కృష్ణం‘రాజసం’.. ఆరడుగుల ఆజానుబాహుడు | Telugu Film Industry' Rebel Star Krishnam Raju Life Story | Sakshi
Sakshi News home page

కృష్ణం‘రాజసం’.. ఆరడుగుల ఆజానుబాహుడు

Published Mon, Sep 12 2022 4:06 AM | Last Updated on Mon, Sep 12 2022 3:53 PM

Telugu Film Industry' Rebel Star Krishnam Raju Life Story - Sakshi

ఆరడుగుల ఆజానుబాహుడు.. వెండితెరపై ‘రెబల్‌ స్టార్‌’. బొబ్బిలి బ్రహ్మన్న, కటకటాల రుద్రయ్య, తాండ్ర పాపారాయుడు, భక్త కన్నప్ప... సాంఘికం, పౌరాణికం... ఇలా దాదాపు అన్ని జానర్లు టచ్‌ చేసిన పరిపూర్ణ నటుడు. 

‘ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండే గుణం. ‘ఒక కారు కొంటాం.. ఇంకోటి కొంటాం.. కానీ ఆ కారు దిగి కాలు భూమి మీదే పెట్టాలి కదా.. కాళ్లతోనే నడవాలి కదా’.. రెబల్‌ స్టార్‌ చెప్పిన జీవిత సత్యం ఇది. అందుకే ఆయన నిరాడంబరమైన మనిషి.

‘ఈ చేత్తో చేసిన దానం ఆ చేతికి తెలియకూడదు’ అనేది ఆయన సిద్ధాంతం. ఎన్నో సహాయ కార్యక్రమాలు చేశారు. భర్తగా, తండ్రిగా, పెదనాన్నగా.. ఇంటిల్లిపాదినీ బాగా చూసుకున్నారు. పేరుకి తగ్గట్టే రాజులా బతికారు. అందుకే ఆయన పరిపూర్ణమైన మనిషి కూడా...

ఆదివారం తెల్లవారుజాము ‘రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు’ ఇక లేరని ఓ చేదు వార్తని మోసుకొచ్చింది. 82 ఏళ్ల క్రితం ఓ మంచి మనిషి ఈ భూమ్మీదకు వచ్చాడు. రాజసంగా బతికాడు.. రాజసంగా వెళ్లిపోయాడు. ఒక శకం ముగిసింది..

ప్రముఖ నటులు, నిర్మాత, మాజీ కేంద్ర మంత్రి రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు (82) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున 3:25 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరులో ఉప్పలపాటి వీరవెంకట సత్యనారాయణరాజు, లక్ష్మీదేవి దంపతులకు 1940 జనవరి 20న కృష్ణంరాజు జన్మించారు.

ఆయన అసలు పేరు శ్రీ ఉప్పలపాటి చినవెంకట కృష్టంరాజు. అయితే ఆ పేరు పెద్దగా ఉందని శ్రీ, చినవెంకట పేర్లను తీసేసి, ఉప్పలపాటి కృష్టంరాజు అని పెట్టుకున్నారు. మొగల్తూరులోని బోర్డింగ్, హైస్కూల్‌లో ఎనిమిదో తరగతి వరకూ చదువుకున్నారు కృష్ణంరాజు. ఆ తర్వాత నర్సాపూర్‌ టైలర్‌ హైస్కూల్‌లో తొమ్మిదో తరగతి ప్రవేశం కోసం వెళితే.. ఆ స్టాండర్డ్‌ సరిపోదని మళ్లీ ఎనిమిదో తరగతిలో చేరాలంటే, అదే స్కూల్‌లో ఎనిమిది, తొమ్మిది, ఎస్‌ఎస్‌ఎల్‌సి (పది) తరగతులు పూర్తి చేశారు. కాగా టైఫాయిడ్‌ జ్వరం కారణంగా ఎస్‌ఎస్‌ఎల్‌సి తప్పిన ఆయన రెండోసారి పాసయ్యారు. బీకాం మూడో సంవత్సరం చదువుతూ మధ్యలోనే మానేశారు.

