(ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 7)
తులారాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. లగ్న వ్యయాలలో కేతుగ్రహ సంచారం, షష్ఠ సప్తమాలలో గురు రాహువుల సంచారం, పంచమ స్థానంలో శనిగ్రహ సంచారం, గురు శుక్ర మౌఢ్యమిలు, రవిచంద్ర గ్రహణాలు ప్రధాన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. ఎక్కడకు వెళ్ళినా గౌరవంగా ఆహ్వానించే వారు అధికంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. కార్యానుకూలత సాధిస్తారు.
ఉన్నత విద్యకోసం చేసే దూరప్రయాణాలు లాభిస్తాయి. కష్టపడి అనుకున్నది సాధిస్తారు. అనుకున్న పనులు కాస్త అటు–ఇటుగా పూర్తవుతాయి. సాంకేతికవిద్యలో రాణిస్తారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలు మంచి ప్రఖ్యాతి పొందుతాయి. సాంస్కృతిక, క్రీడారంగాలలో ప్రతిభాపాటవాలు గుర్తింపుకు నోచుకుంటాయి. నీచ రాజకీయాలు మనస్తాపం కలిగిస్తాయి. నైతికధర్మానికి కట్టుబడి ఉంటారు. పాల ఉత్పత్తులు, తత్సంబంధమైన వ్యాపారాలకు కాలం అనుకూలంగా ఉంది. స్త్రీలతో భేదాభిప్రాయాలు తలెత్తుతాయి. గతంలో చేసిన పొదుపు పథకాలు ఎంతగానో అక్కరకు వస్తాయి. ప్రభుత్వపరంగా ఆర్థిక ప్రయోజనాలను పొందగలుగుతారు.
ప్రతిష్ఠాత్మకమైన కాంట్రాక్టులు లభిస్తాయి. ఉన్నతాధికారులు, ఉన్నతస్థాయిలో ఉన్న స్నేహితుల వల్ల మేలు పొందుతారు. బంధువర్గంలో పదేపదే మీ నుంచి ఆర్థికసాయం ఆశిస్తున్న వాళ్ళు విసిగించడం మొదలుపెడతారు. రాజకీయ వ్యూహం ఫలిస్తుంది. మొండిధైర్యంతో సమస్యల నుంచి గట్టెక్కుతారు.
దీపారాధన చేసే కుందిలో రెండు చుక్కలు పరిమళగంధం వేసి దీపారాధన చేయండి. వైరివర్గంతో హోరాహోరీ పోరాటం జరుపుతారు. ఆహార నియమాలు పాటిస్తారు. చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. వైరివర్గాన్ని బోల్తా కొట్టించడానికి మీరు పన్నిన వ్యూహం ఫలిస్తుంది. శుభకార్యాల విషయమై కార్యానుకూలత కోసం ప్రయత్నిస్తారు,.
ఫైనాన్స్ స్కీములు, లక్కీడ్రాలు, షేర్లు, కోడిపందాలు, గుర్రపు పందాలు, పేకాట, క్రికెట్ బెట్టింగ్స్, రాజకీయ ఫలితాల బెట్టింగులకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. ఋణాలు ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు జాగ్రత్తలు అవసరం. వెన్నుపోటుదారులు స్నేహితుల్లోనే ఉన్నారన్న విషయం ఆలస్యంగా తెలుసుకుంటారు. నిరుద్యోగులైన విద్యావంతులకు తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనా, చిన్న చిన్న ఉద్యోగాలు చేసినా పోటీపరీక్షలలో విజయం సాధించి, మంచి ఉద్యోగాన్ని సాధిస్తారు. ఐఏఎస్, ఐపీఎస్, తదితర సర్వీసులకు ఎంపిక అవుతారు. కష్టానికి తగిన ఫలితం కొన్ని సందర్భాలలో లభిస్తుంది. కీర్తిప్రతిష్ఠలు దక్కుతాయి.
కుటుంబంలో ప్రశాంతత లోపించకుండా జాగ్రత్త వహించడం, దిగమింగటం జరుగుతుంది. దొంగలని తెలిసి కూడా చర్య తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాలలో సంవత్సర ప్రథమార్ధంలో కొన్ని ఇబ్బందులను, సాంకేతికపరమైన సమస్యలను ఎదుర్కొంటారు. మీ మీద ఆరోపణలు చేసినవారి నిజస్వరూపం బయటపడుతుంది. ఫాస్ట్‌ఫుడ్స్, బేకరీల వ్యాపారాలు, హాస్టళ్ళ నిర్వహణ మొదలైనవి మధ్యస్థంగా ఉంటాయి. హోల్‌సేల్ వ్యాపారాలు, సుగంధద్రవ్య వ్యాపారాలు బాగుంటాయి. ఉద్యోగపరంగా సంస్థ నుండి ఒకరిని తొలగించవలసిన పరిస్థితి వస్తుంది. దానికి మీరే బాధ్యులని మీపై దుష్ప్రచారం జరుగుతుంది. వృత్తి ఉద్యోగాలపరంగా అనవసరమైన బాధ్యతలు నెత్తిన పడతాయి.
వ్యాపారంలో రొటేషన్ బాగున్నా, భాగస్వాముల ప్రవర్తన వల్ల ఆశించిన లాభాలు రావు. ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం రుద్రపాశుపత హోమం చేయాలి, పాశుపత కంకణం లేదా రూపు ధరించాలి. ప్రేమ పెళ్ళిళ్ళు ప్రధాన ప్రస్తావనాంశంగా మారుతాయి. మొత్తం మీద ఈ సంవత్సరం ప్రథమార్ధం, ద్వితీయార్ధం రెండూ బాగున్నాయి. స్త్రీలకు ప్రత్యేకం: ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం చాలా బాగుంది. మీరు చేసే వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి. క్రమశిక్షణాయుతమైన పద్ధతులలో కష్టపడి వ్యాపారాన్ని ఒక దారిలోకి తీసుకువస్తారు. టీమ్ స్పిరిట్‌తో మంచి ఫలితాలు సాధిస్తారు.
మీ వ్యక్తిగత భావాలను విమర్శించే వారి పట్ల శతృత్వం పెంచుకుంటారు. కోపాన్ని అదుపులో పెట్టుకోలేరు. సౌందర్య సాధక చిట్కాలు, యోగాభ్యాసాలు, మెడిటేషన్ మొదలైన అలవాట్ల వల్ల ఆరోగ్యం కాపాడుకుంటారు. ఉన్నంతలో అందంగా కనిపించాలని భావిస్తారు. డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు. సహేతుకమైన దానధర్మాలు చేస్తారు. పెళ్ళి ముందా, చదువు ముందా అనే సమస్య ఏర్పడుతుంది. ఈ విషయంలో పెద్దల మాట వినరు. చదువు పూర్తయ్యాకే పెళ్ళి చేసుకుందామని నిశ్చయించుకుంటారు. వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న వాళ్ళకి పెళ్ళి చూపులో అందరికీ మీరు నచ్చుతారు. మీకు మాత్రం ఎవరూ నచ్చరు.
ఇదొక అంతర్జాతీయ సమస్యగా మారుతుంది. అరటినార వత్తులతో అష్టమూలికాతైలం కలిపి దీపారాధన చేయండి. ఈఎన్‌టీ సమస్యలు బాధించే అవకాశం ఉంది. ఒళ్ళు బరువు తగ్గించుకుని నాజూకుగా కనిపిస్తారు. తల్లిదండ్రుల సలహాలు లేనిదే ఏ పనీ చేయరు. విలువైన స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. సంతానపరమైన విషయంలో కొంత ఇబ్బంది వున్నా, ద్వితీయార్ధంలో సంతానం పరిస్థితి బాగుంటుంది. విద్యారంగంలో పిల్లలు మంచి విజయాలు సాధిస్తారు. తల్లి వైపు బంధువులకు కొంతకాలం అండగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. సర్పదోషాలు, గ్రహబాధలు తొలగిపోవడానికి సర్పదోషనివారణా చూర్ణంతో సర్వరక్షాచూర్ణం కలిపి స్నానం చేయండి (తలస్నానం చేయరాదు).
మీ ఆత్మీయవర్గం విదేశాలలో స్థిరపడతారు. మీకు అన్నివిధాలా అందుబాటులో ఉంటారు. చేతి వృత్తులు, అలంకార కేంద్రాలు, బ్యూటీపార్లర్లు, డిజైనింగ్, వస్త్ర వ్యాపారం మొదలైనవి సానుకూల ఫలితాలను ఇస్తాయి. అవివాహితులైన స్త్రీలకి మంచి సంబంధం కుదురుతుంది. సంతానం లేనివారికి సంతానప్రాప్తి కలుగుతుంది. ఇంట్లోనూ, వ్యాపార ప్రదేశాలలోనూ సాంబ్రాణి ధూపం వేయండి. వృత్తి ఉద్యోగ బాధ్యతల వల్ల న్యాయాన్ని, ధర్మాన్ని అనుసరించి ఇతరులకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలుపుకోలేరు. అధికారం చేతుల్లో ఉన్నా సహాయం చేయటానికి వీలులేని పరిస్థితి ఏర్పడుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
నానా రకాల అరిష్టాలు, చికాకులు పోవడానికి, శత్రుబాధలు, గ్రహబాధలు నశించడానికి త్రిశూల్‌ని ఉపయోగించండి. మానసికంగా సంతోషంగా ఉంటారు. పెద్దవాళ్ళని ప్రేమగా చూస్తారు. సహోదర సహోదరీ వర్గాన్ని కూడా ఆదరిస్తారు. బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. మనకెందుకులే మనం తప్పించుకుపోదాం, డబ్బులెందుకు ఖర్చు పెట్టాలి? సేవలు ఎందుకు చేయాలి? నా తోడబుట్టిన వాళ్ళందరికీ లేని బాధ్యత నాకు మాత్రం ఎందుకు? ఈ విధంగా మీరు ఆలోచించరు. ఇటువంటి ఆలోచన మీ కలలోకి కూడా రాదు. ధర్మాన్ని వదిలేస్తే భగవంతుడు మనల్ని వదిలేస్తాడని మీ ప్రగాఢ నమ్మకం.
ఇదే రకమైన బుద్ధి అందరికీ ఉంటే ఈ దేశం ఎంత బాగుండేదో కదా అనే ఆలోచన కలుగుతుంది. ఫైనాన్స్ మరియు చిట్టీల వ్యాపారం పెడితే దివాళా తీస్తారు, జాగ్రత్త ! క్రీడారంగంలో మంచి ప్రతిభాపాటవాలు చూపించినా కుల, మత, వర్గ, ప్రాంతీయ విభేదాల వల్ల మీకు లభించవలసిన ఖ్యాతి, అవార్డులు, రివార్డులు లభించవు. చలనచిత్ర రంగంలో, టీవీ రంగంలో అవకాశాలు కలిసి వస్తాయి.
పెళ్ళి చేసుకోమని వేధిస్తున్న ఒక వ్యక్తి విషయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కీలక సమయంలో మీ శక్తిసామర్థ్యాలను నిరూపించుకుంటారు. మీ శత్రువర్గానికి తగిన విధంగా గట్టి గుణపాఠం చెబుతారు. అవార్డులు, రివార్డులు మీ దగ్గరికి వెతుక్కుంటూ వస్తాయి. మొత్తం మీద గడిచిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment