వాలెంటైన్‌ డే : హత్యలెందుకు..? | Valentines Days No Need To Kill People | Sakshi
Sakshi News home page

ప్రేమలో అసూయ, కక్షలకు తావివ్వొద్దు..

Published Sun, Feb 14 2021 8:46 AM | Last Updated on Sun, Feb 14 2021 10:06 AM

Valentines Days No Need To Kill People - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సృష్టిలో స్నేహం, ప్రేమ అనేవి ఎంతో అద్భుతమైనవి, అందమైనవి, తీయనైనవిగా కలకాలం నిలిచిపోతున్నాయి. ప్రేమ, స్నేహ భావం అనేవి జీవితంలోని అన్నిటా ఎల్లప్పుడూ, ఏదో ఒకరూపంలో స్పృశిస్తూనే ఉంటాయి. ప్రస్తుత డిజిటల్‌ విప్లవ కాలంలో, సోషల్‌ మీడియా క్రేజ్, హవా విపరీతంగా పెరిగిపోయిన ఇప్పటి పరిస్థితుల్లో ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజుగా (‘వాలెంటైన్‌ డే’) అంతర్జాతీయంగా ఎక్కడాలేని ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఏర్ప డ్డాయి. వాలెంటైన్‌ డే అనేది ప్రేమికులకు మాత్రమే పరిమితమైంది కాదు. కుటుంబసభ్యులు, మిత్రులు, సహచరుల మధ్య పరస్పర స్నేహం, మిత్రుత్వం, అనుబంధం, ఆరాధన, గౌరవభావాలు చాటుకునేందుకు ఉద్దేశించినదే ఈ రోజు. 

హత్యలకెందుకు దారితీసున్నాయి? 
ఏ స్నేహమైనా, ప్రేమ అయినా ఏదో ఒక ఆకర్షణతో మొదలవుతుంది. అపోజిట్‌ సెక్స్‌ అట్రాక్షన్‌ అనేది సహజ పరిణామం. అది సినిమాల వల్ల, పాటల వల్ల, రకరకాల పరిస్థితుల ప్రభావం వల్ల ఏర్పడొచ్చు. ఆ ఆకర్షణ మధ్యలో ఏదో ఒక కారణం వల్ల తెగిపోతే, అందులో ఒకరు చాలా తీవ్రమైన ఆకర్షణలో ఉంటే. ఆ వ్యక్తి ఆకర్షణ తక్కువగా ఉన్న వ్యక్తి నిర్లక్ష్యాన్ని, పట్టించుకోనితత్వాన్ని అంగీకరించకుంటే, ఒప్పుకోకుంటే.. అది తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. మనిషి మృగంగా మారుతాడు. మోథేస్‌ అనే సైకాలజిస్ట్‌ పరిశోధనలో తేలిందేమంటే.. ప్రేమను కాపాడుకునేందుకు పుట్టేది అసూయ. ఇది ప్రేమ చేజారుతుందేమో అన్నప్పుడు కాకుండా, తన ప్రేమ మరో అబ్బాయికి దగ్గరవుతున్నప్పుడు అసూయ పెరుగుతుంది.

ప్రేమ వల్ల కలిగే అనుభూతి బాగుంటుంది. కానీ ప్రేమను కోల్పోవడం జీవితాంతం మరిచిపోలేని బాధను మిగులుస్తుంది. ఇది మెదడులోని ‘సెరటోనిన్‌’ మాయజాలం. ప్రేమలో ఉన్నప్పుడు ఇది ఒక రివార్డు మెకానిజంలో సంతోషాన్ని కలిగిస్తుంది. అదే ప్రేమ విఫలమైనప్పుడు రివార్డ్‌ సైకిల్‌ తెగిపోతుంది. అప్పుడు ఆవేశం, కోపంతో ఊగిపోతారు. ఈ కొత్త పరిస్థితికి ఎలా అలవాటుపడాలో తెలియక భౌతికహింస లేదా దాడులకు పాల్పడుతారు. స్త్రీపై తనకున్న అధికారం, నియంత్రణ కోల్పోవడం అనేది నిస్సహాయతను, ఉక్రోషానికి, ఆవేశానికి కారణమై అందుకు కారణమైన వారిని అంతమొందించే ప్రయత్నం చేస్తారు. 

ప్రేమ ఓ పద్మవ్యూహం 
‘ప్రేమ అనేది ఇప్పుడున్న అవగాహన ప్రకారం ఓ పద్మవ్యూహం. ఇందులో అర్జునులు, ద్రోణాచార్యులు చాలా తక్కువ. కానీ అభిమన్యులే ఎక్కువగా ఉంటున్నారు. తనతో ప్రేమలో ఉన్న అమ్మాయి మరొకరి ప్రేమలో పడి వెళ్లిపోవడం సదరు ప్రేమికుడిని తీవ్ర మానసికవేదనకు, తిరస్కారం వల్ల ఎదురయ్యే తీరని బాధకు దారితీస్తుంది. తన ప్రేమను అమ్మాయి తిరస్కరించడం కొంతమేరకు తట్టుకోగలిగినదైనా, మరొకరి చెంతకు చేరడం తట్టుకోలేనంత బాధను కలిగిస్తుంది. ఎవరైనా ఏదైనా రిలేషన్‌షిప్‌లోకి అడుగుపెట్టే ముందు చాలా అంశాల గురించి ఆలోచించాలి. అబ్బాయి, అమ్మాయి పరస్పరం ప్రేమించుకోవడానికి ముందే వారిద్దరి భావాలు, అభిప్రాయాలు కలుస్తాయా, అవగాహన కుదురుతుందా లేదా.. ఇళ్లలో వారి ప్రేమను అంగీకరించకపోయినా ఎదురయ్యే పరిణామాలను ధైర్యంగా ఎదుర్కోగలరా.. అన్న విషయాలపై ఆలోచించుకోవాలి. కొంతకాలం ప్రేమ కొనసాగించాక అభిరుచులు, అభిప్రాయాల్లో తేడాలొస్తే ఎదుటి వ్యక్తి సరైన వారు కాదని రిలేషన్‌షిప్‌ నుంచి దూరం జరగడంతో సమస్య మొదలవుతుంది. ప్రేమ తిరస్కరణను భరించలేక భౌతికదాడులు, హత్యల దాకా పరిస్థితులు దారితీస్తున్నాయి.  – సి.వీరేందర్, సీనియర్‌ సైకాలజిస్ట్‌ í 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement