తీయని పలకరింపు మదిలో చక్కని భావనను రేపుతుంది. ఒక చల్లని అనుభూతినిస్తుంది. ఓ హాయిని చేకూరుస్తుంది. పలరింపు పెద్ద ఓదార్పు. కొన్ని సందర్భాలలో అద్భుతమైన ఊరటను, కొండంత బలాన్నిస్తుంది . ‘తోడుగా నీకు నేనున్నాను‘ అనే ఆత్మీయత, ఆప్యాయతలతో నిండిన పలకరింవు గొప్ప భరోసా నిస్తుంది. మన దుఃఖాన్ని, నిర్వేదాన్ని, నిరాశను, నిçస్పృహను అమడ దూరంలో పెట్టే ఔషధమై మనసుకు సాంత్వననిస్తుంది.
బీటలుబారిన భూమికి ఎంతో హర్షాన్నిస్తుంది వర్షం. అదే విధంగా, చక్కని పలకరింపు శోకంతో ఛిద్రమైన మనోక్షేత్రాన్ని ఏకం చేసే ప్రేమజల్లు అవుతుంది. కొందరికి పలకరింపంటే మాటల మూట అనే భావన ఉంది. పలకరింపు అంటే అద్భుతమైన పదవిన్యాసము కాదు. భాషా సొబగులు చూపటం, భాషా సౌందర్యాన్ని ఒలికించటమూ అంతకన్నా కాదు. సమాసాల హోరు, జోరు కానే కాదు. పలకరింపు ఒక లాలిత్యం... ప్రేమ ధ్వనించాలి. స్నేహం తొంగి చూడాలి.
పెదవుల చివర నుంచి కాక మనసులోంచి రావాలి. అపుడే అది ఎదుటివారి మనసును తాకి ఆహ్లాదాన్నిచ్చే మలయమారుతమవుతుంది. చక్కని పులకరింపై మనసుకు ఓ ప్రశాంతతనిచ్చి మన పలకరింపును స్వీకరించిన వారి ముఖాన చిరునవ్వును వెల్లి విరిసేటట్టు చేస్తుంది. కొందరు నోరు విప్పి పలుకరించటానికి ముందే వారి ముఖం మీద చిరునవ్వు పుడుతుంది. ఆ తరువాతే మాటలు. అటువంటి వారి మాటకు మృదు మధురంగానే ఉంటాయి. శ్రీరాముడు స్మిత పూర్వ భాషి అన్నారు. చిరునవ్వుతో తానే ముందు అందరిని పలకరిస్తాడు.
పదాల అర్థం వాటి పర్యవసానం, వాటి పయనం, వాటి ప్రభావాల గురించి మన అంచనా శక్తి మనకు తెలియాలి. మన పలకరింపు ఎదుటివారికి చేరేది మాటల రూపంలోనే కదా. అది మన గొంతు నుండి పెదవులను దాటి స్వరరూపంలో బయటకు వస్తుంది. స్వరం స్థాయి, మాటల ఊనిక చాలా అవసరం. మనం ఎన్నుకున్న మాటల అర్థాన్ని, ఉద్దేశాన్ని ఎదుటివారికి తెలియజెప్పేది మాటల రూపంలో వ్యక్తమయ్యేది పలకరింపే. అందుకనే ఎంతో అప్రమత్తంగా ఉండాలి.
ఒకరకంగా ఇది అతి సులువు గా కనిపించే అత్యంత క్లిష్టమైన విషయం. ‘బావున్నారా‘ అనేది మనమందరం చేసే అతి సాధారణ పలకరింపు. ఈ నాలుగు అక్షరాలు మన గొంతులో పలికే మన స్వర స్థాయిని బట్టి మన మనోభావాన్ని తెలియచేస్తుంది. అందుకే మాటలు అవే అయినా వాటిని పలికే తీరులో ఎంతో తేడా ఉంటుంది. మన భావాన్ని తెలియచెప్పే మాటల ధ్వని, దాని అర్థం మనం స్వరం లో పలికేటట్టు మాట్లాడగలగాలి. అదే చక్కని పలకరింపుకు చిరునామా అవుతుంది. మనల్ని చక్కని సంభాషణ పరులుగా చేసేది.
పలకరింపు అంటే భాష మీద పట్టు, సాధికారత కానే కాదు. పలకరింపుకు మన విజ్ఞత, వివేచన ఉండాలి.. అపుడే అది చేయదగ్గ పనిని చేస్తుంది.
తల్లిదండ్రులు తమ జీవితమంతా పిల్లలకే ధారపోస్తారు. అహరహం వారి బంగారు భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. వయసు మీరిన తరువాత పలకరింపుకోసం తపించిపోతారు. ఈరోజు విషయాన్ని పిల్లలు అర్థం చేసుకోవాలి. స్వదేశంలో ఉన్నా, విదేశంలో ఉన్నా తమ తల్లిదండ్రులను పలకరించాలి. ఆ పలకరింపు, గడపబోయే సమయం కొన్ని క్షణాలైనా చాలు. అది వృద్ధులకు ఎంతో ధైర్యాన్ని, భరోసాను ఇస్తుంది. అన్నిటికీ మించి వర్ణించలేని సంతృప్తిని, అంతులేని ఆనందాన్ని ఇస్తుంది.
మనం పలకరించినా, లేకపోయినా ప్రకృతి మనల్ని పలకరిస్తూనే ఉంటుంది. ప్రకృతిపరమైన ఈ పలకరింపులు ఆలకించగలగాలి లేదా అలవాటు చేసుకోవాలి. అపుడు ఎంతో ఆనందాన్ని పొందగలం. ఆ దృష్టి ఆనంద హేతువు. ఉదయానే కొక్కోరోకో అనే ధ్వని, ఉదయపు వ్యాహ్యాళి వేళ తమ ఆవాసమైన వృక్షాన్ని వీడి పక్షులు తమ ఆహారన్వేషణ కు ఆకాశానికెగిరే వేళ చేసే టప టప మనే ధ్వని ప్రకృతి పలకరింపు. పండిన నారింజ రంగులో ఉన్న భానోదయం, భాస్కరుని నులివెచ్చని కిరణాలు నిశ్శబ్ద పలకరింపులే కదా! గాలి ఈలలు, చిరుగాలి సవ్వడి, నీటి గలగలలు,
నిన్నటి మొగ్గ నేడు తన రేకానయనాలను విప్పార్చుకుంటూ పరిమళాలతో మనల్ని మన ఆత్మీయులు పలుకరించిన అనుభూతి కలగదా!
పలకరింపు మాటల్లోనే ఉండనక్కర లేదు. అది ఒక చూపు, స్పర్శ, చిరునవ్వు, దృశ్యం, పుస్తకం.. ఇలా ఏవైనా కావచ్చు. ఇలా ఏదోరకమైన పలకరింపును మనం చేయగలగాలి. అది పొందిన వారు, కోరుకునే వారికి తీయని అనుభూతినిస్తుంది. వారి మనసు ఆనంద సంద్రమవుతుంది.
కొందరు ఎంత ఉన్నతపదవుల్లోకి వెళ్లినా తమ హితులను, స్నేహితులను, బంధువులను విస్మరించరు. పలకరించే ఏ సందర్భాన్ని వదలుకోరు. వారి హోదాకు, అంతస్థుకి చెందినవారిని ఎంత ఆప్యాయంగా, ఆత్మీయంగా పలుకరిస్తారో పేదలైనా, ధనికులైనా, చదువుకున్న వారైనా, చదువుకోనివారైనా ఒకేరకమైన ప్రవర్తన. ఒకేరకంగా పలకరిస్తారు. అది ఎంతో గొప్ప లక్షణం. ఇది చాలామందిలో ఉండదు. అటువంటి వారు వేళ్ళమీద లెక్కపెట్టే సంఖ్యలోనే ఉంటారు. అందుకే వారిది అపురూప వ్యక్తిత్వమవుతుంది. అదే మనకు ఆదర్శం కావాలి.
ఆర్థిక బాధల్లో ఉన్న వారందరికీ మనం సహాయం చేయడం సాధ్యం కాకపోవచ్చు. అయితే, కష్టాల కడలిలో ఉన్న మన చుట్టాలను, స్నేహితులను, ఇరుగు పొరుగుని ఓదార్పుగా పలకరించవచ్చు. అది వారికి హార్దికంగా ఎంతో శక్తినిస్తుంది. పెడతోవలో వెళ్ళే వారి ఆలోచనలకు ఒక క్రమ మార్గం ఏర్పరుస్తుంది. ఇటువంటి సందర్భాలలోనే మన సంభాషణ చాతుర్యం తెలిసేది. మన మాటల ఎన్నిక, కూర్పు, పొందికలలో ఎంతో జాగ్రత్త అవసరం. ఇవన్నీ మన పలకరింపు పెదవులను దాటటానికి ముందు మనసులో జరిగే ప్రక్రియ. ఇది పూర్వభాగమైతే, మన భావనలు పలకరింపై ఎదుటివారిని చేరటం ఉత్తరభాగం. సరిగ్గా, ఇక్కడే మాటలకున్న అర్థాన్ని మనమెంత లోతుగా గ్రహించగలిగామో తెలిసేది.
– లలితా వాసంతి
Comments
Please login to add a commentAdd a comment