![Srirama Navami 2023: What We Have To Learn From Rama - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/30/Srirama-Navami12.jpg.webp?itok=yX_xk-bS)
రాముడే దేవుడు నరుడి అవతారం ఎత్తిన అద్భుతమే రామాయణం. దేవుడే నరుడి అవతారం ఎత్తి ఆ నరులు ఎలా మసులుకోవాలో ఏది మంచో ఏది చెడో ఏది ధర్మమో ఏది అధర్మమో తన నడవడిక ద్వారానే నేర్పిన జగద్గురువు శ్రీరామ చంద్రుడు. రాముని జీవితాన్ని చదివితే చాలు జీవితాలు ధన్యం అయిపోతాయి. ఎలా జీవించాలో అర్ధం అవుతుంది.
మనుషుల్లో మనిషిగా పుట్టి మనుషులకు కర్తవ్య బోధ చేసిన ఆదర్శనీయుడు శ్రీరాముడు. అందుకే యుగాల తరబడి రాముణ్ని కొలుచుకుంటున్నాం. గుండెల్లో పెట్టుకుని స్మరించుకుంటున్నాం. మంచి లక్షణాలు కలగలసిన మూర్తి సృష్టిలోని అన్ని మంచి లక్షణాలు అన్ని గొప్పతనాలు ఒక మూర్తిగా మారితే ఆ దివ్యమూర్తే రాముడు అవుతాడు.
అందుకే ఆయన్ను సకల గుణధాముడు అన్నారు. మానవ జీవితంలో ప్రతీ ఒక్కరూ ఎలా ఉండాలో ఎలా బతకాలో ఏ విలువలు పాటించాలో ఏయే ధర్మాలు ఆచరించాలో తాను ఆచరించి అందరికీ నేర్పించిన మహానుభావుడు దశరథ రాముడు. చెడుపై మంచి సాధించే విజయంలో అడుగడుగునా ధర్మ పథానే నడవాలని చాటి చెప్పిన దేవుడు మన రాముడు. మనుషులకు ధర్మోపదేశం ఇచ్చేందుకే ఆ నారాయణుడు మనిషి అవతారం ఎత్తి రాముడయ్యాడు.
ఆయనే మనకి దేవుడయ్యాడు. హరుడే నరుడైన దివ్య ఘట్టం చైత్ర శుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రం లో అవతరించాడు రాముడు. రావణ వధ కోసం శ్రీనారాయణుడు మనిషి జన్మ ఎత్తి మనుషుల్లో మనిషిగా కలిసి మెలిసి సాగించిన ప్రస్థానమే రామాయణం. అయోధ్య మహారాజు దశరథుడి ముగ్గురు రాణులు నోము ఫలమున నలుగురికి జన్మనిచ్చారు. అందులో అగ్రజుడే శ్రీరామ చంద్రుడు.
కారణ జన్ముడు. సకల గుణ ధాముడు. రాముని జన్మ వృత్తాంతం భక్తులకు ఓ పర్వమే. వేల సంవత్సరాలు దాటినా యుగాలు మారినా ముల్లోకాలకూ రాముడే ఆదర్శనీయుడు ఇప్పటికీ. దానికి చాలా కారణాలు ఉన్నాయి. రాముడు మనిషి అవతారం ఎత్తింది మనుషులకు ఓ దారి చూపించడానికే. వారిలో వ్యక్తిత్వ వికాసం కల్పించడానికే. ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో తన నడవడిక ద్వారానే నేర్పించాడు రాముడు.
రాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యాడు. తండ్రి దశరథుడు పిలిచి నువ్వు వనవాసానికి పోవాలంటే అలాగే తండ్రీ అని మారు మాట్లాడకుండా కట్టుబట్టలతో అడవులకు బయలు దేరాడు. సకల రాజభోగాలు, సుఖాలు , అధికారం అన్నీ వదులకుని రాజభవనాన్ని అయోధ్య నగరాన్ని వీడి అడవులకు వెళ్లిపోయాడు. తండ్రుల మాటను పిల్లలు పెడచెవిన పెట్టకూడదని దీని ద్వారా నేర్పాడు రాముడు.
Comments
Please login to add a commentAdd a comment