జర్నలిస్ట్‌గా...
ధనిక కుటుంబంలో పుట్టిన కృష్ణంరాజు పాఠశాలకు గుర్రపు బండిలో, కళాశాలకు బీఎస్‌ఏ మోడల్‌ మోటార్‌ బైక్, వోక్సాలిన్‌ అనే కారులో వెళ్లి వచ్చేవారు. కారులో కళాశాలకు వెళుతుంటే ఆయన్ను యంగ్‌ లెక్చరర్‌ అనుకునేవారు. కళాశాలలో జరిగిన ఎన్నికలప్పుడు లెక్చరర్‌ కాదు స్టూడెంట్‌ అని అందరికీ తెలిసిందట. డిగ్రీ డిస్‌కంటిన్యూ చేశాక కొంతకాలంపాటు ‘ఆంధ్రరత్న’ అనే దినపత్రికలో జర్నలిస్టుగా చేశారు. 

హైదరాబాద్‌లో రాయల్‌ స్టూడియో
చిన్నప్పటి నుంచి కృష్ణంరాజుకి ఫొటోగ్రఫీ అంటే ఇష్టం. 14 ఏళ్ల వయసు నుంచే మార్కెట్‌లోకి వచ్చిన ప్రతి కెమెరా కొని ఫొటోగ్రఫీలో ప్రయోగాలు చేశారు. ఆ అనుభవంతో హైదరాబాద్‌ అబిడ్స్‌లో ‘రాయల్‌ స్టూడియో’ను ప్రారంభించారు. చూడటానికి హీరోలా ఉన్నావని సీహెచ్‌వీపీ మూర్తిరాజు (బంధువు), స్నేహితులు కృష్ణంరాజుకి చెబితే నవ్వి ఊరుకునేవారట.. అంతేకానీ, సినిమాలు చేయాలనే ఆలోచన ఉండేది కాదట.

‘చిలకా గోరింకా’తో సినిమా ఎంట్రీ 
‘అక్కా చెల్లెలు’ సినిమా తీసిన పద్మనాభరావు ఓ రోజు కృష్ణంరాజుని చూసి ‘సినిమాల్లో నటిస్తావా?’ అని అడగడం, అటు మూర్తిరాజు, ఇటు స్నేహితులు ప్రయత్నించి చూడమనడంతో పద్మనాభరావుతో కలిసి హైదరాబాద్‌ నుంచి మద్రాస్‌ (చెన్నై) వెళ్లారు కృష్ణంరాజు. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ సినిమా పట్టాలెక్కకపోవడంతో హైదరాబాద్‌కి తిరిగొచ్చేశారు.

ఆ తర్వాత ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలోని ‘తేనె మనసులు’ సినిమా ఆడిషన్స్‌కి వెళ్లారు. ఆ ఆడిషన్స్‌కి కృష్ణ, జయలలిత, సంధ్యారాణి, హేమమాలిని కూడా హాజరయ్యారు. అయితే కృష్ణంరాజు, జయలలిత, హేమమాలినిలను రిజెక్ట్‌ చేశారట. ప్రత్యగాత్మ దర్శకత్వంలో చేసిన ‘చిలకా గోరింకా’ (1966) చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు కృష్ణంరాజు. 

