ఈ ముగ్గుల సంస్కృతి ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల్లో ఉంది. కాకపోతే ఒక్కోభాషలో ఒక్కో పేరుతో దీన్ని పిలుస్తారు. తెలుగులో ముగ్గులు అంటాం. కన్నడలో రంగోలి అంటారు. తమిళం-మళయాళంలో కోలం, బెంగాల్‌లో అల్పన, రాజస్థాన్‌లో మండన, సంస్కృతంలో మండల వంటి పేర్లుతో పిలుస్తారు. ఏ పేరుతో పిలిచినా.. అందరూ అందంగా తీర్చిదిద్దేది రంగవల్లులే. పండుగలతో సంబంధం లేకుండా ప్రతి తెలుగింటి లోగిళ్లలో తప్పనిసరిగా ముగ్గు వేయడం పరిపాటి. ఇది అనాదిగా వస్తున్న ఆచారం లేదా సంస్కతిగా చెబుతారు పెద్దలు. అయితే ఇలా ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్దడంలో దాగున్న ఆరోగ్య రహస్యం, సైన్సు ఏంటో చూద్దామా ఏంటో చూద్దామా..!
ముత్యాల ముగ్గులోని శాస్త్రీయ కోణం..
ముగ్గులని ప్రాచీన ఖగోళశాస్త్రంగా చెబుతుంటారు. పూర్వం ఆర్యభట్ట ఖగోళాన్ని అధ్యయనం చేసేందుకు ముగ్గుల రూపంలో నేలమీద చిత్రించాడట. అప్పటినుంచే ఖగోళశాస్త్ర రహస్యాలకు ప్రతీకగా చుక్కలు పెట్టడం, వాటిని వివిధ ఆకారాల్లో కలపడం ద్వారా ముగ్గులను వేస్తున్నారని నానుడి. జ్యోతిషంలో కనిపించే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, రాశుల చిహ్నాలూ ముగ్గుల్లో కనిపిస్తాయి. గృహవాస్తు, ఆలయవాస్తు, నగర నిర్మాణాల్ని తెలిపే రంగవల్లులూ ఉన్నాయంటున్నారు నిపుణులు.
వైద్యశాస్త్రం కూడా ఉందట..
రంగవల్లిలో కిందికి చూపించే త్రిభుజాలు స్త్రీలనీ, పైకి చూపించే త్రిభుజాలు పురుషులనీ, ఈ రెంటినీ కలపడం ద్వారా గీసిన ఆరు కోణాల నక్షత్రం స్త్రీ, పురుషుల కలయికకు సంకేతమనీ నమ్ముతారు. ముగ్గులోని కలుగపువ్వు గర్భాన్ని సూచిస్తుందట. నేటి కంప్యూటేషనల్ ఆంత్రోపాలజీ పరిశోధనలకీ ముగ్గు ఉపయోగపడుతుంది.
ముగ్గుల్లోని గణిత సూత్రాలను అధ్యయనం చేసేందుకు ఆల్గారిథమ్స్‌ను రూపొందించి, వాటిని బొమ్మలు గీసే కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌లోనూ వాడుతున్నారట. అంతేగాదు సంక్లిష్టమైన ప్రొటీన్ నిర్మాణాల్ని అర్థం చేసుకునేందుకూ ఈ ముగ్గులు తోడ్పడతాయని నిపుణులు చెబుతున్నారు.
ముగ్గులో గమ్మతైన గణితం..
ఈ ముగ్గులో తీరుగా పెట్టే చుక్కలు లెక్కలపట్ల ఆసక్తిని పెంచితే కలపడం వల్ల గణితం తేలికగా అర్థమవుతుందట. ఉదాహరణకు చుక్కలు పెడుతూ సరి, బేసి సంఖ్యలు నేర్చుకోవచ్చు. చుక్కలు...అంక గణితమైతే, వాటిని కలపడం సమితులు. నిజం చెప్పాలంటే ముగ్గులు మేధస్సుకి సవాలుగా నిలుస్తాయి. అంతేగాదు పిల్లల మెదడు వృద్ధి చెందడానికి మొదటి ఏడు సంవత్సరాలూ కీలకం. ఆ సమయంలో వారికి తేలికపాటి ముగ్గులు నేర్పిస్తే వాళ్లలో నైపుణ్యాలు మెరుగుపడతాయని నిపుణులు చెబుతున్నారు
ఆరోగ్య ప్రయోజనం..
ముగ్గు వేయడం అనేది మహిళలకు మంచి వ్యాయామం లాంటిది. వంగి లేవడం కారణంగా.. వాళ్లకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవని.. అందుకే పెద్దలు రోజూ ఇంటి ముందు ముగ్గు వేసే సంప్రదాయం తీసుకొచ్చారని అంటారు.
చేతులు, కాళ్లను చుక్కలకు, గీతలకు అనుగుణంగా అటూఇటూ తిప్పడం వల్ల వారి జీర్ణక్రియ, పునరుత్పత్తి అవయవాలకు చక్కిని మసాజ్‌లా ఉపకరిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే, జాయింట్లు, వెన్నెముక, పూర్తి శరీరానికి వ్యాయాయం తద్వారా బలం చేకూరుతుంది.
ముగ్గులు వేసే మహిళల మెదడు చాలా చురుగ్గా పని చేస్తుందట.
మహిళలకు ఇది శారీరక వ్యాయామంతో పాటు మానసిక వ్యాయామంలా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.
అంతేగాదు ముగ్గులు వేయడం వల్ల మంచి శరీరాకృతిని కలిగి ఉంటారట.
శరీరాన్నీ మనస్సునూ ఒకేచోట కేంద్రీకృతం చేస్తూ వేసే ముగ్గు ఏకాగ్రతను పెంచే దివ్యమైన మెడిటేషన్‌గా చెబుతున్నారు.
ఇది రక్తప్రసరణను మెరుగుపరుస్తుందట. ఎక్కడో చూసి.. ఎప్పుడో నేర్చిన ముగ్గుల్ని గుర్తుతెచ్చుకుంటూ వేయడంవల్ల ధారణశక్తి మెరుగవుతుందట.
దీనివల్లే మహిళలకు ఏకాగ్రత, ఓర్పు అలవడుతాయట.
అదీగాక ఉదయాన్నే ముగ్గు వేస్తారు కాబట్టి..స్వచ్ఛమైన గాలిని పీల్చడం జరుగుతుంది. అందువల్ల మహిళలు ఇలా వాకిట ముగ్గులు వేయడం వల్ల ఆరోగ్యపరంగా ఎంతో మేలని అంటున్నారు ఆరోగ్య నిపుణలు.
అలాగే చాలామంది ముగ్గుగా బియ్య పిండిని ఉపయోగిస్తారు. ఇది పక్షులు పావురాలు, చీమలు, పిచ్చుక, కాకితో పాటు ఇతర కీటకాల కడుపు నింపేందుకు ఉపయోగపడుతుంది.
ఆధ్యాత్మిక పరంగానూ, ఆరోగ్య పరంగానూ ఎన్నో ప్రయోజనాలందించే రంగవల్లికలను శోభాయమానంగా తీర్చిదిద్దుదాం..ఆరోగ్యంగా ఉందాం.
(చదవండి: ఇలాంటి డైట్ గురించి తెలిసే ఛాన్సే లేదు..! కానీ ఒక్క ఏడాదిలోనే 50 కిలోలు..)
Comments
Please login to add a commentAdd a comment