Health Tips In Telugu: Why You Should Never Drink Tea Or Coffee With An Empty Stomach - Sakshi
Sakshi News home page

Health Tips In Telugu: ఉదయాన్నే టీ, కాఫీలు తాగుతున్నారా? ఒక్కసారి ఇది తెలుసుకోండి..

Published Thu, Jun 29 2023 11:53 AM | Last Updated on Thu, Jul 27 2023 4:59 PM

Why You Should Never Drink Tea Or Coffee On An Empty Stomach - Sakshi

మీకు పొద్దున లేవగానే ఖాళీ కడుపుతో టీ తాగే అలవాటుందా? అయితే ఈ స్టోరీ మీకోసమే.. మనలో చాలామందికి ఉదయం లేవగానే టీ, కాఫీ లేనిదే రోజు మొదలవదు. టీ తాగకపోతే ఏదో అయిపోయింది అన్నట్లు  ఫీల్‌ అవుతుంటారు. ఖాళీ కడుపుతో వీటిని తీసుకోవడం వల్ల ఎసిడిక్‌ సమతుల్యత దెబ్బతింటుంది. నిద్ర లేచిన వెంటనే ఖాళీ కడుపుతో బెడ్ కాఫీలు, బెడ్ టీలు తాగడం వల్ల హాని కలుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఉదయం టీ లేదా కాఫీ తీసుకున్నవారిలో నోటిలోని బ్యాక్టీరియా చక్కెరను విచ్ఛిన్నం చేస్తుందని ఇది నోట్లో యాసిడ్ స్థాయిలను పెంచుతుందని చెబుతున్నారు. మరి టీ కాఫీలు ఏ సమయంలో తీసుకోవాలి? ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగడం వల్ల కలిగే నష్టాలు ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. 

► ఉదయాన్నే టీ తాగితే రిఫ్రెష్‌గా ఉంటుందనుకుంటారు చాలామంది. కానీ దీని వల్ల లాభాల కంటే అనారోగ్య సమస్యలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు నిపుణులు. 
 ►  పొద్దున్నే పరిగడుపున టీ, కాఫీలు తాగడం వల్ల ఎసిడిటీ, గుండెల్లో మంట, ‍గ్యాస్‌ వంటి సమస్యలు వస్తాయట. ఇవి దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తాయట.
►  కొంతమంది పళ్లు తోముకోకుండా పొద్దున్నే బెడ్‌ కాఫీ, టీలు తాగుతారు. ఇలా చేయడం వల్ల నోట్లోని చెడు బాక్టీరియా పేగుల్లోకి వెళ్లి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. 
►  ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల పంటి ఎనామిల్‌ దెబ్బతింటుందని, అతిగా తాగడం వల్ల పళ్లు కూడా దెబ్బతినే అవకాశం ఉందట. 
టీ, కాఫీలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కెఫీన్‌ మోతాదు పెరిగి మానసిక ఆందోళన, ఒత్తిడి కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఒక కప్పు టీలో దాదాపు 11 నుండి 61 మిల్లీగ్రాముల కెఫిన్‌ ఉంటుందట.

►  ఎక్కువగా టీ, కాఫీలు తాగడం వల్ల నీళ్లు తాగాలనిపించదు.ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల డీ హైడ్రేైషన్ కు గురయ్యే ప్రమాదం ఉంది.  
►  చాలామంది రాత్రి, పగలు తేడా లేకుండా టీ, కాఫీలు ఎప్పుడు పడితే అప్పుడు తాగేస్తుంటారు. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రాత్రిళ్లు టీ తాగడం వల్ల నిద్రలేమితో బాధపడతారని నిపుణులు సూచిస్తున్నారు. 

ఏ సమయంలో టీ,కాఫీలు తాగాలి?
సాధారణంగా వ్యాయామం చేసే ముందు కాఫీ తాగడం మంచిది. ఇది ఇన్‌స్టంట్‌గా ఎనర్జీతో పాటు అదనపు కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. 
♦ పొద్దున్నే టీ తాగాలనుకునేవారు పరిగడుపున కాకుండా, టిఫిన్‌ తిన్న గంట తర్వాత టీ తాగడం మంచిదట. 

ఏదైనా మితంగా తీసుకుంటే సమస్య లేదంటున్నారు నిపుణులు. రోజుకు రెండుకప్పులు టీ, కాఫీలు తాగొచ్చని, అంతకుమించి మాత్రం తీసుకోవద్దని చెబుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement