![TV Actress Turned Star Entrepreneur Aashka Goradia - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/1/lady%20boss.jpg.webp?itok=pEQelcBA)
నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్‌ఎస్‌డీ) స్టూడెంట్ అయిన ఆష్క గొరాదియకు బాలీవుడ్‌లో బ్రేక్ రాలేదు. అయితే ఆ అసంతృప్తి ఆమె మాటల్లో ఎప్పుడూ తొంగి చూసేది కాదు. ప్రతి అడుగులో ఆత్మవిశ్వాసం కనిపించేది. ఆ ఆత్మవిశ్వాసమే ఆమెను వ్యాపార రంగం వైపు నడిపించింది. ‘రెనీ కాస్మెటిక్స్’తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఘనవిజయాన్ని సాధించింది..
బాల నటిగా కెరీర్ మొదలు పెట్టింది ఆష్క గొరాదియ. తన ప్రయాణంలో రకరకాల సవాళ్లు, కష్టాలు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. వాటివల్ల పోరాటం ఎలా చేయాలో తనకు తెలిసింది. హిందీ సినిమాల్లో నటిస్తున్న కాలంలోనే హాలీవుడ్ కలలతో అమెరికా వెళ్లింది. అక్కడ పెద్దగా అవకాశాలు రాకపోవడంతో తిరిగి ఇండియాకు వచ్చింది. బాలీవుడ్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి, ఎన్నో టీవి సీరియల్స్‌లో నటించి ‘టీవి స్టార్’గా పేరు తెచ్చుకున్న ఆష్క ఎంటర్‌ప్రెన్యూర్‌గా ప్రయాణం మొదలుపెట్టాలనుకుంది. అయితే అది అంత తేలిక కాదనేది తనకు తెలియని విషయమేమీ కాదు. తన కళ్ల ముందే ఎన్నో అనుభవాలు ఉన్నాయి.
అయితే అవేమీ తనకు అడ్డు కాలేదు. మొదటి అడుగుగా సొంతంగా ప్రొడక్షన్ కంపెనీ మొదలుపెట్టిన ఆష్క ఎన్నో సక్సెస్‌ఫుల్ టీవీ షోలు చేసింది. ఆ తరువాత ట్రావెలర్స్ కోసం ఒక మొబైల్ యాప్ వెంచర్‌ను లాంచ్ చేసింది. ఆ తరువాత స్నేహితులతో కలిసి ప్రారంభించిన ‘రెనీ కాస్మెటిక్స్’ ఆమెను స్టార్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మార్చింది.ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఆష్క ఘనవిజయం ఎంతోమంది ఔత్సాహికులకు స్ఫూర్తి ఇచ్చింది. ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణించాలనుకునే వారికి ఆమె చెప్పిన కొన్ని సలహాలు..
కల కనాలి... ముందుకదలాలి: ఒకరి నుంచి స్ఫూర్తి పొందిన తరువాత కల శ్రీకారం చుట్టుకుంటుంది. అయితే అది సాకారం కావాలంటే ఆచరణలోకి రావాలి. పనికి సంబంధించి స్థాయిని పెంచుకుంటూ పోవాలి.
అంకింతభావం ప్లస్ కష్టం: నటన అయినా వ్యాపారమైనా సక్సెస్ కావాలంటే అంకితభావంతో పాటు బాగా కష్టపడాలి. ఒకవేళ విజయం సాధించకపోయినా మనం కన్న కలకు దూరం కావద్దు. ఓటమి నేర్పే పాఠాలతో ముందుకు వెళ్లాలి. సానుకూల ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వాలి.
రిస్క్‌కు భయపడితే రిస్క్: ఈతకొట్టడానికి నీళ్లలోకి దిగిన తరువాత నీళ్లకు భయపడితే ఎలా! వ్యాపారం అన్నాక రిస్క్ ఉంటుంది. అంతమాత్రాన వెనక్కి తగ్గనవసరం లేదు. మూస ఆలోచనలకు భిన్నంగా కొత్తగా ఆలోచిస్తే విజయం మన చెంతకు నడిచొస్తుంది.
కోవిడ్ కల్లోల సమయంలో ఎన్నో వ్యాపారాలలాగే మా వ్యాపారం కూడా దెబ్బతింది. ‘ఇక నీకు నటనే దిక్కు’ అనేవాళ్లు. అయితే నేనెప్పుడూ నమ్మకం కోల్పోలేదు. మంచిరోజులు వస్తాయని గట్టిగా నమ్మాను. అది నిజమైంది.
నెట్‌వర్క్: నటనకైనా, వ్యాపారానికైనా పదిమందితో పరిచయం ముఖ్యం. ఈవెంట్స్, వర్క్‌షాప్‌లకు హాజరుకావడంతో పాటు ఆన్‌లైన్ కమ్యూనిటీలతో టచ్‌లో ఉండాలి. సామాజిక సంబంధాల ద్వారా కొత్త విషయాలు తెలుస్తాయి. ఆలోచన పరిధి విస్తరిస్తుంది. ముందుకు వెళ్లడానికి కావాల్సిన ధైర్యం లభిస్తుంది.
యుఎస్పీ: ‘మా బ్రాండ్ ఇది’ అని మాత్రమే కాదు ‘మా యూఎస్పీ ఇది’ అని గర్వంగా చెప్పుకోగలగాలి. మా బ్రాండ్ విషయానికి వస్తే హై–క్వాలిటీ, గతంలో ఎప్పుడూ చూడని ప్యాకేజీ, పాకెట్–ఫ్రెండ్లీ ప్రైస్ అనేవి మా యూఎస్పీ. మార్కెట్ ప్లేస్‌లకు వెళుతూ ఎప్పటికప్పుడు ట్రెండ్స్ తెలుసుకోవాలి.
ఆష్కకు నటన, యోగా, పోల్ డ్యాన్స్, ట్రావెల్ అంటే ఇష్టం. ఇక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది వాటికంటే రెండు రెట్లు ఎక్కువ ఇష్టమైనది. సినిమాలు, టీవీ సీరియల్స్‌లో ఆష్క‘బిజినెస్ ఉమన్’ పాత్ర ధరించలేదు. అయితే నిజ జీవితంలో మాత్రం ఆమె ‘బిజినెస్ ఉమన్’గా అద్భుత విజయాన్ని సాధించింది. ‘ది బాస్ లేడీ’ అని స్నేహితులతో పిలిపించుకుంటోంది.
(చదవండి: పద్నాలుగేళ్లకే ఎలన్ మస్క్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా..)
Comments
Please login to add a commentAdd a comment