కంప్యూటర్‌పై పనిచేస్తుండే సమయంలో కొందరు ఒకే భంగిమ (పోష్చర్)లో చాలాసేపు కూర్చుండిపోతారు. ఏకాగ్రతతో పనిలో మునిగిపోయినందున తమ పోష్చర్ విషయం పట్టించుకోరు. కేవలం కంప్యూటర్ మీద పనిచేసేవారే కాదు... చాలాసేపు కదలకుండా ఉండి పేషెంట్స్‌ను చూసుకునే వైద్యరంగాల్లోని వారికీ (హెల్త్ కేర్ గివర్స్), పోష్చర్ మారకుండా పనిచేసే ఇతర రంగాల్లోని వారికీ... కొద్దిసేపటి తర్వాత మెడ, ఒళ్లునొప్పులు రావడం, ఎంత జాగ్రత్తగాఉన్నా తప్పులు దొర్లడం వంటి సమస్యలు వస్తుంటాయి. దీనికి కారణం ‘స్టాటిక్ లోడింగ్’ అనే పరిస్థితి. నిజానికి ఈ పదం పూర్తిగా వైద్యరంగానిది కాదు. చాలాకాలం పాటు ఒకేచోట ఉండే వస్తువు స్థితిని తెలపడానికి భౌతిక/ఇంజనీరింగ్ శాస్త్రాల్లో ఉన్న పారిభాషిక పదమే... ఆ తర్వాత వైద్యశాస్త్రం వాడుకలోకి వచ్చింది.
ఒకే పోష్చర్‌లో చాలాసేపు కూర్చుని / కదలకుండా ఉండటంతో వచ్చే ఈ కండిషన్ చాలా రకాల అనర్థాలకు దారితీస్తుంది. దీనివల్ల రక్తప్రసరణ వేగం 20 శాతం వరకు తగ్గుతుంది. శ్వాస ప్రక్రియ కూడా మందగిస్తుంది. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు 30 శాతం వరకు తగ్గుతాయి. అందుకే దేహానికి అవసరమైన ఆక్సిజన్ మోతాదులు సైతం 30 శాతం తగ్గిపోతాయి. ఫలితంగా కణాలన్నింటికీ అవసరమైన ప్రాణవాయువు తగ్గుతుంది. శారీరకంగా ఎలాంటి శ్రమ లేనప్పటికీ... తీవ్రమైన అలసట కలుగుతుంది. చాలాసేపు కంప్యూటర్‌పై టైపింగ్ వల్ల వేళ్ల సమస్యలూ, ఒకే భంగిమలో సుదీర్ఘకాలం కూర్చోవడంతో కీళ్లనొప్పులు, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే ఇటు కంప్యూటర్‌పై పనిచేసేవారూ లేదా ఇతరత్రా పనుల్లో చాలాసేపు ఒకే పోష్చర్‌లో ఉండేవారు.... కొద్ది కొద్ది సేపటి తర్వాత ఒకసారి లేచినిలబడి, కాసేపు అటు ఇటు తిరగాలి.
కంప్యూటర్ స్క్రీన్‌ను అదేపనిగా రెప్పవాల్చకుండా చూడకూడదు. ఇది కంటికి శ్రమ కలిగించడం, కనురెప్పలు కొట్టకపోవడం (బ్లింక్ చేయకపోవడం)తో లాక్రిమల్ గ్లాండ్స్ నుంచి స్రవించే కన్నీరు కంటిపై సమంగా విస్తరించదు. దాంతో కన్నుపొడిబారడం, కన్ను అలసటకు గురికావడం వంటి సమస్యలు వస్తాయి. అందుకే ప్రతి గంట తర్వాత కనీసం 10 నిమిషాల బ్రేక్ తీసుకుంటూ ఉండాలి. ఒకేచోట కూర్చుని పనిచేసే వృత్తుల్లో ఉండేవారు రోజూ కనీసం 30 – 45 నిమిషాల పాటు వాకింగ్ వంటి తేలికపాటి వ్యాయామాలు చేయాలి. కంప్యూటర్‌పై పనిచేస్తున్నప్పుడు కనురెప్పలు తరచూ మూస్తుండాలి. దాంతో ‘స్టాటిక్ లోడింగ్’ అనర్థాలను చాలావరకు నివారించవచ్చు.
చదవండి: మొదటిసారే గుండెపోటు తీవ్రంగా.. మరణానికి దారితీసే పరిస్థితి, ఎందుకిలా?
Comments
Please login to add a commentAdd a comment