ప్రేమ రెండక్షరాలు.. రెండు హృదయాలు.. ఇద్దరు మనుషులు.. ప్రేమ.. ఒక ధైర్యం.. ఒక సాహసం.. ప్రేమ అనిర్వచనీయం... చూపులు కలిసి.. మనుసులు ఒక్కటై జీవిత భాగస్వాములుగా కలకాలంగా జీవించేందుకు పునాది వేస్తుంది. ఆ జీవన ప్రయాణంలో ఏళ్లు గడిచినా.. ఇంకా కొత్తగానే అనిపిస్తుంది. ఆ మధుర స్మృతులను కలకాలం గుర్తుండేలా చేస్తుంది. ఇలా.. ఉమ్మడి కరీంనగర్‌జిల్లాకు చెందిన పలువురు ప్రేమ పెళ్లిళ్లు చేసుకుని ఆదర్శంగా నిలుస్తున్నారు.
క్లాసురూముల్లో మొదలైన ప్రేమను కలకాలం నిలుపుకుని ఆనందంగా గడుపుతున్నారు. ప్రేమ ఎంత మధురమో.. జీవితంలో స్థిరపడడం అంతే ముఖ్యమంటూ సూచిస్తున్నారు. ప్రస్తుత టీనేజీ యువత ఆకర్షణను ప్రేమ అనుకుంటూ.. జీవితంలో దారి తప్పుతున్నారని పలువురు హెచ్చరిస్తుండగా.. స్వచ్ఛమైన ప్రేమ కలకాలం నిలుస్తుందని మరికొందరు సూచిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో పలు ఆలయాలు ప్రేమ పెళ్లిళ్లకు వేదికగా నిలవగా.. కొన్ని లవ్‌స్పాట్స్ వారి స్వీట్ మెమొరీస్‌కు వేదికవుతున్నాయి. నేడు ప్రేమికుల దినోత్సవంగా సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు..!!
ప్రేమ.. ఉద్యోగం.. పెళ్లి
బుగ్గారం: మాది ప్రేమ వివాహం. నేను నా భార్య హరికరెడ్డి ఒకే పాఠశాలలో చదువుకున్నాం. పక్కపక్క గ్రామాలు కావడంతో పరిచయం పెరిగింది. కాలేజీ రోజులలో ప్రేమగా మారింది. పెద్దలకు తెలిసినా జీవితంలో స్థిరపడ్డాకే పెళ్లి చేసుకోవాలని సలహా ఇచ్చారు. అప్పటికి నేను కానిస్టేబుల్ ఉద్యోగం సాధించా. తను బీఈడీ చదువుతోంది. కొద్దిరోజులకు స్కూల్ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించింది. రెండేళ్లకు నేను ఎస్సైగా ఎంపికయ్యాను. ఇటీవలే పెళ్లిబంధంతో ఒక్కటయ్యాం. ఇప్పుడు ఇద్దరం ఒకే నియోజకవర్గంలో ఉద్యోగాలు చేస్తున్నాం. ప్రేమ ఎంత ముఖ్యమో కెరియర్ అంతే ముఖ్యమని యువత గుర్తించాలి.
– శ్రీధర్‌రెడ్డి, ఎస్సై బుగ్గారం, జగిత్యాల జిల్లా
శాలపల్లి అబ్బాయి.. నేపాల్ అమ్మాయి.
గొల్లపల్లి: జిల్లాలోని పెగడపల్లి మండలం శాలపల్లి గ్రామానికి చెందిన కొండి వెంకటి– లక్ష్మి దంపతుల కొడుకు రవి ఆరేళ్లుగా దుబాయ్‌లో ఉంటున్నాడు. అక్కడే పనిచేసే నేపాల్‌కు చెందిన చంద్రమయ రాయ్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. మూడేళ్లక్రితం ఇరు కుటుంబాలను ఒప్పించి దుబాయ్‌లో పెళ్లి చేసుకున్నారు. ఏడాది క్రితం వీరికి కుమారుడు జన్మించాడు. ప్రేమ, అనుబంధాలకు భాష, సరిహద్దులు అడ్డురావని రవి–చంద్రమయ రాయ్ చెబుతున్నారు.
డాక్టర్ లవర్స్..
జమ్మికుంట: నా పేరు కన్నవేన తిరుపతి. సొంతూరు జమ్మికుంట మండలం మాచనపల్లి. కాకతీయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ కోర్సు చదువున్న సందర్భంలో హైదరాబాద్ మల్కాజిగిరికి చెందిన కె.స్వర్ణలతలో పరిచయం ఏర్పడింది. మొదట స్నేహితులుగా ఉన్నాం. తరువాత ప్రేమగా మారింది. 2015లో పీజీ చదువుతుండగా పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. ఇరు కుటుంబాల అంగీకారంతో 2017లో వివాహం చేసుకున్నాం. ఇప్పుడు మాకు ముగ్గురు పిల్లలు. 2020 నుంచి జమ్మికుంటలో ఓ ఆస్పత్రి నెలకొల్పి వైద్య సేవలు అందిస్తున్నాం.
– కన్నవేన తిరుపతి, జమ్మికుంట
అల్గునూర్ అబ్బాయి.. శ్రీలంక అమ్మాయి
తిమ్మాపూర్: చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లిన అల్గునూర్ అబ్బాయి.. శ్రీలంక అమ్మాయి మధ్య ప్రేమ చిగురించింది. ఆ ప్రేమను పదేళ్లు నిలుపుకుని, పెద్దలను ఒప్పించి పెళ్లి పీటలెక్కారు. తిమ్మాపూర్ మండలం అల్గునూర్‌కు చెందిన అరుణ్‌కుమార్ ఇంజినీరింగ్ పూర్తిచేసి పైచదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లాడు. శ్రీలంకలో డిగ్రీ చదివిన అజ్జూరా.. ఎంబీఏ చదివేందుకు ఆస్ట్రేలియా వెళ్లింది. 2014లో ఇద్దరూ పరిచయమయ్యారు. వారిమధ్య ఏర్పడిన స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. ఆ ప్రేమను పెద్దలు అంగీకరించేందుకు చాలా సమయం పట్టింది. ఆలస్యమైనా పదేళ్లు నిరీక్షించారు. చివరకు తల్లిదండ్రులు వారి ప్రేమలోని నిజాయితీని గుర్తించి అంగీకరించారు. పెద్దల అంగీకారంతో అజ్జూరాతోపాటు ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను తీసుకుని అల్గునూర్‌కు వచ్చాడు అరుణ్‌కుమార్. ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో హిందూ వివాహ చట్టం ప్రకారం గత డిసెంబర్‌లో వివాహంతో ఒక్కటయ్యారు. ఇక జనవరిలో ఈ జంట శ్రీలంక వెళ్లింది. వధువు కుటుంబసభ్యులు బౌద్ధులు కావడంతో అక్కడ ఇద్దరూ మరోమారు బౌద్ధ సంప్రదాయం ప్రకారం ఒక్కటయ్యారు.
కులాంతర వివాహాల ‘మరిమడ్ల’
కోనరావుపేట(వేములవాడ): రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మరిమడ్ల ప్రేమాలయంగా వర్ధిల్లుతోంది. ఆ ఊరి జనాభా నాలుగు వేలు. ఆ పల్లెలో దశాబ్దకాలంగా 30 జంటలు ఒక్కటయ్యాయి. కట్నాలు లేకుండా.. ఆదర్శ పెళ్లిళ్లు చేసుకున్నారు. అక్కడ కొట్లాటలు, గొడవలు, ‘పరువు’ హత్యలు కనిపించవు. ఈ ఊరిలో ప్రేమించుకున్న వాళ్లు ధైర్యంగా పెద్దలకు చెప్పి, పెళ్లి చేసుకుంటారు. ప్రభుత్వం జరిపించే కల్యాణమస్తు సామూహిక వివాహ వేదికలో నిజామాబాద్ జిల్లాకు చెందిన రవికుమార్‌తో ముంబయికి చెందిన రజిత వివాహాన్ని మరిమడ్ల వాసులు దగ్గరుండి జరిపించారు.
Comments
Please login to add a commentAdd a comment