
టీహబ్‌లో ‘అంకురం’ కార్యక్రమం
20కి పైగా స్టాళ్లలో ఉత్పత్తుల ప్రదర్శన
ఎందరికో స్ఫూర్తినిస్తున్న విద్యార్థులు
సాక్షి,హైదరాబాద్: స్కూల్ అంటే పుస్తకాలు.. చదువులు.. మార్కులు.. చిన్నప్పటి నుంచి పిల్లలకు ఇదే చెబుతుంటారు. ఇంట్లో.. స్కూల్‌లో మార్కుల గోల. అయితే అందరు విద్యార్థులు ఒకేలా ఉండరు.. కొందరు చదువులో ముందుంటే మరికొందరు సృజనాత్మకతలో ముందుంటారు. పాఠశాల స్థాయిలోనే పిల్లల్లో ఉన్న టాలెంట్‌ను వెలికితీసి ఎంకరేజ్ చేస్తే పారిశ్రామిక వేత్తలుగా రాణించగలరు. ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నా బయటకు చెప్పుకునేందుకు భయపడే ఎంతోమంది పిల్లలకు స్ఫూర్తిగా నిలుస్తూ పలు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన పిల్లలు టెర్రకోట ఆభరణాలు, సాయిల్ టెస్టింగ్ కిట్స్, విండ్ సౌండర్, డిజైన్ కొవ్వొత్తులు.. ఇలా ఎన్నో అద్భుతమైన ఆవిష్కరణలను తయారు చేశారు. వాటిని మంగళవారం హైదరాబాద్‌లోని టీ–హబ్‌లో జరిగిన ‘అంకురం’లోని పలు స్టాళ్లల్లో ప్రదర్శించారు.
కోతుల బెడద నుంచి రక్షణకు
టీఎస్‌ఆర్‌జేసీకి నేరెళ్లలో ఇంటరీ్మడియట్ చదువుతున్న విద్యార్థులు పావని, శ్రీవిద్య, మాని్వత ఏదైనా కొత్త ఆవిష్కరణ చేయాలన్న ఆలోచన చేశారు. తల్లిదండ్రులు, గ్రామంలోని రైతులు కోతుల వల్ల పడుతున్న ఇబ్బందులు వీరిని కదిలించాయి. వెంటనే స్పీకర్లు, విద్యుత్‌తో నడిచే పరికరాలను కాకుండా వినూత్నంగా తయారు చేయాలని చూశారు. వారి ఆలోచనల నుంచి వచి్చందే విండ్ సౌండర్ అనే పరికరం. ఇప్పటికే చాలా మంది రైతులు దీన్ని వాడి, చాలా బాగా పనిచేస్తుందని కితాబిచి్చనట్టు చెబుతున్నారు.
జుట్టు రాలిపోకుండా ఆయిల్..
ఈ రోజుల్లో జుట్టు రాలిపోవడం చాలా మందిలో ప్రధాన సమస్యగా మారుతోంది. చిన్న వయసులోనే ఆ సమస్యను తగ్గించేందుకు నూనె తయారు చేశారు ఈ చిన్నారులు. ఎలాంటి కెమికల్స్ లేకుండా సుగంధద్రవ్యాలను వాడి ఆర్య పేరుతో హెయిర్ ఆయిల్ అభివృద్ధి చేశారు. రెండేళ్లుగా చాలామంది వాడిన తర్వాత ఫీడ్ బ్యాక్ తీసుకుని మరింత మెరుగులు చేశామని చెబుతున్నారు టీజీఆర్‌ఎస్‌జేసీ ఇన్సాన్‌పల్లికి చెందిన విద్యార్థులు.
టెర్రకోటతో ఆభరణాలు..
టెర్రకోట మట్టితో అద్భుతమైన ఆభరణాలు రూపొందించారు టీజీఎంఎస్ జూనియర్ కాలేజీ విద్యార్థులు. గిల్టు నగల కన్నా ఇవి ఎంతో అందగా ఉన్నాయని పలువురు మెచ్చుకుంటుంటే మరింత సంతోషంగా ఉంటుందని విద్యార్థులు చెబుతున్నారు.