ప్రతీకాత్మక చిత్రం
What Are The Amazing Benefits Of Fasting: కార్తీక మాసం వచ్చింది. ఈ మాసంలో చాలామంది పగలంతా ఉపవాసం ఉండి, రాత్రిళ్లు మాత్రం మితాహారం తీసుకుంటారు. కొందరేమో ఈ మాసంలోని కొన్ని ప్రత్యేకమైన తిథులలో లేదా పర్వదినాలలో మాత్రం రోజంతా ఉపవాసం ఉండి, మరునాడు భోజనం చేస్తారు. అయితే ఉపవాసం అనేది కేవలం దైవభక్తితో చేసేది మాత్రమే కాదు... ఉపవాసం వల్ల చాలా లాభాలు ఉంటాయని పరిశోధనలు తెలుపుతున్నాయి.
లావుగా ఉన్నవారికి ఇది మరీ ఉపయోగ పడుతుంది. రోజంతా ఏది తినక పోవడం వల్ల శరీరంలో ఉన్న క్యాలరీలు ఖర్చు అవుతాయి. దీనివల్ల బరువు కూడా తక్కువ అవుతారు. అంతేకాదు రక్తంలో చక్కెరను కూడా మెరుగుపరుస్తుంది. ఈ సమయంలో ఆరోగ్యకరమైన ఆహారం తినడం వల్ల తగిన క్యాలరీలు పొందవచ్చు. ఉపవాసం వల్ల శరీరం తనని తాను శుభ్రం చేసుకుని కొత్త శక్తి వస్తుందని.. ఆరోగ్యం మెరుగుపడుతుందని జపాన్‌కు చెందిన శాస్త్రవేత్త యోషినోరి ఓఘమి అంటున్నారు. ఆయన ఉపవాసం వల్ల ఏం జరుగుతుందో వివరంగా చెప్పారు. అవేంటో చూద్దాం.
ఉపవాసం వల్ల ప్రయోజనాలు
ఉపవాసం వల్ల శరీరంలో దెబ్బతిన్న కణాలు తమను తాము తినటం లేదా తమను తాము నాశనం చేసుకోవటం వల్ల గ్రోత్ హార్మోన్ పెరుగుతుంది. తద్వారా కొత్త కణాలు పుడతాయి. దీన్నే వైద్య భాషలో ఆటోఫజీ అంటారట. మనం రోజూ తీసుకునే ఆహారం, జంక్ ఫుడ్ అలా సగం జీర్ణం అయినా.. కొవ్వు రూపంలో పేరుకుపోతూనే ఉంటుంది. సాధారణంగా ఇదంతా డైలీ వ్యాయామం చేస్తే కరిగిపోతుంది అంటారు.
కానీ మనకు అంత టైం ఎలాగూ ఉండదు. అందుకే కనీసం ఇలా ఉపవాసం చేయటం వల్ల శరీరంలో పేరుకు పోతూ ఉండే పాడైన, చనిపోయిన కణాలను శరీరం తనంతట తానుగా తొలగించుకుంటుంది. కాబట్టి ఉపవాసం వల్ల ఆరోగ్యపరమైన లాభం పొందవచ్చని జపాన్‌కు చెందిన ‘యోషినోరి ఓషుమి’ అనే శాస్త్రవేత్త చెబుతున్నారు.
సింపుల్ గా చెప్పాలంటే...
ఉపవాసంలో ఉన్నప్పుడు తినటానికి ఆహారం అందుబాటులో లేదని, లేదా ఏం తినకూడదు అనే విషయాన్ని మన శరీరం మెదడుకు తెలుపుతుంది. దాంతో నిల్వ ఉన్న శక్తిని వినియోగించమని మెదడు శరీరాన్ని ఆదేశిస్తుంది. అప్పుడు శరీర కణాలు శక్తి కోసం పాతవి, వయసు మీరినవి అయిన పనికిరాని ప్రొటీన్ల మీద దాడి చేస్తాయట.. ఇలా ఎందుకు జరుగుతుందంటే?
ఆహారం శరీరానికి అందనప్పుడు ఇన్సులిన్ లెవెల్స్ పడిపోతాయి.. దానికి వ్యతిరేకమైనదైన గ్లూకగాన్ విజృంభించటం మొదలు పెడుతుంది. ఈ గ్లూకాగాన్ యాక్టివేట్ అయి శరీరంలో శుభ్రం చేయాల్సిన, నిరర్ధకంగా పడి ఉన్న కణాల మీదకు దృష్టి మళ్లిస్తుంది. ఆ క్రమంలో పాత కణాల స్థానంలో కొత్త శక్తివంతమైన కణాల తయారీ మొదలవుతుంది.
ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కదా అని అదేపనిగా ఉపవాసం ఉండటమూ మంచిది కాదు. ఎందుకంటే అసలు మీ శరీరంలో పాడైన కణాలు ఉండకపోతే.. శరీరం ఏం చేస్తుంది ఇక.. శక్తిని అందించలేక డీలా పడిపోతుంది. తద్వారా నీరసం వచ్చి ఇతర అనారోగ్య సమస్యలు దాడి చేసే ప్రమాదం ఉంది కాబట్టి ఉపవాసం కాస్త చూసుకుని చేయడం మంచిది. ఎందులోనూ అతి పనికి రాదన్న సూత్రం ఉపవాస విషయం లోనూ వర్తిస్తుందని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా డయాబెటిస్ వంటి వ్యాధులు ఉన్న వారు ఉపవాసం చేసేముందు డాక్టర్ సలహా తీసుకోవడం, దానిని తట్టుకోగలమా లేదా అని ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవడం మంచిది.
Comments
Please login to add a commentAdd a comment