భారతీయ సంప్రదాయం ప్రకారం పెళ్లంటే నూరేళ్ల పంట. అందుకే దంపతుల మధ్య అభిప్రాయభేదాలు, పొరపొచ్చాలు వచ్చినా సర్దుకుపొమ్మనే సలహా ఇస్తారు. చాలా జంటలు అలాగే సర్దుకుపోతుంటాయి. అలా కుదరని వాళ్లు విడాకులు తీసుకుని విడిపోతుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే.
కానీ, పరిస్థితులు మారాయి, మారుతున్నాయి. పాతికేళ్లు అన్యోన్యంగా కాపురం చేసినవాళ్లు, 50 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకోవడమనేది ఇటీవల కనిపిస్తున్న ట్రెండ్. దీన్నే ‘గ్రే డివోర్స్’ అంటున్నారు. తాజాగా ఏఆర్ రెహమాన్–సైరాబాను విడాకులు గ్రే డివోర్స్‌పై విస్తృతమైన చర్చను రేకెత్తించాయి. అసలెందుకిలా జరుగుతోంది? లేటు వయసులో విడాకులు తీసుకోవాల్సిన అవసరం ఎందుకొస్తోంది? భారతీయ వైవాహిక వ్యవస్థ బీటలు వారుతోందా? ఈ ప్రశ్నలకు సమాధానం అన్వేషిద్దాం.
గ్రే డివోర్స్ ఎందుకు జరుగుతాయి?
సమాజంలో మారుతున్న విలువలు, పెరుగుతున్న జీవితకాలం, వ్యక్తిగత సంతోషానికి పెరుగుతున్న ప్రాధాన్యం దీనికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.
1. వ్యక్తిగత ఎదుగుదలలో అసంతృప్తి
కొంతమంది చిన్న వయసులో వివాహం చేసుకుంటారు. ఆ తర్వాత వ్యక్తిగత ఆశయాలకంటే సామాజిక బాధ్యతలకే ప్రాధాన్యం ఇస్తారు. కాలక్రమంలో, ఒకరు లేదా ఇద్దరూ తమ వ్యక్తిగత అభివృద్ధి కోసం ప్రయత్నిస్తారు. దానికి భాగస్వామిని అడ్డంకిగా భావించినప్పుడు విడాకులకు వెళ్తున్నారు.
2. ఎమ్టీ నెస్ట్ సిండ్రోమ్
పిల్లలు పెద్దవారై ఇళ్ల నుంచి వెళ్లిపోయిన తర్వాత, దంపతుల బాధ్యతలు తగ్గుతాయి. అప్పటివరకు పిల్లల కోసం అడ్జస్ట్ అయినవారు స్వేచ్ఛ వచ్చినట్లుగా భావిస్తారు. భాగ స్వామితో గతంలో పరిష్కరిం చుకోని సమస్యలు పెరుగుతాయి. దాంతో వారిద్దరి మధ్య ఉన్న బంధం బలహీనపడి విడాకులకు దారితీస్తుంది.
3. ప్రేమ, సహవాసంపై మారుతున్న అభిప్రాయాలు
ప్రేమ, పెళ్లి, సహజీవనంపై కాలంతో పాటు అభిప్రాయాలు మారుతున్నాయి. పెళ్లంటే నూరేళ్ల పంట అనే భావన మాయమై, కలిసి ఉన్నన్నాళ్లు సంతోషంగా జీవించాలనే అభిప్రాయం పెరుగుతోంది. ఆధునిక వైద్యంతో జీవనకాలం పెరగడంతో ఏభైల తర్వాత కూడా నచ్చినవారితో జీవితం గడపాలనే భావన పెరుగుతోంది.
4. ఆర్థిక స్వాతంత్య్రం
గతంలో భర్త పనిచేస్తుంటే భార్య ఇంటిపనులు చూసుకునేది. కానీ ఇప్పుడు మహిళలు ఆర్థికంగా స్వతంత్రులవుతున్నారు. దీంతో బాధాకరమైన సంబంధాలను ఏమాత్రం సహించడంలేదు. గృహహింసను భరించేకంటే వైవాహిక బంధం నుంచి బయటపడటమే మంచిదని భావిస్తున్నారు.
5. విడాకులపై సామాజిక స్వీకారం
ఒకప్పుడు విడాకుల పట్ల ఉన్న వ్యతిరేకత ఇప్పుడు మారిపోయింది. సెలబ్రిటీలు గ్రే డివోర్స్ తీసుకోవడం ఇతరులకు మార్గదర్శకం అవుతోంది. దాంతో సామాన్యులు కూడా గ్రే డివోర్స్ గురించి ఆలోచిస్తున్నారు.
గ్రే డివోర్స్‌తో సమస్యలు..
గ్రే డివోర్స్.. విముక్తి కలిగిస్తున్నట్టు అనిపించినా, వాటి వెనుక కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి.
⇒ అస్తిత్వ సంక్షోభం: అనేక సంవత్సరాలపాటు ఒక భాగస్వామిగా ఉన్న తర్వాత, ఒంటరిగా జీవించడం ఒక పెద్ద మార్పు. ‘నా జీవితంలో భాగస్వామి లేకుండా నేను ఎవరు?’ అనే ప్రశ్నలతో బాధపడతారు.
⇒ ఒంటరితనం: జీవితం చివరిలో ఏకాకిగా ఉండటం ఒంటరితనాన్ని మరింత పెంచుతుంది.
⇒ కుటుంబ సంబంధాలు: పెద్దయిన పిల్లలు తమ తల్లిదండ్రుల నిర్ణయాన్ని అంగీకరించలేకపోవచ్చు. కొన్నిసార్లు వారు తల్లిదండ్రులపై కోపంగా ఉండవచ్చు.
·
గ్రే డివోర్స్‌ను
తప్పించేందుకు సూచనలు
1. ఏ బంధానికైనా సంభాషణ ముఖ్యం. అందుకే మీ భావాలు, అంచనాలు, ఆందోళనల గురించి భాగస్వామితో క్రమం తప్పకుండా చర్చించండి.
2. వయసుతో పాటు భావోద్వేగ అవసరాలు కూడా మారుతాయి. ఆలోచనలు, కలలు, భయాలను పంచుకునే సమయాన్ని కేటాయించి బంధాన్ని బలోపేతం చేసుకోండి.
3. మీ ఇద్దరికీ ఇష్టమైన కార్యకలాపాలు లేదా అభిరుచులను గుర్తించి, వాటిని తిరిగి ప్రారంభించండి.
4. చేతులు పట్టుకోవడం, ఆలింగనం చేయడం వంటి స్పర్శతో ప్రేమను గుర్తు చేస్తూ ఉండండి.
5. వ్యక్తిగత అభిరుచులకు ప్రోత్సాహం ఇవ్వడం, కలిసి ఎదగడం ద్వారా సంబంధాన్ని సజీవంగా ఉంచండి.
6. నిందించడం తగ్గించి, శ్రద్ధగా వినండి. ఇద్దరి అవసరాలను గౌరవించే పరిష్కారాలను కనుక్కోండి.
7. మీ భాగస్వామి చేసిన కృషిని గుర్తించడం, థాంక్స్ చెప్పడం వంటి చిన్న పనులు బంధాన్ని బలపరుస్తాయి.
8. సమస్యలను పరిష్కరించడానికి, సంభాషణను మెరుగుపరచడానికి, బంధాన్ని బలపరచడానికి కౌన్సెలింగ్ కూడా సహాయపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment