ప్రతీకాత్మక చిత్రం
కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అనే రుగ్మతతో బాధపడేవారిలో అరచేతి నొప్పి, మణికట్టులో, వేళ్లలో చాలా నొప్పిగా ఉంటుంది. చేయి తిమ్మిర్లుగా కూడా ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో చేత్తో ఏదీ ఎత్తలేకపోవచ్చు. మణికట్టుపై ఒత్తిడి పడే వృత్తుల్లో ఈ సమస్య ఎక్కువ. అలాగే ఆటగాళ్లు, కంప్యూటర్‌పై పనిచేసే వారిలోనూ ఇది కనిపించే అవకాశాలు ఎక్కువే. కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి, ఈ నొప్పి ఎందుకు వస్తుంది, దాని నుంచి ఉపశమనం కోసం మార్గాలేమిటో చూద్దాం.
మణికట్టులో ఎముకల అమరిక విలక్షణంగా ఉంటుంది. మణికట్టు లోంచి అరచేతిలో ఒక సన్నటి ద్వారం (టన్నెల్)ను ఏర్పరిచేలా అక్కడ ఎముకలు అమరుతాయి. దాంట్లో నుంచి మీడియన్ నర్వ్ అరచేతిలోకి వేళ్లలోకి ప్రవేశిస్తుంది. వేళ్లను వంచడానికి ఉపయోగపడే టెండన్స్‌కు కూడా ఇదే ద్వారం నుంచి వెళ్తాయి. ఈ టన్నెల్ మన బొటనవేలి అంత విశాలంగా ఉంటుంది.
దీని చుట్టూ కార్పల్ అనే ఎముకలూ, ఫెక్సార్ రెటినాకులమ్ అనే లిగమెంట్లు ఉంటాయి. మణికట్టులోని ఈ మీడియన్ నర్వ్ మీద ఏదైనా ఒత్తిడి పడినప్పుడు... చెయ్యి బలహీనంగా అనిపించవచ్చు. ఇదే నరం నొక్కుకుపోవడం వల్ల తిమ్మిరిగా కూడా అనిపిస్తుంది. మీడియన్ నర్వ్ స్పర్శజ్ఞానంతో పాటు కదలిలకూ ఉపయోగపడుతుంది. అది బొటనవేలు, చూపుడువేలు, మధ్యవేలితోపాటు కొంతవరకు ఉంగరపు వేలికీ వెళ్తుంది.
దీని తోడ్పాటు వల్లనే ఆయా వేళ్లలో కదలికలు జరుగుతుంటాయి. అందుకే మణికట్టు భాగంలోని దీని మీద ఒత్తిడి పడితే... ఆ ప్రభావం వేళ్ల కదలికల మీదా పడుతుంది. ఈ టన్నెల్‌లాంటి ద్వారంలోని మణికట్టు ఎముకల పైపొరతో పాటు... ఇందులోని సైనోవియమ్ పొరల్లోనూ వాపు రావచ్చు. ఈ వాపు కారణంగా... అక్కడి స్థలం సరిపోక అది మీడియన్ నరంపై ఒత్తిడి పడేలా చేయవచ్చు.
ఎలక్ట్రోఫిజియాలజీ పరీక్షల ద్వారా కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్‌ను నిర్ధారణ చేస్తారు. సమస్య ఒకింత తక్కువే ఉంటే... చేస్తున్న పని మధ్యన అప్పుడప్పుడూ మణికట్టుకు విశ్రాంతి కల్పిస్తుండటం ద్వారా ఈ సమస్యకు చాలావరకు అడ్డుకట్ట వేయవచ్చు. నొప్పి వస్తున్నప్పుడు మణికట్టు ఎముకల్లో కదలికలు ఏర్పడకుండా పట్టీలు వేయడం ద్వారా కూడా కొంతవరకు ఉపశమనం ఉంటుంది. నొప్పి మరీ తీవ్రంగా ఉన్నప్పుడు డాక్టర్ల నిర్ణయం మేరకు కొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చు.
చదవండి: Gynecology: నొప్పి... దుర్వాసనతో కూడిన వైట్ డిశ్చార్జ్.. ఇదేమైనా ప్రమాదమా?
Comments
Please login to add a commentAdd a comment