జుట్టు రాలడానికి అనేక కారణాలు దోహదపడుతుంటాయి. అందులో కొన్ని మందులతోనూ, వైద్యసహాయంతో తప్ప నివారించలేని సమస్యలు ఉండవచ్చు. అయితే మనం మామూలుగాఎలాంటి వైద్యసహాయం లేకుండా నివారించగల సమస్యల్లో ప్రోటీన్లలోపం, శారీరక ఒత్తిడి ముఖ్యమైనవి. ఇలాంటి సమస్యలను పెద్దగా వైద్యసహాయమేమీ లేకుండానే మనకు మనంగా కొన్ని జాగ్రత్తలతో అరికట్టవచ్చు. అలాంటి సమస్యలూ... వాటిని అరికట్టగలిగే తేలిక మార్గాలేమిటో చూద్దాం.
ప్రోటీన్ లోపాల వల్ల: చాలామందిలో జుట్టు రాలిపోవడానికి గల ప్రధాన కారణం... వారు తగినంతగా ప్రోటీన్‌తో కూడిన ఆహారం తీసుకోకపోవడమే. ఈ ప్రోటీన్లే ప్రధానంగా జుట్టు పెరుగుదలకూ, దెబ్బతిన్న జుట్టు తాలూకు రిపేర్లకూ దోహదపడతాయి.
అరికట్టడం ఇలా: ఇలా జుట్టు ఎక్కువగా రాలుతున్నవారు ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. చేపలు, గుడ్లు, మాంసాహారం పుష్కలంగా ప్రోటీన్లు ఉంటాయి. శాకాహారులైతే ఆకుకూరలు, గ్రీన్‌పీస్, నట్స్, శనగలు, పప్పుధాన్యాలు, సోయా తీసుకోవాలి. వీటిలో ప్రోటీన్లు చాలా ఎక్కువ.
శారీరక ఒత్తిడి: మనం నిత్యం ఎదుర్కొనే శారీరక ఒత్తిడులు మనలో భౌతికంగా మార్పులు తెచ్చి జుట్టు రాలిపోయేలా చేస్తాయి. ఇలా జుట్టు రాలడాన్ని ‘టిలోజెన్ ఎఫ్లూవియమ్’ అంటారు. అంటే ఈ దశలో జుట్టు ఊడిపోయే దశ అయిన టిలోజెన్ దశలోకి జుట్టు వెళ్లిపోతుంది. పైగా ఈ దశ చాలాకాలం పాటు కొనసాగుతుంది. ఫలితంగా మాడుపైన జుట్టు పలచబడినట్లుగా కనిపిస్తుంది. ఈ దశలో రాలిన జుట్టు చివరి భాగంలోని తెల్లని పదార్థం పచ్చి పచ్చిగా కాకుండా, బాగా ఎండిపోయినట్లుగా ఉండటాన్ని మనం గమనించవచ్చు.
అరికట్టడం ఇలా: ఇలా రాలిపోయిన జుట్టు సాధారణంగా ఒత్తిడి తొలిగాక మళ్లీ మొలుస్తుంది. అందుకే ఒత్తిడి తొలగించుకోడానికి రిలాక్సేషన్ టెక్నిక్స్ అవలంబించడం, బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌లు చేయడం, యోగా వంటివి ఉపకరిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment