కృష్ణం వందే జగద్గురుమ్‌! | Lord Sri Krishna Special Story In Sakshi Funday | Sakshi
Sakshi News home page

కృష్ణం వందే జగద్గురుమ్‌!

Published Sun, Aug 9 2020 8:57 AM | Last Updated on Sun, Aug 9 2020 2:25 PM

Lord Sri Krishna Special Story In Sakshi Funday

‘‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే!’’

సజ్జనులను రక్షించి, దుర్జనులను శిక్షించి ధర్మసంస్థాపన చేయడానికి ప్రతి యుగంలోనూ అవతరిస్తూనే  ఉంటానని లోకానికి భరోసా ఇచ్చాడు శ్రీకృష్ణ పరమాత్ముడు.  కురుక్షేత్రంలో మోహరించిన సేనలను చూసి, విచలితుడైన అర్జునుడు ధనుర్బాణాలు విడిచి,  చేష్టలుడిగి కూలబడిపోతే, తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ‘గీత’బోధ చేశాడు.  అర్జునుడిని యుద్ధోన్ముఖుడిని చేశాడు. ‘గీత’బోధ కేవలం అర్జునుడికి మాత్రమే కాదు, సమస్త లోకానికీ ఉద్దేశించిన కర్తవ్యబోధ! అందుకే శ్రీకృష్ణుడు గీతాచార్యుడిగా, జగద్గురువుగా పూజలందుకుంటున్నాడు. 

మనకు తెలిసిన దశావతారాల లెక్క ప్రకారం శ్రీకృష్ణుడు నారాయణుడి ఎనిమిదో అవతారం. ధర్మగ్లాని సంభవించినప్పుడు దుష్ణశిక్షణ శిష్టరక్షణ కోసం భగవంతుడు ఎత్తే అవతారాలను లీలావతారాలంటారు. శ్రీకృష్ణుడి అవతారం కూడా లీలావతారమే! భాగవత కథనం ప్రకారం నారాయణుడి లీలావతారాలు ఇరవైరెండు. వాటిలో శ్రీకృష్ణావతారం ఇరవయ్యవది. లీలావతరాల్లోని ముఖ్యమైన పదింటినే పురాణాలు దశావతారాలుగా చెబుతున్నాయి. శ్రీకృష్ణావతారం నారాయణుడి పరిపూర్ణావతారంగా భావిస్తారు. వైష్ణవ సంప్రదాయంలో ఎక్కువగా భక్తులు ఆరాధించేది శ్రీకృష్ణుడినే! 
మన దేశంలో వివిధ ప్రాంతాల్లో వివిధ రూపాలలో, వివిధ నామాలతో శ్రీకృష్ణుడిని ఆరాధిస్తారు. ప్రతి ప్రాంతంలోను శ్రీకృష్ణ క్షేత్రాలు పురాతనకాలం నుంచి ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని మధురలో బాలకృష్ణుడిగా, ఒడిశాలోని పూరీలో జగన్నాథునిగా, మహారాష్ట్రలో విఠోబాగా, తిరుమలలో శ్రీవెంకటేశ్వరునిగా, కర్ణాటకలోని ఉడిపిలో శ్రీకృష్ణుడిగా, కేరళలోని గురువాయూరులో గురువాయూరప్పగా– ఇలా చాలా చోట్ల చాలా రకాలుగా శ్రీకృష్ణుని ఆరాధిస్తారు. 

