ఫొటో చూశారా? వేలిపై చిన్నగా బంగారు రంగుతో మెరిసిపోతోందే.. ఒక నిర్మాణం. అదో సూపర్ కెపాసిటర్! చిన్నగా ఉందని చిన్నచూపు చూస్తే దెబ్బతింటారు! ఎందుకంటే ఈ బుల్లి సూపర్ కెపాసిటర్‌లో మనం సాధారణంగా వాడే ‘ఏఏఏ’ సైజు బ్యాటరీలో ఉండేంత శక్తి ఉంటుంది! కాగితాన్ని మడిచి వినూత్నమైన ఆకారాలను సృష్టించే జపనీస్ కళ ఒరెగామీ స్ఫూర్తితో అతిసూక్ష్మస్థాయి ఎలక్ట్రానిక్స్‌ను ఉపయోగించి జర్మనీ శాస్త్రవేత్తలు ఈ సూపర్ కెపాసిటర్‌ను తయారు చేశారు. పైగా దీన్ని మానవ శరీరం లోపల కూడా వాడుకోవచ్చు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే మన రక్తంలోని కొన్ని కీలకమైన పదార్థాలతోనే ఇది శక్తిని నింపుకుంటుంది. ప్లాస్టిక్ లాంటి పదార్థపు పొరల మధ్య కాంతికి స్పందించే పదార్థాన్ని ఉంచి పీడాట్:పీఎస్‌ఎస్ అనే ప్రత్యేక ప్లాస్టిక్‌ను ఎలక్ట్రోడ్‌లుగా ఉపయోగిస్తారు.
కాంతికి స్పందించే పదార్థం కరెంటును సేకరించేందుకు పనికొస్తుంది. ఈ మొత్తం ఏర్పాటుపై ఒత్తిడిని సృష్టించినప్పుడు పొరలన్నీ ఒక క్రమ పద్ధతిలో ‘ఒరెగామీ’ తరహాలో మడుచుకొని బయో సూపర్ కెపాసిటర్లు తయారవుతాయి. ఒకొక్కటీ ధూళి రేణువు కంటే తక్కువ సైజులో ఉంటుంది. కచ్చితంగా చెప్పాలంటే 0.001 ఘనపు మిల్లీమీటర్ల సైజు ఉంటాయి. రక్తపు ప్లాస్మా లాంటి లవణ ద్రావణాల్లో ఉంచినప్పుడు ఈ బయో సూపర్ కెపాసిటర్లు విజయవంతంగా విద్యుత్‌ను నిల్వ చేసుకోగలిగాయి. అంతేకాకుండా మూడు కెపాసిటర్లను జోడించి మరీ ఉపయోగించవచ్చు. రక్తనాళాల్లో ఇలాంటి వాటిని ఏర్పాటు చేయడం ద్వారా కేన్సర్ కణతుల పెరుగుదలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చునని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఒలివర్ జి షిమిట్ తెలిపారు.
చదవండి: కూల్‌డ్రింక్స్ తాగితే లావెక్కుతాం.. ఎందుకో తెలుసా?
‘సైలెంట్ కిల్లర్’తో జాగ్రత్త.. భారత్‌లో 30 శాతం మంది బాధితులు
Comments
Please login to add a commentAdd a comment