భారత పౌరహక్కుల న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టు ధిక్కార నేరానికి పాల్పడ్డారన్న అభియోగంపై శిక్షించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం నిర్ణయించడం– ప్రజల పౌర, రాజకీయ హక్కుల రక్షణకు గ్యారంటీ పడుతూ అంతర్జాతీయ కన్వెన్షన్ ప్రకటించిన భావ ప్రకటనా స్వేచ్ఛకు విరుద్ధం. కోర్టు ధిక్కార నేరం మోపడానికి రూపొందిం చిన ప్రమాణాలను తక్షణం సమీక్షించాలని కోరిన 1800 మంది భారత న్యాయవాదులతో ఏకీభవిస్తూ అంతర్జా తీయ న్యాయవాదులు, న్యాయ శాస్త్రవేత్తలు, న్యాయమూర్తుల కన్వెన్షన్ సంయుక్త ప్రకటన విడుదల చేసింది. (1–9–2020)
‘సుప్రీంకోర్టుపై తాను అపనిందలు వేశానన్న మిషపైన కోర్టు (జస్టిస్ అరుణ్ మిశ్రా) నాకు ఒక రూపాయి జరిమానా విధించారు. అలాగే నేను కోర్టును క్షమాపణ వేడుకోనందుకూ విమర్శించారు. కానీ, ఆత్మగౌరవం, దాన్ని కాపాడుకోచూసే ఆత్మచైతన్యం, సత్యాన్ని సదా ప్రేమించే ఏ వ్యక్తికైనా రక్షణ కవచాలు కనుకనే తాను రూపాయి జరి మానాను చెల్లించలేద’ని ది హిందూ పత్రిక ప్రత్యేక ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ప్రశాంత్ భూషణ్ జవాబిచ్చారు (7–9–2020)
అంటే దీనర్థం ఆ ఒక్క రూపాయి జరిమానాను ప్రశాంత్ భూషణ్ న్యాయవాది దావే చెల్లించి ఉంటారు. పౌరహక్కులకు, సభా హక్కు లకు, పౌరుల భావప్రకటనా స్వేచ్ఛకు హామీపడిన భారత రాజ్యాంగం మౌలిక సూత్రాలకు, వాటిని తు.చ. తప్పకుండా దేశపాలకులు, శాసన కర్తలు ఆచరించడానికి నిర్దేశించిన పౌర ధర్మాల అధ్యాయానికి (డ్యూటీస్ చాప్టర్) విధిగా కట్టుబడి ఉండాల్సిన అవసరాన్ని గుర్తించిన విశిష్ట న్యాయవాది, ప్రజాస్వామ్యవాది భూషణ్. అందుకే పౌరుల విమర్శనా హక్కునే నొక్కి వేయడానికి ‘క్రిమినల్ కంటెంప్ట్ లా’ను న్యాయస్థానాలు వినియోగించడాన్ని ప్రజలముందు అదే న్యాయ స్థానాల ముందు ప్రశాంత్ భూషణ్ కడిగివేయవలసి వచ్చింది.
కోర్టుల పరువు ప్రతిష్టలన్నవి న్యాయస్థానాలు వెలువరించే తీర్పులపైన వాటిని అమలు జరిపించే తీరుతెన్నులపైన మాత్రమే ఆధారపడి ఉంటాయిగానీ ప్రజల స్పందనపైన, రియాక్షన్ పైన ఆధారపడి ఉండవు అని ప్రశాంత్ భూషణ్ భావన. అందుకే కనీసం గత మూడు దశాబ్దాల కాలంలో పాలక రాజకీయ వ్యవస్థలో మాదిరే శాసన న్యాయవ్యవస్థా చట్రంలో కూడా.. ప్రజాబాహుళ్యం స్వాతంత్య్ర పోరాటాలలో అనుపమ త్యాగాల ద్వారా సాధించుకున్న మంచి ఫలి తాలు కూడా తారుమారవుతూ వచ్చాయి. చివరికి కనీసం 1997లో ప్రధాన న్యాయమూర్తులు సహా 22 మంది న్యాయమూర్తులు న్యాయ వ్యవస్థ పనితీరును, న్యాయమూర్తుల ప్రవర్తనను నిర్దేశిస్తూ జాతీయ స్థాయిలో ఒక విశిష్టమైన తీర్మానాన్ని కన్వెన్షన్‌లో ఏకగ్రీవంగా ఆమో దించారన్న సంగతి జాతీయ, రాష్ట్రాల స్థాయిలో న్యాయ వ్యవస్థలు నిర్వహించే పెద్దలు ఇప్పటికైనా గుర్తించాలి. రాజకీయ ఆర్థిక, సామా జిక ప్రలోభాలకు లోనుకాకుండా నడుచుకోవాలన్న 1997 నేషనల్ కన్వెన్షన్ ఆదేశిక సూత్రాలను తప్పకుండా పాటించాలి.
