ఇటీవల యువత గాడ్జెట్ల వ్యామోహం ఓ రేంజ్‌లో ఉంది. మార్కెట్‌లోకి ఏ కొత్త ఫీచర్ వచ్చినా క్షణం కూడా ఆగరు. రిలీజ్ చేస్తున్న డేట్ ఇవ్వంగానే కొనేసేందుకు రెడీ. ఇంట్లో తల్లింద్రండ్రుల వద్ద డబ్బు ఉందా లేదా అనేది మేటర్ కాదు. ఆరు నూరైనా..కేవలం ఆ కొత్త ఫీచర్ మనం వద్ద ఉండాల్సిందే అన్నంతగా ఉన్నారు యువత. ఇది అసలు మంచిదేనా?..ఒకవేళ్ల అలా కొత్త టెక్నాలజీ కొత్త ఫ్యాషన్‌కి అప్‌గ్రేడ్ కాకపోతే ఏదో పెద్ద నష్టం జరిగనట్టు లేదా భయానక అవమానం జరిగిన రేంజ్‌లో యువత ఇచ్చే బిల్డప్ మాములుగా ఉండదు. ఏంటిదీ? దీని వల్ల ఏం వస్తుంది? ఎవరికీ లాభం?
నిజానికి యువత ముఖ్యంగా కాలేజ్‌కి వెళ్లే టీనేజ్‌ల దగ్గర నుంచి ఉద్యోగాలు చేస్తున్న పెద్దవాళ్ల వరకు అందరికి అప్‌గ్రేడ్ అనే జబ్బు పట్టుకుంది. మార్కెట్‌లోకి వచ్చే కొత్త ఫీచర్ లేదా టెక్నాలజీకి అప్‌గ్రేడ్ అయిపోవాల్సిందే!. లేదంటే ఓర్నీ..! ఎక్కడ ఉన్నవురా? అంటూ ఎగతాళి. పైగా నిన్న మొన్నటి టెక్నాలజీని కూడా తాతాల కాలం నాటిది అంటూ తేలిగ్గా తీసిపడేస్తాం. ఇలా ధరించే దుస్తులు దగ్గర నుంచి కాలికి వేసుకునే చెప్పుల వరకు మార్కెట్‌లోకి వచ్చే ప్రతీ కొత్త బ్రాండ్‌లతో అప్‌గ్రేడ్ అవ్వడం నాగరికత లేక ఓ గొప్ప ట్రెండ్‌గా ఫీలవుతున్నారా? అంటే..ఇక్కడ ఇలా అప్‌గ్రేడ్ పేరుతో మార్కెట్‌లోకి వచ్చే ప్రతిది కొంటున్న యువతకు కూడా ఇలా ఎందుకు అనేది వారికే స్పష్టత లేదు. కానీ ఓ ఆందోళనకరమైన విషవృక్షంలా మనుషుల్లో ఈ విధానం విజృంభిస్తుంది.
మన పక్కోడు ఆ కొత్త టెక్నాలజీకి వెళ్లపోయినంత మాత్రనా వాడు ఏదో సాధించినట్లు కాదు. ముందు మనం దేన్ని ఎంతవరకు కొనాలి. దేనికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలి అనే ధోరణిని మర్చిపోయేలా మాయాజాలం సృష్టిస్తున్నాయి ఈ కార్పొరేట్ కంపెనీలు. ఉదహారణకి ఐఫోన్ పరంగా చూస్తే 4జీ నుంచి 5జీ అప్‌గ్రేడ్ అవ్వాలని నీ వద్ద ఉన్న ఫోర్‌జీ ఫోన్‌ని వదిలేసి కొత్తదానికి వెళ్లాల్సినంత పనిలేదు. మహా అయితే వీడియో లేదా స్టోరేజ్‌కి సంబంధించి కాస్త బెటర్ ఫీచర్ ఉండొచ్చు. దానికోసం ఇలా వేలవేలకు వేలు దుబారా చేయడం సరియైనది కాదు. ఇక్కడ ఉన్న చిన్న లాజిక్‌ని మర్చిపోతున్నాం. మనం ఓ ఫోన్ లేదా ఏ వస్తువైన కొనుక్కుంటున్నాం. దానికి కంపెనీ ఇన్ని ఏళ్లు అని వ్యారెంటీ ఇచ్చేది. మనం కొనుక్కుని వెళ్లిపోతే వాడివద్దకు మళ్లా కస్టమర్‌లు రారు. వాళ్ల బ్రాండ్‌ని మర్చిపోతారు.
నిరంతరం కస్టమర్లతో టచ్‌లో ఉండేలా తన బ్రాండ్‌ని ప్రమోట్ చేసుకునే దృష్ట్యా కంపెనీలు చేసే ఇంద్రజాలం ఇది. దీన్ని గమనించక మన జేబులు గుల్లచేసుకుంటూ అప్‌గ్రేడ్ అంటూ మార్కెట్‌లోకి వచ్చే ప్రతి కొత్త బ్రాండ్‌ని కొనేస్తున్నాం. అప్పటి వరకు మనతో ఉన్న వాటిని పక్కన పడేస్తున్నాం. కొందరి యువతలో ఇదొక మానసిక రుగ్మతలా తయారయ్యిందని మానసిక నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు కొత్త టెక్నాలజీకి చెందిన వస్తువు లేదా మార్కెట్‌లోకి వచ్చిన ట్రెండీ ఫ్యాషన్ తన వద్ద లేనంత మాత్రన ఆత్మనూన్యతకు గురయ్యిపోతున్నారు. మనుషులకు వారి భావాలకు వాల్యూ ఇవ్వండి. నిజానికి అదేమీ స్టాటస్ కాదు. అది అందరూ గమనించాలి.
తల్లిదండ్రులు ఇలాంటి ధోరణి గల పిల్లలను గమనించి కౌన్సిలింగ్ ఇప్పించడం లేదా మీరే చొరవ తీసుకుని ఫ్రెండ్లీగా మాట్లాడి సరైన గాఢీలో పెట్టాలి లేదంటే ఆ మోజులో జీవితాలు అల్లకల్లోలం అయిపోతాయి. ఎందుకంటే ప్రతీది కొనేయ్యలేం. అలాగే ప్రతి అప్‌గ్రేడ్‌ని ప్రతిసారి అందుకోవడం సర్వత్రా సాధ్యం కాదు. ముందు యువత సానుకూల దృక్పథంతో ఈ వస్తువు లేదా దుస్తులు కొనడం వల్ల ఎవరికీ లాభం, దీన్ని ఎందుకు మార్కెట్లో సొమ్ము చేసుకునేలా ఎందుకు ప్రచారం చేస్తారు అనే దానిపై దృష్టిపెట్టండి. మీ పరిజ్ఞానం ఇలాంటి చిన్న చితక వస్తువులకు బానిసైపోకూడదు. ఏదైనా మనకు ఉపయోగపడేది, మన స్థాయికి, ఉన్న పరిస్థితులకు అనుగుణమైనవి మన వద్ద ఉంటే చాలు. ఈ పిచ్చి విధానం మీ ఉనికిని, మీ వైఖరిని కోల్పోయేలా చేస్తుంది. నువ్వు కొత్త టెక్నాలజీకి అడాప్ట్ అవ్వడం కాదు. టెక్నాలజీనే నువ్వు సృష్టించగలిగే దిశగా నాలెడ్జ్‌ని పెంచుకునేలా అడుగులు వేస్తే మీ భవిష్యత్తు బంగారు పూలబాట అవుతుందని అంటున్నారు మానసికి నిపుణులు.
Comments
Please login to add a commentAdd a comment