రెబల్‌ స్టార్‌గా...
ఐదున్నర దశాబ్దాల కెరీర్‌లో ‘బుద్ధిమంతుడు, మనుషులు మారాలి, పెళ్లి కూతురు, మహ్మద్‌ బిన్‌ తుగ్లక్, హంతకులు దేవాంతకులు, తల్లీకొడుకులు, రారాజు, త్రిశూలం, రంగూన్‌ రౌడీ, మన ఊరి పాండవులు, కటకటాల రుద్రయ్య, సతీ సావిత్రి, పల్నాటి పౌరుషం, తాతా మనవడు, టూ టౌన్‌ రౌడీ, జీవన తరంగాలు’ ఇలా... దాదాపు 185 సినిమాల్లో నటించారు. ‘తాండ్ర పాపారాయుడు, భక్త కన్నప్ప, బొబ్బిలి బ్రహ్మన్న, కృష్ణవేణి, అమరదీపం’ వంటి సినిమాలు కృష్ణంరాజుకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. సాంఘిక, పౌరాణిక సినిమాల్లో చేసిన పాత్రలే ప్రేక్షకుల మనసుల్లో రెబల్‌స్టార్‌గా పేరు తీసుకొచ్చాయి.

స్టయిలిష్‌ విలన్‌గా..
హీరోగా చేస్తున్నప్పుడు ‘నేనంటే నేనే’ (తమిళ ‘నాన్‌’కి రీమేక్‌) చిత్రంలో విలన్‌గా చేయమని నిర్మాత డూండీ (అప్పటికి పేరున్న నిర్మాత) అడిగారు. అయితే విలన్‌గా చేయడం ఇష్టంలేక ‘సారీ’ అనేశారు కృష్ణంరాజు. ఆ విషయం తెలిసి,‘ అంత పెద్ద నిర్మాత అడిగితే కాదంటావా? ఈరోజు పెద్ద హీరోలుగా రాణిస్తున్న శివాజీ గణేశన్‌వంటి వారు ఒకప్పుడు విలన్‌గా చేసినవారే’ అని దర్శకుడు ప్రత్యగాత్మ అన్నారు.

‘అయితే ఒక కండీషన్‌.. అందులో మనోహర్‌ కొంచెం ఓవర్‌ యాక్షన్‌ చేశారు.. నేను నా పద్ధతిలో చేస్తా’ అని కృష్ణంరాజు అన్నారు. పెద్ద నిర్మాత అయిన నాకే కండీషనా? అన్నప్పటికీ డూండీ ఒప్పుకున్నారు. చిత్రదర్శకుడు రామచంద్రరావు మాత్రం షూటింగ్‌ లొకేషన్‌లో మనోహర్‌ స్టయిల్‌లో చేయమన్నారు. అయితే డూండీ మాత్రం కృష్ణంరాజుని తనదైన శైలిలో నటించమన్నారు.. కొత్తగా చేశారు. ఆ పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయి.

‘మరో ఆర్‌. నాగేశ్వరరావు (ప్రముఖ విలన్‌ నాగేశ్వరరావు అప్పటికి మరణించారు) ఇండస్ట్రీకి వచ్చాడు’ అనే పేరు వచ్చింది. ఆ తర్వాత విలన్‌ పాత్రలు వచ్చినప్పటికీ అప్పుడు నడుస్తున్న ట్రెండ్‌ ప్రకారం గళ్ల లుంగీ, చారల బనియన్, క్రూరమైన చూపులు.. కృష్ణంరాజు ఇలా రొటీన్‌గా కనిపించదలచుకోలేదు. స్టైలిష్‌ విలన్‌గా చేయాలనుకున్నారు. ఆ విధంగా ట్రెండ్‌ సెట్టింగ్‌ విలన్‌ అనిపించుకున్నారు. అలాగే క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కూడా ఓ స్థాయి ఉన్న పాత్రలే చేశారాయన. ‘బావా బావమరిది, జైలర్‌గారి అబ్బాయి, గ్యాంగ్‌ మాస్టర్, పల్నాటి పౌరుషం, నాయుడుగారి కుటుంబం, మా నాన్నకి పెళ్లి’ తదితర చిత్రాల్లో మంచి పాత్రలు చేశారాయన.