కానీ న్యాయపాలనా జీవిత విలువల పునరుద్ధరణ గురించి ఆ కన్వెన్షన్ నెలకొల్పిన సూత్రాలను న్యాయవ్యవస్థ నిర్వాహకులు పెక్కు మంది పాటించకపోవడం వల్ల గత పాతికేళ్లకు పైగా జరుగుతున్న అక్రమాలకు, అన్యాయాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. అలాగని మన న్యాయవ్యవస్థలో రాజకీయ ప్రలోభాలకు లోను కాకుం డానే పెక్కు తీర్పులు చెప్పిన న్యాయమూర్తులూ లేకపోలేదు. 22 మంది న్యాయమూర్తుల చేవ్రాళ్లతో ఆమోదం పొందిన ఆ కన్వెన్షన్ తీర్మానంలో న్యాయమూర్తులకు కీలకమైన 16 నిబంధనలు విధిం చారు. వాటిలో ప్రధానమైనవి.. న్యాయపాలనా జీవితంలో న్యాయ మూర్తులు.. న్యాయస్థానంలో కూర్చున్న న్యాయమూర్తులు న్యాయ వ్యవస్థలో ప్రజలకు విశ్వాసం కలిగేలా ప్రవర్తించాలని, అదే కోర్టు ఆవరణలో బంధువులతో, తన కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సున్నితంగా వ్యవహరించరాదని, తనకు సన్నిహిత బంధువులు, స్నేహితులకు సంబంధించిన కేసులు వినరాదని నిర్దేశించడం జరి గింది. ఎలాంటి బయటి రాజకీయ ప్రలోభాలకు, లోపాయకారీ ఒత్తి ళ్లకూ లొంగరాదనీ, ఏ కంపెనీలలోనూ షేర్లు, స్టాక్ మార్కెట్ లావా దేవీలతో ఎలాంటి సంబంధం ఉండరాదని నేషనల్ కన్వెన్షన్ నిర్దేశిం చింది. ఈ నిబంధనల తీర్మానాలకే ‘న్యాయమూర్తుల జీవిత విలువల పునశ్చరణ’గా పేర్కొన్నారు. ఈ నైతిక విలువల పునరుద్ధరణకు నాటి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వర్మ సూత్ర ప్రతిపాదకుడు. దీనర్థాన్ని వివరిస్తూ జస్టిస్ కృష్ణయ్యర్ స్వేచ్ఛ అంటే కేవలం స్వేచ్ఛ అని కాదు, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడమని అర్థం కాదని కూడా అన్నారు. అయితే న్యాయవ్యవస్థలో నేడు అనేక రకాల ఉల్లం ఘనలకు కారణం రాజకీయ పాలనా వ్యవస్థల ప్రభావంతో కొన్ని న్యాయస్థానాల్లో (కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ) కొందరు ప్రలోభాలకు లోనవుతుండటమేనని మరికొందరి ఫిర్యాదులు.
అసలు ఈ మాలోకానికి ప్రధాన కారణం ఎక్కడ గూడుకట్టుకుని ఉందో జస్టిస్ మార్టిన్ ఇలా కుండబద్ధలు కొట్టినట్టు చెప్పాడు. ‘అసలు మనం చెప్పుకునే స్వతంత్ర న్యాయవ్యవస్థ అనేది భ్రమా, వాస్తవమా అని ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే, న్యాయమూర్తులు వర్గానికి సంబంధం లేకుండానే పాలకవర్గ సభ్యులుగానే వ్యవహరిస్తారు, ప్రభుత్వాల బాడుగ ఉద్యోగులవుతారు. చివరికి తీర్పులలో తమ నిర్ణ యాలను అమలు జరిపే ప్రభుత్వ పాలకుల నిరంకుశాధికారంపై ఆధారపడతారు. అందువల్ల న్యాయవ్యవస్థ సర్వ స్వతంత్ర శక్తిగా వ్యవహరిస్తూ స్వేచ్ఛగా ఉండాలని భావించడం అర్థం లేని విన్యాసం’.
బహుశా ఈ కారణం రీత్యానే సుప్రసిద్ధ న్యాయ వ్యవహారాల ‘హిందూ’ పత్రిక విలేకరి వి. వెంకటేశన్ అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా ఇటీవల కొలువు చాలించుకున్న జస్టిస్ అరుణ్ మిశ్రా సుప్రీంలో అత్యంత పలుకుబడిగల జడ్జిగా ఎలా ఎదుగుతూ వచ్చారో ‘వైర్’ సంస్థకు అందించిన తాజా విశ్లేషణలో వెల్లడించాడు. తరచుగా జస్టిస్ అరుణ్ మిశ్రా బెంచ్‌కే ఎందుకని రాజకీయంగా అత్యంత కీలక మైన కేసులు చేరుతూ వచ్చిందీ వివరిస్తూ ఈ విచిత్ర పరిణామాన్ని ప్రశ్నించేందుకే జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్‌లోకూర్, జస్టిస్ కురియన్ జోసఫ్ అప్పటి ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా తీరుపై ధ్వజమెత్తారు. ‘సుప్రీంలో ప్రతీ వ్యవహారం సవ్యంగా లేదు. ఉన్నత న్యాయస్థానంలో బయల్దేరిన ఈ లొసుగుల వల్ల దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడనుంది’ అని ప్రకటిం చారు. అలా జస్టిస్ చలమేశ్వర్ నిలబడినందుకే ఆ తరువాయి ఉన్నత స్థానానికి రావలసిన ఆయనను తగ్గించి, మరో జూనియర్‌ను ప్రమోట్ చేయటం లోకానికి తెలిసిన సత్యం.
సీబీఐ స్పెషల్ జడ్జిగా బీహెచ్ లోయా అనుమానిత హత్య కేసు, బీజేపీ అగ్ర నాయకులలో ఒకరు షొరాబుద్దీన్–కౌసర్‌బీ హత్య కేసుల్లో నిందితులుగా ఉన్న సమయంలో ఎలాంటి విచారణ లేకుండానే ఒక బొంబాయి హైకోర్టు జడ్జి అవినీతి కారణంగా కేసుల్ని నిర్వీర్యపరిచారో పత్రికలన్నీ కోడై కూశాయని మరవరాదు. ఇలా ఎన్నో కేసులు కొందరు న్యాయమూర్తుల పాక్షిక రాజకీయాల మూలంగా కొలిక్కి రాకుండా వీగిపోతూ వచ్చాయన్నది ఒక బండనిజం. గుజరాత్‌లో మైనారిటీల హత్యాకాండ విషయంలో నాటి బీజేపీ గుజరాత్ పాల కులపై కేసులన్నీ నిర్వీర్యమైపోవడానికి న్యాయవ్యవస్థ చేతులను అటు కాంగ్రెస్ సహాయంతోనూ, ఇటు బీజేపీ పాలకుల జమానాలోనూ మెలిపెడుతూ రావడమే కారణం. ఒకసారి హైకోర్టు కొట్టివేసిన కేసును మరో కోర్టు తిరగతోడకూడదని రాజ్యాంగంలోని 20(2)వ అధికరణ నిషేధిస్తున్నా కొన్ని కోర్టులు ‘తూ.నా. బొడ్డు’గా భావించటం కూడా ఒక రివాజు అయిపోయింది. ఇక ఈ రాజకీయ–న్యాయస్థానాల మధ్య అతివేలంలో 2019లో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఉన్న రంజన్ గొగోయ్‌పైన కోర్టు ఉద్యోగిగా ఉన్న మహిళ పెట్టిన వేధింపుల అభియోగం కథను ఎలా కంచికి నడిపించారో కూడా లోకానికి తెలుసు. అనంతరం అనేక కేసుల్లో కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు వెలువడటం, రిటైర్మెంట్ తర్వాత ఆయనకు రాజ్యసభ సభ్యత్వం కూడా రావడం విశేషమే. అలా పరస్పరం ‘వాయినాలు’ ఇచ్చి పుచ్చుకోవడం జయప్రదంగా ముగిశాయని మరవరాదు.
కోర్టు కేసుల్లో ప్రభుత్వమే ఫిర్యాదుదారుగా ఉన్నపుడూ జస్టిస్ అరుణ్ మిశ్రా తరచుగా ప్రభుత్వం తరఫునే ఉంటారు. ప్రభుత్వమే ప్రతివాదిగా హాజరైనప్పుడూ మిశ్రా ప్రభుత్వం తరఫున ఉంటూ వచ్చారు. పౌరహక్కుల ఉద్యమ నేతలపై కేసులన్నీ కూడా ఏళ్లూ పూళ్లుగా అతీగతీ లేకుండా పడి ఉండటం మన ‘ప్రజాస్వామ్యం’లో ఓ బంతులాటగా మారింది. మెరుగైన సంప్రదాయాలను కాపాడిన న్యాయవ్యవస్థల తీర్పుల్ని పక్కన పడేసి, విస్మరించడమే జస్టిస్ అరుణ్ మిశ్రా సామాజిక మితవాదంలో కీలకమైన అంశంగా న్యాయ నిపు ణులు, వ్యాఖ్యాతలూ భావించడం విశేషం. దేశ పౌరులకు సంపూర్ణ న్యాయం ఒనగూర్చే అసాధారణ అధికారాన్ని న్యాయవ్యవస్థకు, కోర్టు లకూ రాజ్యాంగంలోని 142వ అధికరణ కల్పిస్తోంది. కానీ, ఈ అధిక రణను కాదని చివరికి పెద్ద బెంచ్ తీర్పును కూడా తోసిపుచ్చి వ్యవ హరించే అవకాశాన్ని కోర్టు చిన్న బెంచ్‌లకు దఖలుపరుస్తున్న ఉదా హరణలు కూడా దేశంలో చెలామణీలో ఉన్నాయని కొందరు నిపుణుల అభిప్రాయం.
‘ఉపాహార్’ (1997) విషాద ఘట్టంపై విచారణలో సుప్రీం తీర్పును ప్రస్తావిస్తూ ఆ విషాదంలో కోల్పోయిన ఇద్దరు బిడ్డల ఉదం తాన్ని తలచుకుంటూ తల్లిదండ్రులు చేసిన వ్యాఖ్య పాఠకుల గుండెల్ని పిండేస్తుంది: ‘పంతొమ్మిదేళ్లనాడు నాకు దేవుడిలో నమ్మకం పోయింది, ఇప్పుడు భారత న్యాయ వ్యవస్థలో విశ్వాసం పోయింది. న్యాయస్థానా లంటే మాకెంతో గౌరవం. కానీ, ఉపాహార్ సినిమా యజమానులు మాత్రం రూ.60 కోట్లతో తమ స్వేచ్ఛను కొనుక్కోగలిగారు’! బహుశా అబ్రహాం లింకన్ అన్నట్టు ‘కొన్ని తీర్పులు లీగల్‌గా సమర్థనీయం కావచ్చునేమోగానీ, నైతికంగా సమర్థనీయం కావు’!!
ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment