
యువర్ సక్సెస్ స్టోరీ... ఎవరి విజయగాథను వారే స్వయంగా రాసుకుని, ఇక్కడ పబ్లిష్ చేసుకోవచ్చు. విజయం సాధించటంలో ఎదుర్కొన్న సవాళ్లు, ప్రతి సవాళ్లను కూడా స్వేచ్ఛగా తెలియచేసుకోవచ్చు. ఎంతోమందికి మార్గనిర్దేశం చేస్తూ, ఉత్తేజాన్ని ఇస్తూ, ఆదర్శంగా నిలిచే ప్రదేశం ఇది. అదే –యువర్ స్టోరీ. దీని ఫౌండర్ శ్రద్ధా శర్మ. ప్రపంచంలో విజయం సాధించిన వారు చాలామంది ఉంటారు. కాని అందరి విజయగాథలు తెలుసుకునే అవకాశం ఉండదు. అటువంటి వారి గురించి అందరూ తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నారు యువర్ స్టోరీ ఫౌండర్ అండ్ సిఈవో శ్రద్ధా శర్మ.
ఔత్సాహిక పారిశ్రామికవేత్తల విజయగాథలను ప్రతి ఇంటికి చేరువ చేయాలనే లక్ష్యంతో ‘యువర్ స్టోరీ’ అనే సామాజిక మాధ్యమాన్ని స్థాపించారు శ్రద్ధా శర్మ. ఇప్పటికి ఈ మాధ్యమం ద్వారా 70,000 విజయ గాథలను పరిచయం చేశారు. ‘‘సమాజంలో మనలో ఒకరుగా, మన చుట్టూ ఉన్నవారి విజయాలను అందరికీ తెలియచేయటానికే ఈ వేదిక ఏర్పాటు చేశాను’’ అంటారు శ్రద్ధా శర్మ.
ఇదే కారణం...
‘యువర్ స్టోరీ’ అంటూ ప్రారంభించిన శ్రద్ధా శర్మ సొంత స్టోరీ కూడా ఆసక్తికరమే. శ్రద్ధా పాట్నా వాస్తవ్యురాలు. ప్రాథమిక విద్య అయ్యాక ఢిల్లీలో మంచి పేరు పొందిన ‘సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ’నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ, అహ్మదాబాద్ ‘ఎం.ఐ.సి.ఏ’ నుంచి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. చదువులో ముందున్న శ్రద్ధాశర్మకు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’, ‘సి.ఎన్.బి.సి’ వంటి ప్రముఖ మీడియా సంస్థ లలో పనిచేసే అవకాశం వచ్చింది. సిఎన్‌బిసి లో ఉన్నత పదవిలో పనిచేశారు. ఆ సంస్థలో పనిచేస్తున్న రోజుల్లోనే శ్రద్ధా శర్మ ఎంతోమంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో నేరుగా మాట్లాడి ఆ కథలను ప్రసారం చేశారు. అలా ఎంతోమంది సిఈవోలతో మాట్లాడే అవకాశం కలిగింది శ్రద్ధా శర్మకు. వారి విజయగాథలను నేరుగా పరిశీలించిన శ్రద్ధా శర్మకు మనసులో ఒక కొత్త ఆలోచన పుట్టింది. ఆ ఆలోచనే 2008లో ‘యువర్ స్టోరీ’ ప్రారంభించటానికి ముఖ్య కారణం.
పెద్దల ఆదరణ..
ఇందులో వ్యాపార ధోరణి లేదు. అయితే అందరికీ ఈ విషయంలో అనుమానం కలుగుతుంది. చాలామంది ‘‘మీరు డబ్బులు ఎలా సంపాదిస్తారు. బహుశ మీ వారు మీకు ఫైనాన్స్ చేస్తున్నారేమో’’ అని శ్రద్ధాను చాలామందే ప్రశ్నించారు. అంతేకాదు, ‘ఇది ఒక సంవత్సరం కంటె నిలబడదు’ అంటూ నిరుత్సాహపరిచారు కూడా. అందరి ఆలోచనలు తప్పు అని నిరూపించారు శ్రద్ధా శర్మ. ‘యువర్ స్టోరీ’ ప్రారంభించిన తొలినాళ్లలోనే ఈ మాధ్యమం ఎందరినో ఆకర్షించింది. ఇందులోని నిజాయితీ పెద్దలకు చేరింది. వెంటనే ‘రతన్ టాటా’ ఫండింగ్ చేయటానికి ముందుకు వచ్చారు. ఆయనతోపాటు టీవీ మోహన్ దాస్ పై, యూనివర్సిటీ ఆఫ్ బర్క్‌లీ వారు కూడా సహకరిస్తున్నారు. పన్నెండు భాషలలో విజయవంతంగా నడుస్తోంది. ప్రతి నెల 15 మిలియన్ల వ్యూస్‌తో పాటు, 20 మిలియన్ల మందికి చేరుతోంది.
టీచర్ మాటలే నాకు బలం..
శ్రద్ధా గురించి ‘వన్ హూ హాస్ షాటర్డ్ ద గ్లాస్ సీలింగ్’ అని ది హిందూ రాసిన వ్యాసంతో శ్రద్ధా శర్మ ప్రపంచానికి పరిచితులయ్యారు. ‘నాస్‌కామ్’ అవార్డు అందుకున్నారు. లోరియల్ ఫెమినా అవార్డును, 2015లో అత్యంత ప్రభావితం చేసిన లింక్‌డ్ ఇన్ –500 లలో ఒకరుగా నిలిచారు. 2016లో ఇంటర్‌నెట్ కాటగిరీలో మోస్ట్ వ్యూడ్ సిఈవోగా నిలిచారు. ‘యువర్ స్టోరీ జర్మనీ’ ప్రారంభించి భారత్, జర్మనీల మధ్య వారధిగా నిలిచారు. ‘నేను ఒక బిహారీని, నేను చాలా వెనకబడ్డాను అనుకోకుండా అదే నీకు బలంగా భావించాలి’ అని తన టీచర్ చెప్పిన మాటలు విజయం సాధించటంలో పరుగులు తీయించాయని, గర్వంగా తలెత్తుకు తిరుగుతున్నానని శ్రద్ధా శర్మ చెబుతారు.
Comments
Please login to add a commentAdd a comment