పుట్టింటికి నడిచొచ్చిన పుస్తకం | Uttar Pradesh Mamta Singh Established Library In Amethi | Sakshi
Sakshi News home page

పుట్టింటికి నడిచొచ్చిన పుస్తకం

Published Wed, Mar 2 2022 2:14 AM | Last Updated on Wed, Mar 2 2022 2:15 AM

Uttar Pradesh Mamta Singh Established Library In Amethi - Sakshi

మనకు కల ఒకటుంటుంది
మన పని మరొకటుంటుంది
బాధ్యతల బరువుంటుంది. 
తప్పక చేయాల్సిన విధి 
ఇంకొకటుంటుంది. 
ఇన్నింటి మధ్య కలను బతికించుకుంటూ 
వెళ్లాలనే తపన ఉంటే అది 
మమతా సింగ్‌ అవుతుంది. 


ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేథీ వాసి మమత. అగ్రసర్‌ అనే గ్రామంలో పుట్టింది. చదువు, పెళ్లి రీత్యా ఏళ్ల క్రితమే ఊరు వదిలి నగరానికి చేరుకుంది. చదువు పూర్తయ్యింది. పెళ్లి అయ్యింది. ఉద్యోగం వచ్చింది. అప్పుడు మొదలయ్యింది. పుట్టిన ఊరుకు ఏదైనా చేయాలి. ఏం చేయాలి.. ?! ఆలోచనలు తెగలేదు. పుస్తకాలంటే తనకు ఇష్టం. పుస్తకం ఇచ్చిన జ్ఞానం అన్నింటినుంచి మనల్ని ప్రత్యేకంగా ఉంచుతుంది అనిపించింది. ఆ పుస్తకాన్ని పుట్టిన ఊళ్లోని ప్రజలకు చేరువ చేయాలనుకుంది. ‘పుస్తకాల పురుగు’ అని స్నేహితులు అంటుంటే విని నవ్వి ఊరుకునేది. ఇప్పుడు ఆ పుస్తకాన్ని పట్టుకుని తను పుట్టి పెరిగిన ఊరికి టీచర్‌గా వెళ్లడమే కాదు, అక్కడివాళ్లకు లైబ్రరీని కానుకగా ఇచ్చింది. వీటి గురించి మమతను కదిలిస్తే పుస్తకం తనకిచ్చిన గొప్ప జీవితం గురించి చెబుతారామె...

‘‘నా చిన్నతనంలో అమ్మ పుస్తకాలను పరిచయం చేసింది. పుస్తకాల మీద నాకున్న మక్కువ వల్ల చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా పుస్తకాలు సేకరించాను. నా దగ్గర ఉన్న పుస్తకాలన్నీ చూసి, లైబ్రరీని ఏర్పాటు చేయచ్చు కదా అని నా ఫ్రెండ్‌ అన్నప్పుడు ఆ సలహా నచ్చింది. అది ఊళ్లో అయితే బాగుంటుందనిపించింది. నా దగ్గరున్న 1200 పుస్తకాలతో ఊళ్లో చిన్న లైబ్రరీని ప్రారంభించాను. సిగరెట్, మద్యం కోసం డబ్బు ఖర్చుపెట్టే జనం రెండు రూపాయలు పుస్తకాల కోసం ఖర్చు పెట్టడానికి వెనకాడతారని నాకు తెలుసు. అందుకే ఉచితంగా పుస్తకాలను అందుబాటులో ఉంచాలనుకున్నాను. ఇప్పుడు 4,000 కంటే ఎక్కువ పుస్తకాలు ఈ లైబ్రరీ లో ఏర్పాటు చేశాను. వీటిలో కొన్ని పుస్తకాలు స్నేహితులు ఇచ్చారు. కంప్యూటర్‌ వంటి పరికరాలు మా కుటుంబ సభ్యులు ఇచ్చారు. అయితే, ముందు ఈ ప్రక్రియ అంత సులభం కాలేదు. 

అడ్డుగా నిలిచిన ఇనుపగోడ
కుల, లింగ వివక్షత అనేవి ప్రజల మనసుల్లో బలంగా ఉండిపోయాయి. మరోవైపు అట్టడుగు వర్గాల వాళ్లు గ్రంథాలయానికి రావడానికి వెనుకాడుతున్నారు. లైబ్రరీకి ‘సావిత్రీబాయి పూలే’ పేరు పెట్టడంతో జనం రావడమే లేదు. నేను ఆ ఊరి స్థానిక ఎన్నికల్లో పోటీ చేయదలుచుకో లేదు, ఇందులో నాకేవిధమైన వ్యక్తిగత ప్రయోజనం లేదు, ఊళ్లో జనాల్ని పుస్తకాలతో అనుసంధానించాలనుకున్నాను. కానీ, ఊళ్లో కొందరు పెద్దలకు ఇది నచ్చలేదు. నా కుటుంబంలో నా సోదరుడు, అతని భార్యనే నాకు ఇనుపగోడగా అడ్డు నిలిచారు. దీనిని పడగొట్టడానికి నేను పెద్ద ప్రయత్నమే చేశాను. ఈ పనిలో నా పిల్లల నుండి కూడా నాకు మద్దతు లభించింది. ఇప్పుడు దగ్గరలోని మరో రెండు గ్రామాల్లోనూ గ్రంథాలయ శాఖలు ఏర్పడ్డాయి. 

పెరిగిన మహిళల సంఖ్య
ప్రభుత్వ టీచర్‌గా ఉద్యోగనియామకానికి నేను పుట్టిపెరిగిన ఊరిని ఎంచుకున్నాను. దీనికి అమ్మనాన్నలు, అత్తమామలు ఇద్దరి మద్దతు లభించింది. లైబ్రరీ ఏర్పాటుకు కూడా! కానీ, గ్రామస్థులకు సమస్య అయ్యింది. కూర్చొని పుస్తకాలు చదవగలిగే లైబ్రరీ లాంటి ప్రదేశం ఒకటుంటుందని వారికి తెలియదు. మొదట్లో పుస్తకాల దుకాణం అనుకున్నారు. పోటీ పరీక్షల పుస్తకాల నుంచి నోట్‌బుక్స్‌ వరకు కావాలని వారు అడుగుతున్నప్పుడు ‘ఇది స్టేషనరీ దుకాణం కాదు, లైబ్రరీ అని, ఇక్కడ చదవడానికి పుస్తకాలు అందుబాటులో అదీ ఉచితంగా ఉంటాయని చెప్పాను. మెల్లగా ఒక్కొక్కరు రావడం మొదలయ్యింది. పాత టైరుతో అటూ ఇటూ పరిగెత్తే పిల్లలు, గొడవపడే పిల్లలు అప్పుడప్పుడు రావడం మొదలయ్యింది. ఇప్పుడు పిల్లలే కాదు మహిళలు కూడా లైబ్రరీలో చదువుకోవడానికి వస్తుంటారు. ఈ లైబ్రరీలో అన్ని వయసుల వారికీ పుస్తకాలు ఉన్నాయి. లాక్డౌన్‌ సమయంలో చిన్నపిల్లలే కాదు టీనేజర్లు కూడా లైబ్రరీలో కూర్చొని పుస్తకాల గురించి చర్చించుకునేవారు. ఈ పుస్తకాలు సమయాన్ని సక్రమంగా ఉపయోగించుకోవడం నేర్పడమే కాకుండా వారి హృదయాలను సున్నితంగా మార్చుతున్నాయి.  

నేర్పిన ఒంటరి ప్రయాణం
పద్దెనిమిదేళ్ల వరకు నేను ఒంటరిగా ఇంటి నుంచి బయటకు వెళ్లలేదు. ఒంటరిగా రోడ్డు దాటింది లేదు. ‘తక్కువ మాట్లాడు, సున్నితంగా మాట్లాడు, అందరి మాటల్ని విను, దుపట్టాను పక్కకు జరగనీకు’ ఇలా చాలా మంది పెద్దవాళ్లు చెప్పిన సలహా ప్రకారం మంచి అమ్మాయి చేసేదంతా నేను చేశాను. కానీ, బంధువులందరిలోనూ ఏదో ఒక లోపం కనిపించడం నేను చూశాను. సమాజం ఇచ్చిన మంచి అమ్మాయి స్లాట్‌లో నన్ను నేను సరిపెట్టుకోవడంలో విసిగిపోయాను. జ్ఞానానికి ప్రత్యామ్నాయం లేదని పుస్తకాల ద్వారా తెలుసుకున్నా, అన్నదమ్ముల కారణంగా వ్యక్తిత్వం బలపడింది. నా భర్త ప్రోత్సాహం వల్ల నా భయాలన్నింటినీ జయించి తొలిసారి ఒంటరి యాత్రకు వెళ్లాను. అండమాన్‌ నికోబార్‌ వరకు ఒంటరిగా నడిచాను. పుస్తకాలు సంతోషపరుస్తాయి. ప్రయాణం ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని ఈ పర్యటన నాకు నేర్పింది.

జీవితంలో చాలాసార్లు నిర్ణయాలు తీసుకుంటాం. కానీ, వాటితో దృఢంగా నిలబడే ఓపిక మనకు ఉండదు. అటువంటి పరిస్థితిలో ఇతరులు చెప్పేదానికంటే మీ హృదయ స్వరం వినడం, మీరు నిర్ణయించుకున్న మార్గంలో నడవడం చాలా ముఖ్యం అని అర్థం చేసుకోవాలి. నేను అదే చేశాను. నా పుస్తకాల ప్రపంచంలో నా గ్రామాన్ని మొత్తం చేర్చాను. ఇప్పుడు ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను. నా కల సంపూర్ణమైందన్న భావన నాకు కలిగింది’’ అంటారు మమతాసింగ్‌. 
  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement