ప్రతినెలలోనూ ఏకాదశి ఉంటుంది కానీ... ఏడాదికి ఓ సారి వచ్చే వైకుంఠ ఏకాదశి మాత్రం చాలా ప్రత్యేకం. ఎందుకలా? ఈ ఏకాదశికే ప్రత్యేకంగా అన్ని పేర్లు ఎలా వచ్చాయి?. పైగా ఆరోజు ఉత్తరద్వారా దర్శనం చేసుకోవాలని అంటారు ఎందుకు?. ఆఖరికి భగవద్గీత పుట్టింది కూడా ఈ పర్వదినమే అని చెబుతుంటారు ఎందుకని?
సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశి లేదా మార్గశిర శుక్లపక్షంలో వచ్చే శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశి అంటేనే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరం. అసుర బాధలు భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్లి ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణుని దర్శించి తమ బాధలను విన్నవించి, స్వామి అనుగ్రహంతో రాక్షస పీడ నుంచి విముక్తులు అయ్యారు. ఏకాదశి తిధినాడు దేవతలందరూ ఉత్తరద్వారం గుండా వెళ్లి వైకుంఠంలో శ్రీమన్నారాయణుని దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశి అని అంటారు. దివి నుంచి భువికి దిగి వచ్చిన మూడు కోట్ల దేవతలకు గరుడ వాహనరూఢుడైన మహావిష్ణువు దర్శనానుగ్రహం ప్రసాదించడం వల్ల ఈ రోజుని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. దీన్నే హరివాసరమని, హరిదినమని వైకుంఠ దినమని అంటారు.
ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది అంటే.. డిసెంబరు 22 శుక్రవారం ఉదయం 9 గంటల 39 నిమిషాల తర్వాత ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. 23 శనివారం ఉదయం 7 గంటల 56 నిముషాలకు పూర్తవుతుంది. అయితే.. సూర్యోదయ సమయంలో ఏకాదశి తిథి ఉన్నరోజునే లెక్కలోకి తీసుకుంటారు. కాబట్టి.. ఇవాళ(డిసెంబర్ 23వ తేదీన) ముక్కోటి ఏకాదశి పర్వదినంగా జరుపుకుంటారు. ఆ రోజున తెల్లవారుజామునే ఏకాదశి ఘడియలు దాటిపోకముందే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం మంచిదని పండితుల వచనం.
ఉత్తర ద్వారా దర్శనం ఎందుకంటే..
వికుంఠ అనే స్త్రీ నుండి అవతరించినందుకు శ్రీ మహావిష్ణువును వైకుంఠుడు అని పిలుస్తారు. ఉత్తర దిక్కున కుభేర స్వరూపంగా ఉండే అధిపతే శ్రీమహావిష్ణువు. విష్ణువు జీవులకు నియంత, జీవులకు సాక్షి, భూతముల స్వేచ్ఛావిహారాన్ని అణచేవాడు. కాబట్టి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించి శ్రీమహావిష్ణువును దర్శించడం అంటే ఇంద్రియాలను అణచుకొని బ్రహ్మజ్ఞ్యానమును పొందుట అని అర్ధం. అందుచేత విశేషించి ఈ రోజున భక్తులందరూ వైష్ణవ ఆలయాలలో ఉత్తర ద్వారం గుండా ప్రవేశించి ప్రదక్షిణలు ముగించుకుని దైవదర్శనం చేసుకుంటూ ఉంటారు. అలా చేసే ప్రదక్షిణను ముక్కోటి ప్రదక్షిణ అని పిలుస్తూ ఉంటారు. ఈ ఉత్తర ద్వారం దర్శనం చేసుకుంటే మనల్ని వెంటాడుతున్న సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం.
పూజా విధానం..
వైకుంఠ ఏకాదశి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి స్నానం చేయాలి. ఉపవాస వ్రతం ప్రారంభించి, మీ ఇంట్లోని పూజా మందిరంలో విష్ణుమూర్తి ఫొటో లేదా విగ్రహం ఎదుట నెయ్యి దీపం వెలిగించి ధ్యానం చేయాలి. విష్ణు పూజ చేసే సమయంలో తులసి, పుష్పాలు, గంగాజలం, పంచామృతం చేర్చాలి. సాయంకాలం వేళ తాజా పండ్లను తినొచ్చు. ఏకాదశి మరుసటి రోజున అవసరంమైన వారికి ఆహారం అందించాలి.
ఈ రోజే గీతా జయంతి కూడా..
మార్గశిర మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి తిథి నాడే గీతా జయంతి కూడా జరుపుకుంటాం. మహాభారతంలోని శ్రీ కృష్ణుడు అర్జునునికి భగవద్గీతను మార్గశిర శుక్ల ఏకాదశి తిథి నాడే భోదించాడు. ఈ రోజున ప్రముఖ దేవాలయాలన్నింటిలో భతవద్గీతను పఠిస్తారు. ఈ రోజు భక్తులు విశేషంగా గీతను, విష్ణువుని పూజిస్తారు.గీత సాక్షాత్తు భగవానునిచేత పలకబడినది . కాబట్టి ఏ సందేహానికి తావులేకుండా భగవద్గీత పరమ ప్రామాణికమైన మానవజాతికి దివ్యమార్గాన్ని చూపే పవిత్రగ్రంథం.
గీకారం త్యాగరూపం స్యాత్
తకారమ్ తత్వబోధకమ్
గీతా వాక్య మిదమ్ తత్వం
జ్ఞేయమ్ సర్వ ముముక్షుభి:
గీత అను రెండక్షరముల తాత్పర్యమును ఈ శ్లోకం తెలుపు చున్నది. "గీ" అనే అక్షరం త్యాగాన్ని ను బోధించుచున్నది. "త" అనే అక్షరం తత్వాన్ని అంటే ఆత్మస్వరూపాన్ని ఉపదేశించుచున్నది. గీత అనే రెండుశబ్దములకు అర్థము ఇదేనని ముముక్షువులు తెలుసుకోవాలని పెద్దలు భోధిస్తున్నారు. త్యాగశబ్దానికి నిష్కామ యోగమైన కర్మ ఫలత్యాగమనీ లేక సర్వసంగపరిత్యాగమనీ అర్థము వుంది.
అలాగే తత్వబోధన ఆత్మసాక్షాత్కారమనీ, బంధం నుంచి విముక్తి కలగటం అనే అర్థం కూడా వుంది. ఈ పరమ రహస్యాన్నే గీతాశాస్త్రము ఉపదేశించుచున్నది. అటువంటి పరమ పావనమైన గీత భగవానుని నోట వెలువడిన మహాపుణ్యదినము మార్గశిర శుద్ధ ఏకాదశి. ఈరోజు ఆపవిత్రగ్రంథాన్ని సృజించినా మహాపుణ్యము వస్తుంది. ఇక పఠన ప్రభావాన్ని వర్ణించనలవికాదు. మానవాళికి సర్వ సమస్యలకు పరిష్కారాన్ని సూచించే జగద్గురువైన ఈ గ్రంథరాజాన్ని ఈ రోజునుంచైనా పఠించటం ప్రారంభించండి.
(చదవండి: భగవద్గీత: విజయవంతమైన జీవనానికి దివ్యౌషధం)
Comments
Please login to add a commentAdd a comment