అవార్డులు.. రివార్డులు
కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ‘అమరదీపం (1977)’, ‘బొబ్బిలి బ్రహ్మన్న’ (1984) చిత్రాలకు గానూ ప్రభుత్వం నుంచి రెండు నంది అవార్డులు అందుకున్నారు కృష్ణం రాజు. ‘అమరదీపం’, ‘మన ఊరి పాండవులు’ (1978) సినిమాల్లోని నటనకుగానూ రాష్ట్రపతి పురస్కారాలు వరించాయి. 1994లో శరత్‌ దర్శకత్వంలో వచ్చిన ‘జైలర్‌గారి అబ్బాయి’ చిత్రంలో ఉత్తమ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నంది అవార్డు అందుకున్నారాయన. అదే విధంగా 2014లో ‘రఘుపతి వెంకయ్య’ అవార్డు అందుకున్నారు కృష్ణంరాజు. వీటితోపాటు పలు ప్రైవేట్‌ సంస్థల నుంచి ఎన్నో అవార్డులు అందుకున్నారాయన. 

కేంద్రమంత్రిగా... 
1991లో కాంగ్రెస్‌ పార్టీలో చేరి, అదే ఏడాది నర్సాపురం నుంచి లోక్‌సభకు పోటీచేసి ఓడిపోయారు కృష్ణంరాజు. ఆ తర్వాత బీజేపీలో చేరి, 1999లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో నర్సాపురం నుంచి ఎంపీగా విజయం సాధించి, కేంద్రమంత్రిగా చేశారు. ఆ తర్వాత చిరంజీవి స్థాపించిన ‘ప్రజారాజ్యం’ పార్టీలో  చేరారు కృష్ణంరాజు. అనంతరం బీజేపీలోనే కొనసాగారు.

సినీ పరిశ్రమలో ‘మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌’ (మా)కి సేవలందించారు. అలాగే ‘క్రమశిక్షణా సంఘం (మా)’కి అధ్యక్షుడిగా ఉన్నారు. కాగా ప్రభాస్‌ హీరోగా నటించిన ‘రాధేశ్యామ్‌’ కృష్ణంరాజుకి ఆఖరి సినిమా. చిత్రసీమ ఓ మంచి నటుడిని కోల్పోయింది. ఆతిథ్యం ఇచ్చే విషయంలో రారాజు అనిపించుకున్న ఓ మంచి మనిషి దూరం అయ్యారు.
కృష్ణంరాజు అంత్యక్రియలు చేవెళ్లలోని మొయినాబాద్‌లో గల కనకమామిడి ఫామ్‌ హౌస్‌లో ఈరోజు మధ్యాహ్నం అధికారిక లాంఛనాలతో జరుగుతాయని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.        

సీతాదేవితో వివాహం


1969లో కోట సంస్థానాధీశుల వంశస్తులు రాజా కలిదిండి దేవి ప్రసాద వరాహ వెంకట సూర్యనారాయణ కుమార లక్ష్మీ కాంత రాజ బహుద్దూర్‌ (గాంధీబాబు), సరస్వతీ దేవిల కుమార్తె సీతాదేవిని వివాహమాడారు కృష్ణంరాజు. 1995లో సీతాదేవి రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, 1996లో తూర్పుగోదావరి జిల్లా తునికి చెందిన శ్యామలాదేవిని రెండో వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు.

తీరని ఆశలు
కృష్ణంరాజు టైటిల్‌ రోల్‌లో బాపు దర్శకత్వంలో వచ్చిన ‘భక్త కన్నప్ప’ చిత్రానికి అమితమైన ప్రేక్షకాదరణ లభించింది. ఈ సినిమాను ప్రభాస్‌తో రీమేక్‌ చేయాలని కృష్ణంరాజు ఆశపడ్డారు.. కానీ కుదర్లేదు. అలాగే ప్రభాస్‌ హీరోగా నటించిన ‘ఛత్రపతి’ (2005) సినిమాలోని ఓ పవర్‌ఫుల్‌ డైలాగ్‌లో ‘ఒక్క అడుగు’ అనే పదం ఉంటుంది. దీన్నే టైటిల్‌గా పెట్టి, ఓ మల్టీస్టారర్‌ సినిమాను తన దర్శకత్వంలోనే చేయాలనుకున్నారు కృష్ణంరాజు.

అయితే ఇది కూడా కార్యరూపం దాల్చలేదు. అలాగే ‘విశాల నేత్రాలు, జీవన తరంగాలు’ నవలలంటే ఆయనకు ఇష్టం. వీటి ఆధారంగా సినిమాలు తీయాలనుకున్నారు. అదీ నెరవేరలేదు. ఇక ప్రభాస్‌ పెళ్లి చూడాలని కృష్ణంరాజు ఎంతగానో ఆశపడ్డారు. కానీ ప్రభాస్‌కు ఉన్న వరుస సినిమాల కమిట్‌మెంట్స్‌ కారణంగా వివాహం వాయిదా పడుతూ వస్తోంది.

అలాగే తన ముగ్గురు కుమార్తెలు సాయి ప్రసీద, సాయి ప్రకీర్తి, సాయి ప్రదీప్తిల వివాççహాల విషయంలోనూ కృష్ణంరాజుకి ఆశ ఉండటం సహజం. మరోవైపు ఎంపీ అయిన కృష్ణంరాజుకు గవర్నర్‌ హోదాలో బాధ్యతలు నిర్వర్తించాలని ఉండేదట. ఓ దశలో కృష్ణంరాజుకు తమిళనాడు గవర్నర్‌ పదవి అంటూ వార్తలు వినిపించాయి. కానీ ఇది కూడా కార్యరూపం దాల్చలేదు. 

యంగ్‌ రెబల్‌ స్టార్‌తో మూడు చిత్రాలు
కృష్ణంరాజు–ప్రభాస్‌ కాంబినేషన్‌లో మూడు సినిమాలు వచ్చాయి. పెద్దనాన్న కృష్ణంరాజుతో కలిసి ప్రభాస్‌ స్క్రీన్‌  షేర్‌ చేసుకున్న తొలి సినిమా ‘బిల్లా’ (2009). ఈ సినిమా వచ్చిన మూడేళ్లకు ‘రెబల్‌’ (2012) సినిమాలో కలిసి నటించారు కృష్ణంరాజు, ప్రభాస్‌. ‘రెబల్‌’ తర్వాత మరోసారి కృష్ణంరాజు, ప్రభాస్‌ కలిసి నటించడానికి పదేళ్లు పట్టింది. ప్రభాస్‌ హీరోగా నటించిన ‘రాధేశ్యామ్‌’ (2022)లో పరమహంస అనే కీ రోల్‌ చేశారు కృష్ణంరాజు. ఇది ఆయనకు చివరి సినిమా.

పరిశ్రమ నుంచి వెళ్లిపోవాలనుకున్నారు కానీ...!
కథానాయకుడిగా, విలన్గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా తెలుగు చలన చిత్రపరిశ్రమలో కృష్ణంరాజుది సుదీర్ఘమైన సక్సెస్‌ఫుల్‌ కెరీర్‌. అయితే ఇంత ప్రతిభావంతుడైన కృష్ణంరాజు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ముఖ్యకారణం  ప్రముఖ ప్రొడ్యూసర్, యాక్టర్, డైరెక్టర్‌ ఎల్వీ ప్రసాద్‌. వెండితెరపై కృష్ణంరాజు తొలి సినిమా ‘చిలకా గోరింకా’. ఈ సినిమాకు బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో నంది అవార్డు వచ్చింది కానీ కమర్షియల్‌గా సక్సెస్‌ కాలేదు. దీంతో కాస్త దిగాలు పడ్డారు కృష్ణంరాజు.