శ్రీకృష్ణారాధన చరిత్ర
శ్రీకృష్ణారాధన క్రీస్తుపూర్వం ఎనిమిదో శతాబ్ది నాటికే బాగా ఉనికిలో ఉండేది. ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో లభించిన క్రీస్తుపూర్వం ఎనిమిదో శతాబ్ది నాటి చిత్రంలో సుదర్శనచక్రాన్ని ధరించిన రథసారథి కృష్ణుడేనని పండితుల అంచనా. శ్రీకృష్ణుని ప్రస్తావన ఉన్న తొలిగ్రంథం ఛాందోగ్యోపనిషత్తు. సామవేదానికి చెందిన ఈ ఉపనిషత్తు క్రీస్తుపూర్వం 8–6 శతాబ్దాల నాటిదని చరిత్రకారులు చెబుతారు. ఛాందోగ్యోపనిషత్తులో శ్రీకృష్ణుని ప్రస్తావన, ధృతరాష్ట్రుడి ప్రస్తావన కనిపిస్తాయి. ఛాందోగ్యోపనిషత్తు తర్వాతి కాలానికి చెందినవైన నారాయణ అధర్వ శీర్షోపనిషత్తు, ఆత్మబోధోపనిషత్తు వంటి మరికొన్ని ఉపనిషత్తులలో కూడా శ్రీకృష్ణుని ప్రస్తావన ఉంది. పురాణ వాఙ్మయంలోని భాగవత, మహాభారత గ్రంథాల్లో శ్రీకృష్ణుని గాథ సమగ్రంగా కనిపిస్తుంది. క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దికి చెందిన సంస్కృత వ్యాకరణకర్త పాణిని తన గ్రంథంలో ‘వాసుదేవకుడు’ అంటే వాసుదేవుడి భక్తుడు అనే అర్థాన్ని చెప్పాడు. పాణిని గ్రంథంలోనే అర్జునుడి ప్రస్తావన కూడా ఉన్నందున, ఇందులో ప్రస్తావించిన వాసుదేవుడే శ్రీకృష్ణుడని భావించవచ్చునని పండితుల అభిప్రాయం.

హెలియోడోరస్‌ విదిశాలో ప్రతిష్ఠించిన గరుడస్తంభం, మాయాపూర్‌లో నిర్మాణమవుతున్న చంద్రోదయ మందిరం నమూనా

గ్రీకువీరులూ కృష్ణభక్తులే!
చంద్రగుప్తుని ఆస్థానాన్ని క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దిలో సందర్శించిన గ్రీకు యాత్రికుడు మెగస్తనీస్‌ తన రచనల్లో మధురలోని శూరసేనుడనే రాజు ‘హెరాకిల్స్‌’ను పూజించేవాడని రాశాడు. మెగస్తనీస్‌ ఇతర రచనలను బట్టి ‘హెరాకిల్స్‌’, ‘కృష్ణుడు’ ఒకరేనని చరిత్ర పరిశోధకులు ఒక అంచనాకు వచ్చారు. క్రీస్తుపూర్వం 180–165 కాలానికి చెందిన గ్రీకో–బాక్ట్రియస్‌ పాలకుడు అగాథొకిల్స్‌ కృష్ణబలరాముల బొమ్మలతో నాణేలను ముద్రించాడు. అంటే, ఆనాటికే శ్రీకృష్ణుని ప్రాభవం గ్రీస్‌ వరకు పాకిందన్నమాట! క్రీస్తుపూర్వం ఒకటో శతాబ్దిలో తక్షశిలకు వచ్చిన గ్రీకు రాయబారి కొడుకైన హెలియోడోరస్‌ శ్రీకృష్ణ భక్తుడిగా మారి, భాగవత ధర్మాన్ని అవలంబించాడు. అతడు మధ్యప్రదేశ్‌లోని విదిశా (ఇదివరకటి బేస్‌నగర్‌) నగరంలో గరుడ స్తంభాన్ని ప్రతిష్ఠించి, దానిపై ‘దేవదేవుడైన వాసుదేవుని కోసం ఈ గరుడ స్తంభాన్ని వేయించిన భాగవత ప్రభుభక్తుడు హెరిడోరస్‌’ అని శిలాశాసనం వేయించాడు. దాదాపు ఇదే కాలానికి చెందిన మరో శాసనం మధుర సమీపంలోని మోరాలో ఉంది. ఇందులో వృష్టి వంశానికి చెందిన ఐదుగురు వీరుల ప్రస్తావన ఉంది. అందులో ప్రస్తావించిన ఐదుగురు వీరులు: బలరాముడు, కృష్ణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, సాంబుడు.

 
ఆల్ఫ్రెడ్‌ బీ ఫోర్డ్‌ (అంబరీష్‌ దాస్‌)

శరణాగత రక్షకుడు
‘‘నల్లనివాడు పద్మనయనంబులవాడు గృపారసంబు పైజల్లెడువాడు మౌళిపరిసర్పిత పింఛమువాడు నవ్వు రాజిల్లెడు మోమువాడు...’’ అంటూ శ్రీకృష్ణుని రూపాన్ని కళ్లకు కట్టినట్లుగా వర్ణించాడు పోతనామాత్యుడు. తన ఆంధ్ర మహాభాగవతంలో ఆయన శ్రీకృష్ణుని రూప స్వభావ లీలా విలాసాలను అత్యంత రమ్యంగా వర్ణించాడు. ‘కృష్‌’ అంటే దున్నడమనే అర్థం ఉంది. భూమిని దున్నడానికి ఉపయోగించే నాగలి మొన నల్లగా ఉంటుంది. అందుకే ‘కృష్ణ’ అనే శబ్దానికి ‘నల్లని’ అనే అర్థం ఏర్పడింది. భూమిని దున్ని సస్యశ్యామలం చేసేవాడు కృష్ణుడు. అందజాలని వాడైన శ్రీకృష్ణ పరమాత్ముడు సంపూర్ణమైన భక్తికి మాత్రమే లోబడతాడు. ‘అన్యథా శరణం నాస్తి’ అంటూ శరణాగతులైన వారిని తక్షణమే రక్షిస్తాడు. భాగవత, మహాభారతాలలో ఇందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. కురుసభలోని ద్రౌపదిని ఈడ్చుకు వచ్చిన దుశ్శాసనుడు ఆమె వలువలూడ్చబోతే, నిస్సహాయ స్థితిలో ఆమె కృష్ణుడినే స్మరిస్తూ తనను రక్షించమని మొరపెట్టకున్న తక్షణమే ఆమె మానసంరక్షణ చేశాడు. జూదంలో ఓడిన పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేసిన కాలంలో అడుగడుగునా వారిని కాపాడుతూ వచ్చాడు. వారి అరణ్య, అజ్ఞాతవాసాలు ముగిశాక, వారి తరఫున రాయబారం చేశాడు. దుర్యోధనుడి దురహంకారం కారణంగా రాయబారం విఫలమైతే, కురుక్షేత్రంలో అర్జునుడి రథానికి సారథ్యం వహించి, ధర్మసంస్థాపన చేశాడు. శరణాగతులకు తానెప్పుడూ తోడుగా ఉంటానని భగవద్గీతలో తానే స్వయంగా చెప్పుకున్నాడు. వైష్ణవ సంప్రదాయంలో భక్తులు శరణాగతినే అనుసరిస్తారు. భక్తిమార్గంలో పరాకాష్ట శరణాగతి. 

లీలామానుష విగ్రహుడు
శ్రీకృష్ణుడు లీలామానుష విగ్రహుడు. పసివయసు నుంచే లెక్కలేనన్ని లీలలను ప్రదర్శించాడు. దేవకీ వసుదేవులకు చెరసాలలో పుట్టిన కృష్ణుడు, పుట్టిన వెంటనే తల్లిదండ్రులకు దూరమై, యశోదా నందుల వద్ద పెరిగాడు. మేనమామ కంసుడు తనపైకి పంపిన రాక్షసులను పసితనంలోనే వధించినవాడు. తోటి గోపబాలకులతో కలసి గోవులను కాసుకుంటూ, వారితో ఆటలాడినవాడు. ఇరుగు పొరుగు ఇళ్లలో వెన్న దొంగిలించి అల్లరి చేసినవాడు. మన్ను తిన్నావెందుకని మందలించిన తల్లి యశోదకు తన నోటనే ఏడేడు పద్నాలుగు లోకాలను చూపినవాడు... శ్రీకృష్ణుడి బాల్యలీలలు, జీవిత విశేషాలు చర్వితచర్వణమే అయినా, భక్తులకు ఇవన్నీ మనోరంజకమైనవి. ఈ లీలలను తలచుకుంటూనే భక్తులు తన్మయులైపోతారు.

శ్రీల ప్రభుపాద 
ప్రసిద్ధ కృష్ణభక్తులు
ఎందరో సుప్రసిద్ధులు శ్రీకృష్ణుని ఆరాధించారు. శ్రీకృష్ణుని లీలలను కీర్తిస్తూ భక్తి కీర్తనలను రచించి, గానం చేశారు. శ్రీకృష్ణుడి భక్తితత్వాన్ని బోధించారు. చైతన్యప్రభు, భక్తజయదేవ, మీరాబాయి, సూరదాసు, మధ్వాచార్యులు, వల్లభాచార్యులు వంటివారెందరో శ్రీకృష్ణుని ఆరాధించి, ఆయన భక్తితత్వాన్ని, శరణాగత మార్గాన్ని లోకానికి చాటారు. శ్రీకృష్ణ భక్తుడైన వల్లభాచార్యులు ఒకసారి అడవి గుండా ప్రయాణిస్తూ దారితప్పిపోయారు. పొద్దుగూకే వేళ అయినా, దారి కానరాక తనను కాపాడమంటూ శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థించారు. అప్పుడు శ్రీకృష్ణుడు నిజరూపంలో కనిపించి, ఆయనకు వెన్నంటి ఉంటూ దారి చూపాడట. ఆ దర్శనం తర్వాతే వల్లభాచార్యులు ‘మధురాష్టకం’ రాశాడని అంటారు. వల్లభాచార్యుని శిష్యుడైన సూరదాసు అంధుడు. చిన్ననాటి నుంచే కృష్ణనామ స్మరణలో మునిగి తేలేవాడు. సూరదాసు ఒకసారి తన నిస్సహాయతనువ్యక్తం చేస్తూ కీర్తనను గానం చేయగా ఆలకించిన వల్లభాచార్యులు అతనికి హితబోధ చేశారు. భక్తుని పలుకుల్లో దైన్యం ఉండరాదని, ఏదైనా భగవంతుని పుత్రునిలా అర్థించాలని నచ్చజెప్పి, అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశించారు. సూరదాసు బృందావనంలో శ్రీకృష్ణుడు సంచరించిన చోట కూర్చొని రోజూ ఒక కొత్త భజనగీతాన్ని ఆలపించేవాడు. బ్రజభాషలో ఆయన ఆలపించిన గీతాలు ‘సూరసాగర్‌’ పేరిట గ్రంథస్థమయ్యాయి. సూరదాసు పాడేటప్పుడు ఆయన గానం వినడానికి శ్రీకృష్ణుడు స్వయంగా వచ్చేవాడని ప్రతీతి.

శ్రీకృష్ణ భక్తుడైన చైతన్యప్రభు గౌడీయ వైష్ణవ తత్వానికి ప్రాచుర్యం కల్పించాడు. ‘హరేకృష్ణ’ నామాన్ని విస్తృతంగా వ్యాప్తిలోకి తెచ్చాడు. గౌడీయ వైష్ణవ సంప్రదాయాన్ని పాటించేవారు చైతన్యప్రభును సాక్షాత్తు శ్రీకృష్ణుడి అవతారంగానే భావిస్తారు. అద్వైత ఆచార్యులకు, నిత్యానంద ప్రభుకు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడి మాదిరిగానే చైతన్యప్రభు విశ్వరూపాన్ని ప్రదర్శించాడని కూడా కొన్ని గ్రంథాల్లో పేర్కొనడం విశేషం. 

విదేశాలకు విస్తరించిన కృష్ణచైతన్యం
చైతన్యప్రభు బోధలతో గౌడీయ వైష్ణవంలోని కృష్ణతత్వం, ‘హరేకృష్ణ’ భక్తి ఉద్యమం దేశంలోని చాలా ప్రాంతాలకు విస్తరించింది. శ్రీల ప్రభుపాదగా ప్రసిద్ధి పొందిన అభయచరణారవింద భక్తివేదాంత స్వామి తాను నెలకొల్పిన ‘ఇస్కాన్‌’ (ఇంటర్నేషనల్‌ సొసైటీ ఫర్‌ కృష్ణా కాన్షియస్‌నెస్‌) ద్వారా కృష్ణతత్వాన్ని విదేశాలకు కూడా విస్తరించారు. దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలోనూ ‘ఇస్కాన్‌’ ఆలయాలు వెలిశాయి. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, రష్యా, ఉక్రెయిన్‌ వంటి దేశాలన్నింటిలోనూ కలుపుకొని ప్రస్తతానికి దాదాపు 850 ‘ఇస్కాన్‌’ ఆలయాలు ఉన్నాయి. వీటిలో మన దేశంలోనే అత్యధికంగా 150 ఆలయాలు ఉన్నాయి. వీటితో పాటు ‘ఇస్కాన్‌’ ఆధ్వర్యంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన 12 విద్యాసంస్థలు నడుస్తున్నాయి. ‘ఇస్కాన్‌’ వ్యాప్తితో ‘హరేకృష్ణ’ ఉద్యమం పలు దేశాలలో సాంస్కృతికంగా ప్రభావం చూపే స్థాయికి చేరుకుంది. పశ్చిమబెంగాల్‌లోని ‘ఇస్కాన్‌’ ప్రధానకేంద్రమైన మాయాపూర్‌లో ‘చంద్రోదయ మందిరం’ ప్రస్తుతం నిర్మాణంలో ఉంది.

సుమారు 4.25 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలోని ప్రాంగణంలో 340 అడుగుల ఎత్తున చేపట్టిన ఈ మందిర నిర్మాణం మరో రెండేళ్లలో పూర్తి కానుంది. ఈ నిర్మాణం పూర్తయితే, కంబోడియాలోని ఆంగ్‌కోర్‌వాట్‌ ఆలయం తర్వాత అతి పెద్ద ఆలయం ఇదే కానుంది. ఈ ఆలయ ప్రాంగణంలో సమస్త సౌకర్యాలతో పాటు అధునాతనమైన ప్లానెటోరియం కూడా ఏర్పాటు కానుంది. దీని నిర్మాణానికి 75 మిలియన్‌ డాలర్లు ఖర్చవుతుండగా, ఇందులో సింహభాగం ‘ఫోర్డ్‌ మోటార్‌ కంపెనీ’ వ్యవస్థాపకుడైన హెన్రీఫోర్డ్‌ మునిమనవడు ఆల్ఫ్రెడ్‌ బీ ఫోర్డ్‌ ఖర్చు చేస్తున్నారు. ‘హరేకృష్ణ’ ఉద్యమానికి ఆకర్షితుడైన ఆయన ‘ఇస్కాన్‌’లో చేరారు. అంబరీష్‌ దాస్‌గా వైష్ణవనామాన్ని స్వీకరించి, ప్రస్తుతం ‘ఇస్కాన్‌’ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఒకవైపు తన వ్యాపారాలను చూసుకుంటూనే, ‘ఇస్కాన్‌’ చేపట్టే కార్యక్రమాలకు భూరి విరాళాలు చెల్లిస్తూ, ఈ సంస్థ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement