాడీ (ఐఎఫ్‌ఏ) పరీక్ష, ఇన్‌డైరెక్ట్ ఇమ్యూనో పెరాక్సైడేజ్ (ఐపీపీ) పరీక్ష, ఎలీజా, ఇమ్యూనో క్రొమాటోగ్రాఫిక్ టెస్ట్ (ఐసీటీ), పీసీఆర్ పరీక్షల ద్వారా దీన్ని నివారణ చేయవచ్చు. అయితే చాలా రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లలో కూడా దాదాపుగా ఇవే లక్షణాలు కనిపిస్తాయి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌లో తగిన మోతాదులో యాంటీబయాటిక్ చికిత్స చేసి, బాధితుల పరిస్థితిని నార్మల్ చేయవచ్చు. అందుకే అన్నన్ని ఖరీదైన పరీక్షలకు బదులు కాస్తంత అనుభవజ్ఞులైన డాక్టర్లు కొన్ని లక్షణాల ఆధారంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌ను గుర్తిస్తారు.
ఉదాహరణకు మలేరియాలో ప్రోటోజోవన్ పారసైట్ రకాన్ని బట్టి కొన్ని రోజుల వ్యవధిలో జ్వరం మాటిమాటికీ వస్తుంటుంది. అదే వైరల్ జ్వరాలు చాలా తీవ్రంగా, ఎక్కువ ఉష్ణోగ్రతతో వస్తుంటాయి. ఈ లక్షణాలను బట్టి ఆయా జ్వరాలను గుర్తుబట్టి చికిత్స అందిస్తారు. దీనికి జ్వరం వచ్చిన తొలిదశలోనే సింపుల్‌గా ఇచ్చే యాంటీబయాటిక్స్‌తో చికిత్స అందిస్తే చాలు. ఒకవేళ చికిత్స అందించకపోతే కొన్నిసార్లు ఇది లంగ్స్, గుండె, నాడీ వ్యవస్థ, జీర్ణవ్యవస్థతోపాటు కిడ్నీలపై దుష్ప్రభావం చూపే అవకాశం ఉంది.
నివారణ
దీనికి టీకా ఏదీ అందుబాటులో లేదు. చిగ్గర్ కీటకాల కాటుకు గురికాకుండా జాగ్రత్త తీసుకోవడం మంచిది. ఇవి పొలాల్లో, మట్టిలో నివసిస్తూ, అక్కడే గుడ్లు పెడతాయి. కాబట్టి చేలూ, పొలాల్లో నడిచే సమయాల్లో చెప్పులు వాడటం వంటి జాగ్రత్తలతో దీన్ని చాలావరకు నివారించవచ్చు. ఫుల్ స్లీవ్ దుస్తులు, కాళ్లు పూర్తిగా కప్పేలాంటి దుస్తులు ధరించడం మేలు. ట్రెకింగ్ వంటి సాహసక్రీడల్లో పాల్గొనేవారు చిగ్గర్స్ ఉండే ప్రాంతాల్లోనే నడిచే అవకాశాలు ఎక్కువ. అందుకే... ట్రెక్కింగ్ చేసేవారు ఇప్పుడీ వ్యాధి విస్తరిస్తున్న ప్రాంతాలకు కొన్నాళ్లు ట్రెక్కింగ్‌కు వెళ్లకవడమే మంచిది.
చికిత్స
కొన్ని అరుదైన సందర్భాల్లో (అంటే కాంప్లికేషన్ వచ్చిన కేసుల్లో) మినహా... టెట్రాసైక్లిన్ వంటి యాంటీబయాటిక్ మందులతోనే ఇది అదుపులోకి వస్తుంది. కీమోప్రోఫిలాక్టిక్ ట్రీట్‌మెంట్ తీసుకుంటే... అది కొంతవరకు దీని నివారణకు ఉపయోగపడే అవకాశం ఉంది. ఇప్పుడు మన రాష్ట్రాల నుంచి ఒడిశా వెళ్లాల్సినవారు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కిమో ప్రోఫిలాక్టిక్ తీసుకోవడం కొంత మేలు చేస్తుందని చెప్పవచ్చు.
డా.. శివరాజు, సీనియర్ ఫిజీషియన్
Comments
Please login to add a commentAdd a comment