ఆ తర్వాత కృష్ణ హీరోగా నటించిన ‘నేనంటే నేనే’ చిత్రంలో కాస్త ప్రతినాయకుడి ఛాయలు ఉండే రోల్‌లో నటించే అవకాశం వచ్చింది కృష్ణంరాజుకు. దీంతో మరింత కలత చెందిన ఆయన సినీ పరిశ్రమకు వీడ్కోలు చెబుదాం అనుకున్నారట. కానీ పాత్ర ఏదైనా ప్రేక్షకులకు దగ్గర కావడం ముఖ్యమని, ఈ విషయంపై దృష్టి పెట్టమని కృష్ణంరాజుకు ఎల్వీ ప్రసాద్‌ హితబోధ చేశారు.

దీంతో ఆలోచనలో పడ్డ కృష్ణంరాజు నూతనోత్సాహంతో మళ్లీ యాక్టర్‌గా మేకప్‌ వేసుకున్నారు. ‘నేనంటే నేనే’లో కృష్ణంరాజు పోషించిన ఆనంద్‌ పాత్రకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయి. దీంతో నటుడిగా తిరుగులేని సక్సెస్‌ఫుల్‌ ప్రయాణాన్ని కొనసాగించారు కృష్ణంరాజు.

రాజుకి ఆకలి బాధ
పుట్టినప్పటినుంచి ఆకలి బాధ తెలియకుండా పెరిగిన కృష్ణంరాజు ఓ సందర్భంలో రెండు రోజులు పస్తులు ఉన్నారు. నటనలో సంతృప్తి పొందేవరకూ ట్రైనింగ్‌ తీసుకునే సమయంలోవచ్చిన ప్రతి సినిమానీ వదులుకున్నారాయన. అప్పటికి ఇంటి నుంచి కృష్ణంరాజు తండ్రి డబ్బులు పంపించేవారు. అయితే తన దగ్గర డబ్బులయిపోయాయని తండ్రికి ఉత్తరం రాయడానికి బద్ధకించి కృష్ణంరాజు రాయలేదు.

దాంతో రెండు రోజులు పస్తులు ఉన్నారు. పోనీ ఎవరినైనా అడుగుదామంటే ఆత్మాభిమానం.. మొహమాటం. ఆ సమయంలో వచ్చిన శివకుమార్‌ రెడ్డి (పొలిటీషియన్‌ బెజవాడ గోపాల్‌రెడ్డి బావ) అనే ఫ్రెండ్‌ నీరసంగా ఉన్న కృష్ణంరాజుని చూసి, విషయం అడిగి తెలుసుకున్నారు. ‘మాకయితే డబ్బులిస్తావు కానీ నీక్కావాలంటే అడగవా’ అంటూ చివాట్లు పెట్టి, బలవంతంగా హోటల్‌కి తీసుకెళ్లి బిర్యానీ తినిపించారు. అయితే కృష్ణంరాజు తండ్రికి ఈ విషయం తెలిసి, బాధపడి అప్పట్నుంచి నెలకు 1200 రూపాయలు పంపించడం మొదలుపెట్టారు. అప్పట్లో 1200 అంటే పెద్ద మొత్తం కింద లెక్క.

నటన కోసం పుస్తక పఠనం
తొలి చిత్రం ‘చిలకా గోరింకా’ సినిమా కృష్ణంరాజుకు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దాంతో పాటు ఈ సినిమాలో ఇంకా బాగా యాక్ట్‌ చేసుంటే బాగుండనే ఫీలింగ్‌ ఆయనకు కలిగింది. దీంతో నటన గురించి, నటనావిధానాల గురించి తెలుసుకోవడానికి పుస్తకాలు చదవాలనుకున్నారు. ఈ క్రమంలోనే రష్యన్‌ యాక్టర్‌ స్టాన్స్‌ లాస్కీ రచించిన ‘మై లైఫ్‌ ఇన్‌ ఆర్ట్‌’, మరో అంతర్జాతీయస్థాయి దర్శక – నటుడు పుడోకిన్స్‌ రాసిన వ్యాసాలు, వరల్డ్‌ లిటరేచర్‌లో వచ్చిన ‘ది ఆర్ట్‌ ఆఫ్‌ సినిమా అండ్‌ యాక్టింగ్‌’పై వచ్చిన పుస్తకాలను చదివారాయన.

కానీ పుస్తక జ్ఞానం మాత్రమే సరిపోదని, ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ కూడా ఉండాలని తెలుసుకున్నారు కృష్ణంరాజు. ఇందుకోసం అప్పటి సినీ ప్రముఖుడు సీహెచ్‌ నారాయణరావు దగ్గర కృష్ణంరాజు శిక్షణ తీసుకున్నారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి లంచ్‌ అవర్‌ వరకు, మళ్లీ మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు కృష్ణంరాజు నటనలో శిక్షణ తీసుకునేవారు. ఇలా నటనలో తనకు కాన్ఫిడెన్స్‌ వచ్చేంత వరకు మేకప్‌ వేసుకోకూడదని నిర్ణయించుకున్నారు కృష్ణంరాజు.

ఈ క్రమంలో రంగూన్‌ రామారావు డైరెక్షన్‌లోని ఓ సినిమా, జోసఫ్‌ తలియత్‌ అనే దర్శక– నిర్మాతలు ఇచ్చిన హీరో ఆఫర్స్‌ను రిజెక్ట్‌ చేశారు కృష్ణంరాజు. దీంతో ఆయన మిత్రులు కృష్ణంరాజుపై కోప్పడ్డారు. కానీ ఆయన మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకునేందుకు ససేమిరా అన్నారు. నటనపై పూర్తి పట్టు సాధించిన తర్వాతే కృష్ణంరాజు తన తర్వాతి సినిమాకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు.

మరణం గురించి కృష్ణంరాజు చెప్పిన విషయం
జీవించి ఉన్నప్పుడే చావు గురించిన ఆలోచన అంటే చాలామంది భయపడతారు. కానీ కృష్ణంరాజు భయపడలేదు. పైగా తాను ఎలా చనిపోవాలనుకుంటున్నారో ఓ సందర్భంలో ఆయనే చెప్పారు. ‘పచ్చని చెట్టు నీడలో కూర్చొని.. జీవితంలో నేను ఎవరికీ అన్యాయం చేయలేదనే భావనతో గుండెల మీద చేతులు వేసుకుని నిర్మలమైన ఆకాశం వంక చూస్తూ నా తుదిశ్వాస విడవాలి. ఆ రోజూ, ఈ రోజూ .. అదే నా కోరిక’’ అని మరణం గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు కృష్ణంరాజు. 

ధ్యానంలో దైవ దర్శనం
కృష్ణంరాజుకి శివుడు అంటే  ఇష్టం. ఆ విషయం గురించి, కొన్ని ఆధ్యాత్మిక విషయాలను గతంలో ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
కృష్ణంరాజు: సినిమాల్లోకి వచ్చిన మొదట్లోనే శివయ్య పరిచయం అయ్యాడు. ధ్యానంలో అలా కైలాసగిరికి వెళ్లి స్వామిని దర్శించుకొని, తిరుమల వెంకన్నస్వామిని చేరుకొని ఆయన పాదాలకు నమస్కరించుకొని, అన్నవరం సత్య నారాయణ స్వామి దగ్గరకు వెళతాను.

అక్కడి నుంచి షిరిడీ వెళ్లి బాబా హారతిలో పాల్గొని శబరిమలై వెళ్లి పద్దెనిమిది మెట్లు ఎక్కి స్వామిని దర్శిస్తే .. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేం. ఈ ధ్యానప్రయాణంలో శరీరం తేలికైన భావన. పాజిటివ్‌ ఎనర్జీ శరీరాన్ని, మనసును తేజోవంతం చేస్తుంది. టికెట్‌ లేకుండా ఉచిత దర్శనాలు చేసుకొస్తు్తంటారని మా ఇంట్లో అంటారు (నవ్వుతూ).

