రాజు– బుధుడు: అధికారంలో ఉన్నవారు వ్యాపార ధోరణిలో ప్రభుత్వాలు నడుపుతారు. ప్రపంచ నాయకులు, దేశ నాయకులు, రాష్ట్ర నాయకుల మధ్య అభిప్రాయాల భేదాలు తలెత్తుతాయి. అధిక పన్నులు తప్పవు. సామాన్య మానవుడికి తినడానికి, తాగడానికి, నివసించడానికి అయ్యే ఖర్చులు అందుబాటు ధరల్లో ఉండవు. భారతదేశం తీసుకున్న కీలక నిర్ణయాలకు తగిన పరిణామాలను ఎదుర్కోవలసిన పరిస్థితులు ఏర్పడుతాయి. ఆయుర్వేద, జ్యోతిష మొదలగు అరుదైన శాస్త్రాలకు ప్రాముఖ్యత పెరుగుతుంది. ఇటువంటి వాటిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం తరఫున మద్దతు లభిస్తుంది. దేశ ఆహార పద్ధతులలో మార్పులు చోటుచేసుకుంటాయి.
ఎగుమతి, దిగుమతి వ్యాపారాలో మార్పులు సంభవిస్తాయి. ప్రపంచ స్థాయిలో దేశాలకు దేశాల మధ్య స్నేహం కాకుండా వ్యాపారధోరణి ఆలోచనలు తలెత్తుతాయి. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఆరోగ్య నియమాలు పాటించాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. నూనె లేకుండా వంటలు చేసుకోవలసిన పరస్థితి సంభవిస్తుంది (ఆరోగ్య నియమం కాదు నూనె కొనలేని పరిస్థితులు ఏర్పడుతాయి.) చర్మ వ్యాధులు, జీర్ణకోశ వ్యాధులు ఎక్కువవుతాయి. పెద్ద నాయకులు సభలు ఏర్పాటు చేసినప్పుడు జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది. అపశ్రుతులు సంభవించే అవకాశం ఉంది. సెక్యూరిటీ ఇబ్బందులు వస్తాయి. ప్రముఖ నాయకులకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతాయి.
ధాన్యాధిపతి– శని: అన్నదాన సత్రాలు అధికమవుతాయి. లోకంలో కనివిని ఎరుగని స్థాయిలో వృద్ధాశ్రమాలు అభివృద్ధి చెందుతాయి. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. ధాన్యం అపరాల దిగుబడి తగ్గుతుంది. ఆహారంలో పోషక విలువలు తగ్గిపోతాయి. పురుగుమందులు ఎక్కువగా ఉపయోగించబడిన పదార్థాలను స్వీకరించి తద్వారా అనేకరకాలైన రోగాలకు గురయ్యే అవకాశం ఉంది. మన సంస్కృతికి విరుద్ధమైన పోషక విలువలు లేని రకరకాల ఆహారపదార్థాలు, పానీయాలు మార్కెట్‌లో చలామణీ అవుతాయి. ఉచిత సేవాకేంద్రాలో కూడా వాణిజ్యపరమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. నువ్వులు, జొన్నలు, రాగులు, ఉలవలు అందుబాటులో ఉంటాయి. పశుదాణాకు కొరత ఏర్పడుతుంది. అకాల వర్షాల వల్ల, వడగళ్ళవాన వల్ల, ఈదురు గాలుల వలన ధాన్య సంపదకు, పంటలకు ఇబ్బందులు ఏర్పడుతాయి. వివిధ రకాలైన పంట పొలాలకు నష్టం కలుగుతుంది.
అర్ఘ్యాధిపతి– గురువు: వేదాధ్యయనం బాగా జరుగుతుంది. తిరిగి వేదాభ్యాసాన్ని ఆశ్రయించేవాళ్ళు అధికమవుతారు. వేదమంత్రాలతో దేవాలయాలు అభివృద్ధి చెందుతాయి. దేశంలోనూ, రాష్ట్రంలోనూ అతివృష్టి, అనావృష్టి కొనసాగుతుంది. అంతరిక్ష ప్రయోగాలు, అంతరిక్ష ప్రయాణాలలో అపశ్రుతులు చోటుచేసుకుంటాయి. ప్రజలలో దానగుణం పెరుగుతుంది. వేదపాఠశాలలు పునరుద్ధిరించబడతాయి, అరుదైన శాస్త్రాలను సంరక్షించుకునే ప్రయత్నాలు జరుగుతాయి. అధికంగా పిల్లలలో అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన విద్యను నేర్చుకోవాలనే ఉబలాటం పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ చదువుకోవాలన్న నేపథ్యంలో ఆలోచిస్తారు.
మేఘాధిపతి– గురువు: అతివృష్టి, అనావృష్టి, పిడుగుపాటులు, వడగళ్ళ వానలు సంభవం. సముద్రంలో ఆటుపోట్లు ప్రపంచస్థాయిలో చర్చనీయాంశంగా మారుతుంది. దీనికి ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికీ ఆస్తి నష్టం తప్పదు. జలప్రళయాలు వస్తాయి. ఆస్తినష్టం సంభవిస్తుంది. సముద్రమధ్య దీవులకు యమగండ కాలం దాపురిస్తుంది. భూకంపాలు అధికమయ్యే అవకాశం ఉంది. ప్రకృతి నిర్దయ ప్రపంచానికి తీవ్ర విషాదాన్ని మిగులుస్తుంది. సునామీలు వచ్చే అవకాశం ఉంది. అగ్నిపర్వతాలు పేలడం సర్వసాధారణం అవుతుంది.
మంత్రి– శుక్రుడు: మంత్రిత్వం బ్రాహ్మణ గ్రహమైన శుక్రుడికి రావడం మంచిదే. పాలకుల ఆలోచనా విధానం, అభివృద్ధికి వ్యూహాలు బాగుంటాయి.అయితే ఆచరణలో మాత్రం తగిన ఫలితాలు రావు. అధికార పక్షానికి, విపక్షాలకు ఎన్నడూ లేని విధంగా సంగ్రామం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో కర్ఫ్యూ విధించే అవకాశం ఉంటుంది. ముఖ్య నాయకుల అసహజ మరణం తీవ్రవిషాదానికి దారితీస్తుంది. పండ్లు, పూలు, స్వీట్లు, మద్యం అధిక ధరలు కలిగి ఉంటాయి. విదేశీ వివాహాల వ్యామోహం అన్ని హద్దులను దాటిపోతుంది. పర్వతప్రాంతాలలో దుస్సంఘటనలు సంభవిస్తాయి. ప్రేమ వివాహాలు, విడాకులు తీసుకునే వారి సంఖ్య అధికమవుతుంది. మారుపెళ్ళిళ్ళ ప్రస్తావన నిత్యకృత్యంగా మారుతుంది. కవులు, కళాకారుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. చిన్నపిల్లలు కళాసాంస్కృతిక వైజ్ఞానిక రంగాలలో అద్భుతంగా రాణిస్తారు. బాలమేధావులను చూసి ప్రపంచం దిగ్భ్రాంతికి లోనవుతుంది. కులమతవర్గ వివక్షలు అధికమవుతాయి. మత మార్పిడులు దేశాన్ని ఒక కుదుపు కుదుపుతాయి. మద్యం వినియోగం అధికమవుతుంది. అనేక రంగాలలో రాజకీయంగా, సామాజిక రంగాలలో, నేరచరిత్రలో స్త్రీల పాత్ర గణనీయంగా పెరుగుతుంది. భార్యా బాధితులు అధికమవుతారు. యువతీ యువకులు విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి, సంస్కృతీ సంప్రదాయాలకు దూరంగా ఉంటారు. యువత మద్యం, మాదక ద్రవ్యాల వలన నిర్వీర్యమవుతారు.
సైన్యాధిపతి– శుక్రుడు: రక్షణ వ్యవస్థ పటిష్ఠంగా ఉంటుంది. సైనికుల వలన దేశానికి ప్రఖ్యాతి లభిస్తుంది. చాలా ప్రదేశాలలో ప్రభుత్వానికి పోటీగా తీవ్రవాద శక్తులు బలోపేతమవుతాయి. హ్యాకర్స్ వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కీలక సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది. ఆంతరంగిక భద్రతా వ్యవస్థకు గడ్డుకాలం. జైలు నుంచి పారిపోయే ఖైదీల సంఖ్య అధికమవుతుంది. స్త్రీలు అనేక రంగాలలో విశేషంగా రాణిస్తారు. క్రీడా, వైద్య, సాంస్కృతిక రంగాలలో స్త్రీలకు అఖండ ఖ్యాతి వస్తుంది. స్త్రీలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు, వేధింపులు అధికమవుతాయి. విడాకులు తీసుకునే వారి సంఖ్య పెరుగుతుంది. మారణాయుధాల వినియోగం, కొనుగోలు, రక్షణ బడ్జెట్ అధికమవుతుంది. సైన్యాధిపత్యం శుక్రుడికి వచ్చిన కారణం చేత రక్షణ రంగం బలపడుతుంది. అద్భుతమైన వ్యూహాలు రచించి, శత్రుదేశాలకు కొరకరాని కొయ్యగా తయారవుతుంది. సెక్యూరిటీ రంగంలో స్త్రీలు ప్రధాన పాత్ర పోషిస్తారు. చాలామంది స్త్రీలు ఐఏఎస్, ఐపీఎస్‌కు ఎంపికవుతారు. కరాటే, మార్షల్ ఆర్ట్స్, షూటింగ్, స్విమ్మింగ్, క్రికెట్, బ్యాడ్మింన్ తదితర క్రీడారంగాలలో స్త్రీలు బాగా రాణిస్తారు.
రసాధిపతి– బుధుడు: ప్రజాపోరాటాలు అధికమవు తాయి. బంగారం సహా లోహాలన్నీ ధర కలిగి ఉంటాయి. పెట్రోలు, డీజిల్ హింసాత్మక సంఘటన లలో ప్రధానపాత్ర పోషిస్తాయి. మారణాయుధాల వినియోగం అధికమవుతుంది. చింతపండు, నూనె, దాల్చినచెక్క, అల్లం, నెయ్యి, పాలు, పెరుగు, హోమ ద్రవ్యాలు, పూజా, అలంకార సామాగ్రి, ఆయుర్వేద మూలికలు ధర కలిగి ఉంటాయి. ఆయుర్వేద, హోమియోపతి వైద్యులకు అనుకూల కాలం. చేతివృత్తుల వారికి ఊరట లభిస్తుంది. సంప్రదాయ వస్తువులకు, సామాగ్రికి ఆదరణ పెరుగుతుంది.
నీరసాధిపతి– చంద్రుడు: చంద్రునికి నీరసాధిపత్యం వచ్చినందున నిజమైన సాహిత్య కళాకారులకి గుర్తింపు లభిస్తుంది. ప్రజాదరణ లభిస్తుంది. ఉన్నతస్థాయిలో ఉన్నవారికి ఇబ్బందులు ఏర్పడుతాయి. ముఖ్య స్థానాలలో ఉన్న నాయకులపై లైంగిక ఆరోపణలు, స్కావ్‌ులు, ఇతర ఆరోపణలు ఎదుర్కోవలసిన పరిస్థితులు ఉంటాయి. దాచిపెట్టుకున్న సొమ్ము మనకు అందకుండా ఎక్కడ ఉందో అని రోజూ బాధపడుతున్న వారికి ఒక శుభవార్త అందుతుంది. వాళ్ళ డబ్బులు ఎవరు కొట్టేశారో, ఏ బడాబాబుల దగ్గర ఉన్నాయో బట్టబయలు అవుతుంది. దంత సమస్యలు అధికమవు తాయి. తైవాన్, అఫ్గానిస్తాన్ తదితర దేశాలలో ప్రకృతి బీభత్సాలు అధికంగా ఉంటాయి. అగ్నిపర్వతాలు విస్ఫోటం చెందే అవకాశం ఉంది. ప్రకృతి ముందు మానవుడు బలహీనుడని మరోసారి రుజువు అవుతుంది. కలుషితమైన ఆహారం, పానీయాలు అందరికీ అందుబాటులో ఉంటాయి. ఆత్మహత్య ధోరణి ప్రపంచ స్థాయిలో అధికమవుతుంది. మంచినీళ్ళు తాగటం కూడా ఓ పెద్ద వరంగా మారుతుంది.
సస్యాధిపతి– చంద్రుడు: జల ఉపద్రవాల వల్ల అనేక ప్రాంతాల్లో బీభత్సం సంభవిస్తుంది. కంట్లో నీళ్ళు, ఇంట్లో నీళ్ళు, త్రాగేందుకు మాత్రం నీళ్ళు దొరకవు. చంద్రుడికి సస్యాధిపత్యం రావడం వలన కళా సంబంధమైన, వినోద సంబంధమైన విషయాలు ప్రజలకు వైషమ్య సందేశాలను అందజేస్తాయి. భార్యాభర్తల మధ్య, యువతీ యువకుల మధ్య ఈ ప్రభావం అధికంగా ఉంటుంది. వృద్ధుల పరిస్థితి దయనీయంగా మారుతుంది. కన్నవారి ప్రేమాభి మానాలు, రక్తసంబంధీకులు ప్రేమానురాగాలను సైతం తూకం వేసి కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. వాణిజ్య పంటలకు మద్దతు ధర లభించదు. నకిలీ విత్తనాలు, నకిలీ పురుగుమందులు చలామణీలో ఉంటాయి. అన్నిరకాల ధాన్యం, నిత్యవసర సరుకుల ధరలు విశేషంగా పెరుగుతాయి. బంగారం, వెండి ధరలు హెచ్చుగానే ఉంటాయి. దేశ ఆర్థిక పరిస్థితి వెనుకంజలో ఉంటుంది. భగవంతుడి అనుగ్రహం చాలా ముఖ్యమైనది.
Comments
Please login to add a commentAdd a comment