మీ మీద దైవానికి కోపం వచ్చిందని ఎప్పుడైనా భావించారా?
సినిమాల్లోకి వచ్చిన మొదట్లో గమనించాను. నా పూర్తి పేరు శ్రీ ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌లో కుదించి ‘కృష్ణంరాజు’ అని రిజిస్ట్రేషన్‌ చేయించాను. అప్పటి నుంచి కొన్నాళ్లపాటు ఏ పని చేసినా కలిసి వచ్చేది కాదు. మా ఊళ్లో ఒకతను ‘మీ కులదైవం వెంకటేశ్వరస్వామి. నీ పేరులో ముందున్న ‘వెంకట’  పేరు తీసేశావు.. అందుకే ఈ సమస్యలు’ అన్నాడు.

నాకూ అది నిజమే అనిపించింది. కొన్ని తరాల నుంచి ‘వెంకట’ అని మా ఇంట్లో అందరికీ వారి వారి పేర్ల ముందు ఉంటుంది. దాంతో నా పేరుకు ముందు మళ్లీ ఇంటిపేరు (యు), వెంకట (వి) జత చేసుకున్నప్పడు నా ఎదుగుదలలో మంచి మార్పులు చూశాను. 

దేవుడు, భక్తుడి పాత్రలు చేస్తున్నప్పుడు దైవానికి సంబంధించిన వైబ్రేషన్స్‌ వచ్చేవా?
మేకప్‌ వేసుకున్నానంటే నాకు వేరే ఏదీ గుర్తొచ్చేది కాదు. ఆ పాత్రలో లీనమవుతాను. ఇక భక్తిరస సినిమాలైతే చెప్పక్కర్లేదు. ‘భక్త కన్నప్ప’లో శివుడికి కన్ను ఇచ్చే సీన్‌ చేసేటప్పుడు శరీరం, మనసులో ఏదో తెలియని ఉద్వేగం ఆవరించేది.

నిర్మాతగానూ...
కన్నడ చిత్రం ‘శరపంజర’ (1971) ఆధారంగా తెలుగులో వచ్చిన ‘కృష్ణవేణి’ (1974) సినిమాతో నిర్మాతగా మారారు కృష్ణంరాజు. ఈ సినిమాకు మంచి ప్రేక్షకాదరణ లభించింది. దాంతో తన తమ్ముడు ఉప్పలపాటి సూర్య నారాయణ రాజు (ప్రభాస్‌ తండ్రి) నిర్మాతగా గోపీకృష్ణా మూవీస్‌ బ్యానర్‌ను స్థాపించి, ‘భక్త కన్నప్ప’  సినిమా నిర్మించి, నటించారు కృష్ణంరాజు. బాపు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అనూహ్య విజయం సాధించింది.

ఆ తర్వాత అమరదీపం, ‘మన ఊరి పాండవులు, ‘సీతారాములు , మధురస్వప్నం,  బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు, బిల్లా’ వంటి సినిమాలను నిర్మించారు కృష్ణంరాజు. ‘రాధేశ్యామ్‌’కు సమర్పకులుగా ఉన్నారు. అలాగే హిందీ చిత్రం ‘ధర్మ్‌ అధికారి’కి సమర్పకుడిగా ఉన్నారు కృష్ణంరాజు. ఇక ‘బొబ్బిలి బ్రహ్మన్న’ చిత్రానికి హిందీ రీమేక్‌గా ‘ధర్మ్‌ అధికారి’ని నిర్మించారు. హిందీలోనూ ఈ చిత్రం బాగా ఆడినప్పటికీ కొందరు ఉత్తరాది పంపిణీదారులు మోసం చేయడంతో కొంత నష్టం జరిగిందని ఓ సందర్భంలో కృష్ణంరాజు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement